అక్షరాక్షరం ఉద్వేగభరితం... ‘తెలంగాణ అక్షరాళ్లు’

తెలగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో వరంగల్‌జిల్లా నిర్వహించిన పాత్ర చిరస్మరణీయమైనది. విద్యార్థులు, యువకులు,ఉద్యోగులు, సబ్బండ వర్ణాల వారు ఉద్యమంలో దూకి కల సాకారం చేసుకున్నారు. కేసీఆర్‌ ఆమరణ దీక్ష తర్వాత వరంగల్‌జిల్లా ఉద్యమక్షేత్రంగా మారిపోయింది. మానుకోట, రాయినిగూడెం, లక్ష గళగర్జన, సకలజనుల సమ్మె.. ఇలాంటి ఎన్నో ఘట్టాలు ఉద్యమ తీవ్రతను పాలకులకు చాటిచెప్పాయి. దాదాపు 170 మంది యువకిశోరాలు తెలంగాణ రాష్ర్టాన్ని స్వప్నిస్తూ ఆత్మ బలిదానాలకు పాల్పడ్డారు. ఉద్యమకారులపైన వేలాది కేసులు నమోదయ్యాయి. రోజుల తరబడి జైళ్లలోమగ్గారు. వాళ్ల త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. వరంగల్‌ జిల్లాలో అవిరామంగా సాగిన ఉద్యమంపై తెలంగాణ జర్నలిస్టుల ఫోరం(వరంల్‌ జిల్లా శాఖ) ఆధ్వర్యంలో వెలువరించిన తెలంగాణ అక్షరాళ్లువ్యాసాల సంకలనం ఉద్యమ చరిత్రలో యెన్నదగిన గ్రంథంగా గుర్తింపు పొందింది. సీనియర్‌ జర్నలిస్టు శంకర్‌రావు శెంకేసి ఈ పుస్తకానికి ప్రధాన సంపాదకుడిగా, పీవీ కొండల్‌రావు, కె.మహేందర్‌, ఎం.రవీందర్‌రావు  సహ సంపాదకులుగా వ్యవహరించారు. 
ఉద్యమంలో జర్నలిస్టులు వృత్తిగతంగా,వ్యక్తిగతంగా పొందిన అనుభవాలను ఈ పుస్తకంలో  సజీవంగా అక్షరీకరించారు. అలాగే ఉద్యమనేతలు తమ అనుభవాలను, అభిప్రాయాలను కుండ బద్దలుకొట్టారు. ఈ పుస్తకాన్ని టీజెఎఫ్‌ సారథి అల్లం నారాయణ, ప్రముఖ సినీ దర్శకుడు ఎన్‌.శంకర్‌, తెలంగాణ రచయితల నేత జూలూరి గౌరీ శంకర్‌ తదితర ప్రముఖులు 2012లో వరంగల్‌ జడ్పీ హాల్‌లో ఆవిష్కరించారు. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ఈ పుస్తకం ఎందరికో స్ఫూర్తినిచ్చింది.. ఎన్నో పుస్తకాలు రావడానికి కారణంగా నిలిచింది.  తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ అనంతరం ఈ పుస్తకం రెఫరెన్సుగా ఉపయోగపడుతోంది. అపూర్వ ఘట్టాలను రికార్డు చేసిన చారిత్రక డాక్యుమెంట్‌గా గుర్తింపు పొందింది.
తెలంగాణ తొలి దశ వైఫల్యాల వద్ద ప్రారంభమైన మలిదశ ఉద్యమంలో 2009 డిసెంబర్‌ 9 ప్రకటన ఒక పెద్ద మలుపు. ఆ ప్రకటనకు వెనుకా ముందూ జరిగిన సంఘటనలూ, ఆ సంఘటనలను బయటి సమాజానికి అందించే క్రమంలో తాము పొందిన అనుభవాలను తెలంగాణ జర్నలిస్టుల ఫోరం వరంగల్‌ జిల్లా శాఖ తెలంగాణ అక్షరాళ్లుపేరిట సంకలనంగా తీసుకువచ్చింది. తెలంగాణ ప్రాంతానికి చెందిన సమస్త వృత్తుల వాళ్లు రాష్ట్ర సాధన సమరంలో భాగస్వాములు అయిన తీరు అపూర్వం. ఈ అపూర్వ ఘట్టాలను రికార్డు చేసి తరువాత తరాలకు అందించకపోతే అది ఒక చారిత్రక తప్పిదమే అవుతుంది. అయితే వీటిని రికార్డు చేసే జర్నలిస్టులు అనుభవాలను కూడా ఈ ఘట్టాలకు జోడించి చదివితే తప్ప మలిదశ ఉద్యమ చరిత్ర మనకు సమగ్రంగా అనిపించకపోవచ్చు.  
పుస్తకంలో ఒక్కొక్క పేజీ తిరిగేస్తున్న కొద్ది మనకు ఒక్కొక్క సంఘటన కళ్లముందుకు ప్రత్యక్షమవుతుంది. తెలియకుండానే మనం ఇప్పటిదాకా జరిగిన ఉద్యమ ఘట్టాలను నెమరువేసుకోవడం ప్రారంభిస్తాం. ఫొటోగ్రాఫర్లు, కెమెరామన్‌లు, డీటీపీ ఆపరేటర్లు జూనియర్‌, సీనియర్‌ పాత్రికేయులు. ఒకటి కాదు రెండుకాదు.. చప్పన్నారు అనుభవాలు! నార్లాపురం (అటవీ ప్రాంత గ్రామం )నడిబొడ్డున జరిగిన గ్రామస్థుల ర్యాలీ నుంచి జంతర్‌ మంతర్‌ దగ్గర జరిగిన జర్నలిస్టుల ధర్నా వరకు, గల్లీ నుండి ఢిల్లీ దాకా ఒకటే తీరు. నిరసన రూపాలు మాత్రమే వేరు.
ఆకాంక్ష తెలియజెప్పే తీరులో తేడా లేదు. దాని తీవ్రత లోనూ తేడా లేదు. పిల్లల నుంచి పెద్దల వరకూ ఈ ఉద్యమ ప్రభావం పడనివాళ్లు తక్కువ. అది ఐదారేళ్లు  కూడా లేని శంకర్‌రావు శెంకేసి బిడ్డపైనే కాదుదొంతు రమేష్‌, మానుకోట నవాబ్‌ పిల్లలపైనా ఉంది. ఇంకా చెప్పాలంటే ఆ అనుభవాలను తమ వ్యాసాల్లో చెప్పకుండా వదిలేసిన అనేకుల పిల్లల పైన కూడా ఉంది. పాఠశాలలు, కళాశాలలు, పార్కులు, కూడళ్లు ఒకటేమిటి ఊరూరూ ఒక ఉద్యమ కేంద్రమే. ఈ ఉద్యమ వార్తల సేకరణలో ఎవరి అనుభవం వారిది.
 బధిరులు, అంధులు పాల్గొన్న ర్యాలీ వార్త కవరేజీ తన జీవితంలో మరచిపోలేనిదని అంటారు తంగెళ్లపల్లి కుమారస్వామి. అసలు వీళ్లు కాదు వికలాంగులు ఉద్యమంలోకి రానివాళ్లేనన్నది ఆయన చేసిన విశ్లేషణ.  తెలంగాణ కోసం మామునూరు సందీప్‌ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నపుడు రాజ్‌నారాయణకు, వేగంగా వెళ్లి రైలును ఢీకొన్న యువకుడి ఘటన దొంతు రమేష్‌కు దుఃఖం కలిగించినట్లే మన మనసులూ ఆర్ద్రమౌతాయి. ఇక గటిక విజయకుమార్‌ అయితే కేసీఆర్‌ దీక్ష భగ్నం సంఘటనను దాదాపు దృశ్యమానం చేశారు. 

వివక్ష పట్ల వ్యతిరేకత పునాదిగా నడుస్తున్న ఉద్యమంలో జర్నలిస్టుల పట్ల కూడా వివక్ష పాఠకుడికి కొత్త విషయం. తెలంగాణ జర్నలిస్టులకు భాష రాదని, రాయడం రాదని అవహేళన చేసిన వాళ్లు  ఉన్నారని దాసరి కృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తే గుంటూరులో తెలంగాణవాడు పని చేసుడేందని ఇక్కడ వుంటే గింటే మా (ఆంధ్ర) వాళ్లే ఉండాలని అక్కడి నాయకులు వెటకారంగా అనే వారని గోలి విఠల్‌ బాధపడ్డారు.
ఇక పిన్నా శివకుమార్‌ది ఇంకో కోణం. ఉస్మానియా వార్తా సేకరణలో పోలీసుల దాష్ఠీకానికి గురై కోర్టును ఆశ్రయిస్తే విరిగిపోయిన కెమెరాలకు మాత్రం ప్రభుత్వం పరిహారమిచ్చిందనీ, తన్నులు తిన్నది తెలంగాణ ఫొటోగ్రాఫర్లయితే ప్రయోజనం (కెమెరాలకు పరిమారం) పొందింది యాజమాన్యాలని అంటరాయన. 
ఇక సీమాంధ్ర మీడియా వివక్ష వల్ల జరిగిన మొదటి ఆత్మార్పణ మిర్యాల్‌కార్‌ సునీల్‌ కుమార్‌ది. తాను పని చేసే పత్రికలో తెలంగాణ వార్తలు ప్రచురింపబడకపోతే ఎంతో ఆవేదన చెందేవాడని ఆయనను ఈ రంగానికి పరిచయం చేసిన బొక్కా దయాసాగర్‌ చెప్పారు.   ఉద్యమంలో ఎంత ఐడెంటిఫై అయ్యాడో ఆయన విషాదంతమే నిరూపించిందని అల్లం నారాయణ అన్నారు. సునీల్‌ సంస్మరణ సభ సందర్భంగానే తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టుల ఫోరంఅన్న నినాదం పుట్టిందని ఆయన గుర్తు చేసుకున్నారు. 
ఇక తమ అనుభవాలను అచ్చు రూపంలోకి తీసుకురావడానికి 1969 నాటి ఉద్యమ ఘట్టాలు కావలసినంతగా రికార్డు కాకపోవడమే కారణమని సంపాదక బాధ్యులు కొండల్‌రావు, రవీందర్‌ రావు, మహేందర్‌, ప్రధాన సంపాదకుడు శంకర్‌రావు ప్రారంభంలోనే చెప్పారు. ఆ కొరత కొంత తీర్చడానికా అన్నట్లుంది సుప్రసిద్ధ పాత్రికేయుడు వి.ఎల్‌. నర్సింహారావు వ్యాసం.   నాటి ఉద్యమ ప్రారంభానికి గల మౌలిక కారణాలను ఆంధ్రుల కుట్రలను ఆయన సుదీర్ఘంగా వివరించారు. తెలంగాణ భూముల ఆక్రమణ ఎలా జరిగిందో నిజాయితీపరులైన సంబంధిత అధికారులను వాళ్లు ఏవిధంగా వెనుకకు పంపారో కళ్లకు కట్టినట్లు వివరించారు. గుంటూరు నేత ఒకరికి ఏటూరునాగారంలో వందల ఎకరాల భూములు ఉండడాన్ని ఈ సందర్భంగా ఆయన ఉదహరించారు. 
బతుకుదెరువు కోసం ఈ ప్రాంతానికి వచ్చిన ఆంధ్రావాళ్లలో కొందరికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల విముఖత ఉందని బొక్కా దయాసాగర్‌ తన అనుభవాన్ని ఉదహరించారు. దుగ్గొండి మండలం బంధంపల్లి సెటిలర్‌ ఒకరు గ్రామంలో జరుగుతున్న చాటింపునుద్దేశించి తెలంగాణ వచ్చేది లేదు పోయేది లేదు ఏదో చేస్తాండ్రని వెక్కిరించాడన్నారు. అయినప్పటికీ సెటిలర్లు కొద్దిగ ఎక్కువగా వున్న పస్రా లాంటి ప్రాంతంలో ప్రధాన రహదారులపై ముమ్మరంగా మానవహారాలు జరగడం ఉద్యమ తీవ్రతను తెలుపుతున్నదని ఆయనే స్థిమితపడ్డారు. 
ఇలా ఎవరి వ్యక్తిగత అనుభవాలు వారికి ఉన్నప్పటికీ ఉమ్మడి అనుభవాలు అనేకం. అందులో ముఖ్యమైనవి రెండు. ఒకటి మానుకోట ఘటన అయితే రెండవది రాయినిగూడెం ఉదంతం. ఈ రెండు ఘటనల విషయంలో వీళ్లు ప్రత్యక్ష సాక్షులు, భాగస్వాములు కూడా! ఈ రెండు సంఘటనలు తెలంగాణ ఉద్యమాన్ని రెండేళ్లపాటు ప్రజల్లో సజీవంగా ఉండేటట్లు చేశాయనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. 
 జగన్‌ అనుచరగణం మానుకోటకు చేరింది మొదలు జర్నలిస్టులలో ఒకటే బాధ. ఈ సభకు ఆటంకం కలిగితే బాగుంటుందని ఆ రోజు అనుకోని విలేకరి లేడు. పీవీ కొండల్‌రావు, దొంతు రమేష్‌, జి. అనిల్‌కుమార్‌, నూర శ్రీనివాస్‌, వంశీ, దాసరి శ్రీనివాసులు, గోకారపు శ్యాం... ఒక్కరేమిటి మానుకోట అనుభవాలను ఈ పుస్తకంలో ప్రస్తావించని వాళ్లు బహు తక్కువ. 

ఇక్కడి కాంగ్రెస్‌ నాయకుల అండతో జగన్‌ అనుచరులు రైల్వే స్టేషన్‌కు సమీపించిన సందర్భంగా తలెత్తిన వాగ్వాదం, పెను వివాదం కావడం క్ష ణాల్లో స్టేషన్‌ ప్రాంతమంతా వ్యాపించడం జరిగిపోయింది. ఒక వైపు బుల్లెట్లు కురుస్తున్నప్పటికీ తమ వద్ద నున్న రాళ్లను బుల్లెట్లుగా చేసుకుని తెలంగాణ వాదులు పోరాడారని దొంతు రమేష్‌ చెప్పారు. ఈ దాడి ప్రతి దాడులతో ఎక్కడి వాళ్లం అక్కడే నతికామని  నూర శ్రీనివాస్‌ గుర్తు చేసుకున్నారు. 
పెండ్యాల కొండల్‌రావు అయితే ఇక మాకు ఏ లైవ్‌ అవసరం లేదనిపించింది..అని తృప్తిగా నిట్టూర్చారు. పరిస్థితి కొద్దిగా సద్దుమణిగిందో లేదో అప్పటి దాకా వీరులమని విర్రవీగిన వాళ్లు ప్రాణ భయంతో తోక ముడుస్తున్నప్పుడు  తెలంగాణ వాదులందరికీ మహదానందం కలిగింది. తెలంగాణ సాయుధ పోరాటంలో రజాకార్‌ మూకలపై వడిశెల రాళ్లు .. మానుకోటలో సీమాంధ్ర గూండాలపై కంకర రాళ్లు.. పోరాటంలో సారూప్యత యాధృచ్చికమే కాదు సందర్భోచితం కూడా. 
ఇక రాయినిగూడెం విషయానికి వస్తే ప్రజలతో సమానంగా పోలీసు బలగాలను మోహరించి పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని ఖర్చు చేసి రచ్చబండను నిర్వహించడం అవసరమా? ముఖ్యమంత్రి వస్తే తప్ప ఇక్కడి యంత్రాంగం సంక్షేమ పథకాలను అమలు చేయదా అన్నది తోట సుధాకర్‌కు వచ్చిన సందేహం! తెలంగాణ ఆకాంక్షను బయటపెట్టనీయకుండా వాళ్లు ఎంత అష్టదిగ్భంధనం చేసినా పోలీసుల లక్ష్యాన్ని తాము పటాపంచలు చేశామని హింగే మాధవరావు ఆనంద పడ్డారు.
 ముఖ్యమంత్రి ప్రసంగం మొదలయ్యిందో లేదో జర్నలిస్టుల గ్యాలరీ నుండి పెద్దపెట్టున జై తెలంగాణ నినాదాలు! దూడబోయిన రాకేష్‌, బొల్గం శ్రీనివాస్‌, నూర శ్రీనివాస్‌, పిన్నా శివకుమార్‌ చేతికి దొరికిన కాగితాలపై నినాదాలు రాసుకుని ముఖ్యమంత్రికి తమ నిరసనను తెలియ జేయడం దానిని కాకతీయ విద్యార్థినులు అడ్డుకోవడం, రాయినిగూడెం మహిళలు కొనసాగించడం అంతా నిమిషాల్లో జరిగిపోయింది.

రవీందర్‌రావు అభిప్రాయపడినట్లు ఇవి అపూర్వ నిరసన రూపాలు! ఉద్యమంలో భాగస్వాములు కాకపోయినట్లయితే రైటింగ్‌ ప్యాడ్‌లను నిరసన కోసం వినియోగించవచ్చననే ఆలోచన తడుతుందేమో ఒక్క సారి ఆలోచించండి.
అక్కడివారిని తట్టి లేపింది మీడియా మిత్రులేనని బొల్గం శ్రీనివాస్‌ అన్నారు. అక్కడి గ్రామ పంచాయతీలో నిర్బంధించిన విద్యార్థినులను విడిపించడంలో స్థానిక మహిళల పాత్ర అపూర్వమన్నది ఫోటో గ్రాఫర్‌ దాసరి శ్రీనివాసులు అభిప్రాయం. మంత్రి పొన్నాల కారు ముందు బైఠాయించి విద్యార్థినులను విడిచిపెట్టే వరకు అతడిని, ఆయన కోడలును కదలనీయలేదంటే వారి చైతన్య స్థాయి ఎంతో అంచనా వేయొచ్చు. తెలంగాణ ఉద్యమంలో మహిళల చైతన్యం గురించి చెప్పాల్సి వస్తే రాయినిగూడెం వహిళలతో పాటు బొక్క దయాసాగర్‌ ప్రస్తావించిన  మొగిలిచర్ల నారీమణుల దీక్షను తప్పకుండా ప్రస్తావించాల్సి ఉంటుంది.  తెలంగాణ కోసం కేవలం మహిళలే వంద రోజులకు పైగా దీక్ష చేసి  తమ సత్తా చూపారు. సాయుధ పోరాట కాలపు స్ర్తీల భాగస్వామ్యాన్ని గుర్తుకు తెచ్చే సంఘటనలివి. 
శంకర్‌రావు శెంకేసి అభిప్రాయపడ్డట్లు అపూర్వం అనితర సాధ్యంకళ్లతో చూడాలే తప్ప అక్షరాల్లో చెప్పలేని ఉద్యమంఇది. ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్‌ అన్నట్లు సానుభూతి సార్వజనీనం కావడం ఈ ఉద్యమ ప్రత్యేకతఅయితే, ఆ సార్వజనీనం అయిన ఉద్యమానికి సాక్షీభూతం కావడం ఈ పుస్తకం ప్రత్యేకత! తెలంగాణ కల సాకారమైన నేపథ్యంలో ఈ పుస్తకం ఒక చరిత్రగా, భవిష్యత్తుకు దిక్సూచిగా వెలుగొందుతుందనడంలో అతిశయోక్తి లేదు.

గుండెబోయిన శ్రీనివాస్‌


READ TELANGANAAKSHARALLU

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు