పోలీసుల అదుపులో ఎటిఎం దొంగలు

 


నగరంలో కూకట్ పల్లి లో ఓ ఎటిఎంలో నగదు రీఫిల్ చేస్తుండగా కాల్పులు జరిపి నగదు దోచుకుని ఫరారి అయిన ఇద్దరు దోపిడీ దొంగలను పోలీసులు పట్టుకున్నారు. హెచ్ డిఎఫ్ సి బ్యాంకుకు సంభందించిన ఏటిఎం లో సిబ్బంది డబ్బులు రీఫిల్ చేస్తుండగా ఈ ఇద్దరు దుండగులు గురువారం మద్యాహ్నం అకస్మాత్తుగా చొరబి కాల్పులు జరిపారు. కాల్పులలో వ్యాన్ డ్రైవర్ అలీతో పాటు మరో వ్యక్తి  తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం దుండగులు నగదు తీసుకుని పల్సర్ వాహనంపై ఫరారీ అయ్యారు. 

గాయపడిన వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించగా అలి చనిపోయారు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. ీ కేసును పోలీసులు ఛాలెంజ్ గా తీసుకున్నారు. సిపి సజ్జనార్ పర్యవేక్షణలో ఆరు స్పెషల్ టీములు ఏర్పాటు చేశారు. దోపిడి జరిగిన ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్న సిసి కెమెరాలను పరిశీలించగా దుండగులు పల్సర్ వాహనంలో ఎటువైపు ఫరారీ అయ్యారో నిర్దారణ జరిగింది. వారు కూకట్‌పల్లి నుండి సంగారెడ్డి మీదుగా నాందేడ్ వైపు వెళుతున్నట్లు గుర్తించి ఆ వైపు పోలీసులు బృందాలు వెంటాడుతూ  మార్గ మద్యంలో ఉన్న సంగారెడ్డి పోలీసులను అలర్ట్ చేసారు. సంగారెడ్డి పోలీసులు దారి గాచి వారిని పట్టుకున్నారు. 

గత 15 రోజుల క్రితం  ఈ ఇద్దరు దుండగులు ఓ సెల్ ఫోన్ షాపులో గన్ తో బెదిరించి నగదుతో పాటు సెల్ ఫోన్లు దోచుకు వెళ్లారు. ఈ కేసు పై పోలీసులు ఓ వైపు దర్యాప్తు జరుపుతుండగానే ఎటిఎం దోపిడి జరిగింది. దాంతో ఈ రెండు సంఘటనలకు పాల్పడింది ఒకే ముఠాగా పోలీసులు నిర్దారణకు వచ్చారు. సిసి కెమెరాలు నిందితులను పట్టించేందుకు బాగా ఉపయోగపడ్డాయి. ప్రస్తుతం నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు. వారి నుండి దోపిడీ సొత్తు స్వాదీనం చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ముఠా అంతర్ రాష్ర్ట ముఠానేనని పోలీసులు తెలిపారు.  వారి పాత నేరాల చిట్టాలను పోలీసులు సేకరిస్తున్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు