పూలే ఆదర్శంగా యుద్ధం చేయాలి

 


పూలే ఆదర్శంగా యుద్ధం చేయాలి


    భారతదేశం పరాయి పాలనలో ఉన్నప్పుడే ఈ దేశ మూలవాసుల (భూమి పుత్రుల) విముక్తి కోసం, హక్కుల కోసం ఛత్రపతి శివాజీ మహారాజు మొదలుకొని మహాత్మా జ్యోతిరావు పూలే వరకు ఎంతోమంది మహానీయులు త్యాగపూరిత పోరాటాలు చేసి ఎన్నో హక్కులు సాధించి పెట్టారు. ఇతర దేశాల నుండి బ్రతకడానికి వచ్చిన వారు కాలక్రమంలో పాలకులుగా మారి ఈ దేశ మూలవాసులను అణచివేసిన తీరుపై తిరుగుబాటు చేసిన వారిలో గౌతమ బుద్ధుడు, అశోక చక్రవర్తి, ఛత్రపతి శివాజీ మహారాజ్, శంబాజి మహారాజ్, పండుగ సాయన్న, సర్థార్ సర్వాయి పాపన్న, మహాత్మా జ్యోతిరావు పూలే, సాహు మహారాజ్, నారాయణ గురు, పెరియార్ ఇ వి రామసామి లు ముఖ్యులు. 

    ఆధునిక భారతదేశంలో బ్రిటీష్ పాలనలో ఈ దేశ మూలవాసి ప్రజలైన శూద్ర, అతిశూద్ర ప్రజలపై జరుగుతున్న అణచివేతపై తిరుగుబాటు చేసి సైద్ధాంతికంగా ప్రజలను చైతన్యం చేసి ఎన్నో హక్కులు సాధించిపెట్టిన వారిలో మహాత్మా జ్యోతిరావు పూలే అగ్ర స్థానంలో నిలుస్తారు. శూద్రుల అనచివేతకు ప్రధాన కారణమైన అధర్మమైన మనుధర్మ శాస్త్రం సిద్ధాంతాన్ని దెబ్బ తీయాలని, సర్వ సమస్యలకు, దోపిడీకి ప్రధాన కారణం శూద్రులకు విద్య లేకపోవడమేననని పరిశోధించిన మహాత్మా జ్యోతిరావు పూలే ఆనాటి స్థితిని ఈ విధంగా పరిశీలించి ప్రబోధించాడు. 


 విద్య లేనందువల్ల - విజ్ఞానం లేకుండా పోయిందని

విజ్ఞానం లేనందున - చైతన్యం లేకుండా పోయిందని

చైతన్యం లేకపోవడం వల్ల - నైతికత లేకుండా పోయిందని

నైతికత లేనందున - ఐక్యత లేకుండా పోయిందని

ఐక్యత లేనందున - అణచివేతకు గురవుతున్నారని, ఇదంతా అవిద్య వల్లనే 

.... మహాత్మ జ్యోతిరావు పూలే


   ప్రజా చైతన్యానికి, విముక్తి పోరాటాలకు విద్యా అవసరాన్ని గుర్తించడంతో పాటు విద్యను అణగారిన వర్గాల ప్రజలకు అందించాలని ప్రణాళికలు రచించి పూలే శూద్రులకు విద్యా బోధన ప్రారంభించాడు. ఆర్యులు సృష్టించి అమలు చేస్తున్న మనుధర్మ శాస్త్రం (ఆనాటి ఆర్య రాజ్యాంగం) సిద్ధాంతానికి జ్యోతిరావు పూలే వ్యతిరేకంగా పని చేస్తున్నాడని కక్ష కట్టిన ఆర్య బాపండ్లు పూలేపై ఎన్నో రకాల ఒత్తిడి తేవడంతో పాటు వారి తండ్రిగారినీ బెదిరించి పూలే దంపతులను ఇంటి నుండి కూడా వెళ్లగొట్టించారు. మనుధర్మ శాస్త్రం ప్రకారం స్త్రీలు కూడా శూద్రుల వలే విద్య నేర్చుకోవడానికి వీలు లేదని, ఆస్తి కలిగి ఉండరాదని, ఆయుధం పట్టరాదని అందునా ఒక పురుషుడు నిర్వహించే పాఠశాలలకు స్త్రీలు వెళ్లకూడదని జ్యోతిరావు పూలే నిర్వహిస్తున్న పాఠశాలలకు స్త్రీలను వెళ్లకుండా చేసారు. శూద్రుల అభివృద్ధికి విద్య ఎంత ముఖ్యమో  స్త్రీల అభివృద్ధికి కూడా విద్య చాలా ముఖ్యమని ఆలోచన చేసిన పూలే తన సహచరి సావిత్రిబాయి పూలేకు విద్య నేర్పించి స్త్రీలకు ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేయించి శూద్రులకు విద్యనందించాడు.


   బ్రాహ్మణీయ ఆధిపత్య వర్గాల నుండి ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికి శూద్రులకు, స్త్రీలకు విద్యతో పాటు సామాజిక చైతన్యం కల్పించడంలో పూలే సాహసోపేతమైన త్యాగపూరిత ఉద్యమం చేసాడు. 1856 లో పూలేను చంపాలన్న ప్రయత్నం జరిగింది. పూలేను చంపడానికి వచ్చిన ఇద్దరు శూద్రులకు తన పోరాటం గురుంచి బోధించి తన అనుచరులుగా మార్చుకున్నాడు. ఆయన కార్యకలాపాలు చదువు వరకే పరిమితం కాలేదు. పూలే ఇంట్లోని మంచినీటి బావి నుండి నీళ్ళు తీసుకోవడానికి అస్పృశ్యులను అనుమంతించారు. ఆ రోజుల్లో ఇదొక విప్లవమే. అప్పటివరకు అగ్రకులాల వారెవరూ ఆ పని చేయలేదు. 1860 లో ఆయన వితంతు వివాహ ఉద్యమం మొదలుపెట్టారు. ఆ కాలంలో వితంతువులు పిల్లలు కనే అవకాశం లేని స్థితిలో గర్భం తీసివేయాలి లేదా పుట్టిన పిల్లలను చంపుకోవాలి అలాంటి గర్భవతులైన వితంతువుల కోసం 1863 లో ఒక ఆశ్రమం నెలకొల్పాడు. ఆ ఆశ్రమంలో జన్మించిన బ్రాహ్మణ వితంతువు పుత్రుణ్ణి దత్తత తీసుకుని గొప్ప ఆదర్శవంతునిగా నిలచిపోయారు. బ్రాహ్మణ వితంతువులు తమ తలలను నున్నగా గొరుక్కోవాల్సిన దురాచారానికి వ్యతిరేకంగా క్షౌరకుల చేత సమ్మె చేపించారు. ఆయన ఉద్యమాలకు బలం చేకూర్చేవిధంగా రచనలు కూడా చేసేవాడు. ఆయన రచనల్లో ప్రముఖమైనది 'గులాంగిరి' 1873 జూన్ 1 న విడుదలైన ఆ గ్రంధం బానిస విధానాలపై పోరాటానికి స్ఫూర్తి అవుతుందని ఆయన భావించాడు. అణచివేతను అనుసరించే సమాజములో, విలువలు క్షీణిస్తున్న కాలంలో మనుషులు తమ హక్కులు నిలుపుకోవడానికి 1873 సెప్టెంబర్ 24 న సత్యశోధక్ సమాజ్ ను నెలకొల్పి శ్రమ జీవుల బతుకులు బాగుపడడానికి  మద్యపానానికి వ్యతిరేకంగా పోరాటం చేసాడు. స్వాతంత్రం పూర్వమే విలువల కోసం, హక్కుల కోసం, శ్రమజీవుల కోసం, స్త్రీ సమానత్వం కోసం పోరాటం చేస్తే నేటి పాలకులు ఎలాంటి పాలన చేస్తున్నారో ప్రజలు ఆలోచన చేయాలి. విద్యా దోపిడి, మద్యపానం ద్వారా ఆదాయం, అవినీతి పాలన, విలువలు లేని సమాజంలో నేటి పాలన కొనసాగుతుంది. 

   పూలే చేసిన కృషి వల్ల, ఆయన చూపిన మార్గంలోనే మహారాష్ట్రలో సాహుమహారాజ్ (శివాజీ మహారాజ్ మనుమడు) తన ఆస్థానంలో విద్యాభివృద్ధికి కృషి చేయడమే కాకుండా ఎవరు ఎంతమందో వారికి అంత వాటా అని చట్టం చేసి ఆకాలంలోనే రిజర్వేషన్లకు పునాదివేశారు. పూలే ఆశయాల కొనసాగింపుగా కేరళలో నారాయణ గురు ప్రతి ఊరులో పాఠశాలలు ప్రారంభించి విద్యాభివృద్ధికి కృషి చేశాడు. దేశంలో నూరు శాతం అక్షరాస్యత గల రాష్ట్రంగా, అభివృద్ధి సూచీలో అమెరికాతో సమానంగా కేరళ ఉందంటే పూలే, నారాయణ గురు కృషి వల్లనే సాధ్యమైంది. తమిళనాడులో పెరియార్ ఉద్యమానికి కూడా పూలే భావజాలం, సిద్ధాంతం ఎంతో మేలు చేసింది. అనగారిన ప్రజల రిజర్వేషన్ల కోసం రాజ్యాంగంలో మొట్టమొదటి సవరణ జరిగి నేడు దేశంలో బహుజనులకు అత్యధిక రిజర్వేషన్లు కల్పిస్తున్న రాష్టంగా తమిళనాడు ఉందంటే దానికి పెరియార్, పూలే కృషి పలితమేనని చెప్పాలి. ఇంకో మాటలో చెప్పాలంటే వేల ఏండ్ల అణచివేతపై మొట్టమొదటి సారిగా తిరుగుబాటు చేసి ఆధునిక భారత విప్లవవాదిగా పూలే పేరు సంపాదించినాడు. 

   మహాత్మ జ్యోతిరావు పూలే మరణించిన సంవత్సరం తర్వాత జన్మించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ పూలే ఉద్యమ చరిత్రను చదివి పూలేను తన గురువుగా ప్రకటించుకొని, పూలే సిద్ధాంతాన్ని ఆదర్శంగా తీసుకొని  అణగారిన ప్రజల విముక్తికోసం ఉద్యమాలు చేసాడు. పూలే అంకితభావం, పోరాట తీరు, బావాజలంతో ప్రభావితమైన సాహుమహారాజ్, పెరియార్, నారాయణ గురు లాంటి వాళ్ళు చేసిన ఉద్యమాలు, శాసనాల పునాధిగానే అంబేడ్కర్ రాజ్యాంగంలో  అణగారిన వర్గాలకు ఎన్నో హక్కులు పొందుపరిచారు. ముఖ్యంగా విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, ఎస్సి, ఎస్టీ లకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించారు. పూలే స్ఫూర్తిగా ఒబిసి లు చేసిన ఉద్యమం వల్ల బి.సి లకు 27 శాతం విద్య, ఉద్యోగ రిజర్వేషన్లు లభించాయి. 

   దేశంలో మెజారిటీ ప్రజలతో పాటు జనాభాలో సగబాగమైన స్త్రీలకు విద్య అందించడం ద్వారానే దేశాభివృద్ధి జరుగుతుందని పూలే ఆచరణాత్మక ఉద్యమ సిద్ధాంతం బోధిస్తుంటే మన పాలకులు మాత్రం గత 40 ఏండ్లుగా ఆ సిద్ధాంతాన్ని కుట్రపూరితంగా పక్కకు నెట్టి పాలిస్తున్నారు. ఆనాడు మెజారిటీ ప్రజలకు విద్య లేకపోవడం సమస్య అయితే నేడు అందరకి సమాన విద్య లేకపోవడం పెద్ద సమస్య . ఉన్నోళ్లకు ఒక విద్య, లేనోళ్ళకు ఒక విద్య కొనసాగిస్తూ ప్రజల మధ్య  అసమానతల పెంపుకు పాలకులు కారణమవుతున్నారు. 

    విద్య లేనందువల్లనే నేడు మెజారిటీ ప్రజలు అసంఘటిత రంగాల్లో జీవనం కొనసాగిస్తూ నానాటికి పెరుగుతున్న ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, పట్టణీకరణను ఎదుర్కోలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. విద్య కోసం దేశాలు దాటిపోవడమే కాకుండా కూటి కోసం దేశాలు దాటి వలస పోతున్నారు. ఉపాధికోసం దేశంలోని వివిధ పారిశ్రామిక నగరాలకు వలసలు పోతున్నారు. అవిద్య, చాలీచాలని ఆదాయంతో వారి పిల్లలను ప్రైవేట్ రంగంలో చదివించడం కత్తిమీద సాములాగా మారింది. పిల్లల చదువుకోసం, వైద్యం కోసం సంపాదన ధారపోయడమే కాకుండా అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పాలకులు ఉద్దేశపూర్వకంగానే ప్రజలను విద్యకు దూరం చేసి తద్వారా అభివృద్ధికి దూరం చేయడం వల్లనే నేడు దేశంలో దుర్భర పరిస్థితి కొనసాగుతుంది.


యుద్ధం మొదలైంది


   దేశ స్వాతంత్ర ఉద్యమం మొదలుకొని అన్ని ఉద్యమాల్లో కీలకపాత్ర పోషించి ఎన్నో త్యాగాలు చేసిన బి.సి సమాజం నేడు బతకలేక బలిదానాలు చేసుకుంటున్న దుస్థితి ఏర్పడింది. ఉత్పత్తి, శ్రమలో కీలకపాత్ర పోషించి సమాజ హితం కోసం త్యాగాలు చేస్తున్న బి.సి లు నేడు వారి ఆత్మగౌరవం కోసం, అధికారం కోసం ఉద్యమాలు చేయాల్సిన అవసరముంది. బి.సి స్వాతంత్ర ఉద్యమం చేయాల్సిన అవసరమేర్పడింది. ప్రజాస్వామ్యంలో చట్టసభలు సకల సమస్యలకు పరిష్కారం చూపెట్టగలవు. అలాంటి చట్టసభల్లో 60 శాతం జనాభా కలిగిన బి.సి లకు సముచిత స్థానం లేకపోవడం వల్ల అభివృద్ధికి బదులు తిరోగమన అభివృద్ధి జరుగుతుంది. ఎన్నో పోరాటాల వల్ల 27 శాతం రిజర్వేషన్లు సాధించిన బి.సి సమాజం కుల జనగణన సాధన దిశగా అడుగులు వేస్తుంది. కుల జనగణనతోనే ఆగి పోకుండా చట్టసభల్లో వాటా కోసం పోరాటం చేయాల్సిన అవసరముంది. స్వాతంత్రం వచ్చి 75 ఏండ్లు దాటినా బి.సి లకు చట్టసభల్లో వాటా లేకపోవడం ఆ వర్గాలను అవమాణించినట్లే అవుతుంది. చట్టసభల్లో వాటా కోసం దేశ వ్యాప్త ఉద్యమం చేయాల్సిన అవసరాన్ని గుర్తించిన బి.సి సంఘాలు ఇటీవలి కాలంలో ఆల్ ఇండియా ఒబిసి ఐక్య కార్యాచరణ కమిటిగా ఏర్పడి తెలంగాణలో మార్చి ఒకటి నుండి 20 రోజుల పాటు మహా పాదయాత్ర కూడా చేసారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత ఎర్రకోట వరకు ఈ ఉద్యమాన్ని కొనసాగించి దేశవ్యాప్తంగా బి.సి ఉద్యమాన్ని విస్తృత పర్చాలని తద్వారా చట్టసభల్లో బి.సి లకు వాటా సాధించాలని పోరాటం మొదలైంది. ఇంకొక మాటలో చెప్పాలంటే బి.సి విముక్తి కోసం ప్రజాస్వామ్య యుద్ధం మొదలైందని చెప్పవచ్చును. నిత్య నిర్బంధం, బ్రిటిష్ పాలన, బ్రాహ్మణీయ ఆధిపత్యం తీవ్రంగా ఉన్న ఆనాటి కాలంలో సాహసోపేతమైన పోరాటం చేసిన జ్యోతిరావు పూలేను ఆదర్శంగా తీసుకొని చట్టసభల్లో బి.సి వాటా కోసం పోరాటం చేసి సాధించిన రోజే పూలే ఈ సమాజానికి అందించిన పోరాట పటిమకు సార్థకత చేకూరుతుంది. 

    నైతికత, మానవత్వం, విద్య, సాంఘీక సంస్కరణలు ప్రధాన అంశాలుగా చేసుకొని త్యాగపూరిత ఉద్యమాలు చేసి బహుజన వర్గాలకు, స్త్రీలకు ఎన్నో హక్కులు కల్పించి పెట్టడానికి ప్రధాన కారకుడైన మహాత్మ జ్యోతిరావు పూలే ఆదర్శంగా ఉద్యమకారులు సమాన విద్యా సాధనకోసం పోరాటం చేయాలని సమసమాజ స్థాపనకు సకల సామాజిక రంగాల్లో జనాభా దామాషా ప్రకారం ఎవరు ఎంతమందో వారికంత వాటా కోసం ఉద్యమించాలి. మహానీయులు కల్పించిన రిజర్వేషన్లను కొల్లగొట్టడానికి ప్రభుత్వ రంగాలను ప్రైవేట్ పరం చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలి. బి.సి. జనగణన జరిపి చట్టసభల్లో, విద్య ఉద్యోగాల్లో బి.సి లకు రిజర్వేషన్ల కోసం పోరాటం చేయాలి. 1827 ఏప్రిల్ 11 న జన్మించి 1890 నవంబర్ 28 న మరణించిన జ్యోతిరావు పూలే సిద్ధాంతం, పనితీరు, అంకితభావం పాలకులకు ప్రజలకు స్ఫూర్తిదాయకం కావాలి. పూలే జయంతిని అధికారికంగా జరిపిస్తున్న ప్రభుత్వాలు ఆయన ఆశించిన సమాజ నిర్మాణ కోసం కూడా చిత్తశుద్ధితో కృషి చేయాల్సిన బాధ్యత మరువరాదు. పూలే జయంతి సందర్భంగానైనా పాలకులు విద్యకు-అబివృద్ధికి మధ్య ఉన్న ప్రాముఖ్యతను గుర్తించి  సమాన విద్య అందించాలి.


(ఏప్రిల్ 11 మహాత్మ జ్యోతిరావు పూలే 197వ జయంతి సందర్బంగా)


 


సాయిని నరేందర్

సామాజిక, రాజకీయ విశ్లేషకులు

     9701916091

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు