లండన్ మీట్ అండ్ గ్రీట్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

 తెలంగాణ సాంప్రదాయాలను కొనసాగిస్తున్న  ప్రవాసీయులను ఆభినందించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్



విదేశాలలో స్థిరపడినప్పటికి తెలంగాణ ప్రాంత సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తున్న వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రవాసీయులను  తెలంగాణ మత్స్య, సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అభినందించారు. 

 వరంగల్ ఎన్ ఆర్ ఐ ఫోరం, లండన్, యుకె సంఘం అధ్వర్యంలో లండన్ లో జరిగిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. కుటుంబ సబ్యులతో లండన్ సందర్శించిన మంత్రిని వరంగల్ ఎన్ఆర్ఐ ఫోరం ఘనంగా సత్కరించింది.

ఈ సందర్భంగా జరిగిన మీట్  అండ్ గ్రీట్ కార్యక్రమంలో మంత్రి మఖ్య అతిధిగా పాల్గొన్నారు. జూలై 10 వ తేదీన లండన్ లో ఘనంగా జరగనున్న బోనాల పండగ పోస్టర్ ను మంత్రి ఆవిష్కరించారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతు  స్వరాష్ట్రం గొప్ప తనాన్ని  విదేశాలలో చాటుతూ  సాంప్రదాయాలను, సంస్కృతిని, పండగలను మరిచి పోకుండా నిర్వహిస్తున్నారని అన్నారు.  బతుకమ్మ పండగ, బోనాలతో పాటు దసరా ఉత్సవాలు తెలంగాణలో ఎంతో ప్రాముఖ్యతతో నిర్వహించిన రీతిలో లండన్ లో కూడ నిర్వహించడం అభినందనీయమన్నారు. లండన్ ఎన్నారై ఫోరం నిర్వహిస్తున్న  ఛారిటి కార్యక్రమాలను ప్రశంసించారు. ఫోరంకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడు ఉంటాయని తెలిపారు.

లండన్ ఎన్ఆర్ఐ ఫోరం అధ్యక్షులు శ్రీధర్ నీల మాట్లాడుతూ ఫోరం నిర్వహించిన కార్యక్రమాలు వివరించారు. జూలై 10 వ తేదీన పోచమ్మ బోనాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత రెండు సంవత్సరాలుగా కరోనా కారణంగా పోచమ్మ బోనాలు నిర్వహించ లేక పోయామని ఈ సారి  సుమారు 2 వేల మందితో బోనాల పండగ నిర్వహిస్తామని తెలిపారు. ఫోరం అధ్వర్యంలో వరంగల్ జిల్లాలో అనేక ఛారిటి కార్యక్రమాలు నిర్వహించామని, మారు మూల  ఆదివాసి గ్రామాలతో పాటు వరంగల్ నగరంలో సహాయం అంద చేసామని తెలిపారు.

కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయికిరణ్, ఫోరం ఫౌండర్ కిరణ్ పసునూరి, వైస్ ప్రెసిడెంట్ భాస్కర్ పిట్టల, జయంత్ వద్ది రాజు, జాయింట్ సెక్రెటరి వంశి ముదిగంటి, టీం లీడర్లు మంజుల, రాధిక తదితరులు పాల్గొన్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు