కోటి విలువ చేసే వజ్రం 11 లక్షలకు కాజేసిన వ్యాపారి

రాయలసీమలో ఇది శరా మామూలే  - లక్షల నుండి కోట్ల విలువ చేసే వజ్రాలురాయలసీమ అంటే రతనాల సీమగా ఒకప్పుడే కాదు ఇప్పటికి ఆపేరు సార్దకం చేసుకుంది. అవును ఇప్పటికి సీమలో రతనాల (వజ్రాల) వేట కొనసాగుతోంది. వజ్రాలు ఎక్కడో కాదు రైతుల పంట చేన్లు, వాగులు, వంకలు, నదుల ఒడ్డున దొరుకుతాయి. సహజ సిద్దంగా ప్రకృతి వరప్రసాదంగా లభించే ఈ వజ్రాల విలువ మామూలుగా ఉండదు. లక్షల నుండి కోట్ల మేర విలువ చేస్తాయి. వర్షాలు ప్రారంభం అయ్యాయంటే వజ్రాల వేట మొదలవు తుంది. వజ్రాల దొరికితే గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తుంటారు. ఇదే అదనుగా వ్యాపారులు ఖరీదైన వజ్రాలను కారు చౌకకు కొనుగోలు చేస్తూ వజ్రాలు తెచ్చిన వారిని మోసగించడం ఈ ప్రాంతంలో అందరికి సుపరిచితమే. ఈ వర్షాకాలంలో కర్నూలు, అనంతపురం జిల్లాల లోని పలు గ్రామాలలో అనేక వజ్రాల వేట కథలు వెలుగు చూసాయి. 

తాజాగా కర్నూలు జిల్లా లోని దుగ్గలి మండలం జీ ఎర్రగుడిలో ఓ మహిళకు పొలంలో కలుపు తీస్తుండగా ఓ ఖరీదైన వజ్రం దొరికింది. ఈ వజ్రం విలువ కోటి రూపాయలకు పైగానే ఉంటుందని స్థానికంగా  ముచ్చట్లు.   దాన్ని గుట్టుచప్పుడు కాకుండా  అనంతపురం జిల్లా గుత్తికి చెందిన ఓ వ్యాపారి తక్కువ ధరకు కొనుగులు చేశాడని విషయం బయటికి పొక్కడంతో పోలీసులు కూడ ఆరా తీస్తున్నారని సమాచారం.  కోటి విలువ చేసే వజ్రానికి కేవలం  11 లక్షల రూపాయల నగదు, 2 తులాల బంగారం ఇచ్చి ఆ  వ్యాపారి వజ్రాన్ని కాజేసినట్లు చెబుతున్నారు. అయితే ఇలాంటి విషయాల్లో పోలీసుుల కూడ చేయగలిగేది ఏమి ఉండదు. ఎందుకుంటే అమ్మిన వారు కొన్నవారు ఎవరూ వాస్తవాలు వెల్డడించేందుకు ఇష్ట పడరు. ఎందుకంటే పోలీసులు రంగ ప్రవేశం చేస్తే అమ్మిన వారికి కొన్నవారికి ఇరు వర్గాలకు కూడ నష్ట దాయకమే. ఎవరైనా లిఖిత పూర్వకంగా ఫర్యాదు చేస్తే తప్ప పోలీసులు కేసు నమోదు చేసి చర్యలు తీసుకునే అవకాశాలుండవు. సందట్లో సడే మియాల లెక్క పోలీసులు కూడ అటు వ్యాపారుల నుండి ఇటు విక్రేతల నుండి ఎంతో కొంత లాభ పడుతుంటారని చెప్పు కుంటారు.

గత రెండు మూడు నెలలుగా కర్నూలు, అనంతపురం జిల్లాలలో పలు గ్రామాలలో అనేక వజ్రాల వేట కథలు ప్రచారంలో ఉన్నాయి. కర్నూలు జిల్లా ఆదోని డివిజన్ లోని జొన్న గిరి, ఎర్రగుడి, పెరావలి, గిరిగెట్ల, తుగ్గలి, మద్దికేర, ఆగ్రహారం, పగిడిరాయి. రాతన కొత్తూరు, బసినేపల్లి, గిరిగెట్ల, అమినాబాద్,మహానంది, మహాదేవపురం, తదితర గ్రామాలు వజ్రాల వేటకు ప్రసిద్ధి గాంచాయి. 

ఆంధ్ర ప్రదేశ్ లోని అనంతపురం, కడప, ప్రకాశం జిల్లాలతో పాటు తెలంగాణ లో కృష్ణనది పరివాహంలో మహబూబ్ నగర్, నల్గొండ ఒకటి రెండు ప్రాంతాలలో కూడ వజ్రాల వేట కొనసాగుతుంది.

కొద్ది రోజులక్రితం రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలంలో ఓ చదువుకున్న రైతుకు ఖరీదైన వజ్రం లభించగా దానిని లాబుల్లో పరీక్షించి నిర్దారణకు వచ్చినట్లు ఆంధ్ర జ్యోతి  ఈ వార్తను ప్రచురించింది. అయితే ఆ రైతు గుట్టుచప్పుడు కాకుండా ఈ విషయాన్ని బయటకు చెప్పలేదని చెప్పితే ప్రభుత్వం  తన భూమి ఎక్కడ లాక్కుంటుందోనని ఆందోళన చెందాడని పత్రిక రాసింది.

అమ్మే వారు కొనే వారు వజ్రాల లావాదేవీలను చాలా గుట్టుగా కొనసాగిస్తారు. మూడోకంటికి తెలియ కుండా దొరికిన వజ్రాలపై వేలం పాటలు కూడ సాగుతాయి. ఎవరు ఎక్కువ ధరకు పాడితే వారికే వజ్రం విక్రయిస్తారు. 

 శ్రీకృష్ణ దేవరాయల కాలంలో విజయ నగర సామ్రాజ్యం వజ్రాలకు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రాజ్యంగా పేరుంది.  కృష్ణ దేవరాయలు, ఆయన మంత్రి తిమ్మరుసు ఆలయాల సమీపంలో అట్లాగే నరసింహ ఆలయం సమీపంలో వజ్రాలు ఉన్నట్లు  కథలు కథలుగా చెప్పుకుంటూ వజ్రాల వేటలో అదృష్టాన్ని పరీక్షించు కుంటారు. 
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు