ప్రైవేటు వైద్యంపై సర్కార్ వేటు - ససేమిరా అంటున్న వైద్యులు

 


 ప్రభుత్వ వైద్యులు ఇక నుండి  ప్రైవేట్ ప్రాక్టీస్ చేసేందుకు వీలు లేని విదంగా తెలంగాణ మెడికల్ ఎడ్యుకేషన్ సర్వీస్ రూల్స్ సవరిస్తు రాష్ర్ట ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం వైద్యులను ఆందోళనకు గురి చేసింది. ఈ సవరణ కేవలం ఇక నుండి కొత్తగా  రిక్రూట్ అయ్యే వైద్యులకు మాత్రమే వర్తిస్తుందని అంతకు ముందు ఉన్న వైద్యులకు వర్తించదని  ప్రభుత్వం స్పష్టత నిచ్చినప్పటికి వైద్యులందరు ఏఖోన్ముఖంగా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం నెమ్మదిగా వైద్యులందరి ప్రైవేట్ ప్రాక్టీస్ ను పూర్తిగా బ్యాన్ చేయదన్న గ్యారంటి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రైవేట్ ప్రాక్టీస్ రద్దు చేయడం సరైన నిర్ణయం కాదని వాదిస్తున్నారు. ఇలాచేయడం వల్ల  సర్కార్ దవాఖానాలలో పనిచేసేందుకు వైద్యులు ముందుకు రాలేరని ఫలితంగా నిపుణుల కొరత ఏర్పడుతుందని కూడ హెచ్చరికలు చేస్తున్నారు.

వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్ విషయం అనేది చాలా జటిల మైన సమస్యే. పూర్తిగా రద్దు చేయా లేక పూర్తిగా అంగీకరించా లేక సర్కార్ ఈ విషయాన్ని దాట వేస్తూ వచ్చింది. కేంద్ర ప్రభుత్వ వైద్య సంస్థల్లో పనిచేసే వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్ పై బ్యాన్ అమల్లో ఉంది. కేంద్ర సర్వీసుల్లో ఉన్న  వైద్యులు అట్లాగే ఎయిమ్స్, నిమ్స్  వంటి అత్యున్నత ప్రమాణాలు కలిగిన ఆసుపత్రులలో పనిచేస్తున్న వైద్యులు  ఎవరూ  ప్రైవేట్ ప్రాక్టీస్ చేసేందుకు వీలు లేదు.

ఇక రాష్ర్టాల పరిధి లో  ఉన్న దవాఖానాల్లో పనిచేసే వైద్యుల విషయంలో రాష్ట్రానికో విదంగా విధానం ఉంది. దేశంలో 20 రాష్ర్టాలలో  వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్ పై  బ్యాన్ ఉంది. బ్యాన్ విధించి నందుకు వైద్యులకు 25 శాతం  నాన్ ప్రాక్టీస్ అల వెన్సులను ఇస్తున్నారు. కొన్ని రాష్ర్టాలలో బ్యాన్ అమల్లో ఉన్నా అంతగా చూసి చూడనట్లు వదిలేస్తున్నారు. వైద్యుల మూల వేతనంలో 25 శాతం మేరకు ఇస్తున్న అలవెన్సులు  40 శాతం మేరకు పెంచాలని ఆయా రాష్ర్టాలలో వైద్యులు డిమాండ్ చేస్తున్నారు.

తెలంగాణ రాష్ర్టం ఏర్పడక ముందు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ర్టంలో  ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న  హయాంలో వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్ పై బాన్ విధించారు. దీనిపై వైద్యుల్లో పెద్ద ఎత్తున నిరసన పెల్లు బికింది. చాలా మంది వైద్యులు స్వచ్చందంగా ప్రభుత్వ ఉద్యోగాలు వదులుకుని ప్రైవేట్ రంగంలో స్థిర పడ్డారు. అట్లా సర్కార్ కొలువులు వదులుకున్న  హైదరాబాద్ లో ఉన్న ప్రముఖ వైద్యులు  ఈ రోజు బడా కార్పోరేట్ ఆసుపత్రులకు యజమానులయ్యారు.

సమాజంలో ఇతర వృత్తులతో పోల్చుకుంటే అత్యధిక హోదా,గౌరవం,ఆదాయం కలిగిన వృత్తి ఏదన్నా ఉందంటే ఠక్కున గుర్తుకు వచ్చేది వైద్యవృత్తి మాత్రమే. 

అందుకే మన దేశంలో వైద్యునికి  దైవంతో సమాన మైన హోదానిచ్చి వైద్యో నారాయణో హరి అని కీర్తిస్తూ ఉంటారు. లాభ దాయకమైన వైద్యరంగంపై కార్పోరేట్ గద్దలు వాలిన తర్వాత ఈ పరిభాషకు అర్దం మారిపోయింది. రోగాల భారిన పడి ఆసుపత్రులకు వెళ్లితే జబ్బు నయం అయ్యేకన్నా డబ్బులు చెల్లించ లేక హరీ మనే పరిస్థితులు నెలకొన్నాయి.

దీనికంతటికి కారణం వైద్యాన్ని ఖరీదైన వృత్తిగా మార్చడమే. అందుకే భారత దేశం వంటి పేద దేశంలో వైద్యం అంటే భయం. ఒకప్పుడు నాడి చూసి రోగం చెప్పే వైద్యులు ఉండేవారని చెబుతారు. కాని ఇప్పుడు లాబరేటరీల రిపోర్టులు (అవసరం ఉన్నవి లేనివి) చూడకుండా ప్రిస్క్రిఫ్షన్ రాయలేమంటున్నారు. ఖరీదైన పరికరాలు సాంకేతిక యంత్రాలు లేకుండా డబ్బులు వెచ్చించకుండా అసలు జబ్బులు ఎలా నయం అవుతాయని వైద్యులు ప్రశ్నిస్తున్నారు.

పూర్తిగా ఉచిత వైద్యం అందిచాల్సిన సర్కార్ వైద్యాన్ని ప్రైవేట్ రంగంలోకి అనుమతించడం  ఫలితంగా భారత దేశం వంటి జానాభాధిక్యతగల పేద దేశాలకు శాపంగా మారింది. వైద్యం పూర్తిగా ప్రైవేట్ పరం కావడం వెనకాల కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాల రెండింటి పాత్రతో పాటు వైఫల్యాలు ఉన్నాయి.

ఓ మనిషి ప్రాణం నిల బెట్టడానికి మించిన అత్యున్నత సేవను మించింది మరోటి లేదు. కాని ఈ దేశంలో వైద్యంలో వర్గీకరణలు వచ్చాయి.  సర్కార్ వైద్యంతో ప్రాణాలు నిలుస్తాయన్న నమ్మకాలు అందరూ ఎప్పుడో  కోల్పోయారు. ఈ పరిస్థితుల్లోనే  ప్రైవేట్ వైద్యం కోసం పరుగులు పెడుతుండడంతో అందుకే అది బాగా ఖరీదైంది.

 పట్టణాలు, నగరాలకే ఈ ప్రైవేట్ వైద్య సేవలు  పరిమితం అయ్యాయి. ప్రైవేట్ వైద్యం గ్రామాల స్థాయికి చేర లేదు. గ్రామీణులు అత్యధికంగా సర్కార్ దవాఖానాల పైనే ఆధారపడక తప్పడం లేదు. కాని సర్కార్ దవాఖానాల్లో వైద్యుల కొరత మందుల కొరత  ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేందుకు వైద్యులు ఎవరూ ముందుకు రావడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఖచ్చితంగా కొన్ని సంవత్సరాలు పని చేసి తీరాలని రాష్ట్రాలు వైద్య విద్యార్థులకు బాండ్స్ విధించాయి. కాని ఈ విధానాలు ఇప్పడు తెలంగాణలో లేవు. 2018 లో సిఎం కెసిఆర్ బాండ్స్ ను ఎత్తి వేశారు. పిజి కోర్సులలో చేరే వారికి మాత్రం ప్రభుత్వం కోరితే ఏడాది పాటు సర్వీసు చేయాలనే నిభందన ఉంది.

అయితే తాజాగా సర్కార్ దవాఖానాల్లో మెరుగైన వైద్యంతో పాటు  వైద్యుల కొరతను తీర్చేందుకు ప్రభుత్వం మెడికల్ ఎడ్యుకేషన్ సర్వీసు రూల్స్ సవరణ చేయడాన్ని  వైద్యులు తీవ్రంగా పరిగణిస్తున్నారు.

ఈ కొత్త రూల్స్ వల్ల ఎవరూ సర్కార్ కొలువుల దరి దాపులకు రారని వైద్య సంఘాల నేతలు వాదిస్తున్నారు. రాష్ర్టంలో 1300 పై చిలుకు వైద్యుల పోస్టులు భర్తి చేసేందుకు సన్నాహాలు చేపట్టి మరో వైపు ఈ నిభందనలు తీసుకు రావడం ఏమిటని వైద్యులు ప్రశ్నిస్తున్నారు. వారి మనో గతం ఏమిటంటే ప్రైవేట్ ప్రాక్టీస్ కు అనుమతులు ఇస్తేనే సర్కార్ కొలువులు చేస్తామని లేదంటే ప్రైవేట్ వైద్యం చూసుకుంటామని  అర్దం చేసుకోవచ్చు.  తెలంగాణ లో వైద్య విద్యార్థులకు బాండ్స్ కూడ విధించక పోవడం వల్ల ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో వైద్య విద్య అభ్యసించిన వారు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేందుకు ముందుకు రావడం లేదు.

సర్కార్ దవాఖానాల్లో ఓ ఎంబిబిఎస్ వైద్యుడికి  ఇచ్చే జీతం సరిపోదని విధులు ముగిసిన తర్వాత  ప్రైవేట్ ప్రాక్టీస్ చేసుకోవడం ద్వారా అదనపు ఆదాయం సమకూర్చుకుంటున్నారని  వైద్యుల సంఘ నాయకుల  వాదన.

ప్రైవేట్ వైద్య కళాశాలల్లో వైద్య విద్యకు లక్షలు కాదు. కోట్లు వెచ్చిస్తున్నారు. పట్టాపుచ్చుకున్న తర్వాత నోట్ల వేట సాగిస్తున్నారు. ఇది ఇప్పటి వైద్యుల తీరని విమర్శలు ఉన్నాయి.

వైద్య మంత్రిగా హరీశ్ రావు భాద్యతలు చేపట్టిన తర్వాత  ఆ శాఖలో ప్రక్షాళన ప్రారంభమైంది. గ్రామీణ ప్రాంతాల్లో దవాఖానాలు నిరుపయోగంగా మిగిలి పోరాదని మంత్రి కొన్ని ఖఠిన నిర్ణయాలు చేపట్టారు. వైద్యుల విధులకు టార్గెట్లు విధిస్తు దావాఖానాల్లో వారాని కో రోజు నిద్ర చేయాలని కూడ ఆదేశాలు జారి చేశాడు. ఇవన్ని వైద్యులకు మింగుడు పడని సమస్యలుగా కనిపిస్తున్నాయి.

తెలంగాణ రాష్ర్టంలో 37000 మంది వైద్యులు  ఉన్నట్లు మెడికల్ కౌన్సిల్ గణాంకాలు తెలియ చేస్తున్నాయి. రాష్ర్టంలో  9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉండగా 23 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. రాష్ర్ట జనాభా 3.5 కోట్లు ఉందని ప్రతి 900 మందికి ఓ వైద్యుడు చొప్పున ఉన్నాడని గణాంకాలు తెలియ చేస్తున్నాయి. ప్రపంచ అరోగ్య సంస్థ  ప్రమాణాల మేరకు ప్రతి వేయి మంది కి ఒక్క డాక్టర్ ఉండాలి.

ప్రతి ఏటా రాష్ర్టంలో 6500 మంది వైద్యవిద్యార్థులు ఎంబిబిఎస్ పట్టాలు పుచ్చుకుని బయటకు వస్తున్నారు. కొత్తగా ప్రతి జిల్లాకు ఓ మెడికల్ కాలేజి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించి ఏడు కళాశాలలకు మంజూరు ఇచ్చింది. ఈ కళాశాలలు ప్రారంభమైతే రాష్ర్టంలో ప్రతి ఏటా 7200 మంది వైద్యులు పట్టాలు పుచ్చుకుంటారు.

వైద్య పట్టాలు పుచ్చుకున్న వారంతా గ్రామాల్లో పనిచేయ నిరాకరిస్తే గ్రామీణ పరిస్థితి ఏమిటనేది ప్రభుత్వం మందున్న ప్రశ్న.  వైద్యం పేదవాడి ముంగిటికి చేరాలంటే వైద్యులు సేవా ధృక్ఫధానికి తలొగ్గక తప్పదు. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో చదివేందుకు కోట్లు ఖర్చు పెడుతున్న వైద్యుల సంగతి పక్కన పెడితే సర్కార్ మెడికల్ కాలేజీల్లో ఎంబిబిఎస్ చదివి పట్టాపుచుకున్న  వైద్యులు గ్రామాల బాట పడితేనే పేద ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. ఓక్కో వైద్య విద్యార్థిపై సర్కార్ ప్రతి ఏటా 50 లక్షలకు పైగా  ఖర్చు చేస్తోందని ఓ అంచనా .

ఈ సమస్యకు పరష్కారం లభించాలంటే ప్రభుత్వం వైద్యుల సంఘాలతో సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉంది. గ్రామీణ పేద ప్రజలకుపయోగ పడేరీతిలో పకడ్బంది వైద్య విధానం రాష్ర్టంలో  అమలు చేయాల్సి ఉంది. వైద్యులు కూడ తమ వృత్తి పట్ల ఉన్న గౌరవ మర్యాదలు కాపాడుకుంటూనే ప్రజా ప్రయోజనాల రీత్యా సహకరించడం అనివార్యంగా భావించాలి.

కూన మహేందర్

జర్నలిస్ట్

(ప్రజాతంత్ర దినపత్రిక 14-06-2022)


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు