దృక్పథం - నైపుణ్యం - విజ్ఞానం : నూతన విద్యా విధానం 2020




చాలా కాలం క్రితం విద్యావేత్త అరిందం చౌదరి తన పుస్తకంలో విజయానికి ముఖ్యంగా దృక్పథం ( A for Attitude) నైపుణ్యం ( S for Skill) స్కిల్ ఇంగ్లీష్ స్పీకింగ్ మరియు విజ్ఞానం (K for Knowledge) అంటే ASK అవసరం అని వ్రాసారు. కానీ ఇంత కాలం మన విద్యా వ్యవస్థ అన్ని స్థాయిల్లోనూ కూడా ఎక్కువ ప్రాముఖ్యత విజ్ఞానానికి అనగా థియరీకి అంతకన్నా తక్కువ ప్రాధాన్యత నైపుణ్యానికి ఇంకా అంతకన్నా తక్కువ సరిఅయిన దృక్పథానికి,ఆలోచన విధానానికి ఇవ్వడం జరుగుతూ వచ్చింది. అందుకే మన దగ్గర అత్యంత ఉన్నత స్థాయిలో పట్టభద్రులైన విద్యార్థులకు కూడా ఉపాధి దొరకక దొరికినా అందులో రాణించక పోవడం చూస్తూ ఉన్నాం.‌ఈ నిజం  పరిశోధనల ద్వారా కూడా నిరూపితమైంది. కస్తూరి రంగన్ నివేదిక ఆధారంగా ఈమధ్య ప్రవేశపెట్టిన భారతీయ నూతన విద్యా విధానం 2020 - విద్యా ప్రాముఖ్యతలను తారుమారు చేసి దృక్పథానికి ఆ తరువాత నైపుణ్యానికి ఆ తర్వాత పరిశోధనాత్మక విజ్ఞానానికి బాటలు వేసేలా ఉంది.

ఇంతవరకూ ఆరవ సంవత్సరం నుండి విద్యారంభం అయితే ఇప్పుడు మూడవ సంవత్సరం ఉండే విద్యారంభం కావాలని ఈ నూతన విద్యా విధానం చెబుతుంది. నాల్గవ ఏట విద్యా సంస్థలో చేరి ఐదు సంవత్సరాలు ప్రాథమిక విద్య, మూడు సంవత్సరాలు మాధ్యమిక,విద్య మూడు సంవత్సరాలు ఉన్నత పాఠశాల విద్య, ఆ తర్వాత నాలుగు సంవత్సరాలు డిగ్రీ చదవాలని సూచించడం జరిగింది. మన విద్యార్థి లోకానికి సమర్థవంతంగా సామర్ధ్యాలు సాంకేతిక పరంగా ఇతర సౌకర్యాలు పెరిగిన కారణంగా తక్కువ వయసులోనే ఎక్కువ విద్యను అభ్యసించగలరు అనే  భావనతో చేసిన సూచనగా కనిపిస్తుంది. ఇది బహుశా 20 శాతం ఉన్న మధ్య తరగతి, ఉన్నత తరగతి అంటే  సకల వసతులు కలిగిన ధనిక వర్గాల పిల్లలకు ఉపయోగ పడుతుందేమో కానీ, 60 నుండి 70 శాతం ఉన్న మొదటి తరం విద్యార్థులకు ఆశనిపాతం గానే ఉంది.
ప్రాథమిక విద్య ఆసాంతం మాతృభాషలోనే జరగాలని సూచన మాత్రం మంచిది. అయితే అభివృద్ధి చెందిన దేశాలు అయినటువంటి జపాన్ తదితర దేశాల్లో విద్య మాత్రం భాషలో జరగడం వల్ల వారికి అవగాహన లోతుగా జరిగి సృజనకు దారి  తీస్తుందన్న విషయం నిర్ధారించబడింది. కాబట్టి పాఠశాల విద్యలో మన భారతదేశంలో లింకు భాష అయినటువంటి ఇంగ్లీషులో బోధిస్తూ ఇతరత్రా అన్ని విషయాలు మాత్రం మాధ్యమిక స్థాయి వరకు వీలైతే ఉన్నత పాఠశాల స్థాయి వరకు మాతృభాషలోనే చేయడం జరిగితే ఇంకా బాగుంటుంది. అయితే ఇంగ్లీష్ భాష విషయంలో మాత్రం చాలా లోతైన సాహిత్యాన్ని పెట్టకుండా ఇంగ్లీష్ భాష లో మాట్లాడేందుకు వాడుక భాషకు కావలసినటువంటి వ్రాత మరియు మాట్లాడే నైపుణ్యాలు పెంచేందుకు పరిమితం చేయాలి.

మాధ్యమిక విద్య నుండే వృత్తి నైపుణ్యాలు భోదించాలనే సూచన మాత్రం ఆహ్వానించదగినది.  కానీ ఇందుకు తగిని విదంగా వృత్తి నైపుణ్యాలు నేర్పే వసతులు కలిగిన పాఠశాలలు లేవనేది వాస్తవం. ముందు పాఠ్యాంశంలో విషయాలు చేర్చి ఆ తర్వాత దానికి నెమ్మదిగా వసతులు కల్పించి అమలు చేసే విధానాలు అన్ని రంగాల్లో లాగానే విద్యా రంగంలో కూడ ఉన్నది అనేది నిజం. అందుకే ముందు వసతులు కల్పించి లేదా కల్పిస్తూ ఈ నైపుణ్యాలను నేర్పడం మంచిది అంతేకాకుండా ఈ నైపుణ్యాలు ప్రస్తుతం మన ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా ఉండేట్టు చూసుకోవడం అత్యంత అవసరం.

మన విద్యార్థుల్లో ముఖ్యంగా వెనుకబడిన తరగతుల, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు పోషక ఆహారం లభ్యత అతి తక్కువ. చాలా మందిలో రక్తహీనత, కంటి జబ్బులు ఇతరత్రా బలహీనతలు ఉన్నాయి అనే విషయం నిర్వివాదాంశం. అందుకోసం చక్కటి ఆహారం అందించాలనే సూచన మంచిదే అయినప్పటికీ దానికి చాలా పెద్ద మొత్తంలో నిధులు కేటాయించడం ఒక పారదర్శక విధానాన్ని అవలంబించి ఎలాంటి ఆటంకాలు లేకుండా అమలు పరచడం అనేది అత్యంత ముఖ్యమైన అంశంగా పరిగణించి పాటించాలి.

ఇంతవరకు ఏదైనా కోర్సులో ఒక విద్యార్థి ప్రవేశం తీసుకుంటే అది రెండు సంవత్సరాలు అని నాలుగు సంవత్సరాల గాని దానికే అంకితం కావాలని ఆ కోర్సు లో ఉన్నటువంటి అన్ని విషయాల్ని చదివితేనే పట్టభద్ర అర్హత ఇవ్వడము జరుగుతుంది .దీని ద్వారా ఈ కోర్సులో ఏదో ఒక విషయంలో అత్యంత సామర్థ్యం సంపాదించి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్న మిగతా విషయాల మీద శ్రద్ధ లేకున్నా కోర్సు ఆసాంతం చదివి ఎంతో అమూల్యమైన సమయాన్ని వృధా చేస్తూ అటు ఆ సామర్థ్యాలు అవసరం ఉన్నా సంస్థలకు తన సేవలను అందించలేక పోతున్న టువంటి విద్యా విధానానికి స్వస్తి చెప్పడం జరిగింది. ఇలాంటి లోపాన్ని సవరిస్తూ  కొత్త విద్యా విధానం సమూలమైన మార్పులు తీసుకురావడం ప్రశంసనీయం. ఇప్పుడు ఒక విద్యార్థి ఏ కోర్సులో ప్రవేశం తీసుకున్న తను ఇష్టం వచ్చిన ఆ కోర్సు సంబంధించినవి కాకుండా ఇతరత్రా కోర్సులకు సంబంధించిన విషయాలను కూడా నేర్చుకునే అవకాశం కల్పిస్తూ ఎప్పుడంటే అప్పుడు ఏ‌ నైపుణ్యానికి కానీ సబ్జెక్టుకు సంబంధించిన సర్టిఫికెట్లు తీసుకొని అనుకున్నప్పుడు  బయటికి వెళ్లి పోయే అవకాశాన్ని కల్పించడం చాలా విద్యార్థులకు స్వేచ్ఛ ఇవ్వడమే కాకుండా ఉపాధి మరియు స్వయం ఉపాధి రంగానికి కూడా ఎన్నో విధాలుగా‌ ఉపయోగ పడుతుంది.

అత్యంత వేగంగా మారుతున్నటువంటి ఉపాధి రంగ అవసరాలకు ఈ మార్పు చాలా దోహదపడుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా కంప్యూటర్ సాంకేతిక రంగంలో, సమాచార రంగంలో విద్యార్థి దశలోనే ఎన్నో ఆవిష్కరణలకు సంబంధించిన ఊహలు వచ్చినప్పటికీ విద్యార్థులు కోర్సుకు అంకితమై, ఉన్నతికి ఆలస్యం చేయబడి ఒకసారి నిర్లక్ష్యం కూడా చేయబడి, కోర్సుని మధ్యలో వదలలేక ఆందోళనకు లోనయ్యే విద్యార్థులకు ఈ విధానం ఎంతో దోహదపడుతుంది
ప్రస్తుతం వృత్తిపరమైన విద్యా సంస్థలకు అంటే సాంకేతిక విద్యా సంస్థలకు, వైద్య విద్యా సంస్థలకు, ఇతర విద్యా సంస్థలకు ప్రత్యేక నియంత్రణ విభాగాలున్నాయి. వాటన్నింటినీ కలిపి ఒకే గొడుగు కిందకు చేర్చి నియంత్రిత విధానాలను  క్రమంగా తక్కువ చేసి, ఎక్కువ స్వేచ్ఛ విద్యా సంస్థలకు , ముఖ్యంగా, విశ్వవిద్యాలయాలకు,స్వయం నియంత్రిత విశ్వవిద్యాలయాలకు,ప్రైవేట్ రంగంలో విద్యా విశ్వవిద్యాలయాలకు వారి యొక్క నాణ్యతను నిర్ధారించుకుని పరిస్థితిని కల్పించే విధానాన్ని కూడా ఆవిష్కరించింది. ఇంతవరకు నియంత్రణ సంస్థల నిర్వహణలో ఎన్నో అవకతవకలు అవినీతి చోటు చేసుకున్నాయి. నియంత్రణ వల్ల పెద్దగా విద్యాసంస్థల నాణ్యత పెరిగింది ఏమీ లేదు. కాబట్టి పోటీతత్వం కనుక ఈ స్వేచ్ఛ విధానం ద్వారా పెరిగితే అప్పుడు తప్పకుండా నాణ్యత కూడా పెరుగుతుంది. నియంత్రణ ఖర్చులు కూడా తగ్గుతాయి. కాకుంటే దేశం మొత్తానికి  విద్య ప్రమాణాలు నిర్ణయించడానికి,ఆర్థిక వనరులు సమకూర్చేందుకు, అక్రిడిటేషన్ కు (ఆమోదాలు), నియంత్రణకు నిర్దేశించబడినటువంటి సంస్థ పనితీరు మాత్రం అత్యంత పారదర్శకంగా సమర్థవంతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి.

పరిశోధనా రంగంలో ఎంఫిల్ తీసివేయడం సరైన నిర్ణయం. అంతేకాకుండా పీహెచ్డీ లలో,ముఖ్యంగా పీహెచ్డీ లను పదోన్నతులకు తప్పనిసరి చేయడం వల్ల నాణ్యత చాలా ఘోరంగా పడిపోయింది. పరిశోధనలు సృజనాత్మకంగా, లోతుగా, విస్తృతంగా జరిగేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. పరిశోధనలు దేశాభివృద్ధికి, ఉపాధి రంగాలకు, ఉత్పత్తి అవసరాలకు దగ్గరగా ఉండేలా చూస్తే బాగుంటుంది.  పదోన్నతులకు పి హెచ్ డి ని అర్హతగా తీసివేసి ఇతరత్రా నిబంధనలను నిర్ణయించడం ఉత్తమం. పరిశోధనా నిమిత్తం ఏర్పాటు చేసేందుకు నిర్దేశించిన జాతీయ పరిశోధన సంస్థ ఆచార్యులతో సహా  ఉత్పత్తి రంగాల్లో నిష్ణాతులైన వారిని,  పరిశోధన రంగంలో పేటెంట్లు పొందినటువంటి శాస్త్రజ్ఞులను కూడా సభ్యులుగా చేస్తే పరిశోధనా ప్రమాణాలు అంతర్జాతీయ స్థాయికి ఎదిగే అవకాశాలు ఉంటాయి.

ఉన్నత విద్య స్థూల ప్రవేశాల నిష్పత్తి  2035 వరకు 50 శాతం వరకు‌ పెంచాలి అనేది అవసరమైన చాలా సాహసోపేతమైన నిర్ణయం.దీన్ని నెరవేర్చడంలో ప్రభుత్వం శ్రద్ధ పెట్టడమే కాకుండా తగినన్ని‌ ఉపాధి అవకాశాలు కల్పించడంలో కూడా శ్రద్ధ వహించాలి. 

రాజ్యాంగం ప్రకారం విద్య ఉమ్మడి జాబితాలోది. కాబట్టి కేంద్రం రాష్ట్రాల సహాయ సహకారాలతో ఆమోదంతో వారి సూచనలను పరిగణలోనికి తీసుకొని ప్రతిపాదించిన విధంగా జాతీయ స్థూల ఆదాయంలో 6% వరకు విద్యారంగంపై ఖర్చు కేటాయించి నట్లయితే తప్పకుండా ఈ విద్యా విధానం లక్ష్యాలను నిర్ణయించిన సమయానికి కాకపోయినా ఎక్కువ సమయం తీసుకోకుండా సాధించుకోవడం వీలవుతుంది.

PRASAD MANDUVA
AUTHOR IS A WRITER AND ACADEMICIAN 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు