ఈ సారి కూడ గ్రామాల్లోనే పూర్థిస్థాయిలో దాన్యం కొనుగోలు - ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు

 


రైతులు పండించిన వరి ధాన్యాన్ని గ్రామాల్లోనే పూర్థిస్థాయిలో కొనుగోలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. కరోనా ప్రమాదం ఇంకా పూర్తిగా తొలగిపోనందున రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని వివిధ ప్రభుత్వ ఏజెన్సీలను గ్రామాలకు పంపి మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయిస్తామని తెలిపారు.

వానాకాలం ధాన్యం కొనుగోళ్ల అంశంపై ఇవాళ ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి మరోసారి మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు.

కరోనా సమయంలో పూర్తిస్థాయిలో కొనుగోళ్లు చేసిన విధంగానే ఇప్పుడు కూడా ఏజెన్సీలు రైతుల వద్దకే వచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేస్తాయని, మార్కెట్లకు ధాన్యాన్ని తీసుకొచ్చి రైతులు ఇబ్బంది పడొద్దని ముఖ్యమంత్రి సూచించారు. 17శాతానికి లోబడి తేమ ఉన్న ధాన్యాన్ని ఎండబెట్టి పొల్లు, తాలు లేకుండా తీసుకొస్తే ఏ- గ్రేడ్ రకానికి క్వింటాల్ కు రూ.1,888, బి-గ్రేడ్ రకానికి క్వింటాల్ కు రూ.1,868 కనీస మద్దతు ధరను ప్రభుత్వమే చెల్లిస్తుందని సీఎం కేసీఆర్ తెలిపారు.

గ్రామాల్లో వరికోతల కార్యక్రమం నెలా పదిహేనురోజులపాటు సాగుతుందని, కొనుగోళ్ల విషయంలో రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వ్యవసాయ, మార్కెటింగ్, పౌర సరఫరాలశాఖల అధికారులు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మొత్తం ఎంతధాన్యం వచ్చే అవకాశం ఉంటుందనే అంశంపై పక్కాగా అంచనా వేయాలని, కొనుగోళ్ల కోసం తగిన ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని సూచించారు.

సాగునీటి సౌకర్యం క్రమంగా పెరుగుతుండటంతో పడావు పడ్డ భూములు కూడా బాగవుతూ, సాగులోకి వస్తున్నాయన్నారు. రైతుబంధు పథకం కింద ప్రభుత్వమే పంట పెట్టుబడి సాయం అందిస్తుండటంతో పట్టణాలకు వలస వెళ్లిన రైతులు కూడా గ్రామాలకు తిరిగివచ్చి భూములను సాగు చేసుకోవడం సంతోషకరమని సీఎం పేర్కొన్నారు. బ్యాంకు గ్యారెంటీలు సహా రైతుల ధాన్యం అమ్మకం డబ్బు వెంటనే చెల్లించే విధంగా పకడ్బందీగా ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.

తెలంగాణ గొప్ప వ్యవసాయ రాష్ట్రంగా రూపుదిద్దుకుంటున్న నేపథ్యంలో పౌర సరఫరాలశాఖ ఇంకా విస్తృతంగా బలోపేతం కావాల్సిన అవసరం ఉందని, అందుకు అనుగుణంగా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నిర్దేశిత పంటలు వేయాలని ప్రభుత్వం సూచించిన విధంగా రైతులు 10.78 లక్షల ఎకరాల్లో కంది పంటను సాగు చేయడం అభినందనీయమని, ఆ పంటను కూడా కొనుగోలు చేయడానికి ఏర్పాట్లు చేసుకోవాలని సీఎం సూచించారు.

సమావేశంలో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి,  గంగుల కమలాకర్,  మహమూద్ అలీ, ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు  రాజీవ్ శర్మ, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ  నర్సింగ్ రావు, సెక్రటరీ  స్మితా సభర్వాల్, ఓఎస్డీ శ్రీమతి ప్రియాంక వర్గీస్, సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ చైర్మన్  మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మార్క్ ఫెడ్ చైర్మన్ మర గంగారెడ్డి, వ్యవసాయశాఖ కార్యదర్శి  జనార్దన్ రెడ్డి, సివిల్ సప్లైస్ కమిషనర్  అనిల్ కుమార్, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు