సింఘులో కొత్తజోష్


గ్రౌండ్ రిపోర్ట్

   సింఘులో  కొత్తజోష్

     


  చర్య (ACTION) కు ప్రతిచర్య ( REACTION) అనే న్యూటన్ భౌతికవాద సూత్రం తెల్సిందే. బంతిని ఎంత గట్టిగా నేలకేసి కొడితే, అంతే గట్టిగా పైకి లేస్తుందనే నానుడి కూడా తెల్సిందే. రైతాంగ పోరాట అణచివేత కోసం రాజ్యం వండి వార్చి, వడ్డించే కుట్రలు పెరిగే కొద్దీ, వాటిని అధిగమించే కొత్త భౌతిక, నైతిక, రాజకీయ బలాలు కూడా రైతాంగానికి తోడవుతున్నాయి. ఇప్పుడే అందిన అలాంటి ఒక ఫ్లాష్ న్యూస్ ని భావ మిత్రులతో పంచుకునే ప్రయత్నామిది


       సింఘు బోర్డర్ వద్ద మొన్న సాయంత్రం అర్బన్ లాంపెన్ గ్యాంగుల్ని మోడీ షా ప్రభుత్వం ఆర్.ఎస్.ఎస్. సాయంతో ఆర్గనైజ్ చేసి, రైతు ప్రదర్శకుల పై రాళ్ళ వర్షం కురిపించి బీభత్స కాండ సృష్టించడం తెల్సిందే. పోలీసు బలగాలు చోద్యం చూస్తూ నిలబడటమే కాక, తమపై రాళ్ళ దాడి నుండి ఆత్మరక్షణకి ప్రయత్నించే రైతు ప్రదర్శకుల్ని టార్గెట్ చేసి భీభత్సం సృష్టించడం కూడా తెల్సిందే. ఆ సందర్భం లో రైతుల్ని కొట్టడానికి తమ చేతులు రావడం లేదంటూ పోలీస్ బలగాలలో వ్యక్తమైన ఆవేదన కూడా తెల్సిందే. ఆ అరాజక రౌడీ మూకల రాళ్ళ దాడికి "స్థానిక ప్రజల న్యాయబద్ద నిరసన" గా ముద్దుపెరుపెట్టి కార్పొరేట్ మీడియా ప్రచారం చేయడం కూడా తెల్సిందే. అదే సింఘు బోర్డర్ వద్ద పరిసర గ్రామాలకి చెందిన ఒరిజినల్ స్థానిక ప్రజల నుండి వ్యక్తమైన ప్రతిస్పందన ప్రాధాన్యత గలది. అది రాజ్యం వండి వార్చి వడ్డించే కట్టుకథల్ని పటాపంచలు చేసింది.* 


     స్థానికుల పేరిట లాంపెన్ గ్యాంగులు చేసిన దాడులు నిజమైన స్థానిక ప్రజల్లో కసిని పెంచింది. సింఘు బోర్డర్ పరిసర గ్రామాల ప్రజల నుండి నిరసన వెల్లువెత్తింది. ఈరోజు సింఘు బోర్డర్ వద్ద కొనసాగే రైతాంగ ధర్నా శిబిరం వద్దకు ఆయా పరిసర గ్రామాల ప్రజలు ర్యాలీలుగా  తరలి వచ్చారు. 

     నంగల్ కలాన్ అనే ప్రధాన గ్రామం నుండి ట్రాక్టర్లు-బైకుల తో పెద్ద ర్యాలీగా ధర్నా సైట్ కి చేరారు. మిగిలిన పరిసర గ్రామాల ప్రజలు కూడా వారినే అనుసరించారు. ఆటేర్నా అనే గ్రామం నుండి ధర్నా సైట్ కి తరలి వస్తోన్న మార్గంలో ప్రజల్ని ఆపడానికి  భారీగా పోలీస్ బలగాలు అడ్డుగా నిలిచాయి. వారు వెనక్కి వెళ్లి మరో దారి గుండా ధర్నా శిబిరం వద్దకు చేరారు.

        పై స్థానిక ప్రజల్ని  అభినందిస్తూ ధర్నా శిబిరం వద్ద సభావేదిక పై రైతాంగ నేతలు ఉద్వేగపూరిత ప్రసంగాలు చేశారు. కరతాళ ధ్వనులు, చప్పట్లు, కేరింతలతో ధర్నా ప్రాంగణం దద్దరిల్లింది. ఇది రైతాంగ ఉద్యమానికి పెద్ద జోష్ ని ఇచ్చింది.* 


      ఈ వార్తను కార్పొరేట్ మీడియా ప్రచారం చేయదు. మనమే విస్తృతంగా ప్రచారం చేద్దాం.


 ✍ *ఇఫ్టూ ప్రసాద్* (పిపి)

 10-15pm, 31-1-2021

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు