ప్రజా చైతన్యం కోసమే బి.సి. మహా పాదయాత్ర

 ప్రజా చైతన్యం కోసమే బి.సి. మహా పాదయాత్ర



చట్టసభల్లో బి.సి వాటా సాధనే లక్ష్యంగా 13 రోజులుగా పాదయాత్ర


చట్టసభల్లో బి.సి ల వాటా కోసం ఐక్యం అవండి


ఆల్ ఇండియా ఒబిసి నాయకుల పిలుపు


   చట్టసభల్లో బి.సి వాటా సాధన కోసం ఆల్ ఇండియా ఒబిసి ఆధ్వర్యంలో గత 13 రోజులుగా కొనసాగుతున్న బి.సి మహా పాదయాత్ర 256 కిలోమీటర్లు పూర్తి చేసుకొని బుధవారం సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండల కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా మండల కేంద్రంలో కరపత్రాలు పంచి, పాటలతో ప్రచారం చేసి కూడలిలో ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్, తెలంగాణ బి.సి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్, హిందూ బి.సి మహాసభ రాష్ట్ర అద్యక్షులు బత్తుల సిద్ధేశ్వర్లు, జాక్ వైస్ చైర్మన్లు వెలుగు వనిత, పటేల్ వనజలు ప్రసంగం చేశారు. వంద కులాలుగా, వంద వర్గాలుగా విడిపోయి నిత్యం శ్రమ చేస్తూ జీవించే సబ్బండ కులాలను చైతన్యం చేసి చట్టసభల్లో బి.సి ల వాటా సాధించడం కోసమే మహా వీరుల స్పూర్తితో మహా పాదయాత్ర చేస్తున్నామని వారన్నారు. ఐకమత్యంగా పోరాడితేనే చట్టసభల్లో బి.సి వాటా సాధిస్తామని అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో చట్టాలు, ప్రణాళికలు రూపొందించే చట్టసభల్లో బి.సి లకు జనాభా దామాషా ప్రకారం వాటా లేనందునే బి.సి లు వలసలు పోవడమే కాకుండా బతకలేక బలిదానాలు చేసుకుంటున్నారని వారన్నారు. దేశ స్వాతంత్ర పోరాటం నుండి తెలంగాణ పోరాటం వరకు ఎన్నో పోరాటాల్లో కీలకపాత్ర పోషించిన బి.సి లు నేడు బి.సి ల కోసం జరిగే పోరులో లక్షలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. బి.సి వీరులు పండుగ సాయన్న, కొండా లక్ష్మణ్ బాపూజీ, బెల్లి లలితక్క, ఉ.సా, శ్రీకాంతచారి, మారోజు వీరన్న, దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, సర్దార్ సర్వాయి పాపన్న ల జన్మస్థలాలను సందర్శిస్తూ సాగుతున్న మొదటి దశ  పాదయాత్రను ప్రజలు, ప్రజా సంఘాలు, పార్టీలకతీతంగా కలసి నడిచి జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. చట్టసభల్లో బి.సి వాటా సాధించే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని, పార్లమెంటు ఎన్నికల తర్వాత ఢిల్లీ వరకు  బి.సి దండయాత్ర కొనసాగుతుందని అన్నారు. సకల సామాజిక రంగాల్లో సమాన వాటా దక్కాలంటే చట్టసభల్లో సమాన వాటా ద్వారానే సాధ్యమవుతుందని, అన్ని రాజకీయ పార్టీలు బి.సి నాయకులను జిల్లా స్థాయి నాయకత్వం వరకే పరిమితం చేస్తున్నారని, బి.సి లను అసెంబ్లీ, పార్లమెంటులల్లో అంటరానివారిగా చేశారని, చట్టసభల్లో బి.సి వాటా కోసం పార్లమెంటులో చట్టం చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి పనిలో బి.సి లు ఉండి ఎంతో శ్రమ చేస్తున్నప్పటికీ పాలనలో మాత్రం వాటా దక్కడం లేదని అన్నారు. ఎన్నో ఉద్యమ అనుభవాలు, ఎన్నో త్యాగాలు చేసిన చరిత్ర కలిగిన బి.సి లు నేడు చట్టసభల్లో వాటా కోసం ఉద్యమించాల్సిన చారిత్రక అవసరం వచ్చిందని అన్నారు. 



   ఈ కార్యక్రమంలో జాక్ వైస్ చైర్మన్లు పటేల్ వనజ, వెలుగు వనిత, ఏటిగడ్డ అరుణ పటేల్, నాయకులు సింగారపు అరుణ, బుచ్చిబాబు, గడిపిపె విమల, బాలస్వామి, ఎర్రమల్ల శ్రీను, ఎర్ర శ్రీహరి గౌడ్, గిరగాని బిక్షపతి గౌడ్, అజయ్ పటేల్, చాపర్తి కుమార్ గాడ్గే, అనంతుల రాంప్రసాద్, కొంగర నరహరి, సుజాత, విశ్వపతి, కుంట విజయ్ కుమార్, సూరారపు రమారెడ్డి,  సుదర్శన్ తదితరులు పాదయాత్ర బృందంలో పాల్గొన్నారు.

    ఈ కార్యక్రమంలో

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు