పేదలకు వాక్సిన్ ఉచితంగా ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం-మంత్రి ఈటెల రాజేందర్

 


వ్యాక్సిన్‌ ఉచితంగా ఇవ్వాలని కోరాం: ఈటల రాజేందర్


హైదరాబాద్‌: రష్యా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిందని వస్తున్న వార్తలపై తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పందించారు.  ‘‘అనేక వ్యాక్సిన్‌లు పరోక్షంగా తెలంగాణలోకి వస్తున్నాయి. కొన్ని క్లినికల్‌ ట్రయల్స్‌ కోసం వస్తుండగా, మరి కొన్నింటిని కొందరు తెలిసిన వారి ద్వారా తెచ్చుకుని వాడుతున్నారు. భారత్‌లో వ్యాక్సిన్‌ ఎప్పటిలోగా అందుబాటులోకి వస్తుందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిని వీడియోకాన్ఫరెన్స్‌లో అడిగాం. అందుబాటులోకి వస్తే ఎంతమందికి ఇస్తారు అనే విషయాన్ని ప్రస్తావించాం. దశలవారీగా వ్యాక్సిన్‌ ఇస్తే మొదట వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులకు ఇవ్వాలని సూచించాం. పేద ప్రజలకు కూడా ఉచితంగా వ్యాక్సిన్‌ ఇవ్వాలని కోరాం’’ అని ఈటల రాజేందర్ తెలిపారు.

 ఖైరతాబాద్‌లోని ఎంఎస్‌ మక్తాలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాను స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో కలిసి మంత్రి గురువారం ఉదయం ప్రారంభించారు. పేద ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన దవాఖానాలను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని కోరారు. నర్సింగ్‌ ఉద్యోగుల నియామకాల్లో అవకతవకలు జరిగాయన్న వార్తలను మంత్రి ఈటల ఖండించారు. కాంట్రాక్ట్‌ బేసిస్‌లో డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న వారికి వెయిటేజ్‌ విషయంలో కోర్టు క్లియరెన్స్‌ ఇచ్చిందన్నారు. పొరుగు సేవల వారికి ఇది వర్తించదని  తెలిపారు. కొంత మంది నకిలీ సర్టిఫికెట్లు సృష్టించినట్లు తమ దృష్టికి వచ్చిందని.. వాటిని పరిశీలిస్తున్నట్లు మంత్రి వివరించారు. ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా పారదర్శకంగా నియామకాలు చేపడతామని ఈటల స్పష్టం చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు