ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి అప్పులపాలవ్వొద్దు: తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల

 ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని వసతులు అందుబాటులో ఉన్నాయని.. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి అప్పులపాలు కావొద్దని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. రూ.లక్ష రూపాయలయ్యే కరోనా చికిత్సకు ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులు రూ.30లక్షల వరకు వసూలు చేయడం సబబు కాదని ఆయన ఆక్షేపించారు. విపత్కర పరిస్థితుల్లో ఇలాంటి వ్యాపార ధోరణి మంచిది కాదన్నారు. హైదరాబాద్‌లోని రెసిడెన్షియల్‌, కాలనీ అసోసియేషన్లతో మంత్రి ఈటల శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనాపై ప్రజల్లో భయం పోగొట్టేందుకు ప్రభుత్వం పనిచేస్తోందని.. ఈ విషయంలో రెసిడెన్షియల్‌ అసోసియేషన్లు కీలక పాత్ర పోషించాలన్నారు. కరోనా సోకిన వారిని వెలివేసినట్లు చూడటం మంచిది కాదని చెప్పారు. ప్రభుత్వం, ప్రజలు కలిసి పనిచేస్తే సాధించలేనిది ఏదీ ఉండదని.. కరోనాపై పోరులో రెసిడెన్షియల్‌ సంఘాలన్నీ కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు.

కరోనా పాజిటివ్‌ వచ్చిన వారు ఉండేందుకు కమ్యూనిటీ హాళ్లు, క్లబ్‌ హౌజ్‌లను ఇస్తే.. ప్రభుత్వం మందులు, భోజనం అందజేస్తుందని కాలనీ సంఘాలకు మంత్రి తెలిపారు. పట్టణ పేదలకు ఇంటి ముందుకే వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్‌ఎంసీ పరిధిలో సుమారు 200 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసిందని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. మరో 100 దవాఖానాలు త్వరలో ప్రారంభించనున్నట్లు చెప్పారు. పట్టణ ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాల్లో మొత్తంగా 145 చోట్ల కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కరోనా వైరస్‌ను వీలైనంత ముందుగా గుర్తిస్తే ప్రాణాలను కాపాడవచ్చన్న ఉద్దేశంతోనే కొవిడ్‌ పరీక్షల సంఖ్య పెంచినట్లు మంత్రి వివరించారు. కరోనా పరీక్షలు, చికిత్సల వివరాలు తెలిపేందుకు నోడల్‌ అధికారిని ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా ఈటల తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు