కాకతీయుల చెరువులు………..

కాకతీయుల చెరువులు………. అవి చాలా పెద్ద చెరువులు కావటం వల్లనే కాకతీయులు తమ శాసనాల్లో వాటిని ‘సమువూదము’లు అని వర్ణించారు.
కాకతీయ రాజులు, వారి సామంతులు-సేనానులు వ్యవసాయాభివృద్ధికి పెద్ద పెద్ద చెరువులు తవ్వించారు. వాటిని ‘సమువూదము’ లనే వ్యవహరించారు. ప్రోలసముద్రం, నామ సముద్రం, ఎరక సముద్రం, కేసరి సముద్రం, కాట సముద్రం, సబ్బి సముద్రం వంటి తటాకాల పేర్లు చూస్తే, ఆనాటి దేశ ఆర్థిక వ్యవస్థలో చెరువులకున్న ప్రాముఖ్యం అర్థమవుతది.
తటాక నిర్మాణం మహా పుణ్యకార్యంగాను, సప్తసంతానాలలో ఒకటిగాను పరిగణింపబడింది. రెండు పెద్ద కొండల మధ్యనో, గుట్టల మధ్యనో, నీటి వాలు బాగా ఉన్నచోట్లలో మట్టిగట్లు పోసి కాకతీయ రాజులు చెరువులు నిర్మించేవారు. ఇలాంటి చెరువుల కిందనే వ్యవసాయం జరుగుతూ ఉండేది. అంతేకాక, ఎవరు కట్టించిన చెరువులు వాళ్ల పేరనే ఉండేవి. ప్రోలరాజు నిర్మించింది ప్రోల సముద్రం, ఎరక సానమ్మ నిర్మించింది ఎరక సముద్రం…ఇట్లా ఆ పేర్లుండేవి.
గణపతిదేవుని ముఖ్యమంత్రి అయిన బయ్యన నాయకుని కుమారుడు జగదలముమ్మడి నాయకుడు పాకాల చెరువు నిర్మించాడు. ఈ చెరువు పరీవాహక ప్రదేశం దాదాపు 20 చదరపు మైళ్ళు. ఈ చెరువులో పుట్టిన మున్నేరు కాలువ దాదాపు 100 మైళ్ళు ప్రవహించి కృష్ణలో కలుస్తుంది. ఈ చెరువుకు 3 తూములున్నాయి. ఈ 3 తూములు 32 మైళ్ళకు నీటిని తీసుకొని పోతయి. 14-15 అంగుళాల వర్షం పడితే చెఱువు నిండుతది. ఈ చెఱువు నీటితో 10 వేల ఎకరాలు సాగవుతది.
ఓరుగల్లులోని లక్నవరం, రామప్ప చెరువులు కూడా ఇంత పెద్దవే. రామప్ప దేవాలయం కట్టించిన రేచర్ల రుద్రుడు రామప్ప చెరువును తవ్వించాడు. 83 చదరపు మైళ్ళ ప్రదేశంలోని నీరు ఈ చెఱువులో వచ్చి పడుతది. దీని ఆయకట్టు 5000 ఎకరాలు. 75 చదరపు మైళ్ల ప్రాంతంలోని నీటితో నిండే లక్నవరం చెఱువు ఆయకట్టు 3500 ఎకరాలు. కాకతీయ రాజవంశానికి చెందిన మైలాంబ బయ్యారం చెరువును నిర్మించింది. ఇవి ఈనాటికీ నిలిచి ఉన్నయి. కోవూరి బ్రహ్మయ్య 700 జైన బసదులను కూల గొట్టించి పొట్ల చెఱువును తవ్వించాడట.
ఇంతింత పెద్ద చెరువులు కావటం వల్లనే శాసనాలలో వాటిని ‘సమువూదము’లని వర్ణించారు. గణపతిదేవుని సేనాని గౌండప్ప ‘సమువూదాల గర్వాన్ని అణచివేస్తున్న’ గౌండ సమువూదాన్ని నిర్మించాడట. ఈ గౌండ సేనానియే తన యజమాని పేరున ‘ఆకాశాన్నంటే తరంగాలనే చేతులతో ఆకాశగంగను ఆహ్వానిస్తున్నట్లున్న’ గణప సమువూదాన్ని నిర్మించాడట. బాస సముద్రం కూడా గౌడప్ప నిర్మించిందేనట.
తటాకాలు, చెరువులు, కాలువలే కాక బావుల కింద కూడా వ్యవసాయం జరిగేది. ఈ విధంగా ఆనాటి నీటి వనరులు కాకతీయ సామ్రాజ్యాన్ని సస్యశ్యామలం చేశాయి. ఇప్పటికీ మన కాలానికీ ఉపయోగపడుతున్నయి.
(ఆచార్య హరి శివకుమార్ రచించిన ‘కాకతీయ వైభవము’ నుంచి…)
కాకతీయుల నాటి తెలంగాణ ఆర్థిక జీవనం
తెలుగునేల, ప్రత్యేకించి తెలంగాణ ప్రాంతం స్వర్ణయుగాన్ని అనుభవించింది కాకతీయుల కాలంలోనే.
– కాకతీయ రాజలు తెలంగాణ గడ్డమీదనే పుట్టి, పెరిగి ప్రజల కష్టసుఖాలను ఎరిగినవారు. కాబట్టి, ప్రజల కష్టాలను తీర్చి సుఖాలను పెంచే మార్గాలను ఆలోచించి, ఆచరణలో పెట్టారు. అలా ప్రజలు ఆశించిన ఫలితాలను అందుబాటులోకి తెచ్చారు.
– తొలి కాకతీయ రాజులు రాష్ట్రకూట రాజులకు సామంతులుగా సుమారుగా రెండు వందల సంవత్సరాల పాటు నకీ.శ. 973 వరకు) హనుమకొండ-వరంగల్ జిల్లా ప్రాంతాన్ని పాలించారు. మరో రెండు వందల సంవత్సరాల కాలం నకీ.శ. 1162 వరకు) పశ్చిమ చాళుక్య రాజులకు సామంతులుగా మధ్య తెలంగాణను పరిపాలించారు. ఆ తరువాత స్వతంత్ర రాజులుగా యావత్ తెలుగుదేశాన్ని సుమారు 160 సంవత్సరాలు నకీ.శ. 1323 వరకు) ఏలారు.
– కాకతీయులు వ్యవసాయం, వ్యాపారం, ద్రవ్య విధానం తదితర ఆర్థిక రంగాల్లో తెలుగునేలపై ఉన్న వనరులను ప్రజల సంక్షేమానికి వినియోగపడేటట్లు అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచారు. ఆనాటి రాతి శాసనాలు, రాగి శాసనాలు, నాణాలు, గ్రంథాలు ఈ విషయాలను స్పష్టపరుస్తున్నాయి.
డా॥ ద్యావనవల్లి సత్యనారాయణ, 94909 57078

వ్యవసాయం – చెరువులు
నాటికీ, నేటికీ వ్యవసాయం ప్రజల ప్రధాన జీవనాధారం. కాబట్టి, కాకతీయులు వ్యవసాయ భూమిని, పంటలను విస్తృతంగా అభివృద్ధి పరిచే చర్యలు తీసుకున్నారు. వ్యవసాయ భూమి పరిమాణాన్ని పెంచడానికి వారు ప్రధానంగా నాలుగు రకాల చర్యలు తీసుకున్నారు. ఒకటి: అడవులను నరికించి వ్యవసాయ యోగ్య భూములను అందుబాటులోకి తెచ్చారు. రెండు: నిరుపయోగంగా ఉన్న భూములను పోడు చేసేవారికి (వ్యవసాయం) పన్నుల రాయితీతో ఇచ్చారు. మూడు: గ్రామాలకు దూరంగా నిరుపయోగంగా ఉన్న భూములను బ్రాహ్మణులకు, పండితులకు, మంచి అధికారులకు, దేవాలయాలకు, అగ్రహారాలుగా నగామాలు), కానుకలుగా, వృత్తులను నిర్వహించుకోవడానికి ఇచ్చి ఆయా భూములను వ్యవసాయం యోగ్యంగా మార్చేలా చేశారు. నాలుగు: రాజ్యంలోని భూమి అంతటికీ రాజే యజమాని కాబట్టి, రాచపొలాలను సగం ఆదాయాన్ని చెల్లించే రైతులకు (అర్థసీరులు) కౌలుకు ఇచ్చారు. చివరి పద్ధతిని ‘అడపగట్టు’ అనేవారు.
కాకతీయులు చేపట్టిన పై సంస్కరణల వల్ల చెన్నూరు, మంథని, ఏటూరు నాగారం, పాలంపేట, పాకాల, కొత్తగూడ, ఎల్లందు, బయ్యారం, అమ్రాబాద్, శ్రీశైలం ప్రాంతాల్లో కొన్ని లక్షల ఎకరాలు భూమి కొత్తగా సాగులోకి వచ్చినట్లు, ఆయా ప్రాంతాల్లోనే కొన్ని వేల గ్రామాలు ఏర్పడినట్లు, ఆయా ప్రాంతాల్లో దొరికిన శాసనాలు విశదం చేస్తున్నాయి.
కొత్తగా సాగులోకి వచ్చిన భూములకు, రావలసిన భూములకు సాగునీరు అందించడానికి కాకతీయులు కొన్ని వేల చెరువులు తవ్వించారు. ప్రత్యేకించి తెలంగాణలో కాకతీయుల కాలంలో తవ్వించిన చెరువు లేని గ్రామం లేదంటే అతిశయోక్తి కాదు.
మొదటి ప్రోలరాజు నకీ.శ. 1052 – 1076) తన బిరుదు ‘అరిగజ కేసరి’ పేరుతో వరంగల్ జిల్లా మహబూబ్‌బాద్ దగ్గర కేసరి సమువూదాన్ని తవ్వించాడు. అతని వారసుడు రెండవ బేతయ (1076 – 1108) మరో కేసరి సముద్రం, సెట్టి కేరెయ అనే చెరువులను నిర్మించాడు. రుద్రదేవుని మంత్రి గంగాధరుడు ఈనాటి హన్మకొండ బస్టాండ్ దగ్గరి చెరువుని కట్టించాడు.
గణపతిదేవుని కాలంలోనైతే (1199 – 1262) ఆయన బంధువులు, మంత్రులు, అధికారులు ఎందరో ఎన్నో చెరువులను తవ్వించారు. ఉదాహరణకు, ఆయన మంత్రి బయ్యన కొడుకు జగదాలు ముమ్మడి పాకాల చెరువును తవ్వించాడు. అది ఇప్పటికీ ఏటా 9,037 ఎకరాల భూమికి సాగు నీటిని అందిస్తున్నది. గణపతిదేవుని కింద మాండలిక పరిపాలకుడైన రేచర్ల రుద్రుడు రామప్ప చెరువు నిర్మించాడు. ఆ చెరువు ఇప్పటికీ 4,350 ఎకరాల భూమికి నీరందిస్తున్నది. ఆ చెరువు గట్టు తూర్పు కొసనున్న దేవాలయ మంటప స్తంభానికి చెక్కిన మూడు స్త్రీ మూర్తుల శిల్పాలు ఆ చెరువు ద్వారా వృద్ధి చెందే పాడిపంటలను సూచిస్తున్నాయి.
గణపతిదేవుని సోదరి మైలాంబ ఖమ్మం జిల్లాలో బయ్యారం చెరువును తవ్విస్తే, అతని మరో సోదరి కుందవ్వ అదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో తన పేర రెండు కుంద సమువూదాలను తవ్వించింది. అతని భార్య మైలమ కూడా కరీంనగర్ జిల్లాలో కటుకూరు చెరువును నిర్మించింది. గణపతిదేవుని సేనాని మల్యాల చౌండ కొండపర్తిలో ‘సమువూదాల గర్వాన్ని అణిచివేసే’ చౌండ సమువూదాన్ని నిర్మించాడు. ఈ చౌండ సముద్ర ప్రస్తావనలో మనకు ఆనాటి చెరువులను ‘సమువూదాలని’ ఎందుకు పిలిచేవారో స్పష్టమవుతున్నది.
చెరువులను తవ్వించడం ఆనాడు సప్త సంతానాల్లో ఒకటైన పుణ్యకార్యంగా ప్రచారంలో ఉండేది. కాబట్టి, రాజులతో పాటు చేతనైన వారెవరైనా చెరువులను తవ్విస్తుండేవారు.
చెరువులతో పాటు ఇతర సాగునీటి ఆధారాలు కూడా కాకతీయుల కాలంలో మనుగడ సాగించినట్లు శాసనాధారాలున్నాయి. అలా మనకు కుంటలు, ఊటకాలువలు, ఏతం, మోట, రాటనాలు, మనుషులే లాగే కప్పీ రాట్నాల ప్రస్తావనలు కన్పిస్తాయి. ఇల్లంతకుంట (కరీంనగర్ జిల్లా) ఒక కుంటకు ఉదాహరణ. ఊట కాలువలకు ఉదాహరణలుగా గొనుగు కాలువ, బొమ్మకంటి కాలువ, ఉత్తమ గండ కాలువ, ఉటుం కాలువ, చింతల కాలువ తదితరాలను పేర్కొనవచ్చు.
కరీంనగర్ జిల్లా ధర్మవరం మండలంలో ఉండే గొనుగు కాలువమీద హక్కు విషయమై నేఢవూరు, చామనపల్లి, కటిక్యోలపల్లి గ్రామస్తుల మధ్య వివాదాన్ని పరిష్కరించడానికి ఆనాటి రాజు గణపతిదేవుడు రెండుసార్లు వారి వద్దకు అధికారులను పంపి, అన్ని కుల సంఘాల అభివూపాయాలను (ండుసార్లు) తెలుసుకుని, ప్రాడ్వివాకుని (న్యాయమూర్తి) సమక్షంలో తన తుది తీర్పు ప్రకటించి, ఆ కాలువ మీద చామనపల్లి మహాజనులకు బాహ్మణులకు) హక్కును కల్పించి, ఆ విషయాన్ని రాగి శాసన రూపంలో భద్రపరచడం జరిగిందీ అంటే ఆనాటి రాజులు ప్రజల సంక్షేమం, అభివూపాయాల పట్ల ఎంత శ్రద్ధ తీసుకునేవారో అర్థమవుతుంది.
సాగునీటి కల్పన అనేది ఆనాడు దానంగా, వ్యాపారంగా కూడా చెలామణిలో ఉండేది. ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తూ దేవుడికి దానంగా చెరువులను, కుంటలను తవ్వించడం గురించి పైన తెలుసుకున్నాం. చెరువులు, కుంటలు, కాలువలు ప్రైవేటు వ్యక్తులు కూడా తవ్వించి లేదా మరమ్మత్తులు చేసి రైతులకు సాగునీటిని అందించే పద్ధతి కూడా కాకతీయుల కాలంలో అమలులో ఉండేది. లబ్ధి పొందిన రైతులు మరమ్మత్తుదారుకు తాము పండించిన ప్రతి ధాన్యానికి ఒక కుంచం చొప్పున చెల్లించేవారు. అలా చెల్లించడాన్ని ‘పుట్టికుంచం’ లేదా ‘చెరువు కుంచం’ అనేవారు. ఈ పద్ధతిని ‘దశవంధ’ అనేవారు. చెరువు కింది రైతులందరూ చెరువు కుంచం చెల్లించక అందుకు బదులుగా ఉమ్మడిగా మరమ్మత్తుదారుకు దశంవధ మాన్యం (కొంత భూమి) కూడా ఇవ్వడం అమలులో ఉండేది. పుట్టి …అంటే 80 కుంచాలు… పండించుకునేందుకు సాగునీరును నిరంతరాయంగా కల్పించే ఏర్పాటు చేసి, కేవలం ఒకే కుంచం పన్ను వసూలు చేసుకునేట్లు చూడడం ఆనాటి ప్రభుత్వ సంక్షేమ యంత్రాంగానికి ఒక మచ్చు తునక.
ఆనాటి భూముల్లో అడవులు, పచ్చిక బయళ్ళు పశువుల మేతకు, వంట చెరుకు, వ్యవసాయ పనిముట్లు, వన మూలికలు తదితర అవసరాలకు ఉపయోగపడగా, అచ్చుకట్టు భూముల్లో వ్యవసాయం చేసేవారు. అచ్చుకట్టు భూముల్లో ఈనాటి లాగే మెట్ట భూముల్లో వర్షాధార పంటలు పండేవి. మాగాణి భూముల్లో నీటి నేలలు, తోంటలు అని రెండు రకాలుండేవి. నీటినేల అంటే వరి పండించే నేల. తోంట అంటే తోట. తోటలో ఈనాటి మాదిరిగానే కూరగాయలు, కొన్ని రకాల వాణిజ్య పంటలు, పండ్లను పండించేవారు.
రాజ్యంలోని భూములన్నిటికీ రాజు యజమాని కాబట్టి, రైతులు అన్ని రకాల భూములపై శిస్తుపన్ను చెల్లించేవారు. అడవులు, పచ్చిక బయళ్ళపై పుల్లరి, ఉప్పు మడులపైన అడ్డవట్టు సుంకం చెల్లించేవారు. మెట్ట, మాగాణి భూముల పైన చెల్లించే పన్నును ‘అరి’ అనేవారు. దీనిని ధనం, ధాన్యం, వస్తురూపాల్లో శిస్తు చెల్లించడం అమలులో ఉండేది. ఒక నిర్ణీత భూమిలో పండిన పంటను ‘సిద్ధాయం’ అనేవారు. ఈ సిద్ధాయంలో ఒక పుట్టి ధాన్యానికి ఒక బంగారు (పహిండి) నాణాన్ని చెల్లించేవారు. దాన్ని ‘పుట్టి పహండి’ లేదా ‘పుట్టిమాడ’ అనేవారు. ‘సిద్ధాయం’ పెరిగితే ప్రభుత్వానికి చెల్లించవలసిన పుట్టిమాడల సంఖ్య పెరుగుతుందన్న మాట. నీరు నేల సిద్ధాయం మీద చెలించే పన్నును ‘గడ్డుగమాడ’ అనేవారు.
శిస్తును ధాన్యరూపంలో వసూలు చేసే సందర్భంలో తూము న్యాయకాండ్రు పంటను కొలిచేవారు. తాసు న్యాయకాండ్రు తూచేవారు. ఒక పుట్టి పంట పండితే ఒక తూము వసూలు చేసేవారు. దీనిని ‘పుట్టితూము’ లేదా ‘రాసితూము’ అనేవారు. ‘పుటి’్ట అంటే 80 కుంచాలు, ‘తూము’ అంటే 4 కుంచాలు. కాబట్టి, భూమి శిస్తు పంటలో 5 శాతం ఉండేదని చెప్పవచ్చు. పండిన పంట ధాన్యం కాక మరోలాగా కొలిచే పంట అయితే, ఆ పంటలో కొంత భాగాన్ని అది పండిన రూపంలోనే శిస్తుగా చెల్లించేవారు. అలాంటి వస్తురూప శిస్తును ‘పంగ’ లేదా ‘పంగము’ అనేవారు. కొలుచు, కొలుగు, పఱ అనే పదాలు కూడా అదే అర్థంలో శాసనాల్లో కనిపిస్తున్నాయి.
పంగను సరైన సమయంలో, సరైన విధంగా చెల్లించకపోతే అందుకు శిక్షగా ‘పంగతప్పు’ అనే పన్నును చెల్లించవలసి ఉండేది. పంగము రూపంలో వసూలైన పంటను వసూలు చేసిన ‘ఆయకాండ్రు’ అనే అధికారులు అదే రోజు అంగట్లో అమ్మేందుకు కూడా రైతే అమ్మకపు పన్ను, కొనేవాడు ‘విల్చుపన్ను’ కట్టేవారు. ఈ రెండు పన్నులను ‘అమ్మడికాలు’ అనేవారు.
పై పన్నులతో పాటు కాంపులు (రైతులు) రాజుకు కానిక, దరిశనము అనే పన్నులను చెల్లించేవారు. రాచపొలాలను కౌలుకు తీసుకోవడం కోరు వ్యవస్థ. అలాంటి పొలాల్లో పండిన పంటలో ఆర్థాయం రాజుకు చెల్లించవలసి ఉండేది. పంట మంచిగా పండినప్పుడు చెల్లించే పన్నును ‘వెన్నుపన్ను’ అనేవారు. పొలానికి నీరు అందించినందుకు చెల్లించవలసిన పన్ను కాలాన్ని బట్టి పండిన పంటలో ఆరవ భాగాన్నుండి సగభాగం వరకు ఉండేది. ఒక్క రాజుపోలం పైనే సగభాగం పన్ను ఉండేది. మిగతా భూములపై సాధారణంగా ఐదవ భాగం పన్నుగా ఉండేది. ప్రభుత్వానికి అందిన పన్ను తిరిగి ప్రజల సంక్షేమం కోసం చెరువులు, కుంటలు, కాలువలు తవ్వించడం తదితర ప్రజోపయోగ పనుల నిర్మాణం కోసమే వినియోగించబడేది. పైగా ఆనాటి రాజులు అగ్రహారాలు, వృత్తులు, మాన్యాలు వరుసగా పండితులు, దేవాలయాలు, దేశ సేవకులకు ఉచితంగా ఇచ్చి, వాటిపై పన్ను రాయితీ కల్పించేవారు.
కొత్తగా సాగులోకి వచ్చిన భూములకు, రావలసిన భూములకు సాగునీరు అందించడానికి కాకతీయులు కొన్ని వేల చెరువులు తవ్వించారు. ప్రత్యేకించి తెలంగాణలో కాకతీయుల కాలంలో తవ్వించిన చెరువు లేని గ్రామం లేదంటే అతిశయోక్తి కాదు.
అలనాటి వైభవం
ఆనాటి పంటలు ఎలా ఉండేవో అప్పటి కవి ఒకరు కింది శ్లోకంలో ఇలా వర్ణించారు.
ఆంధ్రాస్సంతి గరీయాంసః కాంచన ఛాయ శాలయః
యథాహాటక స్యూతస్య కోటరారత్న శాలిః
అంటే…ఆంధ్రదేశపు భూములు పండిన వరి చేలతో బంగారు మేరు పర్వతం లాగా మెరుస్తున్నాయని అర్థం. వరితోపాటు ఇతర పంటలు కూడా బాగా దిగుబడి నిచ్చేవని సాహిత్య ఆధారాలు తెలియజేస్తున్నాయి.
ఇవాళ తెలంగాణలో పండిస్తున్న అన్ని ఆహార పంటలు, పప్పు దినుసులు, వాణిజ్య పంటలన్నింటినీ కాకతీయుల కాలంలో పండించేవారు. ప్రభుత్వమే కాకుండా ప్రైవేటు వ్యక్తులు కూడా భూమిని కౌలుకిచ్చేవారు. దానిని ‘తాంబూల స్రవ’ అనేవారు. ఆ సమయంలో తాంబూలాలను రైతులు పరస్పరం మార్చుకునే వారేమో!
కాకతీయుల విధానాల వల్ల ప్రజల ఆదాయం మళ్ళీ ప్రజల సంక్షేమానికే వినియోగించబడి ప్రజలు శాంతి సౌభాగ్యాలతో విలసిల్లారు. కాని, ఆ రాజులు మరింత ధనవంతులు కాలేదు. విలాసాలకు మరుగలేదు. తద్వారా దేశ వినాశనానికి ఒడి కట్టలేదు.
కాకతీయుల కాలం నాటి వృత్తులు
వ్యవసాయానికి అనుబంధమైనవి కొన్ని, నిత్యావసర వస్తు సేవలను అందించేవి కొన్ని కాకతీయుల కాలంలోనూ ఉండేవి. అన్ని వృత్తుల్లో కుటీర పరిక్షిశమ స్థాయిలో ఉన్నవి నేత వృత్తి, గానుగ వృత్తి, లోహ వృత్తి. తిండి తరువాత అత్యవసర వస్తువులు బట్టలు. కాబట్టి, బట్టలు నేసే సాలెలకు కాకతీయ రాజ్యమంతటా ప్రముఖ స్థానం ఉండేది. ఒక్క ఓరుగల్లు పట్టణంలోనే పద్మశాలీలు 6,500ల మంది, పట్టు నేసే సాలెలు 2,500 మంది ఉండేవారట. పట్టు బట్టలకు విలువ ఎక్కువ. కాబట్టి, పట్టు సాలెలకు కూడా సమాజంలో విలువ ఎక్కువగా ఉండేది. వారు నేసే పట్టు బట్టలు ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతి అయ్యేవి. వారి నైపుణ్యాన్ని రుద్రమదేవి కాలంలో నకీ.శ.1262-1289) తెలుగుదేశాన్ని సందర్శించిన వెనిస్ యాత్రికుడు మార్కోపోలో ఇలా పొగిడాడు. ‘‘వారు (పద్మశాలీలు) సాలెపురుగు జాల వలె వుండే అతి విలువైన సన్నని వస్త్రాలను నేసేవారు. వాటిని ధరించనొల్లని రాజు, రాణి ప్రపంచంలో లేరు’’.
ఇదే మార్కోపోలో ఆనాడు తెలుగునాట వజ్రాల పరిక్షిశమ కూడా ఉండేదని, ప్రకాశం జిల్లా దేశీయక్కొండ (నేటి మోటుపల్లి) రేవు నుండి వజ్రాలను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసేవారని రాశాడు. పాకాల చెరువు గట్టు మీదున్న ఇనుప నాగలిని బట్టి, తెలంగాణలో ఇనుప పరిక్షిశమకు సంబంధించి కనిపిస్తున్న ఆనవాళ్ళను బట్టి, సాహిత్యంలో ఇనుప వస్తువులకు సంబంధించి కనిపిస్తున్న ప్రస్తావనలను బట్టి కాకతీయుల కాలంలో ఇనుప పరిక్షిశమ కూడా బాగా వర్ధిల్లిందని చెప్పవచ్చు.

(నమస్తే తెలంగాణ సౌజన్యంతో)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు