నేనెరిగిన భాషలో రామాయణం!

 

నేనెరిగిన భాషలో 
రామాయణం!


రామాయణం లోకోత్తరం..

మానవ జీవన గమనంలో 

ఎన్నో ప్రశ్నలకు ప్రత్యుత్తరం

సాక్షాత్తు శ్రీరామచంద్రుని

సన్మాన పత్తరం..

మహాసాధ్వి సీతమ్మతల్లి

గుణగణాల ప్రశంసాపత్రం

సృష్టి అంతం వరకు మానవజాతి ప్రవర్తనానియమావళిని సూచిస్తూ

వాల్మీకి మహాముని రాసిన

వీలునామా పత్రం..

ఎన్నిమార్లు విన్నా 

తనివితీరనంత రసవత్తరం..

అన్నిటినీ మించి మహత్తరం!


రామాయణమంటే..

సంతానానికి నోచుకోని 

ఇద్దరు తండ్రుల విరాగగీతం

పిల్లలు పుట్టాక వారిని అల్లారుముద్దుగా పెంచుకున్న అదే తండ్రుల ఆనందగీతం

తన కొడుకును మించి రాముని 

ప్రేమదీరా పెంచుకున్న 

కైకమ్మ అవగతం..

రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల

అనుబంధ గీతం..

తన యాగ పరిరక్షణకు 

శ్రీరామచంద్రయ్య రావాలని

అలా వస్తే ఆ మహాపురుషుని

పదస్పర్శతో అహల్యా శాపవిమోచనం కావాలని..

తాటకి వధతో బుల్లి రాముని

పరాక్రమం లోకవిదితం కావాలాని..

పనిలో పనిగా సీతాస్వయంవరంలో 

శివధనువు విరిచి రామయ్య

కళ్యాణ రాముడుగా మారాలన్న విశ్వామిత్రుని

మనోగతం..

శ్రీ సీతారాముల కళ్యాణము

చూతము రారండి అంటూ మనోహరంగా సాగే అపురూపగీతం..

జానకిరాముల పవిత్ర దాంపత్య 

రసవత్తర కావ్యం..

ఎప్పటికీ నవ్యాతి నవ్యం...


రామాయణమంటే

శ్రీరామ పట్టాభిషేకం జరపాలన్న దశరథుని సంకల్పం..

అది విన్న మందర క్రోధం..

కైకమ్మ మనసులో 

నూరిపోసిన విషం

ఆ తల్లి ఉక్రోషం..

మూడు వరాల సూత్రం

కుప్పకూలిన ఓ తండ్రి శోకం

పితృవాక్య పాలనకు నడుం కట్టిన రఘురాముని త్యాగం

పతిని అనుసరించిన 

వైదేహి పాతివ్రత్యం..

అన్నను అనుసరించిన

లక్ష్మణుని ముద్ర ..

ఊర్మిళ నిద్ర..

అయోధ్య విలాపం

గుహుని స్నేహం

పులకించిన దాశరథి హృదయం..

అపూర్వ వనవాసి 

పద ధూళితో

పంచవటి పులకింత..

శూర్పణఖ వైపరీత్యం

సౌమిత్రి అఘాయిత్యం..

రావణుని క్రోధం...

మాయలేడి విన్యాసం..

మరిది తాత్సారం..

ఆ మరిది గీసిన

లక్ష్మణరేఖ దాటిన 

భూజాత తత్తరం..

జంగమదేవరగా 

రావణుడి మత్సరం..

సీతాపహరణం..

జటాయువు పోరాటం..

సీత దూరమై 

రామయ్య జంఝాటం..

శబరి ఆరాటం..

పక్షిరాజు వివరం..!

హనుమత్ సమాగమం..

సుగ్రీవుని పరిచయం..

వాలీ నిగ్రహణం..

సముద్ర తరణం...

సీతా దర్శనం..

లంకాపురీ దహనం..

పశ్చాద్రావణ కుంభకర్ణనిధనం..

సాధ్వీలలామ అగ్నిప్రవేశం..

హవ్యవాహనుడి ప్రస్తుతి

సీతారాముల స్తుతి..

సాకేతపురి కనుల పండువగా

శ్రీరామ పట్టాభిషేకం..

హేత్యర్థి రామాయణం..

సుమనోహర రసరమ్య దృశ్యకావ్యం..!

    

 శ్రీరామనవమి శుభాకాంక్షలతో

   ఎలిశెట్టి సురేష్ కుమార్

         విజయనగరం

         9948546286

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు