ఢిల్లీ రణ రంగం - ఎర్ర కోటపై ఎగిరిన రైతు జెండా

 


నూతన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించాలంటూ గత 60 రోజులుగా ఢిల్లీ ఆవల ఆందోళన చేస్తున్న రైతులు మంగళవారం తీవ్ర ప్రతిఘటనల మద్య ఢిల్లీ నగరంలోకి ప్రవేశించారు. ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించిన రైతులను నగరం ఆవలే నిలిపి వేసేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పోలీసులు భాష్ప వాయు గోళాలు ప్రయోగించినా వాటర్ కానన్ లు ప్రయోగించి చివరికి లాఠి చార్జి చేసినా రైతులు వెనుకడుగు వేయకుండా ట్రాక్టర్లతో దూసుకు వచ్చారు.



రైతుల రిపబ్లిక్ డే ట్రాక్టర్ల ర్యాలి నిర్వహించేందుకు కొన్ని ప్రాంతాల్లో అనుమతులు ఇచ్చారు. అయితే హఠాత్తుగా రూటు మార్చి అనుమతులు లేని ప్రాంతాలలోకి రైతులు దూసుకు వెళ్ళారు. రైతులను నిలువ రించేందుకు పోలీసులు చేసిన ఏ ప్రయత్నాలు ఫలించ లేదు.  ఇండియా గేట్, రాజ్ పథ్, రాజ్ ఘాట్ వైపు దూసుకు వెళ్ళి ఎర్ర కోట పరేడ్ మైదానం లోకి చేరారు. ఎర్ర కోట పై విజయ గర్వంతో రైతులు కిసాన్ జెండాలు ఎగుర వేసి నినాదాలు చేసారు.

జాతీయ జెండాలను తొలగించి రైతులు కిసాన్ జెండాలు ఎగుర వేసి భారత జాతిని అవమాన పరిచారంటూ ప్రభుత్వ అనుకూల  జాతీయ మీడియా అప్పుడే రైతుల ర్యాలీపై బురద చల్లే యత్నాలు మొదలు పెట్టింది. ర్యాలీ సందర్భంగా ఓ రైతు ట్రాక్టర్ బోల్తా పడి చనిపోవడం ఉద్రిక్తకు దారి తీసింది. పోలీసులు కాల్పులు జరపడం వల్లే ట్రాక్టర్ బోల్తాపడి రైతు చనిపోయాడని రైతులు నిరసనకు దిగారు. మృతుడిని ఉత్తరాఖండ్‌లోని బాజ్‌పూర్‌కు చెందిన నవనీత్ సింగ్‌గా గుర్తించినట్టు చెప్పారు. అయితే ట్రాక్టరు తిరగబడటంతో రైతు చనిపోయాడని పోలీసులు వెల్లడించారు. 

పలు మార్లు పోలీసులు రైతులపై లాఠీలతో విరుచుకుపడ్డారు. విచక్షణా రహితంగా కొట్టారు. తలలుపగిలి, కాళ్ళు చేతులు విరిగినా రైతులు లెక్క చేయకుండా పోలీసులు దెబ్బలు భరించి నినాదాలు చేస్తూ  ముందుకు సాగారు.

పబ్లిక్ రవాణా బస్సును రైతులు ఓ చోట అగ్రహంతో  ధ్వంసం చేసారు. ట్రాక్టర్లతో పోలీసులు రోడ్డుకు అడ్డంగా పెట్టిన బారికేడ్లను ధ్వంసం చేసి తొలగించారు. కొన్నిచోట్ల రైతులు పోలీసులపై దాడికి పాల్పడ్డారు. కర్రలు పట్టుకుని పోలీసులను తరిమి కొట్టారు. అయితే హింసాత్మక సంఘటనలకు పాల్పడింది రైతులుకాదని గుర్తు తెలియని సంఘ విద్రోహ శక్తులు చొరబడి ఈ పనిచేశారని కిసాన్ ర్యాలి నిర్వాహకులు స్పష్టం చేసారు.



ఢిల్లీలో పరిస్థితులు అదుపు లోకి తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో సమావేశం జరుపుతోంది. 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు