ఆర్ కె మృతిని ధృవీకరిస్తు మావోయిస్టు పార్టి ప్రకటన

మావోయిస్టు అగ్ర నేత ఆర్ కె మృత వార్తలపై గందరగోళానికి తెరపడింది. ఆర్ కె మరణించాడని వచ్చిన వార్తలపై ప్రజాసంఘాలు నమ్మశక్యంగా లేదని ఆగ్రహం వ్యక్తం చేసాయి. ఆర్ కె సతీమణి కూడ  పార్టి ప్రకటిస్తే తప్ప ఇలాంటి వార్తలు నమ్మశక్యం కాదన్నారు. దాంతో  మావోయిస్టు పార్టి ఆర్ కె మరమాన్ని ధృవీకరిస్తు ప్రకటన విడుదల చేసింది.

 గత కొంత కాలంగా అనారోగ్యంతో చికిత్స పొందిన ఆర్ కె

కిడ్నీల ఫెయిల్యూర్ తో డయాలసిస్

మంచి వైద్యం అందించినప్పటికీ దక్కించుకోలేకపోయామన్న పార్టిసీపీఐ (మావోయిస్టు) సెంట్రల్ కమిటీ, పొలిట్ బ్యూరో సభ్యుడు  హక్కిరాజు హరగోపాల్ ఏలియాస్ రామకృష్ణ మరణ వార్తను పార్టి ధృవీకరించింది. ఈ మేరకు పార్టి అధికారప్రతినిధి అభయ్ ఓ ప్రకటన విడుదల చేశాడు. 

 తేది: అక్టోబర్ 15, 2021

సీపీఐ (మావోయిస్టు) సెంట్రల్ కమిటీ, పొలిట్ బ్యూరో సభ్యుడు కామ్రేడ్ హక్కిరాజు హరగోపాల్ రామకృష్ణ )(ఆర్కే), సాకేత్, మధు, శ్రీనివాస్) అమరత్వంపై ప్రెస్ నోట్ ...

కామ్రేడ్ అక్కిరాజు హరగోపాల్ (63) అనారోగ్యంతో 14 అక్టోబర్ 2021 ఉదయం 6 గంటలకు తుదిశ్వాస విడిచాడు. కామ్రేడ్ హరగోపాల్ కు అకస్మాతుగా కిడ్నీల సమస్య మొదలైంది. వెంటనే డయాలసిస్ ట్రీట్మెంట్ ప్రారంభించి వైద్యం అందిస్తున్న క్రమంలో కిడ్నీలు ఫెయిల్ అయి, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తి అమరుడైనాడు. ఆయనకు పార్టీ మంచి వైద్యం అందించినప్పటికీ దక్కించుకోలేకపోయింది. ఆయనకు విప్లవ శ్రేణుల మధ్యనే అంత్యక్రియలు నిర్వహించి శ్రద్ధాంజలి అర్పించడం జరిగింది.

కామ్రేడ్ రామకృష్ణ అమరత్వం పార్టీకి తీరని లోటు. కామ్రేడ్ హరగోపాల్ 1958 సంవత్సరంలో గుంటూరు జిల్లాలోని పల్నాడ్ ప్రాంతంలో జన్మించాడు. తండ్రి ఒక స్కూల్ టీచర్. కామ్రేడ్ హరగోపాల్ పోస్టు గ్రాడ్యుయేషన్ విద్యనభ్యసించాడు. కొంత కాలం తండ్రితో పాటు టీచర్ గా పని చేశాడు. 1978లో విప్లవ రాజకీయాల వైపు ఆకర్షించబడి భాకపా (మాలె) (పీపుల్స్ వార్) లో పార్టీ సభ్యత్వం తీసుకొన్నాడు.

1980లో గుంటూరు జిల్లా పార్టీ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నాడు. 1982లో పార్టీలోకి పూర్తికాలం కార్యకర్తగా వచ్చాడు. గుంటూరు పల్నాడ్ ప్రాంతంలో గ్రామాల్లో పార్టీ కార్యకలాపాలు నిర్వహించాడు. ఆ క్రమంలో విప్లవోద్యమ నాయకత్వంగా ఎదిగి 1986లో గుంటూరు జిల్లా కార్యదర్శిగా ఎదిగాడు. 1992 లో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికైనాడు. తరువాత దక్షిణ తెలంగాణ ఉద్యమానికి 4 సంవత్సరాలు నాయకత్వం అందించాడు. 2000 సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నిక కావడంతో పాటు, 2001లో జనవరిలో జరిగిన పీపుల్స్ వార్ 9వ కాంగ్రేసులో కేంద్రకమిటీ సభ్యుడిగా ఎన్నికైనాడు.

2004 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, పార్టీ మధ్యలో జరిగిన చర్చల్లో పార్టీ ప్రతినిధుల బృందానికి నాయకత్వం వహించాడు. ప్రభుత్వం ముందు ప్రజల డిమాండ్లను పెట్టి తన ప్రతినిధుల బృందంతో పాటు సమర్ధవంతంగా చర్చించాడు. ఈ చర్చల ప్రక్రియలో పార్టీ రాజకీయ దృక్పథాన్ని రాష్ట్ర, దేశ ప్రజల్లోకి వ్యాప్తి చేసాడు. ప్రభుత్వం చర్చల నుండి వైదొలిగి తీవ్ర నిర్బంధం ప్రయోగించి కామ్రేడ్ రామకృష్ణను హత్య చేయడానికి ప్రయత్నాలు చేయడం ప్రారంభించగానే, ఆయన్ని ఏఓబీ ఏరియాకు కేంద్రకమిటీ బదిలీ చేసి, ఏఓబీ బాధ్యతలు ఇచ్చింది. ఆయన 2014 వరకు ఏవోబీ కార్యదర్శిగా పని చేశాడు. ఆ తర్వాత ఏవోబీని కేంద్రకమిటీ నుండి గైడ్ చేసే బాధ్యత నిర్వహిస్తున్నాడు. 2018లో ఆయన్ని కేంద్ర కమిటీ పోలిట్ బ్యూరోలో నియమించింది. ప్రస్తుతం ఏఓబీలో ప్రభుత్వం కొనసాగిస్తున్న అత్యంత నిర్బంధ కాండలో పార్టీనీ, కేడర్లను రక్షించే కార్యక్రమాన్ని ఎంతో దృఢంగా నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో అనారోగ్య సమస్య తలెత్తి అమరుడైనాడు.

కామ్రేడ్ హరగోపాల్ కు విప్లవోద్యమంలోనే కామ్రేడ్ శిరీషతో వివాహం జరిగింది. వారికి ఒక మగ పిల్లవాడు జన్మించాడు. కామ్రేడ్ మున్నా (పృధ్వి) కూడా విప్లవోద్యమంలో తండ్రి బాటనే నడిచి 2018లో జరిగిన రామగూడ ఎన్‌కౌంటర్ లో అమరుడైనాడు.

కామ్రేడ్ హరగోపాల్ విప్లవోద్యమంలో స్థిరచిత్తంతో పాల్గొన్నాడు. అయన మొక్కవోని ధైర్యసాహసాలతో పార్టీకి, విప్లవోద్యమానికి నాయకత్వం అందించాడు. పార్టీ రాజకీయ డాక్యుమెంట్స్ ను రూపొందించడంలో చురుకుగా చర్చలు చేసేవాడు. ప్రజలతో నిత్య సంబంధంలో ఉంటూ, పార్టీకి అన్ని రంగాల్లో సేవలందించాడు.

విప్లవోద్యమానికి నిస్వార్థంగా సేవలందిస్తూ, అహర్నిషలు కృషి చేసాడు. అయన విప్లవోద్యమంలో ప్రదర్శించిన అకుంఠిత దీక్ష, శైలి, సాధారణ జీవితం , ప్రజల పట్ల ప్రేమ,కామ్రేడ్స్ తో ఆప్యాయతలు, శత్రువు పట్ల కసి, విప్లవ గమనంపై స్పష్టత, దూరదృష్టి నుండి యావత్తు పార్టీ, కేడర్లు, విప్లవ ప్రజానీకం ప్రేరణ పొంది, ఆయన ఆశయాన్ని తుది కంటా కొనసాగించి, దేశంలో ప్రజాస్వామిక విప్లవాన్ని పరిపూర్తి చేయడానికి మరోమారు ప్రతిజ్ఞ చేద్దాం. కామ్రేడ్ అక్కిరాజు హరగోపాల్ (రామకృష్ణ) అమర్ రహే! అమర్ రహే!!

అభయ్,
అధికార ప్రతినిధి,
కేంద్ర కమిటీ,
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు