మహాసభలు.. మహా కుట్ర..!ప్రపంచ తెలుగు మహాసభలపై జిల్లా సాహితీ గళం

మాటా ఒక తూటా కన్నా ఎన్నో రెట్లు మిన్న. భాషలో వేలకొలది బాంబుల బలముందన్న అంటాడు వల్లంపట్ల. భాష ఇవ్వాళ చర్చనీయాంశమైంది. అమ్మ భాష కమ్మదనం అరిగిపోయిన వాదన అయింది. తెలుగు టెలుగై వెలిగిపోతున్నది. అచ్చం అది భారత్ వెలిగిపోతుందన్నట్టే. మసకబారిన మస్తిష్కం లాగే భాష సామ్రాజ్యవాద ఉత్పత్తి వస్తువైంది. ఉత్పత్తి కారకాలను చిదిమేసి ఉత్తుత్తి ప్రయాస రాజ్యమేలుతున్నది. ఇవ్వాళ కనీసం రెండు నిమిషాలు కూడా అచ్చమైన అమ్మభాషలో మాట్లాడటం కష్టంగా మారింది. అట్లాగేనండీ. అంటే నామోషి.

అందుకే ఓకే అనేస్తున్నాం. తప్పకుండా డెఫినెట్‌గా అంటున్నాం. పేరులో ‘నేము’ంది ఎలాపిలుస్తే ఏమిటి? బోలీ బదల్తీ హై బాత్ నహీ బదల్తీ. భావాన్ని వ్యక్తం చేయడానికి ఏ భాష అయితేంది. భావం అర్థం కావాలి కానీ అని సర్దుకుపోతున్నాం. సర్దుకుపోవడం అంటే అంత తేలిగ్గా అర్థం కావడం లేదు కాబట్టి అడ్జస్టయిపోవడం అంటేనే వీజీ కదా అనేదాకా వచ్చాం. ఇటువంటి సందర్భంలో సర్కారు అట్టహాసంగా తిరుపతి వెంకన్నసన్నిధిలో ప్రపంచ తెలుగు మహాసభల్ని నిర్వహిస్తుంది. భాషను ఒక్క కొండ కాదు ఎక్కిచ్చింది ఏడుకొండపూక్కిచ్చింది. ఇంకా ఎవరికి అందనంత ఎత్తుకు భాషను తీసుకుపోతుంది. మాతృభాషలో విద్యాబోధన అందమైన అభిలాష కానీ అది అందని ద్రాక్ష. తిరుపతి వెంకన్న ఉన్న కొండ ప్రాంతాలు ఒకనాడు తమిళదేశం (తమిళనాడు రాష్ట్రం)లో ప్రాంతం. ఇప్పుడక్కడ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తున్నట్టు? అంటే భలే వారండీ..! ముఖ్యమంత్రి సొంతజిల్లా కదా? ఆయనకు తెలుగు రాకున్నా ఫర్వాలేదు అక్కడే పెట్టాలి కదా అందుకోసం అక్కడ నిర్వహిస్తున్నారు. తెలుగు భాషకు ప్రాచీన హోదా కల్పించాలంటే వెయ్యేళ్ల చరిత్ర దానికుందని రుజువు చేయాలంటే మాత్రం కోటి లింగాలలో ఉన్న శాతవాహనుల తెనుగు పదాన్ని తెలుగుగా స్వీకరించి ఇదిగో మా తెలుగు అనొచ్చు. అట్లాగే తెలుగును బతికించి, బతుకును బతికిచ్చి మెప్పిచ్చిన కాతీయుల కళాపోషణ, భాషాపోషణ ఎవరికీ పట్టదు. నిట్టూర్చకండి ఇది మన కర్మ. కాకతీయ ఉత్సవాలకు ముష్టి కోటి పడేసి ప్రారంభం రోజు ఓ రెండు పత్రికలకు ప్రకటనలు ఇచ్చేసి ఇదిగో ఆది ఆరంభమే అన్నట్టు పోజులు కొట్టేస్తారని అంటారు కానీ మేం లేచాం ఇగ చూసుకోం డి..
అన్నట్టు మనవాళ్లు వ్యవహరిస్తున్నారు. అది వేరే విషయం. తెలుగు భాషా ఉద్ధరణకు కనీసం తమిళనాడు వలె, కర్నాటక వలె దానికొక మంత్రిత్వశాఖ ఉండాలన్న (మంవూతిత్వశాఖ పెడితే ఏం వెలగబెడతారులే అన్న విమర్శ ఉన్నా) డిమాండ్ ఎప్పటి నుంచో వస్తున్నది. మాతృభాషలో విద్యాబోధన చేయాలి అని చెప్పేవాళ్లు, గట్టిగా డిమాండ్ చేసేవాళ్లు కనీసం ఇంగ్లిష్ మీడియం స్కూళ్లల్లో తెలుగు మాట్లాడద్దు (డోంట్ స్పీక్ తెలుగు) అని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఆదేశాలు జారీ చేసి అమలు చేస్తుంటే ‘అట్లా కాదయ్యా.. తెలుగు మాట్లాడద్దని చెప్పే హక్కు నీకెక్కడిది? అని ప్రశ్నించే పరిస్థితులే లేకుండాపోయాయి. కనీసం ‘ఇంగ్లిష్‌లో మాట్లాడాలి’ అని కనీస సూచన అయినా చేయాలి కదా? అలా విద్యాశాఖ ఆదేశాలైనా జారీ చేయాలి కదా ! అటువంటి అంశాలైనా పట్టించుకోకుండా భాషోద్ధరణకు మేం నడుంకట్టామని గొప్పలు చెప్పుకునేందుకు సభలు నిర్వహిస్తున్నదనే వాదన కాలం వాడిగా సాగుతున్నది.
ఇటువంటి విషయాలు కాసేపు పక్కనపెడితే తిరుపతిలో మూడు రోజులపాటు జరుగబోయే ప్రపంచ తెలుగు మహాసభలపై తెలంగాణ నిర్దద్వందంగా బహిష్కరిస్తున్నది అని ఇక్కడి సంఘాలు, కవులు, రచయితలు సమావేశాలు పెట్టి, ప్రదర్శనలు నిర్వహించి మరీ చెబుతున్నారు. పోయేవాళ్లు పోతున్నారనుకోండి. వారికుండే పరిమితులు వారికొచ్చే కీర్తివూపతిష్టలు, వారికుండే పరిచయాలు ఇలా అనేకం ఉన్నా ‘అయినా పోయి రావలె..’అన్న ఉబలాటంతో కొంతమంది ఎవరి ఏర్పాట్లు వారు చేసుకుంటున్నారు. ఇక అసలే పోవద్దనుకుంటున్నవాళ్లు పోయేవాళ్లమీద తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓరుగల్లు సాహితీకారులు ఏమంటున్నారు? ప్రపంచ తెలుగు మహాసభలపై వారి అభివూపాయం ఏమిటీ? వెళ్లొద్దు అనేవాళ్ల వాదన ఏ స్థాయిలో ఉంది? బహిష్కరణకు పిలుపునివ్వడంలోని అసలు ఉద్దేశం ఏమిటీ? వారికి తెలుగు భాషమీద కోపమా? సర్కారు తీరుపై ఆగ్రహమా? ఇటువంటి అనేక అంశాలను జిల్లా కవి, రచయిత లోకం నిష్కర్షగా, నిర్మోహమాటంగా వారి అభివూపాయాలను వెలిబుచ్చారు. ఆయా అభివూపాయాల సమహారాన్ని నమస్తే తెలంగాణ పాఠకులకు ప్రత్యేకంగా అందిస్తున్నాం.
తెలుగు మహా సభలు ఎందుకు గుర్తొచ్చాయి..
పాలకులకు ఒక్కసారిగా ప్రపంచ తెలుగు మహాసభలు ఎందు కు గుర్తుకొచ్చాయి? తెలంగాణ ఉద్యమం ఉధృతంగా కొనసాగుతున్న సమయాన ఈ ఉబలాటం ఎందుకు కలిగింది? ఐక్యంగా ఉన్నామంటూ బయటికి చెప్పి ఏ ప్రాంత అస్తిత్వ ఉద్యమాన్ని దెబ్బతీయడానికి ఈ ప్రయత్నం..? 1975లో నిర్వహించిన తర్వాత మళ్లీ ఇప్పుడే ఎందుకు జరుపుతున్నారు.? ఇదంతా తెలంగాణ ఉద్యమం లేదని బయటి ప్రపంచానికి చెప్పడానికి సీమాంధ్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలో భాగమేనని పలువురు కవులు, కళాకారులు, రచయితలు, భాషాభిమానులు ఆరోపిస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం ఉవ్వెత్తున్న ఎగిసిపడుతున్నప్పుడల్లా సీమాంధ్ర పాలకులకు తెలుగు మహాసభలు గుర్తొస్తాయని మండిపడుతున్నారు. 1969లో అదే జరిగిందని, మళ్లీ ఇ ప్పుడూ అదే జరుగుతుందని సీమాంధ్రుల గుట్టు విప్పుతున్నారు.
December 25, 2012

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు