వరంగల్ లో బిజెపి ఎంపి అరవింద్ కాన్వాయ్ పై టిఆర్ఎస్ కార్యకర్తల దాడి
నిజామాబాద్ బిజెపి ఎంపి డి అరవింద్ ఆదివారం వరంగల్ పర్యటన స్వల్ప ఉద్రిక్తకు దారి తీసింది. టిఆర్ఎస్ నేతలపై అరవింద్ విమర్శలు గుప్పించడంతో టిఆర్ఎస్ కార్యకర్తలు ఆయన కాన్వాయ్ పైన దాడికి దిగారు. రాళ్లు, కోడిగుడ్లు విసిరారు. ఈ దాడిలో పలువురు బీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఈ ఘటనకు నిరసనగా ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఇంటిని ముట్టడించేందుకు బీజేపీ కార్యకర్తలు, నేతలు బయలుదేరారు. ఈ క్రమంలో బీజేపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు బీజేపీ నేతల మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో బీజేపీ నేత రావు పద్మ  సృహకోల్పోయారు. అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పరిస్థితులు నియంత్రించేందుకు పలువురు బీజేపీ కార్యకర్తలు, నాయకులను పోలీసుల అరెస్ట్ చేశారు.
పోలీసుల సమక్షంలోనే టిఆర్ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని వరంగల్ బిజెపి ఆద్యక్షురాలు రావు పద్మ ఆరోపించారు. బిజెపి రాష్ట్ర అద్యక్షులు బండి సంజయ్  ఎంపీ అరవింద్‌పై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేయడాన్ని బీజేపీ నేత బండి సంజయ్ ఖండించారు. తెలంగాణ ప్రజలు కరోనాకు బయపడుతుంటే.. సీఎం కేసీఆర్‌కు బీజేపీ భయం పట్టుకుందని ఎద్దేవాచేశారు. బీజేపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టినా బీజేపీ ఎప్పుడు రాజ్యాంగాన్ని అతిక్రమించలేదని తెలిపారు. సీఎం కేసీఆర్, మాజీ ఎంపీ కవితపై ఎన్ని కేసులు ఉన్నాయో ప్రజలందరికీ తెలుసన్నారు. బీజేపీపై దాడులకు పాల్పడుతే సరైన సమాధానం చెబుతామని, ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని హెచ్చరించారు. పోలీస్ అధికారుల ఆధ్వర్యంలో దాడులు జరగడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పక్కా ముందస్తు ప్లాన్ ప్రకారమే దాడికి పాల్పడ్డారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని సంజయ్ చెప్పారు.

టీఆర్ఎస్‌లోని హిందూ వ్యతిరేక మూకలు తనపై దాడికి దిగినట్లుగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. వరంగల్‌లో తాను ‘ఆత్మనిర్భర్ భారత్’పై విలేకరుల సమావేశానికి హాజరయ్యానని ఈ సందర్భంలో తనపై కొంత మంది దాడికి యత్నించారని ట్వీట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా ఆయన జత చేశారు. ఒక ఎంపీపై ఇలా దాడికి పాల్పడడం సీఎం కేసీఆర్, హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డికి సిగ్గు చేటని విమర్శించారు. పట్టపగలు ఒక ప్రజా ప్రతినిధిపై అల్లరి మూకలు దాడికి యత్నించడం ఏంటని ప్రశ్నించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు