అఫ్జల్. .....ఆయుష్మంతుడే...కోజికోడ్ ప్రమాదాన్ని...పెనాల్టి తప్పించింది

బ్రతుకుజీవుడా..!

అఫ్జల్..
ఓ అదృష్టవంతుడు..
కొన్ని గంటల క్రితం సమస్య అనుకున్నదే అతగాడి పాలిట వరమైంది ..ఇంచుమించు మృత్యువు నుంచి కాపాడింది..
అలా జరిగినందుకు ఇప్పుడతను పండగ చేసుకుంటున్నాడు.. అల్లాకి కృతజ్ఞతలు
చెప్పుకుంటున్నాడు..
      నిజానికి మొన్న ఆరో తేదీన  కోజికొడ్ లో ప్రమాదానికి గురైన వందే భారత్ విమానంలో అఫ్జల్ దుబాయ్ నుంచి తన  సొంత జిల్లా కన్నూర్ కు రావలసి ఉంది..అంతా బాగానే జరిగింది... కాని ఫ్లైట్
మిస్సయ్యాడు..
కాలం చేసిన జాలం కాదు..
జరిమానా ఇచ్చిన నజరానా..
విమానాశ్రయానికి బాగా ముందుగానే చేరుకున్న అఫ్జల్ అన్ని కార్యక్రమాలు పక్కాగానే పూర్తి చేసుకుని బోర్డింగ్ పాస్ కూడా పుచ్చేసుకున్నాడు. సీట్ నంబర్ 18c.. ఆ సమయంలో అతను చెప్పలేనంత ఉద్విగ్నతకు లోనవుతున్నాడు.అప్పటికి ఇల్లు వదిలి చాలా కాలమైంది.కొద్ది వ్యవధిలోనే తల్లిని  చూస్తాననే ఆనందం..
అంతే కాదు..అతగాడికి ఈ మధ్యనే సంబంధం కుదిరింది.ఇంటికి వెళ్ళాక నిఖా తేదీ ఖరారు చేసుకోవడమే.పెళ్లి గురించి కలలు కంటూ విమానం రెక్కలను తనే కట్టుకుని జన్మభూమి కి ఎగిరి వెళ్లి పోదామని
ఉత్సాహపడిన అఫ్జల్ ఆశలు చివరి నిముషంలో ఆవిరి అయ్యే పరిణామం ఎదురైంది.వీసా కాలపరిమితి ముగిశాక కూడా తిరిగి వెళ్లకుండా ఉండిపోవడంతో అతను వెయ్యి దీనారాలు జరిమానా చెల్లించ వలసి ఉందని కంప్యూటర్ చూపించింది.ఆ డబ్బులు చెల్లిస్తేనే కదలనిస్తామని airport అధికారులు
మొండికేసారు.అతడి దగ్గర 500 దీనారాలు మాత్రమే ఉన్నాయి.గడ్డాలు పట్టుకోగా ఆ డబ్బులు చెల్లిస్తే విమానం ఎక్కించేందుకు అధికారులు ఒప్పుకున్నారు.అయితే మళ్లీ దుబాయ్ రానిచ్చేది లేదని షరతు పెట్టారు. కాని ఇప్పుడు చేస్తున్న దాని కంటే మంచి ఉద్యోగంతో అఫ్జల్ రెండు నెలల తర్వాత సతీసమేతంగా అక్కడికే రావాల్సి ఉంది.దాంతో చేసేది లేక మిత్రుడికి ఫోన్ చేసి డబ్బులు పంపమని అడిగాడు.ఆ మిత్రుడు మరో మిత్రుడికి డబ్బులు ఇచ్చి పంపాడు.అతడు రావడం..జరిమానా మొత్తం కట్టేయడం అన్నీ జరిగాయి.ఈలోగా పుణ్యకాలం కాస్త దాటిపోయింది.బోర్డింగ్ టైం అయిపోయి విమానం అఫ్జల్ ను  నిరాశలో వదిలేసి గగనతలంలోకి ఎగిరి పోయింది.
     కలత చెందిన అఫ్జల్ వికలమనస్కుడై తల్లిదండ్రులకు,కాబోయే సతీమణికి ఫోన్ చేసి త్వరలోనే వస్తానని చెప్పి జేబులు ఖాళీ కాగా ఫ్రెండుతో పాటు రూం కి వెళ్లి మత్తుగా పడుకుండిపొయాడు.
       తెల్లారే ఫోన్ ఒకటే మోత.. ఎత్తి అవతల మిత్రుడు చెప్పిన మాట విన్నాక అల్లా ఒక్కసారి కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యాడు.తాను ఎక్కాల్సిన విమానం జీవితకాలం లేటు.. కాదు కాదు... తానే తన
పునర్జన్మంత లేటు అని అర్థం అయింది.విమానం కోజికొడ్ లో ప్రమాదానికి గురి కావడం..అందులో ఉండాల్సిన తను లేకపోవడం కలయో..నిజమో..అల్లా లీలో..
మొత్తానికి గండం గడిచింది..అఫ్జల్ ఫైసల్ కాకుండా మిగిలిపోయాడు..
      *ఇ.సురేష్ కుమార్*
       09.08.20..10.10 pm

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు