అపెక్స్ కౌన్సిల్ లో వాడి వేడి వాదం - డిపిఆర్ లు సమర్పించాలన్న కేంద్ర మంత్రి

 కాళేశ్వరం మూడో టిఎంఎసి ఎత్తి పోతలకు అనుమతులు లేవన్న ఎపి సిఎం జగన్
పోతిరెడ్డి పాడుకు ఏ అనుమతులున్నాయని ప్రశ్నించిన తెలంగాణ సిఎం కెసిఆర్
డిపిఆర్ లు సమర్పించాలన్న కేంద్ర మంత్రి 


ఎపి, తెలంగాణ  మద్య నెల కొన్న నది జలాల వివాదంపై మంగళవారం అపెక్స్ కౌన్సిల్ సమావేశం కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అధ్యక్షతన జరిగింది. వీడియో కాన్పరెన్సు ద్వారా రెండు గంటల పాటు జరిగిన సమావేశంలో ఇరు రాష్ర్టాల ముఖ్యమంత్రిల వాద ప్రతివాదాలు వాడి వేడుగా  జరిగాయి. ఢిల్లీలో ఉన్న  ఎపి సిఎం వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్కడి నుండే పాల్గొనగా తెలంగాణ సిఎం కెసిఆర్ హైదరాబాద్ నుండి పాల్గొన్నారు.

 సమావేశంలో ఎపి సిఎం లేవనెత్తిన అభ్యంతరాలపై తెలంగాణ సిఎం కెసిఆర్ గట్టి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ లో గోదావరి నదిపై చేపట్టిన పథకాలకు అనుమతులు లేవని కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టిఎంసి ఎత్తిపోతల పథకానికి అనుమతులు లేవని ఎపి సిఎం వై.ఎస్ జగన్ అభ్యంతరం వ్యక్తం చేశారు.  కెసిఆర్ జగన్ అభ్యంతరంపై  కౌంటర్ ఇస్తూ జగన్ వాదనలు సరికాదని తెలంగాణ ప్రాజెక్టులకు అన్ని అనుమతులు ఉన్నాయని అన్నట్లు తెల్సింది. ఏపిలో  అనుమతులు లేక పోయినా ప్రాజెక్టులు చేపట్టారని  పోతిరెడ్డి పాడు మొదటి దశకు ఏ అనుమతులు లేవంటే రెండో దశ పనులు ఎలా చేపడతారని కెసిఆర్ ప్రశ్నించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గతంలోలాగా తన పద్ధతిని మార్చుకోకుండా కృష్ణానదిపై పోతిరెడ్డిపాడు తదితర అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాలను ఆపకుంటే, తెలంగాణ ప్రభుత్వం కూడా అలంపూర్ - పెద్ద మరూర్ వద్ద బ్యారేజీ నిర్మించి తీరుతుందని, తద్వారా రోజుకు 3 టీఎంసీల సాగునీటిని ఎత్తిపోయడం ఖాయమని ముఖ్యమంత్రి  స్పష్టం చేశారు.

నదీ జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసేవిధంగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో చేసినట్లు తన ఇష్టం ఉన్నట్లు వ్యవహరిస్తే ఇకనుంచి కుదరదని, క్రమశిక్షణను ఉల్లంఘించి, తెలంగాణ నీటివాటాను కొల్లగొట్టాలని చూస్తే, తమ రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను కాపాడుకోవడానికి తామూ సిద్ధమేనని ముఖ్యమంత్రి మరోమారు ప్రకటించారు.

ఇరువురి వాదనలు విన్న కేంద్ర మంత్రి  వారిని  శాంత పరిచే ప్రయత్నాలు చేసి డిటేల్ ప్రాజెక్టు రిపోర్టులు సమర్పించాలని అడిగినట్లు సమావేశం అనంతరం జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు. కృష్ణా బోర్డు తరలింపు విషయంతో పాటు ఇతర విషయాలు చర్చకు వచ్చాయని తెలిపారు. ఇరువైపులా సమర్దనీయంగా నది జలాల వాడకంలో ఎలాంటి వివాదాలకు తావులేకుండా  చూస్తామని కేంద్ర మంత్రి చెప్పారు. డిటేల్ ప్రాజెక్టు రిపోర్టులు సమర్పించేందుకు ఇరు రాష్ర్టాల ముఖ్యమంత్రులు అంగీకరించారని అన్నారు. రిపోర్టుల పరీశీలన అనంతరం అపెక్స్ కమిటి తుది నిర్ణయం వెల్లడిస్తుందని చెప్పారు. అన్ని సమస్యలు పరిష్కరించేందుకు అపెక్స్కమిటి సిద్దంగా ఉందని అందుకు అవసరమైన సానుకూల వాతావరణం నెలకొనేందుకు సహకరిస్తామని ముఖ్యమంత్రులు  చెప్పారని అన్నారు. నది జలాల పంపిణీ విషయంలో సుప్రీం కోర్టులో ఉన్న కేసును ఉపసంహరించుకునేందుకు తెలంగాణ సిఎం కెసిఆర్అంగీకరించారని ,షెకావత్ తెలిపారు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు