అన్ని రంగాల్లోనూ….వెనుకబాటే..

(నమస్తేతెలంగాణ)

-వివక్ష మోసినతెలంగాణ వాస్తవ చిత్రం
-జీవోఎంకు చేరిన వెనుకబాటు ప్రాంతాల జాబితా
-పేదరిక సూచీలో అగ్రస్థానం
-అక్షరాస్యత, అభివృద్ధిలో అధమం
-9 జిల్లాలు దారిద్ర్యనికి నకళ్లు

హైదరాబాద్, అక్టోబర్ 20: తెలంగాణ వెనుకబాటుతనం ఇపుడు అధికారికంగా వెల్లడైంది. ఇక్కడ ప్రజల దారిద్ర్యానికి, దైన్యానికి అధికారిక రాజముద్ర పడింది. గత కొంతకాలంగా తెలంగాణలోనే అభివృద్ధి జరిగిందంటూ దబాయిస్తూ వచ్చిన వారి నోళ్లకు ఇక మూతపడనుంది. కట్‌పేస్ట్ కమిటీ విహార యాత్రలు చేసి ఇచ్చిన నివేదికలోని డొల్లతనం కూడా స్పష్టంగా తేటతెల్లమైంది. రాష్ట్ర ఆవిర్భావంనుంచే ఈ ప్రాంతంపై చూపిన వివక్ష, తద్వారా జరిగిన అన్యాయం అధికారులు సేకరించిన లెక్కల సాక్షిగా బట్టబయలైంది. ఈ మేరకు గణాంకాలతో కూడిన నివేదిక ఢిల్లీలో రాష్ట్ర విభజన అంశాన్ని పర్యవేక్షిస్తున్న మంత్రుల బృందం (జీవోఎం) ముందుకు సాధికారికంగా చేరింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్రం ఏర్పాటు చేసిన ఈ జీవోఎం తన విధి నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి 11 అంశాల్లో నివేదికలు కోరిన విషయం తెలిసిందే. వీటిలో రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల జాబితా అంశం కూడా ఉంది. జీవోఎం ఆదేశం మేరకు సర్కారు కసరత్తు చేసి ఈ నివేదికను రూపొందించి పంపించింది.
గ్రామీణాభివృద్ధి, పేదరిక నిర్మూలనా సంస్థ(సెర్ప్), రెవెన్యూ, ప్రణాళిక, అర్థగణాంక శాఖలు వెనుకబాటుకు గీటురాళ్లుగా తీసుకునే అంశాల ఆధారంగా నివేదికలను రూపొందించాయి. వీటి ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భవించిననాటినుంచే తెలంగాణపై నిర్లక్ష్యం ఆరంభమైందని ఉద్యమకారులు ఇంతకాలం చేస్తూ వచ్చిన వాదనలు నిజమేనని తేలింది. తెలంగాణలో తలసరి ఆదాయం, ఉపాధి అవకాశాలు, వాణిజ్య, విద్యారంగాల్లో వెనుకబాటుతనం రాజ్యమేలిందని వాస్తవ గణాంకాలు, వాటి శాతాలు ధృవ పరిచాయి. చివరికి కూలీల నిజ ఆదాయంలో కూడా తెలంగాణ, కోస్తాంధ్రతో పోలిస్తే బాగా వెనుకబడి ఉందనేది నివేదికలో వెల్లడైన సత్యం. తెలంగాణలోని 6 జిల్లాల్లో నిత్యం కరువేనని, 9 జిల్లాలు వెనుకబాటుతో సతమతమవుతున్నవేనని, 9 జిల్లాల్లో సింహభాగం వర్షాధార వ్యవసాయంపైనే ఆధారపడ్డాయని, స్వయం ఉపాధి, మానవ వనరుల అభివృద్ధిలో మెజారిటీ జిల్లాలు క్షీణత నమోదు చేశాయని, అక్షరాస్యత, ఆత్మహత్యల పరంపర అనేక జిల్లాల్లో చోటు చేసుకున్నదనేది ఈ నివేదిక సారాంశంగా చెబుతున్నారు.
అసంబద్ద వాదనలకు చెల్లుచీటి..
వాస్తవానికి తెలంగాణ వెనకబాటును గతంలో అనేకసార్లు అనేక జాతీయ కమిషన్‌లు, కమిటీలు, పరిశీలక బృందాలు ధృవీకరించాయి. ఈ ప్రాంతపు దారిద్ర్యాన్ని, పేదరికాన్ని, ప్రజల దైన్యాన్ని సవివరంగా చెప్పాయి. అయితే అనేక సందర్భాల్లో హైదరాబాద్, దాని చుట్టుపక్కల పారిశ్రామిక సామ్రాజ్యపు ఆదాయాలను కలిపి చూపి తెలంగాణ అభివృద్ధి చెందిందని సీమాంధ్ర సర్కారు, అక్కడి నాయకులు నోరు మూయించేందుకు యత్నించారు. ఆకుకు పోకకు అందని గీటు రాళ్లు ముందు పెట్టి అభివృద్ధి జరిగిందని దబాయించారు. ప్రాజెక్టులు కట్టక, నీళ్లివ్వక భూములు ఎండబెట్టి కరెంటు మోటర్లపై ఆధారపడే పరిస్థితి కల్పించి విద్యుత్ వాడకాన్ని చూపి అభివృద్ధి అన్నారు. రైతులు ఉన్నదంతా తాకట్టు పెట్టి డజన్ల కొద్ది వేసుకున్న బోర్లకింద వ్యవసాయం పెరిగితే ఆ అభివృద్ధిని సీమాంధ్ర సర్కారు తన ఖాతాలో వేసుకుని సమానాభివృద్ధి అంది. సీమాంధ్రలో చేపల చెరువుల విస్తరణ, ఫాం ఆయిల్ సాగు వల్ల వరి విస్తీర్ణం తగ్గిపోతే కరీంనగర్ వరి విస్తీర్ణంతో పోల్చి తెలంగాణలో వరిసాగు ఎక్కువనే దివాళాకోరు వాదనలు చేసింది.
ఎన్నో ఆధారాలు, ధ్రువీకరణలు..
వాస్తవానికి ఇప్పటికే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు వేసిన అనేక కమిటీలు తెలంగాణ వెనుకబాటుతనాన్ని ప్రముఖంగా ప్రస్తావించాయి. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కమిటీ పేరుతో 1981లో కేంద్రం వేసిన చక్రవర్తి కమిటీ తెలంగాణ మొత్తానికి మొత్తం వెనుకబాటుత నం, అసమానతలకు అద్దం గా నిలిచిందని పేర్కొంది. 1970లో కరువు ప్రాంతాల అభివృద్ధి కార్యక్షికమం (డీపీఏపీ) కింద వేసిన కమిటీ కూడా తెలంగాణలో 6 జిల్లాలు తీవ్ర కరువు కోరలతో అనునిత్యం ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని తేల్చింది. ప్రాంతీయ అసమానతలను అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2005లో ఏర్పాటు చేసిన కమిటీ దేశంలో 170 మండలాలను తన నివేదికలో గుర్తించింది.
అందులో హైదరాబాద్, రంగారెడ్డి మినహా మిగతా అన్ని తెలంగాణ జిల్లాలున్నాయి. సీమాంధ్రకు చెందిన ఒక్క జిల్లా కూడా లేదు. అత్యల్ప మానవ వనరుల అభివృద్ధి, సౌకర్యాల కల్పనలో క్షీణత, వర్షాలపై ఆధారపడిన పంట పొలాలు వంటి అంశాలపై కేంద్రం 2007లో (బీఆర్‌జీఎఫ్) వెనుకబడిన జిల్లాల గ్రాంట్ నిధులను ప్రవేశపెట్టింది. ఇందులో రాష్ట్రంలోని 13 జిల్లాలకు చోటు దక్కగా వాటిలో 9 జిల్లాలు తెలంగాణవే. పేదరికం, వెనుకబాటు తనం అంశంపై చేపట్టే మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో హైదరాబాద్, రంగారెడ్డి మినహా మిగతా అన్ని తెలంగాణ జిల్లాలు ముందు వరుసలో న్నాయి. స్వయం ఉపాధి రంగాలు, వేతన వివరాలను ప్రాంతాల వారీగా పరిశీలించేందుకు 2007లో కేంద్ర ప్రణాళికా సంఘం జరిపిన సర్వేలో దేశవ్యాప్తంగా 150 జిల్లాలను వెనుకబడినట్టు గుర్తించగా అందులో తెలంగాణలోని 10 జిల్లాలున్నాయి. సీమాంధ్రనుంచి ఒకేఒక్క జిల్లాకు చోటు దక్కింది.
దేశవ్యాప్తంగా రైతుల ఆత్మహత్యలపై కేంద్రం ప్రకటించిన నివేదిక ప్రధానంగా 4 రాష్ట్రాల్లోని 31 జిల్లాల్లో ఆత్మహత్యలను గుర్తించింది. వీటిలో హైదరాబాద్ మిన హా మిగతా 9 జిల్లాలున్నాయి. 12వ పంచవర్ష ప్రణాళికలో ప్రాంతీయ అసమానతలపై ప్రణాళికా సంఘం పేర్కొన్న వివరాల్లో ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాలను తీవ్ర దుర్భిక్ష జిల్లాలుగా, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, మ హబూబ్‌నగర్, నిజామాబాద్‌లు అక్షరాసత్యలో బాగా వెనుకబడిన ప్రాంతాలుగా గుర్తించారు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు