తప్పు ధర్మారెడ్డి ఒక్కడిదేనా?! డా.పసునూరి రవీందర్‌

 పాఠశాల స్థాయిలోనే అగ్రవర్ణాల పిల్లల పసిమనుసుల్లో కూడా కుల అహంకార విషబీజాలు నాటుతున్నారు. దీనికి శిక్షణకేంద్రాలు అగ్రవర్ణాల యిండ్లు. తల్లిదండ్రులే ట్రెయినర్లు. మనది పెద్దకులం, కిందికులాలు మనక్రింద బ్రతకాలి. మన శత్రువు అంబేద్కర్‌, రిజర్వేషన్లు మన ఎదుగుదలకు అడ్డంకి అనే పాఠాలు నేర్పుతున్నారు. ఆ అహంకార ధోరణి క్రమంగా విస్తరించి ఇట్లా వెర్రితలలు వేస్తోంది. ధర్మారెడ్లు ప్రజాప్రతినిధిగా గెలిచినా తన అసలు రంగు దాచుకోలేనంత వీరంగమాడుతున్నది


పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కిందికులాలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దళిత, బహుజనులను ఎంతో వేదనకు గురిచేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనల వరకు వెళ్లాయి. దీంతో నాలుక కర్సుకున్న ధర్మారెడ్డి క్షమాపణు చెప్పి తప్పు ఒప్పుకున్నాడు. అసలు ధర్మారెడ్డికి ఇంత అధర్మాగ్రహం, అసూయ, ద్వేషం ఎక్కడి నుండి వచ్చిందన్నదే ఆలోచించాల్సిన విషయం. ఆ చిన్నచూపు ధర్మారెడ్డి ఒక్కడిదేనా? సాధారణంగా అగ్రవర్ణాలందరికీ అలాంటి ద్వేషమే ఉందా అనేది పరిశీలించాలి. ఇట్లా ఒకే దేశం, ఒకే జాతి అనుకునే ప్రజల మధ్య ఇంత దారుణమైన ఈర్ష్యా ద్వేషాలను ఎవరు పెంచి పోషిస్తున్నారు. అసలు మన సామాజిక వ్యవస్థ అగ్రవర్ణాలకు ఏ మేరకు తెలుసు? తెలియకుండా వారు నోటికొచ్చింది మాట్లాడుతుంటే వారిని మానసిక పరివర్తన వైపుగా నడిపించాల్సిన బాధ్యత ఎవరిది? మరోసారి మరో రెడ్డినో, వెలమో, బ్రాహ్మణ కులస్తుడో ఇట్లా కిందికులాల మనసును గాయపరచరనే గ్యారెంటీ ఉందా? అసలు దీనికి ముగింపు ఎక్కడా? దీన్ని ఎట్లా పరిష్కరించాలి? అగ్రవర్ణాల రాగద్వేషాల స్థానంలో విశాలత్వం, ప్రేమ ఎట్లా చిగురించాలి? అనేది ప్రతీ ఒక్కరూ దృష్టిసారించాల్సిన విషయం.

ఇంకెంతకాలం రిజర్వేషన్లు? వాటి ద్వారా విద్యా, ఉద్యోగాల్లోకి వచ్చే ఎస్సీఎస్టీబీసీలకు పొట్టచీల్చితే అక్షరం ముక్కరాదు, వాళ్లంతా దేవుని బిడ్డలు, అన్నీ ఫ్రీగా అనుభవించే పుక్కట్‌గాళ్లు, అనే మాటలు నిత్యం మన సమాజంలో వినబడేవే. వీటిని అనేవాళ్లకు ఎంత అసహనం ఉంటుందో, వాటిని పడేవారికి అంతకంటే అవమానం కూడా ఉంటుంది. నిజానికి ఈ పరిస్థితిపై ప్రభుత్వాలు రెండు వర్గాలకు కల్పించాల్సినంత అవగాహన, చైతన్యాన్ని కల్పించడంలో తీవ్రంగా విఫలమయ్యాయి. దీంతో సామాన్య అగ్రవర్ణ ప్రజలే కాదు, బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న ప్రజాప్రతినిధులు సైతం నోటికొచ్చినంత కూస్తున్నారు. ఇందుకు సజీవసాక్ష్యమే పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వెల్లగక్కిన అక్కసు.

ఇది ధర్మారెడ్డి ఒక్కడి అభిప్రాయమే కాదు. అగ్రవర్ణాల్లో ఈ యేడు దశాబ్దాల కాలంలో గూడుకట్టుకున్న అసహన, ద్వేషానికి ఒక ఉదాహరణ. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. దేశంలో ఉన్న పేద అగ్రవర్ణాలకు రిజర్వేషన్ల చరిత్రను అర్థం చేసుకునే ఓపిక లేదు. రిజర్వేషన్ల వల్ల బాగుపడ్డవాళ్ల లెక్కలు తీసే తరచిచూసే సహనమూ లేదు. ఉన్నదల్లా తమ లోలోపల రగులుతున్న బాధను, కోపాన్ని వెల్లగక్కుకోవడమే వారికి

ఉపశమనం. అందుకే వీరు అంతంతమాత్రం చదువుకున్న, చిన్నాచితక కొలువు చేసే దళిత, గిరిజన, బీసీలను లక్ష్యం చేసుకుంటారు. చరిత్ర, రాజకీయాల పట్ల అవగాహన కలిగిన వారితో చర్చించరు. చర్చిస్తే తమదే తప్పని తెలుస్తుందని వీరికి బాగా తెలుసు. అందుకని వీరు అడ్డదారిలో మరికొన్ని ప్రశ్నలను తయారు చేసుకున్నారు. ఇంకెంతకాలం రిజర్వేషన్లు? అనుభవించిన వారే అనుభవిస్తే, మరి లేనివారి పరిస్థితి ఏంటి? దళితుల్లోనే ఇంకా ఉన్న పేదలకు దక్కాలి కదా అనే రకరకాల కపట ప్రేమరాగాలు పలుకుతుంటారు. దీనికి కారణం సత్యాన్ని కనుగొనాలనే, చరిత్రను తెలుసుకోవాలనే, నిజాలను ఒప్పుకోవాలనే ధైర్యం లేకపోవడమే.

భారతదేశంలో రిజర్వేషన్లు పెట్టడానికి కారణాల ప్రజాప్రతినిధి అయిన ధర్మారెడ్డికే తెలియకపోవడం అత్యంత విచారకరం. రిజర్వేషన్లు ఆర్థిక సాధికారత కోసమా? సామాజిక అసమానతలు తొలగించడం కోసమా? మూడువేల యేండ్ల పాటు ఎలాంటి హక్కులకు నోచుకుకుండా ఉన్నది ఎవరు? రిజర్వేషన్ ‌గాళ్లా? అగ్రవర్ణాల వారా? మరి అప్పుడు అన్నింటిని అనుభవించి ఈ దేశంలో కులంకుళ్లును పెంచిపోషించింది ఎవరు? అట్లా అభివృద్ధికి దూరం చేయబడ్డ మెజారిటీ ప్రజలకు ఈ మాత్రం రిజర్వేషన్లే లేకపోతే ఈ దేశం ఎట్లా ఉండేది? అసహనం పెరిగి అంతర్యుద్ధం రాకపోయేదా?! ఇవేవి ఎమ్మేల్యే స్థాయి వ్యక్తికి తెలియక పోవడం ఆశ్చర్యకరం.

అసలు ధర్మారెడ్డి అక్కసు వెళ్లగక్కింది కేవలం వ్యక్తిగా కాదు. అది అగ్రవర్ణాలందరిలో గూడు కట్టుకొని ఉన్న ఎస్సీఎస్టీబీసీ వ్యతిరేకత. అగ్రవర్ణాల్లో అకారణంగా రిజర్వేషన్ల మీద ఏడ్చేవారి ప్రతినిధిగా సదరు ఎమ్మేల్యే నోటికొచ్చింది మాట్లాడాడు. ఒక ప్రజాప్రతినిధిగా తాను అందరిని సమానంగా చూడాలి. ఎమ్మేల్యేగా ప్రమాణస్వీకారం చేసేటప్పుడు ‘‘శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని..శాసనసభ్యునిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంత:కరణశుద్ధితో నిర్వహిస్తానని, భయంగాని, ఎలాంటి పక్షపాతం గానీ, రాగద్వేషాలు గానీ లేకుండా, రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’ అని చేసిన ప్రమాణాన్ని మరిచిపోయి వ్యవహరించడం క్షమించరాని నేరం.

ధర్మారెడ్డే కాదు ఏ అగ్రవర్ణ నాయకుడైనా ఇట్లా సామాన్య ప్రజల్లా అక్కసు వెళ్లగక్కడం వెనక ఇటీవలి పరిణామాల ప్రభావం ఉంది. రాష్ట్రం ఏర్పడిన తరువాత తెంగాణలో అగ్రవర్ణాలకు సరికొత్త శక్తి వచ్చింది. అందుకు కారణం సీఎం హోదాలో ఉన్న కేసియార్‌ స్వయంగా తాను అగ్రవర్ణాల పక్షపాతం చూపించడం. బ్రాహ్మణ కార్పోరేషన్‌లు, పురోహితులకు జీతాలు, ఓసీలకు ఈడబ్లూఎస్‌ రిజర్వేషన్లు వంటి పరిణామాల నేపథ్యంలో అగ్రవర్ణాల్లోని నిరుద్యోగ నాయకత్వం సంఘటితమయ్యారు. తమ తమ కులాల్లో ఉన్న పేదల దు:ఖాన్నే పెట్టుబడిగా చేసుకొని వీరు వేదికలు, సంఘాలు పెట్టుకొని పబ్బం గడుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఓసీ కులాల ఐక్యవేదికలు, సంఘాలు తెలంగాణలో పుట్టుకొచ్చాయి. ఇది తెంగాణ ఉద్యమాల చరిత్రకు మాయని మచ్చ. సంఘాలు బలహీనులకా? బలవంతులకా?

దేశంలో ఏ రంగాన్ని తీసుకున్నా దాన్ని శాసిస్తున్నది అగ్రవర్ణాలే అన్నది నిర్వివాదాంశం. రాజకీయరంగం, మీడియా, సినిమా, వాణిజ్య, వ్యాపార రంగాన్ని అగ్రవర్ణాల చేతుల్లోనే ఉండడం అత్యంత సహజమైన విషయం. ఈ విషయం ఓసీ ఐక్యవేదిక నాయకులకు తెలియదనుకోలేం. కాకుంటే వారు తమ దుకాణం నడవడానికి చూపిస్తున్నది మాత్రం అమాయకులైన అగ్రవర్ణ పేదలను. ఇట్లా దుకాణాలు తెరుచుకోవడానికి కారకులు స్వయంగా ముఖ్యమంత్రి గారే కావడం తెంగాణ సమాజ విషాదం. వాస్తు బాగోలేదని సెక్రటేరియేట్‌ కూల్చిన ముఖ్యమంత్రికి ఉన్న వ్యక్తిగత సెంటిమెంట్లలో బ్రాహ్మణ ఆదరణ కూడా ఒకటి. బ్రాహ్మణులు కష్టాలు పడే రాజ్యాలు కూలిపోతాయనే మూఢ విశ్వాసం ఆయన ఆచరణలో కనిపిస్తుంది. అందుకే ఆయన అగ్రవర్ణాల సంక్షేమం కోసం కంకణం కట్టుకొని, నూటికి తొంభైమూడు శాతం ఉన్న ఎస్సీఎస్టీబీసీలకు తీరని అన్యాయం చేస్తున్నారు. ఈ అధినేత అండతో గజానికో ధర్మారెడ్డి పుట్టుకొస్తున్నాడు. గతంలో ఎస్సీఎస్టీ అట్రాసిటీ చట్టానికి భయపడో, జడిసో బహిరంగంగా కుల అక్కసును వెళ్లగక్కడానికి అగ్రవర్ణాలు జంకేవి. కానీ, ఇవాళ ఎమ్మెల్యే వంటి బాధ్యతాయుతమైన పోస్టులో ఉన్న ప్రజాప్రతినిధి కూడా రాగద్వేషాలను పెంచిపోషించడంలో ముఖ్యమంత్రి అందించిన ధైర్యం స్పష్టంగా దాగి ఉంది.

ధర్మారెడ్డికైనా, కేసియార్‌కైనా గెలవడానికి బహుజనుల ఓట్లు కావాలి. కానీ, వాళ్లు మాత్రం అభివృద్ధి చెందడానికి వీలులేదన్నదే వారి అభిమతం. అందుకే స్వయంగా ముఖ్యమంత్రే తెంగాణ వచ్చిన తరువాత బహుజనులకు చేసిందేమీ లేకపోగా, దేవాలయాలకు దీపదూప నైవేద్య పథకం క్రింద బ్రాహ్మణులకు బడ్జెట్‌ కేటాయిచండం ఈ రాష్ట్రంలోనే  సాధ్యమయ్యింది. ఇట్లా సీఏం స్థాయి నాయకుడే అధికారిక హోదాలోనే అగ్రవర్ణాలకు వంత పాడడం ధర్మారెడ్డి వంటివారి చేత అవాకులు, చెవాకులు పేల్చేలా చేస్తోంది.

కిందికులాలను అవమానిస్తూ  ధర్మారెడ్డి చేసిన ఆరోపణలు అత్యంత నిరాధారమైనవి. నిందాపూరితమైనవి. దళితులే రాష్ట్రంలో ఏ ఆఫీసుకు పోయినా ఉన్నతాధికారులుగా ఉన్నారనడం హాస్యాస్పదం. ఇది ఒక శాసనసభ్యుని స్థాయికి తగదు. రాష్ట్రంలోని ఉద్యోగుల సంఖ్య, అందులో దళిత, గిరిజన, బీసీ, ఓసీలు ఎంతమంది ఉన్నారో లెక్కలు తీయాలి. అవేవి తీయకుండానే ఒక్కరో యిద్దరినో చూపి ఇట్లా నిందలు వేయడం ఆయన దిగజారుడు తనానికి నిదర్శనం. పైగా కిందికులాలకు పని రాదని బహుజను ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా స్వయంగా ఒక ఎమ్మెల్యే మాట్లాడడం రాజ్యాంగ విరుద్ధం. చాలామంది అగ్రవర్ణ ప్రజాప్రతినిధులు టెన్త్‌, ఇంటర్‌ వరకే చదువుకున్నారనే విషయం ధర్మారెడ్డికి తెలియంది కాదు. అంతేకాదు ఈ అధర్మారెడ్డి ఇంకొక అడుగు ముందుకు వేసి ఇవాళ రాష్ట్రం మొత్తం నాశనం కావడానికి కారణం బహుజనులే అనడం ఆయన ఎంతటి దళిత, బహుజన వ్యతిరేకో తెలుపుతుపున్నది. ఆయనలో  ఎంత కులద్వేషం గూడుకట్టుకొని ఉందో అర్థమవుతున్నది. పైగా ఈయనగారు రిజర్వేషన్ల వల్ల దళితుల పిల్లలు కార్పోరేటు స్కూళ్లల్లో చదువుతున్నారని ప్రకటించాడు. ఆ రిజర్వేషన్‌ మరొకరికి దక్కదనే తీరుగా వ్యవహరిస్తారని అనడం అత్యంత దుర్మార్గమైన విషయం. దళితులు ఏనాడు అట్లా వ్యవహరించింది లేదు. ప్రవేటు విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు ఉన్నాయా? ఇక యూనివర్సిటీ స్థాయి విద్యా సంస్థల్లో ఓపెన్‌లోనే పోటీ పడాలనే ఆత్మగౌరవాన్ని నేర్పిస్తున్న విద్యావంతులైన దళిత తల్లిదండ్రులు ఎందరో ఉన్నారు. ఇవేవి పరిగణలోకి తీసుకోకుండా ధర్మారెడ్డి ఇట్లా మాట్లాడడం వల్ల ఇవాళ దళిత, బహుజనుల గుండెలు రగిలిపోతున్నాయి. ఈ రకమైన అక్కసుకు ముగింపు ఎక్కడ అనేది అసలు ప్రశ్న.

మన సమాజంలో కులం, రిజర్వేషన్లు అనే విషయాల పట్ల ఎవరి అభిప్రాయాలు వారికున్నాయి. ఏకాభిప్రాయం అనేది లేదు. అగ్రవర్ణాలకు రిజర్వేషన్ల మీద అక్కసు వెళ్లగక్కడంలో ఉన్న శ్రద్ధ, మూడువేలయేండ్ల పాటు మూతికి ముంత, నడుముకు తాటాకు కట్టి మనిషిని మనిషిగా చూడని అమానవీయతను తెలుసుకోవడంలో లేదు. శతాబ్దాల పాటు కులంపేర చేసిన దుర్మార్గాలను మరిచి, ఈ డెబ్బయియేండ్ల కాలపు రిజర్వేషన్లకే బెంబేలెత్తిపోయే దుర్నీతి క్షమించరానిది. అగ్రవర్ణాల్లో పేదలు ఉన్నారు. వారు బతకాలి, బాగుపడాలి. కానీ, అది దళితులనో, బీసీలనో నిందించి అవమానించి కాదు. ఈ కులపట్టింపు, రిజర్వేషన్‌ ఏడుపులు నిత్యకృత్యమై బహుజనుల మనసులను గాయపరుస్తున్నాయి. నిత్యం అవమానిస్తున్నాయి. వేధిస్తున్నాయి. అందుకే బహుజనులు క్రమంగా అగ్రవర్ణతత్వానికి వ్యతిరేకులుగా మారుతున్నారు. ధర్మారెడ్డి వంటి వారి మాటల దాడులకు లోలోపలే రగిలిపోతున్నారు. దీన్ని పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది.

ప్రజలను సామాజిక పరివర్తన దిశగా నడిపించడంలో పాలకులు దృష్టి సారించడం లేదు. ఒకప్పుడు పాఠ్యపుస్తకాల్లో అంటరానితనం అమానుషం అని పుస్తకాల మొదటి పేజీల్లో ఉండేది. అది కేవలం ప్రకటన వరకే ఉండేది గానీ, దాని గురించి ఏ ఉపాధ్యాయుడు వివరంగా తెలియజేసే వారు కాదు. ఎందుకంటే కులం యొక్క చర్చలోకి వెళితే, చరిత్రలో అగ్రవర్ణాలు చేసిన దుర్మార్గాలు బయట పడతాయి. తద్వారా వారు దోషులనే విషయం బయటికి వస్తుంది. అందుకే సామాజిక సమానత్వం గురించి బోధించాల్సిన గురువులు కేవలం మార్కుల పాఠాల వరకే పరిమితమయ్యారు. ఇంకా కొందరు అగ్రవర్ణ టీచర్లయితే (అందరూ కాదు) కిందికులాలకు చదువెందుకు? వీరు చదివితే రేపు అవకాశాలన్నీ పొంది, మాతో సమానమవుతారు అని పిల్లలను డ్రాపవుట్‌ల వైపు ప్రోత్సహించారు. విపరీతంగా కొట్టడం, మీకు చదువు అబ్బదు, గొడ్ల కాసుకోండని ఇంటికి పంపడం చేశారు. అట్లా కిందికులాల చదువు ముందుకు పోకుండా ఉండడంలో తమ వంతు పాత్రను పోషించారు.

ఇక పాఠశాల స్థాయిలోనే అగ్రవర్ణాల పిల్లల పసిమనుసుల్లో కూడా కుల అహంకార విషబీజాలు నాటుతున్నారు. దీనికి శిక్షణ కేంద్రాలు అగ్రవర్ణాల యిండ్లు. తల్లిదండ్రులే ట్రెయినర్లు. మనది పెద్దకులం, కిందికులాలు మనక్రింద బ్రతకాలి. మన శత్రువు అంబేద్కర్‌, రిజర్వేషన్లు మన ఎదుగుదలకు అడ్డంకి అనే పాఠాలు నేర్పుతున్నారు. ఆ అహంకార ధోరణి క్రమంగా విస్తరించి ఇట్లా వెర్రితలలు వేస్తోంది. ధర్మారెడ్లు ప్రజాప్రతినిధిగా గెలిచినా తన అసలు రంగు దాచుకోలేనంత వీరంగమాడుతున్నది.

కార్పోరేటు కాలేజీల్లో సకల సౌకర్యాలతో ముప్పూటలా తిని వచ్చిన వారికి, కనీసం ఒక్కపూట తినడానికి తిండిలేని నిరుపేదలైన దళిత బహుజనులకు పోటీ పెడితే ఎవరు గెలుస్తారు. అసలు ఆ పోటి ఎంత అప్రజాస్వామ్యమైనదో ఏ అగ్రవర్ణం వారు ఆలోచించరు. పైగా ఇండియాలో రిజర్వేషన్ల వల్ల తమకు అవకాశాలు రావడం లేదని విదేశాలకు వెళుతున్నారని వీరు కూనిరాగాలు తీస్తారు. విదేశాలకు వెళ్లడానికి ఎన్ని లక్షల రూపాయాలు కావాలి? మరి అట్లా వీసా, పాస్‌పోర్ట్‌ల కోసం లక్షలు వెచ్చించే వారు పేదలు ఎట్లవుతారు? అట్లా కిందికులాల ఎదుగుదలను ఓర్వలేక తమ మేధస్సును విదేశాలకు కేటాయించేవారు దేశభక్తులు ఎట్లా అవుతారు.

ఇక రిజర్వేషన్ల ద్వేషం యూనివర్సిటీ స్థాయిలో తీవ్రతరం అవుతున్నది. ఒక పిల్లవాడిని పెంచేటప్పుడు ఇంట్లోనే మనం రెడ్లం, మనం వెలమ దొరలం, మనం సత్‌బ్రాహ్మణులం అనే కులపిచ్చి ఎక్కిస్తే వాడు మంచి పౌరుడు కావడానికి ఏమైనా అవకాశం ఉందా? పిల్లలకు నేర్పాల్సింది మంచి, మానవత్వం. కానీ, కులపిచ్చి కలిగిన అగ్రవర్ణ తల్లిదండ్రులు తమ పిల్లలకు కులపిచ్చిని నింపి, పేర్ల చివర తోకలు తగిలించి సమాజం మీదికి వదుతున్నారు. ఇక వాళ్లు జీవితాంతం అదే బుద్ధితో లోకాన్ని చూస్తారు. ఐఐటీలు, యూనివర్సిటీలో ఇట్లా కులపిచ్చితో నిత్యం రిజర్వేషన్ల మీద ఏడుపులు ఎక్కడి వరకైనా దారి తీస్తున్నాయి. ఇక ఉద్యోగాల విషయంలో కూడా ఇదే తంతు. చదువుకున్న వారు కూడా తమ కులజాఢ్యాన్ని వదుకోవడానికి సిద్ధంగా ఉండరు. హాఫ్‌ మార్కులో నాకు ఉద్యోగం మిస్సయ్యింది, నాకంటే తక్కువ మార్కులొచ్చిన ఎస్సీఎస్టీలకు ఉద్యోగం వచ్చిందని ఏడుస్తుంటారు. ఉద్యోగం మిస్‌ కావడం ఎవ్వరికైనా బాధాకరమే కానీ, ఈ దేశంలో ఉద్యోగమొచ్చిన దళితుని తరాల చరిత్ర ఏమిటి? ఉద్యోగం రాని తరతరాల అగ్రవర్ణాల చరిత్ర ఏమిటి అనేది తెలుసుకోరు. తెలుసుకుంటే తరతరాలుగా అన్ని సౌకర్యాలను అనుభవించిన అగ్రవర్ణాలకు, ఇప్పుడిప్పుడే చదువు, ఉద్యోగాల్లోకి వస్తున్న కిందికులాల చరిత్ర ఎంత వైవిధ్యమైందో తెలుస్తుంది. కానీ అదంతా తెలుసుకోవడానికి అగ్రవర్ణాలకు యిష్టం లేదు. ఎందుకంటే వారికి నిజాలను అంగీకరించే ధైర్యం లేదు. అందుకే వారు సంకుచిత వాదులుగానే జీవితాలను ముగిస్తున్నారు. కావున ప్రజలను పాలించే పాలకులు ముందు మేల్కొనాలి. లేకుంటే దీని పర్యవసానాలు జాత్యాహంకారానికి దారి తీయొచ్చు. ధర్మారెడ్డిలాగా మరో అగ్రవర్ణ నాయకుడు మాట్లాడకుండా ఉండాంటే ఏం చేయాలో ఇప్పుడు ముఖ్యమంత్రి ఆలోచించాలి. లేకుంటే బహుజనులే రానున్న ఎన్నికల్లో కులదురభిమానం, బహుజన వ్యతిరేకత కలిగిన ధర్మారెడ్డి వంటి వారికి తగిన గుణపాఠం చెప్పాలి.

`డా.పసునూరి రవీందర్‌
కేంద్ర సాహిత్య అకాడెమి యువ పురస్కారగ్రహీత

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు