నది జలాల మల్లింపుకోసం బీజేపీ కుట్రలు- కెసిఆర్




ఉద్యమకాలం నుండి నేటిదాకా తెలంగాణ ప్రజల హక్కులను కాపాడుతూ వస్తున్నది  బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని, బీఆర్ఎస్ ఎంపీలు ఢిల్లీలో తెలంగాణ ప్రజల గొంతుకలై పనిచేస్తారని, పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ పిలుపునిచ్చారు. 


రాష్ట్రంలోని 17 పార్లమెంటు స్థానాలలో ఎంపిక చేసిన అభ్యర్థులకు బిఆర్ఎస్ పార్టీ బీ ఫారాలను తెలంగాణ భవన్ లో అధినేత కేసీఆర్ అందించారు.


ఈ సందర్భంగా కేసీఆర్ ప్రసంగం.


కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్ల సాగునీరు, తాగునీరు, కరెంట్ ప్రజలకు అందించలేకపోతోందన్నారు. ప్రజలకందాల్సిన మౌలిక వసతులకు గత పదేళ్ల కాలంలో లేని సమస్య ఇప్పుడు ఎందుకు తలెత్తిందని కేసీఆర్ ప్రశ్నించారు. ప్రజల పట్ల రైతాంగం పట్ల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్యం, అశ్రద్ధ ధోరణులే అందుకు కారణమన్నారు.


వోటేసి గెలిపించిన కాంగ్రేస్ ప్రభుత్వం పై నాలుగు నెలలకే ప్రజలు విసిగి వేసారిపోయారన్నారు.  ఏదో చేస్తామని మాయ మాటలు చెప్పి నేడు ప్రజలను నిర్ధాక్ష్యణ్ణంగా మోసం చేస్తున్న రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజలు మండిపడుతున్నారని చెప్పారు.


“వరికోతలు కొనసాగుతున్నాయి. వడ్లు ఎక్కడివక్కడే కుప్పలు మిగిలిపోయాయి. కల్లాలకు వచ్చిన ధాన్యాన్ని కొనే దిక్కే లేదు. ధాన్యం కొనుగోలు చేసే అంశంలో తీసుకోవాల్సిన చర్యలు గానీ, ముందస్తు ప్రణాళిక గానీ లేదు. పూర్తి అనుభవ రాహిత్యం. ధాన్యం కొనడం చేతగాక మిల్లర్లమీద కేసులు బనాయిస్తన్నరు.500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు..అదీలేదు...’’ అని మండి పడ్డారు. 

ఈ అంశాలమీద ఉద్యమించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.  బీఆర్ఎస్ నేతలు క్షేత్రస్తాయిలో ప్రజలవద్దకు వెళ్లి వారి కష్టాలను అడిగి తెలుసుకోవాలన్నారు. సోషల్ మీడియా సహా తదితర ప్రచార మాద్యమల ద్వారా ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి రైతాంగాన్ని రక్షించుకోవాలన్నారు.


ధాన్యం కొనుగోలు కోసం గత ప్రభుత్వం అమలు చేసిన విధానాన్ని పకడ్బందీ చర్యలను యధాతథంగా అమలు చేయటంలో ఈ ప్రభుత్వం విఫలం చెందిందన్నారు. నిర్లక్ష్యంతో అహంకారపూరితంగా వ్యవహరిస్తూ రైతులకు నష్టం చేస్తోందని కాంగ్రేస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ దుయ్యబట్టారు.


పోస్టు కార్డు ఉద్యమం ఉదృతం చేయాలి :


రాష్ట్ర రైతాంగం ఎదుర్కుంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ రూ. 500 బోనస్ తో సహా ఎగొట్టిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండు చేస్తూ.. రాష్ట్ర ముఖ్యమంత్రికి నియోజకవర్గాల వారీగా లక్షలాదిగా పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ఉదృతం చేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. నాటి ఉద్యమ కాలం నుంచి నేటి వరకు తెలంగాణ ప్రజల హక్కులను కాపాడేది కేవలం బీఆర్ఎస్ మాత్రమేనని...నాటి ఉద్యమ స్ఫూర్తిని ప్రదర్శించటం ద్వారా కాంగ్రెస్ అసమర్థత పాలనను ఎండగట్టాలని పిలుపునిచ్చారు.


గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించిందని...ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రజా రైతాంగ వ్యతిరేక పాలనను, మోసపూరిత హామీలతో ప్రజలను వంచించిన ఒక్కొక్కటి గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కల్పించాలన్నారు.


నది జలాల మల్లింపుకోసం బీజేపీ కుట్రలు


తెలంగాణకు దక్కాల్సిన గోదావరి నది జలాలను ఇతర రాష్ట్రాలకు మళ్లీంచాలని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భగ్గుమన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ “గోదావరి నది మీద ఇచ్చంపల్లి వద్ద ప్రాజెక్ట్ కట్టి కర్ణాటక తిమిళనాడు రాష్ట్రాలకు నీల్లను మలుపుకపోదామని బీజేపీ కుట్రలు చేస్తున్నది. ఇది బచావత్ ట్రిబ్యునల్ తీర్పుకు వ్యతిరేకం. నది జలాల పంపిణీపై 1974 లో బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు అందరికీ శిరోధార్యం. ఈ తీర్పు ప్రకారం నది జలాలను బేసిన్ల వారీగా పంచి ఎగువ రాష్ట్రాల నుంచి దిగువ రాష్ట్రాలకు నీటి పంపకం చేసింది. ఎగువ రాష్ట్రాలకు కేటాయించిన నీళ్ళు పోను చివరకు మిగిలిన నీరు అంతా దిగువ రాష్ట్రమైన మన రాష్ట్రానికి దక్కాలని తీర్పు స్పష్టం చేసింద’’ని కేసీఆర్ వివరించారు.


గత 50 ఏళ్ల నుంచి బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారమే నీటి పంపకాలు జరుగుతున్నప్పటికీ, కొత్తగా ఇప్పుడు కర్ణాటక, తమిళనాడు లో ఓట్లు దండుకోవటానికి నీళ్ళు మలుపుకుపోదామని, తెలంగాణ ప్రజల నోట్లో మట్టికొట్టే కుట్రలకు బీజేపీ సిద్ధమైందని కేసీఆర్ దుయ్యబట్టారు. ఇంత జరుగుతున్నా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తుందని ప్రశ్నించారు. ట్రిబ్యునల్ తీర్పుకు వ్యతిరేకంగా కేంద్రం ముందుకు పోతుంటే అడ్డుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది? ఇది రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతా కాదా? అని కేసీఆర్ ప్రశ్నించారు.


 


తెలంగాణ నది జలాలు కాపాడాలంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమన్నారు. బీఆర్ఎస్ ఎంపీలు, పార్టీ శ్రేణులు పేగులు తెగేదాక కొట్లాడైన తెలంగాణకు చెందాల్సిన నది జలాలను కాపాడుకుంటామని...ఇవన్నీ ఆలోచించి ప్రజలు బీఆర్ఎస్ పార్టీ ఎంపీలను  భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.


కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా పడిపోయింది.


కాంగ్రెస్ పరిస్థితి క్షేత్ర స్థాయిలో దారుణంగా పడిపోయిందని సర్వేలు చెబుతున్నాయని కేసీఆర్ వివరించారు. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందన్నదని అన్నారు. ఈ క్రమంలో ప్రచారంలో భాగంగా ప్రజల దగ్గరకు పోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మోసపూరిత హామీలను వాళ్లే గుర్తుచేస్తున్నారని దీన్ని విస్తృతంగా జనంలోకి తీసుకుపోవాలన్నారు. కాగా...ఇప్పటికే ప్రకటించిన పలు స్థానాల నుంచి బిఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు పట్ల సానుకూల వాతావారణం నెలకొన్నదని కేసీఆర్ వివరించారు.


బిజెపికి వోటెందుకేయాలి ?


బీజేపీని నిలదీయటానికి వంద రకాల కారణాలున్నాయని వాటన్నింటిని ప్రజలకు వివరించేందుకు పార్టీ శ్రేణులు సోషల్ మీడియా సహా తదితర మీడియా వేదికలను విస్తృత స్థాయి లో వినియోగించుకోవాలని కేసీఆర్ సూచించారు. బీజేపీకి ఎందుకు ఓటు వేయాలో నిలదీయాలన్నారు.


ఒక్క డాలర్  విలువను 83 రూపాయలకు పెంచినందుకా? ఇచ్చంపల్లి నుంచి నీళ్లు మలుపుకుపోతున్నందుకా? కృష్ణా నది మీద ప్రాజెక్ట్ లను కేఆర్ఎంబీ కి అప్పగించినందుకా? ఏడు మండలాలను ఆంధ్రాలో కలిపినందుకా? తెలంగాణ రైతుల మోటార్లకు మీటర్లు పెట్టుమన్నందుకా? ఒక్క మెడికల్ కాలేజ్.. ఒక్క నవోదయ స్కూల్ కూడా ఇవ్వనందుకా? ఇట్ల వంద కారణాలు ముందు పెట్టి బిజెపి కి ఎందుకు ఓటు వేయాలో ప్రజా క్షేత్రంలో ఆ నేతలను నిలదీయాలన్నారు.


కక్ష సాధింపుకే కవిత అరెస్ట్


ప్రజలు పూర్తి మెజార్టీతో గెలిపించిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలదోయాలని బీజేపీ పన్నిన కుట్రలను భగ్నం చేసి, కుట్రదారులను వల వేసి పట్టుకున్నామని కేసీఆర్ తెలిపారు. బీఎల్ సంతోష్ వంటి కరుడుగట్టిన ఆర్ఎస్ఎస్, బీజేపీ నేత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలో భాగస్వామిగా ఉన్నాడని ఆయనను కూడా వదిలిపెట్టకపోవటంతో బీజేపీ మనమీద కక్ష పెంచుకున్నదని వివరించారు. బీఎల్ సంతోష్ కు నోటీసులు పంపినందుకు ప్రతీకారంగా అక్రమ కేసు బనాయించి కవితను అరెస్ట్ చేశారని వివరించారు. ఢిల్లీ మద్యం కేసు పేరుతో సాగుతున్న వ్యవహారం అసలు ఓ కేసే కాదని అందులో ఎటువంటి ఆధారాలు లేవని కేసీఆర్ స్పష్టం చేశారు. ఇది కక్షసాధింపు చర్యేనన్నారు.


కాంగ్రెస్ ప్రభుత్వానికి బీజేపీ తోనే ముప్పు.


గత టర్మ్ లో ఎంఐఎం తో కలుపుకొని 111 సీట్లతో పటిష్టంగా  ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని ప్రయత్నం చేసిన బీజేపీ...అత్తెసరు మెజార్టీతో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చకుండా వదులుతుందా? అనే అనుమానాలు సర్వత్రా వెల్లువెత్తున్నాయని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏదైనా ముప్పు పొంచి వుందంటే..అది బీజేపీ నుంచి మాత్రమేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ముక్త భారత్ అనే నినాదంతో ముందుకు వస్తున్న మోడీ కాంగ్రెస్ ప్రభుత్వాలను ఖతం చేస్తున్నాడని ఈ నేపథ్యంలో అత్తెసరు మెజార్టీతో ఉన్న కాంగ్రెస్ ను ఏదో కుయుక్తులు పన్ని మాయచేసి కూలదోయకుండా ఉంటాడా? అనే అనుమానాలు సర్వత్రావ్యాపిస్తున్నాయన్నారు.


లోక్ సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం


లోక్ సభ ఎన్నికల తర్వాత బీజేపీ, కాంగ్రెస్ ల కొట్లాటతో రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి నెలకొంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారని కేసీఆర్ వివరించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ లో రాజకీయ గందరగోళ పరిస్థితిని తట్టుకొని  రాష్ట్రం రాజకీయ అస్థిరతకు లోనుకాకుండా వుండాలంటే బీఆర్ఎస్ బలంగా వుండాలని కేసీఆర్ స్పష్టం చేశారు. అందుకు ప్రజల పూర్తి మద్దతుంటుందని తమకు విశ్వాసమున్నదన్నారు.


గత ప్రభుత్వాన్ని బదునాం చేస్తూ పాలనకొనసాగించాలనుకుంటున్న కాంగ్రేస్ పార్టీ కుయుక్తులను ప్రజలు పసిగడుతున్నారని కేసీఆర్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్లో మూడు పియర్లు కుంగిపోతే మొత్తం ప్రాజెక్టే కూలిపోయిందని  అబద్దాలు, కట్టుకథలతో ప్రజలను ఇన్నాళ్లు మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం... కాఫర్ డ్యామ్ కట్టాలని నిర్ణయించటం బీఆర్ఎస్ సాధించిన విజయమన్నారు.


ఈ నెల చివరి వారంలో బస్సు యాత్ర.


ఈ నెల చివరివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలు నిర్వహించాలని కేసీఆర్ గారు నిర్ణయించారు.అందుకు సంబంధించిన రూట్ మ్యాప్ ను సిద్దం చేయాలన్నారు. ముఖ్యనాయకత్వమంతా కూచొని చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని ఎంపీ అభ్యర్థులకు, సమన్వయకర్తలకు, పార్లమెంటరీ నియోజక వర్గ పరిధిలోని ఎమ్మెల్యేలకు మాజీ ఎమ్మెల్యేలకు ముఖ్యనేతలకు కేసీఆర్ సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలనలో కష్టనష్టాలకు గురవుతున్న రైతాంగానికి, ప్రజలకు మరింత చేరువయ్యేందుకు బస్సు యాత్రను చేపట్టాలని కేసీఆర్ నిర్ణయించారు.


బస్సు యాత్ర  సందర్భంగా జిల్లా కేంద్రాలు, ముఖ్య పట్టణాలు, నియోజకవర్గ కేంద్రాల్లో తనతో పాటు తన బృందం బస చేసేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఉదయం పూట రైతాంగ సమస్యల మీద  క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తానని తెలిపారు. ఎండిన పంట పొలాలు, ధాన్యం కల్లాలను సందర్శిస్తూ, రైతులను పరామర్శిస్తూ, వారి కష్టనష్టాలకు తెలుసుకుంటూ కేసీఆర్ బస్సు యాత్ర సాగనున్నది.


సాయంత్రం పూట పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ముఖ్యమైన మూడు నుంచి నాలుగు ప్రాంతాలను ఎంపిక చేసుకొని కేసీఆర్ బస్సు యాత్ర కొనసాగనున్నది. ముఖ్యమైన కేంద్రాల్లో బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే ఈ దిశగా అన్ని రకాల ఏర్పాటు సిద్ధం చేశామని అధినేత తెలిపారు. రెండు, మూడు వారాల పాటు ఈ బస్సు యాత్ర కొనసాగనున్నది.


లీగల్ సెల్ కు నిధులు కేటాయింపు


రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కార్యకర్తలను అక్రమ అరెస్ట్ లు చేస్తూ భయాభ్రాంతులకు గురి చేస్తున్నారని ఇప్పటికే పలు చోట్ల ఇలాంటి సంఘనటనలను పార్టీ శ్రేణులు తిప్పికొట్టాయని కేసీఆర్ అన్నారు. అక్రమ కేసులు బనాయించి కార్యకర్తల మనో స్థైర్యాన్ని దెబ్బ తీయాలనుకున్న కాంగ్రెస్ పార్టీ పై పోరాడేందుకు లీగల్ సెల్ ను ఇప్పటికే పటిష్టం చేశామని కేసీఆర్ అన్నారు. ఇందులో భాగంగా కేసులను ఎదుర్కొనేందుకు ఎంతటి ఖర్చుకైనా వెనకడాకుండా కార్యకర్తలకు కాపాడుకుంటామని కేసీఆర్ స్పష్టం చేశారు. ఇందుకు గాను పది కోట్ల రూపాయలను బీఆర్ఎస్ లీగల్ సెల్ అకౌంట్ కు కేటాయించిట్లు కేసీఆర్ ప్రకటించారు.  దీనికి సంబంధించి భవిష్యత్ లో ఎటువంటి న్యాయపరమైన సేవలైనా అందించేందుకు పార్టీ సీనియర్ అడ్వకేట్లు సోమా భరత్ కుమార్, మొహన్ రావు లతో కూడిన అడ్వకేట్ల బృందం నిరంతరం అందుబాటులో ఉంటుందని తెలిపారు.


ఎంపీ అభ్యర్థులకు బీ ఫారామ్ లు అందజేత.


ఇప్పటికే ప్రకటించిన 17 మంది ఎంపీ పార్టీ అభ్యర్థులకు బీ ఫారాలను అందజేసి ఎన్నికల నియామావళిని అనుసరించి ఒక్కొక్కరికి రూ. 95 లక్షల చెక్కును అధినేత కేసీఆర్ అందజేశారు.


 అధినేత కేసీఆర్ చేతుల మీదుగా బీ ఫారాలు అందుకున్న అభ్యర్థుల వివరాలు...ఎంపీ స్థానాల వారీగా..


ఆదిలాబాద్- ఆత్రం సక్కు


పెద్దపల్లి   - కొప్పుల ఈశ్వర్


కరీంనగర్ – బోయినపల్లి వినోద్ కుమార్


నిజామాబాద్ – బాజిరెడ్డి గోవర్థన్


జహీరాబాద్ – గాలి అనిల్ కుమార్


మెదక్ -        వెంక్రటామి రెడ్డి


మల్కాజ్ గిరి – రాగిడి లక్ష్మారెడ్డి


సికింద్రాబాద్ – తీగుళ్ల పద్మారావు గౌడ్


హైదరాబాద్ – గడ్డం శ్రీనివాస్ యాదవ్


చేవెళ్ల   - కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్


మహబూబ్ నగర్ – మన్నె శ్రీనివాస్ రెడ్డి


నాగర్ కర్నూల్    - ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్


నల్గొండ – కంచర్ల కృష్ణారెడ్డి


భువనగిరి – క్యామ మల్లేష్


వరంగల్ – డాక్టర్ సుధీర్ కుమార్


మహబూబాబాద్ – మలోతు కవిత


ఖమ్మం – నామా నాగేశ్వర రావు


ఇదే సందర్భంగా కంటోన్మెంట్ ఉప ఎన్నికలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇప్పటికే ప్రకటించిన గైని నివేదిత కు బీ ఫారామ్ అందజేసి ఎన్నికల నియామవళి ప్రకారం రూ. 45 లక్షల చెక్కును పార్టీ అధ్యక్షులు కేసీఆర్ అందజేశారు.


బీ ఫారాలు తీసుకున్న సందర్భంగా ఎంపీ అభ్యర్థులతో పాటు ఆ పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ముఖ్యనేతలు అధినేతతో కలిసి గ్రూప్ ఫోటోలు తీసుకున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు