ప్రవీణ్ కుమార్ పయన మెటు ?

 స్వచ్చంద పదవి విరమణకు ప్రవీణ్ కుమార్ దరఖాస్తు..

నేరుగా రాజకీయాల్లోకి రానున్నారా ?

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థిగా నిలుస్తారా ?


సుదీర్ఘకాలంగా సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి  హోదాలో పనిచేస్తున్న సీనియర్ ఐపిఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ స్వచ్చంద పదవి విరమణ చేయబోతున్నారు. స్వచ్చంద పదవి విరమణ కోసం ఆయన ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల ముంగిట్లో ప్రవీణ్ కుమార్  స్వచ్చంద పదవి విరమణ కు దరఖాస్తు చేయడం చర్చ నీయాంశంగా మారింది. ప్రవీణ్ కుమార్ ఉప ఎన్నికల్లో కెసీఆర్ కు అస్త్రంగా మారనున్నారా అనేది ఓ సస్పెన్స్. ఇంకా కొద్ది రోజుల్లో ఏం జరగనుందో తేల నుంది. ఆయన నిర్ణయం పై ఆయనే ట్విట్టర్ లోస్వయంగా వెల్లడించారు.  అయితే పదవి విరమణ అనంతరం ఆయన రాజకీయ భవిష్యత్ పై అనేక ఊహాగానాలు సాగుతున్నాయి. నేరుగా పార్టి పెడతారా లేక ఉన్న పార్టీలలో ఏదో ఒక పార్టీలో చేరుతారా  అనేది స్పష్టత లేదు. 

వాస్తవంగా ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలు ఏవి కూడ ప్రవీణ్ కుమార్ ఆలోచనలకు ఆశయాలకు తగిన రీతిలో  లేవనేది సుస్పష్టం.  కాని అధికార టిఆర్ఎస్ పార్టి ప్రవీణ్ కుమార్ కు మంచి అవకాశాలు కల్పించే ఆలోచనలో ఉన్నట్లు  వార్తలు వస్తున్నాయి. హుజురాబాద్ ఉప ఎన్నికల బరిలో ఆయనను పోటీలో నిలపబోతున్నారని కూడ వార్తలు వచ్చాయి.  సిఎం కెసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన దళిత భందు పథకం  అమలు భాద్యతలు పూర్తిగా  ప్రవీణ్ కుమార్ కు అప్పగించే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. అయితే ప్రవీణ్ కుమార్ ఎంత వరకు టిఆర్ఎస్ పార్టీలో అందులో  ఏక వ్యక్తి నియంతృత్వం,దొరతనం ఎక్కువగా ఉన్న పార్టీలో కొనసాగుతారనేది అనుమానమే.

ఫూలే, అంబేద్కర్  ఆలోచనా విధానాలను పునికి పుచ్చుకున్న  ప్రవీణ్ కుమార్  వారి ఆలోచనా విధానాలను తుచ తప్పకుండా ఆచరించే పనిలో  తన చుట్టూ ఉన్న  వారందరిని ప్రభావితం చేసారు.  పేదప్రజలకు తన జీవితాన్ని అంకితం చేసిన ఐఏఎస్ అధికారి శంకరన్ స్పూర్తిగా ప్రవీణ్ కుమార్ సమాజానికి తిరిగి సేవ చేసే లక్ష్యంతో   స్వేరో  సంస్థను ప్రారంభించారు. ఆయనే స్వయంగా స్వేరో సంస్థకు సుప్రీమ్ గా ఉండి కార్యకలాపాలు కొనసాగించారు. ప్రవీణ్ కుమార్ అభిమానులు ఆయన ఆశయాలతో స్పూర్తి పొందిన వారు అనేక మంది స్వేరోలుగా మారారు. సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలల విద్యార్థుల ప్రతిభా పాటవాలను ఖండాంతరాలకు వ్యాపింప చేశాడు. ప్రవీణ్ కుమార్ ను సాంఘీక సంక్షేమ శాఖ నుండి దూరం చేసేందుకు  అనేక సార్లు ప్రయత్నాలు చేసినా ఆయనకు ఉన్న పేరు ప్రఖ్యాతుల కారణంగా తప్పించే సాహసం చేయ లేక పోయారు.

  ప్రవీణ్ కుమార్ అంటే అమితంగా అభిమానించే వారితో పాటే అతనంటే గిట్టని వారి సంఖ్య కూడ బాగానే పెరిగింది. పలు మార్లు ప్రవీణ్ కుమార్ ను వివాదాల్లోకి లాగేందుకు ప్రయత్నాలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రవీణ్ కుమార్ శాఖ మారతారని అంతా అనుకున్నారు. కాని ముఖ్యమంత్రి  కెసిఆర్  ప్రవీణ్ కుమార్ సాంఘీక సంక్షేమ శాఖలో అమలు చేసిన  విధానాలు ఎంతగానో సత్ఫలితాలు సాధించడం చూసి బాగా ప్రోత్సహించారు.  ప్రవీణ్ కుమార్ తన భవిష్యత్ కార్యచరణ ప్రకటించాల్సి ఉంది.  నేరుగా రాజకీయాల్లోకి అడుగు పెడతారా లేక సామాజిక సేవా కార్యక్రమాల్లో సుప్రీం స్వేరో గా కొనసాగుతారా లేక అధికార టిఆర్ఎస్  పార్టి లో చేరి హుజురాబాద్ ఉప ఎన్నికల బరిలో నిలుస్తారా అనేది హాట్ టాపిక్ గా మారింది. ప్రవీణ్ కుమార్ నిర్ణయం స్వేరోలకు ఆయన అభిమానులకు ఓ రకంగా షాక్ కలిగించింది. 

కృతజ్ఞతాభవందనం పేరిట రెండు పేజీల లేఖ విడుదల చేశారు. 



వ్యక్తిగత కారణాల వల్ల ఇంకా తనకు ఆరేళ్ల సర్వీసు ఉండగానే పదవి విరమణ చేయాల్సి రావడం బాధ కలిగిస్తోందని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. అదే సమయంలో ఎట్టకేలకు ఇక ఎటువంటి పరిమితులు లేకుండా... తన మనసుకు ఇష్టమైన పనులు,తనకు నచ్చిన రీతిలో చేయబోతున్నందుకు ఆనందం,ఉత్సాహం కలుగుతోందని... అది తనకు కొత్త శక్తిని ఇస్తోందని అన్నారు. పోలీస్ అధికారిగా తన సేవలకు మంచి గుర్తింపు పొందిన తాను... పేద ప్రజలకు ఉపయోగపడాలన్న ఉద్దేశంతో దివంగత ఐఏఎస్ ఎస్ఆర్ శంకరన్ గారి బాటలో నడిచానని తెలిపారు.పదవీ విరమణ తర్వాత తన శేష జీవితమంతా మహానీయులు పూలే,అంబేడ్కర్, కాన్షీరాం బాటలో పీడితులకు అండగా,భావితరాలను ఒక కొత్త ప్రపంచంలోకి నడిపించే ప్రయత్నం చేస్తానని స్పష్టం చేశారు. తన కొత్త ప్రయాణానికి అందరి దీవెనలు కావాలని ఆకాంక్షించారు.



  "పేదల బిడ్డలు జ్ఞానవంతులు కావాలని సంకల్పించి పూర్తి అంకిత భావంతో పని చేశానని" ట్వీట్‌లో పేర్కొన్న ప్రవీణ్‌కుమార్‌.. సంక్షేమ భవనంలో 9 ఏళ్లు కాలం 9నిమిషాలుగా గడిచిపోయిందని అన్నారు. మరోవైపు పదవీ విరమణ తర్వాత అంబేడ్కర్‌, పూలె, కాన్షీరాం మార్గంలో నడిచి.... పేదలకు, పీడితులకు అండగా ఉండి..., భావితరాలను కొత్త ప్రపంచంలోకి నడిపించే ప్రయత్నం చేస్తానని స్పష్టం చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు