దేశంలో భయానక పరిస్థితులు - నోబెల్ గ్రహీత అమర్త్యసేన్

 




నోబెల్ గ్రహీత, ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్ భారత్ లో ప్రస్తుత రాజకీయ, సామాజిక పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. . ప్రస్తుత పరిస్థులను చూస్తుంటే తనకు భయంగా ఉందన్న ఆయన దేశీయుల మధ్య ఐక్యత లోపించిందని మునుపటిలా ఐక్యంగా ఉండాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. చారిత్రాత్మకంగా ఉదారవాద దేశంలో విభజన జరగడం తనకు ఇష్టం లేదన్నారు. భారత్ కేవలం హిందువులకే చెందినది కాదని, అలాగే కేవలం ముస్లింలదే కాదనీ ఆయన అన్నారు. దేశ సంప్రదాయాలకు అనుగుణంగా ఈ రెండు వర్గాలు కలిసి ఉండాలని వివరించారు. ప్రజలు ఐక్యతను కాపాడేందుకు కృషి చేయాలని..మత ప్రాతిపదికన విభజనలు చేయరాదని అన్నారు.


కోల్‌కతాలోని సాల్ట్ లేక్‌లో ఏరియాలో అమర్త్య రీసెర్చ్ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ.."మీరు దేనికైనా భయపడుతున్నారా అని ఎవరైనా నన్ను అడిగితే అవును అని సమాధానమిస్తాను. ఇప్పుడు భయపడటానికి కారణం ఉంది. దేశంలోని ప్రస్తుత పరిస్థితి భయానకంగా మారింది" అని ప్రముఖ ఆర్థికవేత్త చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌కు ఐక్యత అవసరమని అమర్త్యసేన్ తెలిపారు. సహనం అనేది మన సంస్కృతిలో, మన విద్యా వ్యవస్థలోనే భాగమై ఉందని అన్నారు. కానీ ప్రస్తుతం సహనానికంటే ఎక్కువగా దేశానికి ఐక్యత అవసరం ఉందన్నారు. ప్రజలు కలిసి ఉండాలని.. దీన్ని దేశం అర్థం చేసుకోవాలని అమర్త్యసేన్‌ అన్నారు.


మన చుట్టూ ఉన్న వాతావరణం చరిత్ర నుంచి ముస్లిం ప్రభావాన్ని తొలగించే ప్రయత్నం చేయవచ్చు కానీ నిజాన్ని మాత్రం తారుమారు చేయడం సాధ్యం కాదన్నారు. . భారతీయ చరిత్రలో మొఘలుల ప్రభావం ప్రధానమైనదేనని పేర్కొన్నారు. హిందువులకు చెందిన ఉపనిషత్తులు ప్రపంచానికి ఒక ముస్లిం రాకుమారుడితో తెలియవచ్చిందని అన్నారు. షాజహాన్ కుమారుడు దారా సిఖో సంస్కృతాన్ని నేర్చుకున్నాడని, ఆయన ఉపనిషత్తులను పర్షియా భాషలోకి మార్చారని వివరించారు. ఇది ఆర్యభట్ట దేశమని... సైన్స్ సాధనలో యావత్‌ ప్రపంచానికి భారత్‌ ఆదర్శంగా నిలుస్తోందని ఆయన అన్నారు.








కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు