ఆ భూమి తెలంగాణదే..

(నమస్తేతెలంగాణ)-హస్తినలో రూ.18వేలకోట్ల విలువ చేసే 22 ఎకరాల స్థలం
-హైదరాబాద్‌భవన్‌కు బదులుగా కేంద్రం ఇచ్చింది
హైదరాబాద్, నవంబర్ 29: కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రక్రియను వేగవంతం చేస్తున్న నేపథ్యంలో ఢిల్లీలోని రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఆస్తులు చర్చనీయాంశమవుతున్నాయి. ఢిల్లీలోని ఆంధ్రవూపదేశ్‌భవన్‌తోపాటు దానికి సమీపంలో ఉన్న 22 ఎకరాల భూమి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. ఆంధ్రవూపదేశ్‌భవన్‌లో ఉన్న బ్లాకులు రాష్ట్రం నుంచి వెళ్లే వారికి వసతి కల్పిస్తున్నాయి.
రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు, స్పీకర్, శాసనమండలి ఛైర్మన్ ఢిల్లీకి వెళ్లిన సమయంలో అక్కడ బస చేసేందుకు అనుకూలంగా ప్రత్యేక నిర్మాణాలున్నాయి. వీటికితోడు ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు, ఇతరులు కూడా బస చేసేందుకు యాభై రెండు గదులున్నాయి. ఇవికాక,రూ.పద్దెనిమిదివేల కోట్ల విలువ చేసే 22 ఎకరాల భూమి కూడా ఉంది.
ఈ భూమి మొత్తం తెలంగాణకే చెందుతుందని టీవాదులు ప్రస్తావిస్తున్నారు. ఢిల్లీలో ఉన్న హైదరాబాద్‌భవన్‌ను కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుని దానికి బదులుగా ఈ 22 ఎకరాల భూమిని కేటాయించింది. హైదరాబాద్‌భవన్ నిజాం కాలం నాటిది కావటంతో ఆ 22 ఎకరాల భూమి మొత్తం తెలంగాణ రాష్ట్రానికే దక్కాలనే వాదన ఊపందుకొంటోంది. ఈ భూమిలో ప్రభుత్వ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున షాపింగ్ కాంప్లెక్సులు నిర్మించాలని, ఇతరత్రా వ్యాపార ప్రయోజనాలకు వినియోగించాలని గతంలోనే ప్రయత్నాలు జరిగాయి. అయితే, ఈ ఆలోచనలకు ఆదిలోనే ఆటంకాలు ఎదురయ్యాయి.

ప్రస్తుతం ఆ భూమి ఖాళీగానే ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఈ భూమి మొత్తం తెలంగాణ ప్రభుత్వానికి చెందాలని టీవాదులు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే అవకాశాలున్నాయి. న్యూఢిల్లీలో ఎంతో కీలకమైన ప్రాంతంలో ఉన్న ఈ 22 ఎకరాల భూమి విలువ ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం రూ.పద్దెనిమిదివేల కోట్లకు పైనే ఉంటుందని ఉన్నతాధికారులు అంచనా వేశారు.


Posted on November 30, 2013
0

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు