కామారెడ్డి బి.సి డిక్లరేషన్ అమలుకై పోరాటం చేద్దాం

 


కామారెడ్డి బి.సి డిక్లరేషన్ అమలుకై పోరాటం చేద్దాం


ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్ 


  స్థానిక సంస్థల ఎన్నికల్లో బి.సి లకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనతో పాటు ప్రకటించిన ఇతర సంక్షేమ, అభివృద్ధి అంశాలను సాధించడం కోసం బి.సి లు ఐక్య ఉద్యమానికి సిద్ధం కావాలని ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్ పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో బి.సి జనసభ అద్యక్షులు రాజారాం యాదవ్ అధ్యక్షతన జరిగిన సామాజిక సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం లో ఆయన పాల్గొని మాట్లాడారు.

   స్వాతంత్రం వచ్చిన నాటి నుండి ఎన్నో పోరాటాలు చేయడం వల్ల మండల్ కమీషన్ నివేదికలో సూచించబడిన 40 అంశాల్లో ఒక్కటైనా విద్యా, ఉద్యోగాల్లో 27 శాతం రిజర్వేషన్లు కల్పించారని, దానికి అనుగుణంగా ఆయా రాష్ట్రాల్లో బి.సి లకు స్థానిక సంస్థల్లో కల్పించిన రిజర్వేషన్లు  ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క విధంగా అమలుపరుస్తూ స్థానిక సంస్థల రిజర్వేషన్లలో హెచ్చు తగ్గులకు పాల్పడ్డారని ఆయన అన్నారు. తెలంగాణలో కూడా గతంలో ఉన్న స్థానిక సంస్థల రిజర్వేషన్లను తగ్గించారని, ఈ సందర్భంగా ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల్లో బి.సి లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో పాటు ఎన్నో సంక్షేమ, అభివృద్ధి ప్రణాళికలు కామారెడ్డిలో జరిగిన కాంగ్రెస్ పార్టీ బి.సి డిక్లరేషన్ లో ప్రకటించి నాలుగు నెలలు దాటినా వాటి ఊసే లేకపోవడం బాధాకరమని ఆయన అన్నారు. 

  ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన బి.సి జనసభ అద్యక్షులు రాజారాం యాదవ్ మాట్లాడుతూ కామారెడ్డి డిక్లరేషన్ లో పొందుపరచిన ప్రభుత్వ సివిల్ కన్స్ట్రక్షన్, మెంటెనెన్స్ లో బి.సి లకు 42 శాతం రిజర్వేషన్లు, మొదటి అసెంబ్లీ సెషన్స్ లో బి.సి సబ్ ప్లాన్ కు నిధులు మంజూరు చేస్తామని, బి. సి సంక్షేమానికి లక్ష కోట్లు కేటాయిస్థామని, ఎం.బి.సి సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి ఎం.బి.సి ల అభివృద్ధికి కృషి చేస్తామని, బి.సి ప్రెస్ క్లబ్ లు, ఐక్యతా భవనాలు, స్టడీ సర్కిల్లు, క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని, బి.సి లకు కొత్త గురుకులాలు ఏర్పాటు చేస్తామని, నవోదయ పాఠశాల లాగ బి.సి లకు ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేస్తామని, వృత్తి బజార్లు ఏర్పాటు, బి.సి కుల వృత్తుల కార్పొరేషన్లకు విరివిగా నిధులు ఇచ్చి, పాలక మండల్లను నియమించడం

తదితర ఎన్నో అంశాలను కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ పొందుపరచి వాటి ఊసే మరచిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే డిక్లరేషన్ లో పొందుపరచిన అంశాల కార్యాచరణను ప్రకటించాలని అన్నారు. 

    రైతులకు రుణ మాఫీ తదితర ఎన్నికల హామీలను పలాన రోజున పూర్తి చేస్తామని  పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో ప్రమాణాలు చేస్తున్న రేవంత్ రెడ్డి బి.సి లకు ఇచ్చిన హామీలను ఎప్పుడు నెరవేరుస్తారో స్పష్టంగా ఎన్నికల ప్రచారంలో బహిరంగంగా ప్రకటించాలని బి.సి సంఘాలుగా మనం డిమాండ్ చేయాల్సిన అవసరముందని ఆయన అన్నారు. 

  పార్లమెంటు ఎన్నికల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని మాట్లాడుతున్న కాంగ్రెస్ స్థానిక సంస్థల్లో బి.సి రిజర్వేషన్ల గురుంచి మాట్లాడాలని, 42 శాతం రిజర్వేషన్ల అమలుపై స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేసారు. స్థానిక సంస్థల్లో 42 శాతం బి.సి. రిజర్వేషన్ల సాధనతో పాటు మిగతా డిమాండ్లను సాధించుకోవడానికి బి.సి లు ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో బి.సి రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేష్, బి.సి టైమ్స్ ఎడిటర్ సంగెం సూర్యారావు, హిందూ బి.సి మహాసభ అద్యక్షులు బత్తుల సిద్దేశ్వర్లు, మున్నూరుకాపు సంఘం రాష్ట్ర సంఘం రాష్ట్ర అధ్యక్షులు సర్దార్ పుట్టం పురుషోత్తం, బి.సి యునైటెడ్ ఫ్రంట్ పార్టీ అధ్యక్షులు పాలూరు రామకృష్ణ, తెలంగాణ బి.సి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల నరేందర్ గౌడ్, ఆల్ ఇండియా ఒబిసి విద్యార్థి సంఘం అధ్యక్షులు కిరణ్ కుమార్, ఎంపిటిసి ల ఫోరం అద్యక్షులు కరుణాకర్, వివిధ సంఘాల నాయకులు పటేల్ వనజ, కరుణశ్రీ, మేక లలిత యాదవ్,  ఎ.మహేందర్, చెన్న శ్రీకాంత్ నేత, వెంకటరమణ, న్యాయవాది రమేష్ యాదవ్, మేకల రాజేందర్ యాదవ్, దేశం మహేష్, లింగం శాలివాహన, కొంగర నరహరి తదితరులు పాల్గొని మాట్లాడారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు