కొండపెల్లి సీతారామయ్య , ఒక వ్యక్తి పేరు కాదు


 కొండపెల్లి సీతారామయ్య , ఒక వ్యక్తి పేరు కాదు


కొండ పెల్లి సీతరామయ్య ఒక వ్యక్తి పేరు కాదు. ఆ పేరు వినగానే ముందు గుర్తుకు వచ్చేది ఆ వ్యక్తి కాదు , ఒక ఉద్యమం గుర్తుకు వస్తుంది. విప్లవకారునిగా ఎవరు గుర్తించినా గుర్తించక పోయినా ఆయన పేరు వినగానే మాత్రం ఎవరికైనా గుర్తుకు వచ్చేది, విప్లవోద్యమమే. భారత దేశంలో విప్లవోద్యమం నిలదొక్కుకోవడానికి అభివృద్ది చెందడానికి సీతారామయ్య చేసిన కృషి ఎవరు మరువ లేనిది, ఎవరూ మాపలేనిది కూడా. ఎదురు గాలులలో ఎర్రజెండాను ఎత్తిపట్టిన వాడు, కారు చీకటిలో కాంతి రేఖ అయినవాడు కె.ఎస్. ఉభయ కమ్యూనిస్టు పార్టీల వైఫల్యాల వలన ఉద్యమం తన దశను మరిచి పోయి దిశను కోల్పోయి చట్టసభలలోనే సీట్లకు చుట్ట చుట్టుకుని పాతుకుని పోయింది. తెలంగాణా సాయుధ పోరాట కాలంలోనే కాకలు తీరిన నాయకులు, ఏ మార్గంలో ప్రయాణిస్తే ఈ దేశంలో విప్లవం విజయవంతం అవుతుందో క్షుణ్ణంగా తెలిసిన తలపండిన మేధావులు పండిత చర్చలు చేసుకుంటూ పడకేసి , నిరాశతో నిండిన ఆకాశంలో మీన మేశాలు లెక్క పెడుతుండగా పాపం ‘స్థాయి’ లేని చారుమజుందార్, వెధవది ఒక జిల్లా కార్యదర్శి , ఉద్దండ పండితులను లెక్క చేయకుండా, చెప్పకుండా వానకాలం రాకముందే గర్జించాడు. అంతే కేంద్ర కమిటి, పొలిట్ బ్యూరో, అంటే ఉన్నత స్థాయి నాయకులందరు కోపం అయ్యారు. బచ్చాగాడు మనకు చెప్పాపెట్టకుండానే నగారా మోగిస్తాడా అని ఛీదరించుకున్నారు. నక్సల్బరి ఉద్యమ ప్రాముఖ్యాన్ని తక్కువ చేయడానికి ఉన్నత స్థాయి నాయకులందరు పోటి ఉద్యమ కేంద్రాలను నిలపెట్టటానికి నడుము కట్టారు. నగ్జల్ బరి లో కొత్తగా పుట్టిన మార్గమేది లేదు, దాన్ని మేము తెలంగాణా సాయుధ పోరాట కాలంలోనే కనుగొన్నాము, దాని మీద మాకే పేటెంట్ హక్కు ఉంది, దాన్ని చారుమజుందార్ హైజాక్ చేశాడు అంటూ దబాయించారు. వారి పేటెంట్ వ్యూహం ప్రకారం పర్వతాల్లో పోరాటం మొదలు పెట్టారు. కాని పర్వతం ఎలా ఎక్కాలో తెలవలేదు. ఎక్కే మార్గం తెలవకుండా, ఎలా ఎక్కుతామంటూ మార్గం కోసం చర్చోపచర్చలు చేశారు. పర్వతం చుట్టూతా తిరిగారు, తిరుగుతూనే ఉన్నారు. పర్వతం ఎక్కలేదు దిగలేదు. పర్వతం ఎక్కడం మొదలు పెడితేనే, పర్వతం ఎక్కే మార్గం తెలుస్తుందనే విషయాన్ని మాత్రం గుర్తించలేదు. ఇంకా ఎమ్.సి.సి. వాల్లు నయం. చారుమజుందార్ తో విభేదించిన వీరు నక్సల్ బరి లాగానే పశ్చిమ బెంగాల్ లోనే కాంక్ష అనే ప్రాంతంలో రైతాంగ ఉద్యమాన్ని నిర్మించారు. కాని సచ్చిపోయిన మా గేదె పగిలిపోయిన కుండెడు పాలు ఇచ్చేదని చెప్పుకోలేదు.

చారుమజుందార్ చనిపోయిన తరువాత ఆయన లోపాలను, విమర్షించే పేరు మీద నక్సల్ బరి విప్లవ తత్వం పైన్నే, వ్యూహం పైన్నే నాలుగు దిశల నుండి మితవాద దాడిని మొదలు పెట్టారు. సరిగ్గా అప్పుడు కొండపల్లి సీతారమయ్య ఈ మితవాద దాడులను ఎదుర్కున్నాడు. చారుమజుందార్ అతివాద, దుందుడుకు వాద లోపాలను సరిదిద్దుతూనే నక్సల్ బరి ఉద్యమం అందించిన వ్యూహం- ఎత్తుగడల రక్షణకు పెద్ద సిద్దాంత పోరాటం చేశాడు. పిలుపు అనే పత్రికను స్థాపించి, మితవాద దాడులను ఖండిస్తూ కంటిన్యూగా వ్యాసాలు రాస్తూ సిద్దాంత చర్చ నిర్వహించాడు. మితవాద దాడులను ఓడించాడు. కొండపల్లి సీతారామయ్య నిర్వహించిన ఈ సైద్దాంతిక పోరాటం పునాది పైన్నే తరువాతి కాలంలో ఆంధ్రప్రదేశ్ లో పీపుల్స్ వార్ ఆవిర్భవించింది. దాని నాయకత్వంలో బలమైన ఉద్యమం రూపుదిద్దుకుంది. బలమైన రైతాంగ, విద్యార్ధి, యువజన ఉద్యమాలు వెల్లువెత్తాయి. అయితే సీతారామయ్య కూడా , వెధవది తక్కువ స్థాయి జిల్లా (కృష్ణా) కార్యదర్శి మాత్రమే. కమ్యూనిస్టు పార్టీల లోని ఇతర ఉన్నత స్థాయి నాయకులలాగ పెద్ద విధ్యాధికుడు కూడా కాదు.  ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ కాలంలో నైతికంగా తప్పు చేసి పార్టీ నుండి సస్పెండ్ చేయబడడాన్ని, కొందరు ఉన్నతస్థాయి నాయకులు ఆయన పైన దాడికి ఉపయోగించుకున్నారు.  నైతికత, అనైతికతల నిర్వచనం గురించి చర్చిస్తే ఈ వ్యాసం పరిదిలో కుదిరే విషయం కాదు. మహా మహా ఉద్యమాలను భ్రస్టు పట్టించి మట్టిలో కలిపిన ఉన్నత స్థాయి నాయకులకు ఉన్న నైతికత ఏమిటనేది మరోసారి చర్చించవచ్చు. కాని కొండపల్లి సీతారామయ్య మాత్రం పవిత్రమైన, ఉన్నత స్థాయి పండితులందరిని వెనక వదిలి వేస్తూ ముందుకు దూసుకుపోయాడు. డాక్యుమెంట్లన్నీ పంచాంగం కట్టలుగా చంకలో పెట్టుకుని దేశం అంతా తిరగడం మానివేసి ఒక ప్రాంతంలో మొత్తం దేశం ఆకర్షించగలిగిన ఉద్యమాన్ని నిర్మించాడు. మొత్తం దేశాన్ని ఆకర్షించే ఉద్యమాన్ని నిర్మించినప్పుడే దేశంలోని విప్లవ ఉద్యమాలన్నింటిని ఐక్యం చేయగలమని చెప్పేవాడు. చెప్పిన దాన్ని నిరూపించినాడు. 

ప్రజాసంగాల నిర్మాణమే రివిజనిజం, ఆర్ధికవాదం అన్న చారుమజుందార్ ను ఒప్పించి ప్రజాసంగాల నిర్మాణం ప్రారంభించినాడు. కొన్ని ఎమ్.ఎల్. పార్టీల ఉన్నత స్థాయి నాయకులు, ప్రజాసంగాలకు రాజకీయాలు వద్దు అని, అవి కేవలం తమ ఆర్ధిక సమస్యల పరిష్కారం కొరకే పోరాడాలని వాదించినారు. కొండపల్లి సీతారామయ్య, ప్రజాసంగాలకు రాజకీయాలు ఉండాలనే మార్క్సిస్టు లెనిస్టు అవగాహనను బోధించారు. విద్యార్ధులు నూతన ప్రజాస్వామిక రాజకీయాలను రైతాంగంలో ప్రచారం చేయాలన్నాడు. అందుకొరకు విద్యార్ధులను గ్రామాలకు తరలండని ఆంధ్రప్రదేశ్ లో మొదటి సారి పిలుపిచ్చింది కొండపల్లి సీతారామయ్యనే. కొన్ని ఎమ్.ఎల్. పార్టీలు ముందు వ్యతిరేకించాయి తరువాత అనుసరించాయి. నక్సలైట్ల పై దుష్ప్రచారాన్ని ఖండిస్తూ సీతారామయ్య గారు ‘నక్సలైట్లే నిజమైన దేశభక్తులు’ అని నినాదం ఇచ్చినప్పుడు కూడా కొంత మంది పవిత్ర పండితులు, అలా ఎలా అవుతుంది కమ్యూనిస్టులు అంతర్జాతీయవాదులు అవుతారంటూ వెక్కిరించారు తరువాత నోరు మూసుకున్నారు. 1969 లో ప్రత్యేక తెలంగాణా ఉద్యమం మొదలైనప్పుడు కూడా తెలంగాణా రాష్ట్ర ఉద్యమాన్ని బలపరిచిన మొట్ట మొదటి కమ్యూనిస్టు పార్టీ నాయకుడు కూడా కొండపల్లి సీతారామయ్యనే. అప్పుడు కూడా ఉన్నత స్థాయి, నైతిక విలువల, పవిత్ర పండితులు కొండపల్లిని వేర్పాటువాది అని తిట్టిపోశారు. సరిగ్గా 40 సంవత్సరాల తరువాత ఒక్క సి.పి.ఎమ్. , వ్యక్తులుగా మిగిలిపోయిన పండితులు మినహా మొత్తం వామపక్షాలు తెలంగాణా రాష్ట్ర ఉద్యమాన్ని బలపరిచినాయి. అందుకే సీతారామయ్య ఈ పండితులను సజ్జలు తిని సజ్జలనే విసర్జించే సిద్దాంత కోళ్ళు అని విమర్షించే వాడు. కుల అణిచివేతకు వ్యతిరేకంగా కూడా పొరాడాలని కె.ఎస్. అన్నప్పుడు దాన్ని కులతత్వం అన్నారు. భారత దేశంలొ గ్రామీణ శ్రామిక వర్గం ప్రధానంగా దళితులే అనీ మిగతా ఎవరికంటే కూడా వారికే విప్లవం తక్షణ అవసరం అనీ విప్లవంలో వారి పాత్ర ముఖ్యమైనదని, దళితులు న్యూనతా భావంలో ఉన్నన్ని రోజులు విప్లవంలో వారి పాత్రను వారు నిర్వహించ లేరనీ, అందుకే దళితుల ఆత్మాభిమాన పోరాటాలను బలపరచాలని చెప్పేవాడు సీతారామయ్య. మిగతా అందరితో పాటు మేముకూడా సమానమే అనే భావన ఉన్నప్పుడే ఎవరైనా తమ హక్కుల కొరకు పోరాడ గలుగుతారని చెప్పేవాడు. విధ్యార్ధులను గ్రామాలకు వెల్లమని చెప్పినప్పుడు కూడా ముందు దళిత వాడలకే వెల్లమని చెప్పేవాడు. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని కమ్యూనిస్టు, ఎమ్.ఎల్. పార్టీల నాయకత్వం అంతా సీమాంధ్ర నుండే ఉంటుంది. కాని పీపుల్స్ వార్ పార్టీ నాయకత్వం మెజార్టి తెలంగాణ నుండే ఉంది. ఇప్పటికి మావోయిస్టు పార్టీ కేంద్రకమిటి సభ్యులలో తెలంగాణా వారే అధికం. ఇది యాధృచ్చికంగా జరగ లేదు. దీని వెనక కొండపల్లి సీతారామయ్య ఆలోచన, కృషి ఉంది. ఎక్కడైతే ఉద్యమం ఉంటుందో అక్కడినుండే ఎక్కువ నాయకత్వం ఉండాలని చెప్పేవాడు. దళితుల , బి.సి. ల రిజర్వేషన్ లను కె.ఎస్. బలపరిచి నప్పుడు కూడా కొన్ని ఎమ్.ఎల్. పార్టీల నాయకులు వ్యతిరేకించారు. ఇంకా ఇలా చాలా చెప్పవచ్చు. మొత్తంగా చెప్పాల్సి వస్తే నక్సల్ బరిలో బద్దలైన ఉద్యమం అతి అంచనాలతో దుందుడుకు ఎత్తుగడల కారణంగా వెనక పట్టు పట్టినప్పుడు, కె.ఎస్. రంగం మీదకు వచ్చాడు. సరి అయిన అంచనాలు ఇచ్చి పరిస్థితికి తగిన ఎత్తుగడలతో ఉద్యమాన్ని తిరిగి పట్టాలు ఎక్కించాడు. ఉద్యమ క్రమంలోని ప్రతి మలుపులో ఎదురైన సవాల్లను సమర్ధవంతంగా ఎదుర్కున్నాడు. శారీరకంగా మానసికంగా బలహీనపడుతున్న క్రమంలోనే చివరి దశలో ఉద్యమానికి మార్గదర్శకత్వం వహించలేక పోయాడు.

నిజానికి చారుమజుందార్ ను నాయకునిగా తిరిగి నిలపెట్టింది, సీతారామయ్యనే. వినోద్ మిశ్రా నాయకత్వం లోని లిబరేషన్ , కె.ఎస్. నాయకత్వం లోని పీపుల్స్ వార్ పార్టీలు చారుమజుందార్ ను తమ ప్రియమైన నాయకునిగా గుర్తించడం స్వీకరించడం, ఈ పార్టీలే బలమైన ఉద్యమాలు నిర్మించడం వలన చారుమజుందార్ ఈ నాటికి నాయకునిగా గుర్తింపు పొందగలుతున్నాడు. లేకపోతే మితవాదులు ఎత్తిపోసిన మట్టి , చల్లిన బురద క్రింద చారుమజుందార్ కనిపించకుండా వినిపించకుండా పోయేవాడు. చారుమజుందార్ ను తమ నాయకునిగా గుర్తించిన లిబరేషన్, పీపుల్స్ వార్ పార్టీ లే మిగతా ఎమ.ఎల్. పార్టీల కంటే ఈ నాటికి బలమైన పార్టీలుగా, బలమైన ఉద్యమాలకు ప్రతినిధులుగా ఉన్నాయి.

కొండపల్లి సీతారామయ్య ఏమి తప్పులు చేయలేదని ఏమి లోపాలు లేవని కాదు. సోవియట్ వ్యతిరేక ఐక్యసంఘటన , మూడు ప్రపంచాల సిద్దాంతం విషయాలలో కె.ఎస్. సరిగా అంచనా వేయలేక పోయాడు. కోల్డ్ వార్ సమయంలో మూడవ ప్రపంచ యుద్దం గురించి అతిగా వక్కాణించాడు. పార్టీలో చివరి కాలంలో పార్కిన్ సన్ వ్యాధితో ఇబ్బంది పడ్డాడు, ఇబ్బంది పెట్టాడు. 1990 లో నూతన కేంద్ర కమిటిని ఎన్నుకోవడానికి ముందు, నా వయస్సు పెరిగిపోయింది చురుకుగా పనిచేయడం సాధ్యం కాదు, ఇక కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించలేను, కేంద్ర కమిటిలో సభ్యునిగానే ఉంటాను అన్నాడు. కారణం ఏమైనా తీరా సమయానికి కె.ఎస్. తను అన్నదానికి కట్టుబడి లేడు. ఒక వేళ కట్టుబడి ఉంటే కె.ఎస్. ప్రతిష్ట ఇంకా పెరిగి ఉండేది. అయితే సీతారామయ్య చేసిన తప్పులను ఉన్నత స్థాయి పవిత్ర నాయకులు చేసిన తప్పులతో పోల్చలేము, పొంతనే ఉండదు. ఉద్యమ అభివృద్ది క్రమంలో కె.ఎస్. తప్పులను చేశాడు. కాని తప్పుల కంటే గొప్ప ఉద్యమాన్ని నిర్మించాడు. కొందరు ఉన్నత స్థాయి నాయకుల లాంటి తప్పులు కొన్ని కె.ఎస్. చేసినా, కె.ఎస్. నిర్మించిన ఉద్యమం లాంటి దాన్ని మాత్రం ఉన్నత స్థాయి నాయకులు ఎన్నడూ నిర్మించ లేదు. 

( ఏప్రిల్ 12 కొండపల్లి సీతారామయ్య వర్ధంతి)

లంకా పాపన్న తన ముఖపుస్తక గోడపై 2020 లో రాసిన వ్యాసం)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు