కొలువుల కొలత!

ఎక్కడెక్కడివారు.. ఎంతెంత మంది?
-పూర్తి గణాంకాలతో జీవోఎంకు సర్కారీ నివేదిక
-తెలంగాణకు అన్యాయాలపై నివేదన.. పలు కమిషన్ల సిఫారసుల ప్రస్తావన
-తెలంగాణ ఉద్యోగాల్లో తిష్ఠవేసిన లక్షన్నర మంది సీమాంధ్రులు
-విభజనతో వారికి రిపాట్రియేషన్?
హైదరాబాద్, అక్టోబర్ 22:తెలంగాణ ఉద్యోగాల్లో అక్రమంగా ఉన్న సీమాంధ్రుల సంఖ్య అక్షరాలా లక్షా నలభైవేలు! ఇది సాక్షాత్తూ ముఖ్యమంత్రి స్వయానా చెబుతున్న లెక్క! ఇవి తెలంగాణ విద్యావంతులు కోల్పోయిన ఉద్యోగాలే! సీఎంకు ముందే ఈ లెక్కలు చెప్పిన కమిటీలున్నాయి.. అక్రమాలను తేల్చిన కమిషన్లున్నాయి.. అవి చేసిన సిఫారసులున్నాయి.. రూపుదిద్దుకున్న జీవోలున్నాయి.. అవి చేరుకున్న చెత్త బుట్టలున్నాయి!తెలంగాణ నిరుద్యోగికి.. విద్యావంతుడికి మిగిలిన దుఃఖమూ ఉంది! విలీనం పేరుతో తెలంగాణ ఉద్యోగికి ఉన్న జీతాలు ఏకంగా 35శాతం తగ్గిపోయి తొలి దెబ్బ పడితే.. విలీనం తర్వాత కొద్ది కాలానికే లక్షల సంఖ్యలో సీమాంధ్రులు వచ్చి తెలంగాణ ఉద్యోగాల్లో తిష్ఠవేసిన పరిస్థితి! సాధారణ ఉద్యోగులే కాదు.. ఐఏఎస్, ఐపీఎస్‌లలోనూ అదే వ్యత్యాసం! రాష్ట్రం నుంచి 376 మంది ఐఏఎస్‌లకు గాను.. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఐఏఎస్‌లు 60 మంది ఇక్కడే పనిచేసేందుకు అవకాశాలు ఉంటే.. ప్రస్తుతం పని చేస్తున్నది మాత్రం 27 మందే! రాష్ట్రంలో 258 మంది ఐపీఎస్ అధికారులు పనిచేస్తుండగా, వీరిలో 20 మందే తెలంగాణ ప్రాంతంవారు!
ఈ లెక్కలన్నీ ఇప్పుడు తెలంగాణపై ఏర్పాటైన మంత్రులబృందం ముందుకువెళ్లాయి! తెలంగాణకు ఉద్యోగ విషయంలో జరిగిన అన్యాయాలన్నీ కేంద్రం దృష్టికి వచ్చాయి! ఆంధ్ర-తెలంగాణ విలీనంతో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుంచి ఉద్యోగులకు సంబంధించిన గణాంకాలను రాష్ట్ర ప్రభుత్వం మంత్రుల బృందానికి నివేదికల రూపంలో పంపినట్లు విశ్వసనీయంగా తెలిసింది. రాష్ట్రంలోని రెండు ప్రాంతాలలో కలిపి 9,97, 441 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, ఇందులో తెలంగాణ ప్రాంతంలో 4,03,002 మంది ఉద్యోగులుగా ఉన్నారని ప్రభుత్వం ఆ నివేదికల్లో పేర్కొన్నట్లు సమాచారం. తెలంగాణ ఉద్యోగులకోసం జీతభత్యాల రూపంలో సాలీనా సుమారు 11,451.67 కోట్లు వెచ్చిస్తున్నట్లు పేర్కొంది. వీరిలో 1,16, 838 మంది ఉద్యోగులు ఒక్క హైదరాబాద్‌లోనే పని చేస్తున్నారని ప్రభుత్వ గణాంకాలు తెలియచేస్తున్నాయి. ఏప్రిల్ 2006 నుంచి మార్చి 2013 వరకు 2,92,249 మంది ఉద్యోగ విరమణ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు తెలంగాణ పదిజిల్లాలలోని ప్రధానమైన 20 శాఖలను ప్రామాణికంగా తీసుకొని నివేదికలను తయారు చేసినట్లు తెలిసింది. ఇందుకోసం పంచాయతీరాజ్, ఇరిగేషన్, హోం, టూరిజం, ట్రెజరీ, ఇరిగేషన్, ఎడ్యుకేషన్, సాంఘిక సంక్షేమ శాఖ, హౌసింగ్, ఆరోగ్యశాఖ, అటవీ తదితర శాఖలను కూలంకషంగా అధ్యయనం చేసినట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన నివేదికలో ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ వన్ అధికారులు, గెజిటెడ్ అధికారులు, నాన్‌గెజిటెడ్ అధికారులు, రికార్డు అసిస్టెంట్స్, అటెండర్స్ లెక్కలతోపాటు ప్రత్యేకంగా సెక్ర తదితర విభాగాలకు సంబంధించిన సమగ్ర నివేదికను పంపించినట్లు తెలిసింది. బ్యూరో ఆఫ్ ఎకనామిక్స్, సెంటర్ ఫర్ గుడ్ గవ్నన్స్, సాధారణ పరిపాలనాశాఖ, ఆర్థికశాఖ, డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీస్, 133 హెచ్‌వోడీల బాధ్యులు ఇచ్చిన నివేదికలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. వీటన్నింటినీ సెంటర్ గుడ్ గవ్నన్స్ క్రోడీకరించి, విభజించి నివేదికను తయారు చేసి కేంద్రానికి పంపించినట్లు విశ్వసనీయ సమాచారం.
ఆలిండియా సర్వీసెస్ చట్టం -1951 ప్రకారం ఆంధ్రప్రదేశ్ నుంచి 376 మంది ఐఏఎస్‌లకు అవకాశం ఉండగా, తెలంగాణ ప్రాంతానికి చెందిన ఐఏఎస్‌లు 60 మంది ఇక్కడే పనిచేసేందుకు అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం వీరి సంఖ్య 27 మాత్రమే. అదేవిధంగా మొత్తం రాష్ట్రంలో 258 మంది ఐపీఎస్ అధికారులు పనిచేస్తుండగా, వీరిలో 20 మంది మాత్రమే తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు. ఈ వివరాలను సైతం పంపినట్లు తెలిసింది.
ఆరు దశాబ్దాల తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యోగుల నుండే తీవ్రస్థాయిలో నిరసనలు వెల్లు ఉద్యోగులకు జరిగిన అన్యాయాలు, అక్రమాలు, వేతన వ్యత్యాసాలు, ముల్కీ నిబంధనలు, వివిధ జీవోల ఉల్లంఘనలే ప్రాతిపదికగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌తో ఉద్యోగుల ఉద్యమాలు కేంద్ర పాలకులను ఉక్కిరిబిక్కిరి చేసిన నేపథ్యంలో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ప్రసన్న కుమార మహంతి ప్రతీ గణాంక వివరాలపైన ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు ఉన్నతాధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్లానింగ్‌శాఖ ముఖ్యకార్యదర్శి టక్కర్, బ్యూరో ఆఫ్ ఎకనమిక్స్ డైరక్టర్ శ్రీనివాసశాస్త్రి, జీఏడీ సర్వీసెస్ సెక్రటరీ, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ఈ కసరత్తులో పాల్గొన్నట్లు తెలుస్తున్నది.
కాగా తెలంగాణలో 2,92 వేల మంది రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ నెల వీరికి రూ. 500 కోట్ల పెన్షన్స్ చెల్లిస్తున్నదని నివేదికలో పొందుపరిచినట్లు తెలిసింది. ఒక్క హైదరాబాద్‌లోనే వివిధ శాఖలలో, సెక్ర కలిపి 1,04,458 పోస్టులు ఉండగా, ప్రస్తుతం 68,407 మంది పనిచేస్తున్నట్లు, 36051 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వ నివేదిక తెలియచేస్తోంది. జిల్లాల వారీగా మహబూనగర్‌లో 37,249, ఖమ్మంలో 30,559, వరంగల్‌లో 39,545, నల్లగొండలో 33,746, ఆదిలాబాద్‌లో 29,586, కరీంనగర్‌లో 33,906, నిజామాబాద్‌లో 27,113, మెదక్‌లో 26,113, రంగాడ్డిలో 28,149 మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు గణాంకాలలో పేర్కొన్నారు. శాఖాధిపతుల కార్యాలయాలు 1956లో 56 మాత్రమే ఉండగా, వీటి సంఖ్య 133 వరకు పెరిగిపోయిందని రాష్ట్ర ప్రభుత్వ నివేదిక తెలియచేస్తోంది. సీమాంధ్ర జిల్లాల నుండి డిప్యూటేషన్ సైతం గణనీయంగానే ఉన్నాయని నివేదికల్లో పేర్కొన్నారు. సెక్ర 2788 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా వీరిలో తెలంగాణ ఉద్యోగులు 460 మంది మాత్రమేనని నివేదిక తెలియచేసింది. 371-డీ ప్రకారం జిల్లాలలో 80 శాతం స్థానికులకు ఉద్యోగావకాశాలు ఉండాలన్న నిబంధన ఉన్నదని, అయితే జిల్లాలలో స్థానికేతరులు ఉన్నారని ప్రభుత్వ రిపోర్ట్‌లో పేర్కొనట్లు తెలుస్తున్నది.
ప్రత్యేకించి రాష్టం విలీనం సందర్భంగా తెలంగాణ ఉద్యోగులకు సీమాంధ్ర ఉద్యోగులతో సమానంగా వేతనాలు స్థిరీకరించడంతో అప్పటిదాకా అధిక వేతనాలు పొందిన తెలంగాణ ఉద్యోగులకు జీతాల్లో 35శాతం మేరకు కోత పడింది. ఈ వివరాలను నివేదికలో పొందుపర్చారని సమాచారం. స్టేట్ టీచర్స్ యూనియన్ 1958, ఏప్రిల్ 17న రూపొందించిన వేతన వ్యత్యాస నివేదికను ప్రాతిపదికగా తీసుకున్నట్లు తెలుస్తున్నది. జనవరి 21, 1969లో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.36, 1985 డిసెంబర్ 30న వచ్చిన 610 జీవో, సెప్టెంబర్ 21, 1973న వచ్చిన 371-డీ, రాష్ట్రపతి ఉత్తర్వులు తదితర అంశాలను ఈ నివేదికలో చర్చించినట్లు తెలిసింది. జైభారత్‌రెడ్డి కమిషన్ నివేదిక, 2001లో రిట్ పిటిషన్ నంబర్ 13458పై హైకోర్టు వ్యాఖ్యానాలు, జోన్-5, జోన్-6లపై వచ్చిన విమర్శలు, జోన్-7 పేరుతో పెరిగిన హెచ్‌వోడీల సంఖ్య, 25-6. 2001న గిర్‌గ్లానీ ఏకసభ్య కమిషన్ ఏర్పాటు, మూడు వ్యాల్యూమ్‌ల నివేదిక, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2008లో శాసనసభలో 610 పై జరిగిన చర్చలో చేసిన వ్యాఖ్యలు తదితర అంశాలన్నింటినీ ఈ నివేదికలో చర్చించినట్లు తెలిసింది. తెలంగాణకు న్యాయం చేయడానికి అంటూ తెచ్చిన 610 జీవో పేరుకే ఉంది తప్ప.. రీపాట్రియేషన్స్ జరుగలేదు. జీవో స్ఫూర్తిని దెబ్బతీస్తూ.. తెలంగాణలో నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగాలు చేస్తున్న సీమాంధ్ర జిల్లాల వారిని వెనక్కు పంపించలేదు. ఇలా దాదాపు లక్షా40వేల మంది ఉన్నట్లు అంచనా. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే వీరందరినీ తెలంగాణ నుంచి పంపించేయాల్సి ఉంటుంది.


Posted on October 22, 2013
0

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు