వరంగల్ లో భరతనాట్య కళా క్షేత్రం ఏర్పాటు కోసం కృషి - ప్రముఖ చార్టెడ్ అక్కౌంటెంట్ త్రిపుర నేని గోపి చంద్

 

వరంగల్ లో భరతనాట్య  కళా క్షేత్రం

ఉగాది సందర్భంగా విశిష్ట వ్యక్తులను పురస్కారాలతో సత్కరించిన శివానంద గురు కల్చరల్ ట్రస్ట్

ఏప్రిల్, 10,2024,ములుగు రోడ్ సప్తధామ్:

కళలకు కాణాచి అయిన చారిత్రక వరంగల్ జిల్లాలో సువిశాల మైన భరతనాట్య కళాక్షేత్రం  ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని శివానందగురు కల్చరల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ప్రముఖ చార్టెడ్ అక్కౌంటెంట్ త్రిపుర నేని గోపి చంద్ తెలిపారు.

ములుగు రోడ్ లోని శివానంద మూర్తి సప్తధాం ఆవరణ లో ఉగాది సందర్భంగా వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన ముగ్గురు విశిష్ట వ్యక్తులకు ట్రస్ట్ తరపున ఉగాది పురస్కారాలు అంద చేశారు. 



మారుమూల ఆది వాసి ప్రాంతం అయిన ఏటూరునాగారంలో గత 40 ఏండ్ల నుండి అక్కడి ప్రజలకు వైద్య సేవలందిస్తున్న  డాక్టర్ బండ్ల వరప్రసాద్, వరంగల్ నగరానికి చెందిన ప్రఖ్యాత భరత నాట్య కళాకారుడు బొంపెల్లి సుధీర్ రావు, సివిల్స్ లో టాపర్ గా ఎంపికై ఉత్తర ప్రదేశ్ లోని  వారనాసి ( కాశి పుణ్య క్షేత్రం)లో సబ్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న హన్మకొండకు చెందిన శాకమూరి శ్రీ సాయి అశ్రిత్ లను శివానంద గురు కల్చరల్ ట్రస్ట్ అధ్వర్యంలో ఘనంగా సత్కరించి పురస్కారాలు అంద చేశారు.


హైదరాబాద్ జిహెచ్ఎంసి విజిలెన్సు విభాగంలో ఎసిపిగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ రావు , కాకతీయ యూనివర్శిటి రిటైర్డ్ ప్రిన్సిపాల్ డాక్టర్ కిష్టయ్య, రిటైర్డ్ అధ్యాపకులు సుదర్శన్ రావు, మేనేజింగ్ ట్రస్టీ త్రిపుర నేని గోపి చంద్, ట్రస్టీ బి.సాయినారాయణ, ఇతర ట్రస్ట్  సబ్యుల చేతుల మీదుగా వీరికి ఘనంగా సత్కారాలు జరిగాయి. అనంతరం సన్మాన గ్రహీతలకు ఆహుతులకు ఆశీర్వచనం చేశారు.


ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు త్రిపుర నేని గోపి చంద్ మాట్లాడుతూ పురస్కార గ్రహీతలను పరిచయం చేసారు.

 భరత నాట్యంలో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన బొంపెల్లి సుధీర్ రావు వరంగల్ నగరానికి చెందిన వారు కావడం నగర ప్రజలకు గర్వకారణ మన్నారు. ఎంతో మంది ఆణిముత్యాల వంటి భరత నాట్య కళాకారులను తయారు చేసిన సుధీర్ రావు సేవలు చిరస్మరణీయమన్నారు. మరింత మంది కళాకారులను తీర్చి దిద్దేందుకు కళాక్షేత్రం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. వరంగల్ లో  సుధీర్ రావు అధ్వర్యంలో భరత నాట్యకళా క్షేత్రం ఏర్పాటు చేసేందుకు శివానంద గురుకుల కల్చరల్ ట్రస్ట్ భాద్యత చేపడుతుందని అన్నారు. సప్తదామ్ తో సుధీర్ రావుకు ఉన్న అనుభందం గొప్పదని ఆయన కుటుంబ సబ్యులందరూ గురువుగారి సేవలో భాగస్వాములని అన్నారు.



భరతనాట్య కళాక్షేత్రం ఏర్పాటుకు పది ఎకరాల  ప్రభుత్వ స్థలం అవసరమని ఇందు  కోసం ప్రయత్నాలు చేస్తామని తెలిపారు.  

డాక్టర్ బండ్ల వర ప్రసాద్ గురించి వివరిస్తూ గత 40 ఏండ్లక్రితం ఎంబిబిఎస్ వైద్య విద్య చదివి మారుమూల ఆదివాసి ప్రాంత ప్రజలకు  నామమాత్రపు ఫీజుతో వైద్య సేవలందిస్తున్నారని తెలిపారు. లాభాపేక్షగా మారిన  వైద్య వృత్తిలో పూర్తిగా వృత్తి ధర్మాన్ని ఆచరిస్తూ ప్రజాసేవే పరమార్దంగా డాక్టర్ బండ్ల వరప్రసాద్ అక్కడి ప్రజల గుండెల్లో నిలిచి పోయారని అన్నారు.


సివిల్స్ టాపర్ శాకమూరి సాయి అశ్రిత్ గురించి వివరిస్తూ  ఆర్టిఫిషీయల్ ఇంటలిజెన్సుకు పోటీ పడే రీతిలో  వేగంగా తన సంకేతిక మేధోసంపత్తిని పోగు చేసుకున్నాడని వివరించారు. లాక్ డౌన్ కాలంలో  కోచింగ్ సెంటర్లకు వెళ్లకుండా  ఇంట్లో ఉండే ఆన్ లైన్ అధ్యయనం చేసి సివిల్స్ పరీక్షల్లో టాపర్ గా నిలిచారన్నారు.

సాయి ఆశ్రిత్ వరంగల్ జిల్లాలో సివిల్స్ రాసే యువకులకు  తోడ్పడాటునందించాలని  అన్నారు. తన లాంటి వేయి మంది యువుకులను సివిల్స్ కోసం సిద్దం చేయాలన్నారు.


తమకు జరిగిన సత్కారాలకు కృతజ్ఞతలు తెలియ చేస్తూ సన్మాన గ్రహీతలు తమ అనుభవాలను పంచుకున్నారు.


ఉగాది పంచాంగ శ్రవణం


ఉగాది పండగ సందర్భంగా సప్తధామ్ లో గండ్లూరి గాజశేఖర్ గారి పంచాంగ శ్రవణం జరిగింది. క్రోధి నామ సంవత్సర రాశి ఫలాలలు వివరిస్తూ దేశ రాజకీయ ఆర్థిక సామాజిక స్థితులు ఎట్లా ఉండబోతున్నాయో వివరించారు. ఈ ఏడాది పంటలు బాగా పండుతాయని  వర్షపాతం సమృద్దిగా ఉంటుందని వివరించారు.

పంచాంగ కర్త గండ్లూరి గాజశేఖర్ ను శివానంద ట్రస్ట్ సబ్యులు ఘనంగా సత్కరించారు.

క్రోది నామ ఉగాది


సందర్భంగా అంతకు ముందు శ్రీ శివానంద మూర్తి గారి దివ్య సన్నిధి అయిన సప్తధామ్ లోని శివానందేశ్వరాలయంలో గురువుగారికి పుష్పార్చన జరిపించారు.

కార్యక్రమాల అనంతరం భక్తులకు మహాప్రసాదం పంపిణి చేసారు.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు