కోరోనిల్ విషయంలో రాం దేవ్ బాబా కు మరో సారి షాక్

అయ్యో బాబా...ఇదేంటి బాబా

బాబా రాం దేవ్ పై విమర్శలు
మహారాష్ట్రలో అనుమ తించ బోమన్న ప్రభుత్వం


యోగా గురు రాం దేవ్ బాబా సంస్థ నుండి విడుదలైన కోరోనిల్ ఔషదానికి మహారాష్ట్రలో చుక్కెదురు అయింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇప్పటికే  కోరోనిల్  విషయంలో అభ్యంతరం వ్యక్తం చేయగా మహారాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి దృవీకరణలు లేకుండా విక్రయాలకు అనుమతించ బోమంటూ స్పష్టం చేసింది.   ధృవీకరణలు లేని కోరోనిల్ టాబ్లెట్లను విక్రయించేందుకు అనుమతించ బోమంటూ మహారాష్ట్ర హోం శాఖ మంత్రి  అనిల్ దేశ్ ముఖ్ మంగళవారం స్పష్టం చేశారు. ఎలాంటి ప్రమాణాలు లేని కోరోనిల్ ఔషదాన్ని ఇద్దరు కేంద్ర మంత్రుల సమక్షంలో ఆవిష్కరించడం చాలా దురదృష్టమని ట్విట్టర్ లో పేర్కొన్నారు.

కోరోనిల్ విషయంలోమొదటి నుండి ఎలాంటి స్పష్టత లేదు. రాం దేవ్ బాబా ఈ ఔషధాన్ని మార్కెట్లో విడుదల చేయడం ఇది రెండో సారి. గత ఏడాది జూన్ లో కరోనా ఉధృతంగా ఉన్న  సమయంలో కరోనాకు చికిత్స కోసం అంటూ  కోరోనిల్ కిట్లను బాబా రాం దేవ్ విడుదల చేయడం వివాదాస్పదం అయింది. కోరోనిల్ కరోనాను నయం చేస్తుందని  ప్రభుత్వానికి చెందిన ఏ ప్రామాణిక  సంస్థ ధృవీకరించ లేదు. అప్పట్లో విమర్శలు రావడంతో అసలు ఈ మందు కరోనా ను నయం చేస్తుందని ఎక్కడా పేర్కొన లేదని కేవలం కరోనాను ఎదుర్కునే రోగ నిరోధక శక్తికి తోడ్పడుతుందని బాబా రాం దేవ్ వివరణ ఇచ్చారు. 

ఆ తర్వాత  ఔషధానికి సరైన దృవీకరణలు లేకుండానే మరో సారి ఇద్దరు కేంద్ర మంత్రుల సమక్షంలో వారి చేతుల మీదుగా విడుదల చేయడం మరో సారి వివాదం అయింది. ఔషదం విడుదల సమయంలో  ప్రపంచ అరోగ్య సంస్థ ధృవీకరణ ఉందని బాబ రాం దేవ్ ప్రకటించడం మరో సారి ఆయన అభాసు పాలు అయ్యేందుకు కారణం అయింది. పతంజలి ఔషదానికి తాము ఎలాంటి ధృవీకరణ ఇవ్వలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్వయంగా ట్విట్టర్ వేదికగా వివరణ ఇవ్వడంతో పతంజలి ఆయుర్వేద సంస్థ మరో సారి ఇబ్బందుల్లో పడింది. దాంతో ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్  బాలకృష్ణ మరో సారివివరణ ఇచ్చారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఔషధాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వడం నిరాకరించడం జరగదని కేంద్ర ప్రబుత్వం డ్రాగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతులు ఉన్నాయని వివరణ ఇచ్చారు. 

ఓ వైపు వాక్సి నేషన్ జరుగుతున్న సమయంలో రాం దేవ్ బాబా ఎలాంటి ధృవీకరణలు లేని మందును మార్కెట్ లో ప్రవేశ పెట్టి సొమ్ము చేసుకోవాలని చూస్తున్నాడని ప్రజలను మోసం చేసినందుకు చీటింగ్ కేసులు పెట్టాలని దేశ వ్యాప్తంగా సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేసారు. కొన్నిపోలీస్ స్టేషన్లలో  రాం దేవ్ బాబాపై ఫిర్యాదులు కూడ చేసారు.

ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అయితే రాం దేవ్ బాబా కోరోనిల్ మందు విడుదల పై తీవ్ర ఆక్షేపణలు వ్యక్తం చేసింది. ఇద్దరు కేంద్ర మంత్రుల సమక్షంలో ఔదం విడుదల చేయడం సరికాదని కేంద్ర ఆరోగ్య మంత్రి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసింది.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు