ప్రజాస్వామ్యమా.. బతికున్నావా నువ్వింకా..!?

 ప్రజాస్వామ్యమా..

బతికున్నావా నువ్వింకా..!?

అతీక్ అహ్మద్ ను..

ఆయన సోదరుడిని పబ్లిగ్గా

కాల్చి చంపడంపై ఇప్పటికే చాలా చర్చ జరుగుతోంది..!


ఆ ఇద్దరినీ అలా కాల్చి చంపడం నూటికి నూరు పాళ్ళు సబబేనన్న వాదనను ఒక వర్గం వినిపిస్తుంటే అవతలి వ్యక్తులు ఎలాంటి వారైనా గాని జనం మరీ ఇలా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని శిక్షలు విధించడం ఎంతమాత్రం సహేతుకం కాదన్నది ఇంకో వర్గం తీర్పు.


ఈ వేడి ఇప్పట్లో చల్లారదు.చాలా చర్చ జరుగుతుంది..

జరగాలి కూడా..!


మన దేశంలో న్యాయవ్యవస్థలో ఉన్న కొన్ని లొసుగులు (అలా అనవచ్చా) 

ఎంతో మంది విచ్చలవిడిగా ప్రవర్తించడానికి అవకాశం కల్పిస్తున్నాయి.ఎంతటి నేరం చేసినా గాని బెయిల్ వస్తుంది..వచ్చిన తర్వాత కేసులో తీర్పు రావడానికి సంవత్సరాలు పడుతుంది.ఈలోగా నిందితులు యధేచ్చగా తిరుగుతూ తమ కార్యకలాపాలు కొనసాగించు కోవచ్చు..ఒక కోర్టులో తీర్పు వ్యతిరేకంగా వచ్చినా ఇంకో కోర్టులో అప్పీలు..అక్కడ ఇంకొన్ని సంవత్సరాల కాలయాపన.అక్కడి తీర్పుకు వ్యతిరేకంగా మరో అప్పీలు...

ఇలా సుప్రీం కోర్టులో తుది తీర్పు వచ్చేపాటికి  అదెన్ని సంవత్సరాలో..ఈలోగా ఉండేదెవరు..పోయేదెవరు..

ఇంకెన్ని మార్పులు..?


బెయిల్ అంటే నిందితులు విచ్చలవిడిగా తిరగడానికి..మరిన్ని నేరాలు

చెయ్యడానికి లైసెన్స్ అనే తీరున తయారయ్యాయి మన వ్యవస్థలు..ఒక నేరం చేసినా..వంద నేరాలు చేసినా అదే శిక్ష..అదే తీర్పు..

రోజులు బాగోపోతే శిక్ష..బాగుంటే విడుదల..

ఇదీ తీరు..!


సరే..ఇదంతా ఒక కోణం..

న్యాయవ్యవస్థ  లొసుగుల గురించి అంతకంటే లోతుకు వెళ్లలేమేమో.. 

delayed justice is denied justice.. ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాట..

పదేపదే నిజమవుతున్న  నిజం..!..


అదలా ఉంచితే న్యాయవ్యవస్థలాగే అత్యంత  లోపభూయిష్టంగా ఉంటూ..నేరస్థులకు..

సమాజానికి ప్రమాదకరంగా ఉండే వ్యక్తులకు పునరావాస అడ్డాగా మారింది రాజకీయం..అలాంటి వ్యక్తులకు ఆసరాగా నిలుస్తున్న ఎన్నికల వ్యవస్థ..

అందులోని లొసుగులు..

నేరస్థులు..వారెంతటి ప్రమాదకరమైన వారైనా గాని..ఎలాంటి తీవ్రమైన ఆర్థిక..ఇతర నేరాలు చేసినా గాని ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎటువంటి అభ్యంతరమూ ఉండదు.

జైలులో ఉండి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన..గెలిచి ముఖ్యమంత్రులు అయిన వ్యక్తుల చరిత్రలు కూడా మనం విన్నాం..కన్నాం...

కంటున్నాం...అనుభవిస్తున్నాం.!


మామూలుగా ఒక వ్యక్తి పాస్ పోర్టు కోసం దరఖాస్తు చేసుకుంటే తనపై ఎటువంటి పోలీస్ కేసులు లేవని స్వయంగా ప్రకటించుకోవాలి..

అది కూడా రాతపూర్వకంగా..!

అలాగే..ఒక వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం వస్తే ఏడాది..లేదా రెండేళ్లలో ప్రొబేషన్ కాలం ముగిసి నియామక ధృవీకరణ జరిగేలోపు 

తనపై ఎటువంటి కేసులు లేవని ఒకటి రెండు జిల్లాల ఎస్పిల నుంచి లేఖలు తేవలసి ఉంటుంది.ఒక వ్యక్తి పాస్ పోర్టు లేదా ఉద్యోగ ధృవీకరణ కోసమే 

ఇంత తతంగం అవసరం ఉన్నప్పుడు నేరాలు చేసిన వ్యక్తి బెయిల్ పై బయటికి వచ్చినా..జైలులోనే ఉన్నా కూడా అతగాడి నేరచరిత్ర అంతటినీ  పక్కనబెట్టి అతడు ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి అవకాశం కల్పిస్తున్న మన వ్యవస్థలకు జోహార్..!


కొన్ని సందర్భాల్లో అలాంటి వ్యక్తులు మంత్రి లేదా ముఖ్యమంత్రి అయి తనను ఏ పోలీసులైతే అరెస్టు చేశారో ఆ పోలీసులపై కక్ష సాధింపుచర్యలకు పాల్పడడం..ఇన్నాళ్లు తాను ఒదిగి ఒదిగి దండాలు పెట్టిన పోలీసుల చేత సెల్యూట్ చేయించుకోవడం..జడ్జీలు ఆయా నేతల ఇళ్లకు వెళ్లి తేనీటి విందు కార్యక్రమాల్లో పాల్గొనడం..అదే వ్యక్తి డిజిపిలను.. జడ్జీలను బదలీ చేసే స్థాయికి వెళ్ళడం..

బహుశా ఇవన్నీ మన దేశంలోనే జరుగుతాయేమో..

మేరా భారత్ మహాన్..!


ఇప్పుడు అతిక్ అహ్మద్ విషయమే తీసుకుంటే

అత్యంత వివాదాస్పదుడిగా 

విరాజిల్లుతున్న అతీక్ అహ్మద్ నేరచరిత్ర ఇంతా అంతా అని చెప్పడానికి లేదు.రకరకాల దందాలు.. భూకబ్జాలు..హత్యలు స్వయంగా చేసినట్టు ఆరోపణలు ఎదుర్కోవడమే గాక అలాంటి నేరాలు చేసే ఎందరికో ప్రత్యక్షంగానో.. పరోక్షంగా మద్దతు ఇస్తూ..ఆశ్రయం కల్పిస్తూ ఒక పెద్ద డాన్ గా ఎదిగిన(?) అతీక్ అహ్మద్ పలుమార్లు జైలుకి కూడా వెళ్ళాడు.జైలులోనే ఉంటూ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచాడు కూడా.ఇంతటి భయంకరమైన నేరచరిత్ర ఉన్న అతీక్ కళ్ళల్లో ఇసుమంతైనా పశ్చాత్తాపం కనిపించ లేదు.సరే..ఇక్కడ అతీక్ వైఖరి చర్చనీయాంశం కానే కాదు.అలాంటి వ్యక్తులు సమాజంలో విచ్చలవిడిగా సంచరించడమే గాక ప్రజాప్రతినిధిగా ఎన్నిక కావడానికి దోహదం చేస్తున్న మన వ్యవస్థలోని లోపభూయష్టత నిజంగా స్వర్ణోత్సవ స్వేచ్చాభారతి నుదుటిన మాయని మచ్చగా 

కనిపిస్తోంది.ఇది ప్రతి భారతీయునికి క్లేశం కలిగించే అంశం.పాలకుడైన ప్రతి ఒక్కడూ సిగ్గు పడాల్సిన విషయం.ఈ దేశం పవిత్ర ఆలయంగా భావించే చట్టసభలో ఇలాంటి వ్యక్తి సరసన మనం కూర్చున్నామా అని ప్రజాప్రతినిధులు కలత చెందవలసిన విషయం.

ఔనులే మన సభల నిండా ఇలాంటి వ్యక్తులే..కొంచెం అటూ ఇటుగా..అని ప్రజలు భావిస్తున్న అత్యంత లజ్జారహిత పరిణామం.

ఇలాంటి వ్యక్తుల ఏలుబడిలో 

ఉన్న ఈ దేశాన్ని..వీరి పదఘట్టనల కింద నలిగి అల్లాడుతున్న ప్రజాస్వామ్యాన్ని కాపాడగలగడం సాధ్యమయ్యే పనేనా..

ప్చ్..చాలా దూరం వచ్చేశాం..

నిజంగా మేలుకోవాల్సింది

ప్రజాస్వామ్యం కాదు..

ప్రజలు..!


ఎలిశెట్టి సురేష్ కుమార్

    9948546286

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు