‘జస్టిస్‌ ఫర్‌ హేమంత్‌ ' డిమాండ్ తో ఆందోళనకు దిగిన అవంతి ఆమె స్నేహితులు
 ప్రేమ పెళ్లి కారణంగా కుల దురహంకార హత్యకు గురైన హేమంత్ కు న్యాయ చేయాలని కోరుతూ సోమవారం సాయంత్రం ఆయన భార్య అవంతి హేమంత్ సోదరుడు సుమంత్‌ వారి స్నేహితులు పలువురు ఆందోళనకు దిగారు. చందానగర్ లో  అవంతి తండ్రి లక్ష్మారెడ్డి నివాసం వైపు వారు దూసుకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డగించారు. పోలీసులు అడ్డుకోవడంపై అవంతి వాగ్వాదం జరిపారు.  అయ్ని పాలోసులు అనుమతించక పోవడంతో వారు అక్కడే రోడ్డుపై బైటాయించారు. 

 దారుణ హత్యకు గురైన హేమంత్‌కు న్యాయం జరగాలని అతని స్నేహితులు, సన్నిహితులు  ప్లే కార్డులు ప్రదర్శించారు.  సీపీఐ నారాయణ  వారికి సంఘీభావంగా నిరసనలో  పాల్గొన్నారు. కుల దురహంకార హత్యలకు వ్యతిరేకంగా 'జస్టిస్ ఫర్ హేమంత్' కార్యక్రమం చేపడుతున్నట్టు అవంతి స్నేహితులు వారు తెలిపారు.  ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా.. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 


‘జస్టిస్‌ ఫర్‌ హేమంత్‌’ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ మీడియాతో మాట్లాడారు. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేసి నిందితులకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్‌ చేశారు. తమ కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని జూన్‌ 16 తర్వాత అవంతి పోలీసులకు ఫిర్యాదు చేసిందని ఆయన గుర్తు చేశారు. హేమంత్‌ హత్యకు గురవడంలో పోలీసు శాఖ వైఫల్యం కనిపిస్తోందని అన్నారు. సభ్య సమాజం సిగ్గుపడే ఘటన జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.

హేమంత్‌ కుమార్‌ హత్య కేసులో  మ‌రో ఏడుగురు కీల‌క నిందితుల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఈ కేసులో మొత్తం  నిందితుల సంఖ్య 21కి చేరింది. వీరిలో అవంతి సోద‌రుడు అశీష్ రెడ్డి, సందీప్‌రెడ్డి స‌హా ఎ5 కృష్ణ, ఎ6 బాషా ఎ17, జగన్ ఎ18 సయ్యద్‌ల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎ1 యుగంధ‌ర్ రెడ్డి కృష్ణ‌తో హ‌త్య‌కు సంబంధించి ఒప్పందం చేసుకున్న‌ట్లు పోలీసులు గుర్తించారు. హ‌త్య త‌ర్వాత జగన్, సయ్యద్ నిందితుల‌కు స‌హ‌క‌రించిన‌ట్లు పేర్కొన్నారు.  తన భర్త హత్యలో సందీప్ రెడ్డి గూడూరు, ఆశిష్ రెడ్డి ప్రమేయం కూడా ఉందని అవంతి ఆరోపించిన సంగ‌తి తెలిసిందే. గతంలో సందీప్‌రెడ్డి హేమంత్‌ తండ్రిపై బెదిరింపులకు పాల్పడ్డాడని ఆమె తెలిపారు. ఇక మ‌రికాసేప‌ట్లో హేమంత్ సోద‌రుడు, అవంతి సైబ‌రాబాద్ సీపీ కార్యాల‌యానికి వెళ్ల‌నున్నారు. త‌మ‌కు ప్రాణ‌హానీ ఉంద‌ని అవంతి ఫిర్యాదుచేయ‌నుంది.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు