భారత ప్రజాస్వామ్యం అత్యంత క్లిష్టమైన దశలో ఉంది - తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ

 


భారత ప్రజాస్వామ్యం అత్యంత క్లిష్టమైన దశలో ఉందని కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. ప్రజా సమస్యలకు తోడు ప్రభుత్వం మరిన్ని సమస్యలు సృష్టిస్తూ ప్రజాస్వామ్యాన్ని పతనం దిశగా తీసుకువెళ్తున్నారని ఆమె మండిపడ్డారు. కోవిడ్-19, ఆర్థిక మాంద్యానికి తోడు ప్రభుత్వం కొత్తగా వ్యవసాయ చట్టాలు తీసుకువచ్చి దేశ ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజాస్వామ్యం కుంచించుకుపోతూ వస్తోంది. ప్రస్తుతం మన దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ అత్యంత క్లిష్టమైన దశలో ఉంది. వ్యవసాయ నూతన చట్టాలతో ప్రజలపై ప్రభుత్వం దాడికి దిగుతోంది. కోవిడ్-19పై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. అత్యంత దిగువకు ఆర్థిక మాంద్యం పడిపోయింది. దళితులపై దాడులు తీవ్ర స్థాయికి పెరిగాయి. ఇవన్నీ ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలే. మోదీ ప్రభుత్వం వీటన్నిటికీ కారణం’’ అని సోనియా గాంధీ అన్నారు


ఈనెల 31న దేశవ్యాప్తంగా ఆందోళన 


వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఈనెల 31న ‘రైతు హక్కుల దినోత్సవం’ పేరుతో దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేపట్టాలని కాంగ్రెస్‌ పార్టీ ఈ సమావేశంలో నిర్ణయించింది. కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చేపట్టాల్సిన ఉద్యమాల గురించి సమావేశంలో చర్చించారు. మహిళలు, దళితులపై దాడులకు వ్యతిరేకంగా నవంబర్‌ 5న ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. ఆ రోజు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటలవరకు అన్ని రాష్ట్రాల రాజధానుల్లో ధర్నాలు చేపట్టాలని ఆదేశించారు. నెహ్రూ భావజాలం, జాతి నిర్మాణం అన్న అంశంపై నవంబరు 13న అన్ని రాష్ట్రాల రాజధానుల్లో సదస్సులు నిర్వహించాలని సోనియాగాంధీ సూచించారు. ప్రభుత్వరంగ సంస్థలను కాపాడాలన్న నినాదంతో ఆ నెల 14న ఆన్‌లైన్‌ ఉద్యమం నిర్వహించాలని పిలుపునిచ్చారు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు