దుర్వార్తల కాలమిది!....సికాకులం పాటల కొండ వంగపండు వెళ్లి పోయారు....ఎన్ వేణుగోపాల్

(04-08-2020)



ఈరోజు మరొక పెద్ద దుర్వార్తతో తెల్లవారింది. అద్భుతమైన వాగ్గేయకారుడు, ఉత్తరాంధ్ర జనపదాన్ని అనితరసాధ్యంగా విప్లవ సందేశంగా మార్చి తెలుగు సీమకంతా పరిచయం చేసినవాడు, కవిగా, గాయకుడిగా అపార శక్తిమంతుడు, వ్యక్తిగా అమాయకుడు, స్నేహశీలి వంగపండు ప్రసాద రావు మరణించారనే విషాదవార్త తెలిసింది. పార్వతీపురంలో తన ఇంట్లో రాత్రి (03-08-2020) కూడ బాగానే మాట్లాడుతున్నారని, నిద్రలో బహుశా గుండెపోటుతో మనందరికి వీడ్కోలు పలికారు.
నావరకు నాకు ఆయన పేరూ పాటలూ 1974లో పరిచయమయ్యాయి. ఆయన అంతకు ముందునుంచే విశాఖపట్నంలో షిప్ యార్డులో పనిచేస్తూ, పాటలు రాసి పాడుతూ, విప్లవోద్యమ ప్రభావంలోకి వస్తున్నారు గాని, 1974 అక్టోబర్ లో విశాఖలో జరిగిన విరసం సాహిత్య పాఠశాలకు వెళ్లి తిరిగి వచ్చిన మిత్రుల ద్వారా విశాఖ జననాట్యమండలి లో కొత్త గాయకుడి గురించి విపరీతమైన ప్రశంసల ద్వారా ఆయన గురించి తెలిసింది. అప్పుడే వెలువడిన విరసం విశాఖ ప్రచురణ ఏరువాక, వంగపండు ప్రసాద్ పాటలు పుస్తకం వాళ్లు పట్టుకొచ్చారు. వరంగల్, హైదరాబాదు నుంచి ఆ సభలకు వెళ్లి వచ్చిన వారందరి నోళ్లలోనూ జజ్జనకరి జనారే, ఏం పిల్డో ఎల్దుమొత్తవా, జీపీ వత్తంది రండిరా, యంత్రమెట్లా నడుస్త ఉందంటే, సుత్తీకొడవలి గుర్తుగ ఉన్నా ఎర్రని జెండ ఎగురుతున్నదీ వంటి దాదాపు డజను పాటలూ, వాటిని పాడుతూ వంగపండు ప్రసాద్ అనే కొత్త గాయకుడు వినిపించిన విరుపులూ ఇంకా చెవుల్లో గింగురుమంటున్నాయి.
జీపీ వత్తంది రండిరా పాటలో “అమ్మోలె గాని” అని ఉంటుంది, అంటే ఏమిటో తెలుసా, అది ఆ సికాకులం, ఇజీనారం జిల్లాలో ఎం ఎల్ ఎ అనే ఇంగ్లిష్ మాటకు రూపాంతరం అనేది ఆరోజుల్లో అందరమూ ఒకరికొకరం చెప్పుకుంటుండిన పజిల్. అలాగే ఆయన పాటల్లోని ఎన్నో ఉత్తరాంధ్ర సొగసుకు చిహ్నాలైన మాటలను గుర్తించడం, మనసులో నింపుకోవడం... ఆ తర్వాత ఆరు నెలలకే ఎమర్జెన్సీ వచ్చి సభలు రద్దయిపోయాయి గాని, బహుశా ఆ లోగానే ఒకసారి ఆయనను హైదరాబాదులోనో, వరంగల్ లోనో ఏదో సభలో చూసినట్టు లీలగా గుర్తు.
ఎమర్జెన్సీ తర్వాత జరిగిన ప్రతి సభలోనూ ఆయనను చూస్తూ, పాటలు వింటూ, ఆయన చతురోక్తులు వింటూ ఉండడం ప్రతి ఒక్కరి అనుభవమే. 1978లో ఆయన రాసిన భూమి భాగోతం సృజనలో అచ్చువేశాం. సృజన ప్రచురణగా పుస్తకంగా తెచ్చాం. ఆ భూమి భాగోతం బహుశా కొన్ని వేల ప్రదర్శనలు జరిగి ఉంటుంది. 1990లో విరసం ఇరవయేళ్ళ మహాసభల సందర్భంగా ఆయన పాటల సంపుటం, ఎంపిక చేసిన పాటల ఆడియో కాసెట్ తయారీ జరుగుతున్నప్పుడు, ఆ పుస్తకం అచ్చుపనిలో, ప్రూఫులు దిద్దడంలో నా చెయ్యి కూడ ఉన్నదని తలచుకోవడం, ఆయనతో, ఆయన కూతురు, మంచి గాయని ఉషతో స్నేహం మరపురాని జ్ఞాపకాలు.
అలా 1974 నుంచి కనీసం 1990 ల మధ్య దాకా వంగపండు హృదయానికి దగ్గరిగా వచ్చారు. ఆ తర్వాత ఆయన జీవితంలో, ఆర్థిక సమస్యలలో, అమాయకపు రాజకీయ మలుపులలో చిక్కుకుపోయి, సంబంధం లేకుండా పోయారు గాని చలసాని ప్రసాద్ చని పోయినప్పుడు విశాఖలో ఒక్కసారి కలిశారు.
వంగపండు గారూ, మీ పాటల రచనతోనూ, గానంతోనూ లక్షలాది మంది హృదయాల్లో ఎన్నటికీ చెరగని స్థానం సంపాదించారు. మీకు మరణం లేదు. కన్నీటి నివాళి.

ఎన్. వేణుగోపాల్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు