పెంబర్తి లో లభించిన గుప్త నిధి

 బిందె లో పురాతన బంగారు, వెండి ఆభరణాల  



గుప్తనిధి ఎప్పుడైనా చూసారా....లంకె బిందెల గురించి విన్నారా..పూర్వం దండయాత్రలు జరిగినపుడు దొంగలు దాడులు చేసినపుడు బిందెలలో బంగారు భరణాలు దాచి వాటిని భూమిలో పాతి పెట్టే వారని చెబుతుంటారు. ఆ తర్వాత కాలంలో అవి అట్లాగే ఉండి పోయి తవ్వకాల్లో దొరుకుతుంటాయి. అలాంటి నిధి కోసం కొందరు అదే పనిగా వెదకుతూ తిరుగు తుంటారు.

జనగామ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న పెంబర్తి గ్రామం శివారులో ఓ వ్యసాయ భూమిలో బంగారు, వెండి ఆభరణాలతో పాతి పెట్టిన బిందె గురువారం బయట పడింది. రెవెన్యూ అధికారులు, పోలీసులకు సమాచారం ఇవ్వగా వాటిని స్వాదీనం చేసుకున్నారు. పురాతన కాలం నాటి వెండి బంగారు ఆభరణాలు అందులో ఉన్నాయి. జెసిబి తో తవ్వకాలు జరుపుతుండగా ఈ బిందె లభించిందని భూయజమాని నరసింహ తెలిపారు. బంగారు ఆభరణాలు 3 కిలోల వరకు ఉంటాయి. వెండి అభరణాలు మరో 3 కిలోలు ఉంటాయి. ఇవి ఏ కాలం నాటివో తెల్సుకునేందుకు పురావస్తు శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు  పరిశీలిస్తే కాని పూర్తి వివరాలు తెలియరావు. ఆభరణాలు చూస్తే చాలా పాత కాలం నాటివిగా కనిపిస్తున్నాయి. దేవతా విగ్రహాలకు అలంకరించే బంగారు ఆభరణాలను పోలి ఉన్నాయి.  అయితే ఈ ప్రాంతం ఒకప్పుడు సర్వాయి పాపన్న ఏలుబడిలో ఉండేది. ఆయన కాలం నాటిది అయి ఉంటదని అనుమానిస్తున్నారు. అయితే వాటి పూర్వాపరాలు తెలియాలంటే పురావస్తు శాఖ అధికారులు పరిశీలించాల్సి ఉంటుంది.

నరసింహ అనే రియల్ఎస్టేట్ వ్యాపారి అతని స్నేహితులు కల్సి 11 ఎకరాల భూమిని నెలరోజుల క్రితం కొనుగోలు చేశారు. భూమిని జెసిబితో చదును చేస్తుండగా గట్టి రాయి లాంటిది తగిలినట్లు అటంకం కలిగింది. తీరా చూస్తే పాతకాలం నాటి బిందె అందులో ఆభరణాలు కనిపించాయని దాంతో  ఇది ఏదో నిధి లాగా ఉందని  పోలీసులకు సమాచారం ఇచ్చానని యజమాని నరసింహ తెలిపారు.

భూ యజమాని అయితే నిజాయితీగా పోలీసులకు సమాచారం ఇచ్చాడు కాని ఆయనో సెంటిమెంట్ కథ చెబుతున్నాడు. తనకు రెండు రోజులుగా కళలో అమ్మవారు కనిపించిందని  ఆభరణాలు ఉన్న బిందె లభించడం వల్ల అవి అమ్మవారి నగలేనని మీడియా వారికి చెప్పాడు. ఆ ప్రాంతంలో ఓ గుడి కట్టించాలని అనుకుంటున్నామని ఆయన తెలిపారు. ఈ వార్త తెల్సిన ప్రజలు భారి సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. పోలీసులు వారిని దూరంగా ఉంచి  లభించిన ఆభరణాలను సేఫ్ కస్టడీకి తరలించారు. అమ్మవారి నగలన్న పుకార్లతో పూనకం వచ్చే  కొందరు మహిళలు అక్కడికి చేరుకుని పూనకాలు పూనారు.

ఈ ఆభరణాల గురించి అప్పుడే ఏమి చెప్పలేమని  ఇంకా ఆప్రాంతంలో ఏవైనా నిధులు ఉన్నాయా అనేది కూడ చెప్పలేమని పురావస్తు శాఖ అధికారుల నిర్ణయం మేరకు తదుపరి చర్యలు ఉంటాయని జనగామ తహశీల్ దార్ రవీందర్ తెలిపారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు