నిన్నటి చరితగా నిర్మల్‌బొమ్మ! -నకాషీల కడుపు నింపని ‘ఖిలోనా’ వారసత్వ కళ

(నమస్తేతెలంగాణ)-తగ్గిపోతున్న కళాకారులు.. ఉన్నవారూ ఇతర వృత్తులకు
-కనీస కూలీ గిట్టని వైనం.. సర్కారు ఆసరా కరువు
-పొనికి కర్రకు సవాలక్ష ఆంక్షలు
-సీమాంధ్రుల పాలనలో శతాబ్దాల కళకు తీరని ద్రోహం
-కొండపల్లి బొమ్మకు కొండంత ప్రోత్సాహం
-నిర్మల్ పెయింటింగ్స్‌పై నిలు నిర్లక్ష్యం
ఎక్కడో ఆదిలాబాద్ అడవుల్లో గట్టిగా గాలి వీస్తే విరిగిపోయే తేలికరకం చెట్టుకొమ్మ కళాకృతిగా రూపు మార్చుకుని రాష్ట్రాలు, దేశాలు, ఖండాలు దాటి అమెరికా అధ్యక్షుడికి కానుకగా చేరి.. ప్రపంచాన్ని అరచేతుల్లో ఆడించే ఆ దేశాధినేత కళ్లలో మెరుపై ప్రతిఫలించడం ఎంత అపురూపం! బొమ్మచూసినంతనే తనివితీరక కళాకారుడిని రప్పించి అవార్డుతో సన్మానించేదాక.. వందకోట్ల భారతీయుల ఉపరాష్ట్రపతిని నిలువనివ్వని ఆ కళ ఎంత ప్రతిష్ఠాత్మకం! అంత గొప్ప కళను ఏ దేశమైనా రాష్ట్రమైనా అపురూపంగా కాపాడుకుంటుంది. ప్రోత్సాహాలు కల్పించి రక్షించుకుంటుంది. చిరాయువుగా ఆ వృత్తి నిలిచిపోయేందుకు చర్యలు చేపడుతుంది. కానీ.. సీమాంధ్రపాలనలో నిర్మల్ కళలకు దొరికిన ప్రోత్సాహమేంటి? కళాకారులకు లభించిన ఆసరా ఎంత? వృత్తి అంతరించిపోకుండా తీసుకున్న చర్యలేంటి? ఊరి పేరు చెబితే కళ్లముందు తళుక్కుమని మెరిసే ఆ కళ వర్తమానమేంటి? భవిష్యత్తు దృశ్యమేంటి?
(ఎస్ కృష్ణమోహన్-): నాలుగు శతాబ్దాల చరిత్ర ఉన్న నిర్మల్ బొమ్మల పరిశ్రమ అంతరించిపోయేందుకు సిద్ధమవుతోంది. ఆ కళను నమ్ముకుని జీవించే నకాషీ కుటుంబాలు రానురాను చితికిపోతున్నాయి. వృత్తిని వదిలి ఉపాధి మార్గాన్ని వెతుక్కుంటున్నాయి. శభాష్ అన్నవారే తప్ప కళకు ఆసరా ఇచ్చే వారే లేరు. అవార్డులు గోడలమీద వెలిగిపోతుంటే ఆకలి కళ్లు ఆసరాకోసం వాకిలివైపు చూస్తున్నాయి. కర్రను కళాఖండాలుగా మార్చే చేతులను ఖాళీ జేబులు వెక్కిరిస్తున్నాయి. వచ్చే జీతం కనీసావసరాలకే సరిపోని పరిస్థితులు నెలకొన్నాయి. పాతతరం ఇంకా ఆ వృత్తినే నమ్మకుంటే కొత్తతరం మాత్రం కొత్త జీవనోపాధిని వెతుక్కుంటున్నది. కళను కాపాడేందుకు ప్రభుత్వం నుంచి ఆసరా లేక.. దీని భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతున్నది.
వందల ఏళ్లనాటి కళ..
16వ శతాబ్దంలో నిర్మల్ ప్రాంతాన్ని పాలించిన సామంతరాజులు నిమ్మనాయుడు వంశస్థులు కళలను ఆదరించారు. అనేక కులవృత్తుల కుటుంబాలను నిర్మల్‌కు తీసుకువచ్చారు. ఆ కాలంలో కర్ణాటక నుంచి ఐదు నకాషీ కుటుంబాలను నిర్మల్‌కు తీసుకువచ్చినట్లు పెద్దలు చెబుతారు. నిర్మల్ కొయ్యబొమ్మలు, పేయింటింగ్స్‌కు అపుడే బీజం పడింది. ఆ కుటుంబాలు వారితో ఆ కళ ఇక్కడ దినదినాభివృద్ది చెందింది. నిజాం కాలంలోనూ నకాషీలకు విశేష ఆదరణ లభించింది. స్వాతంత్ర్యానంతరం కొన్నేళ్లు ప్రభుత్వ చేయూత దొరికినా.. ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక సీమాంధ్ర పాలకులు నిర్మల్ కళను క్రమంగా తెరమరుగు చేశారు.
ఖండాంతర ఖ్యాతి..
నిర్మల్ కొయ్యబొమ్మల పరిశ్రమలో తయారయ్యే నిర్మల్ బొమ్మలు, నిర్మల్ పేయింటింగ్స్‌కు ఖండాంతర ఖ్యాతి ఉంది. అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్, బిల్ క్లింటన్‌లకు విదేశాంగశాఖ భారత ప్రభుత్వం తరపున నిర్మల్ పేయింటింగ్స్‌ను కానుకగా అందజేసిన సందర్భాల్లో వారెంతో మంత్రముగ్ధులయ్యారని చెబుతుంటారు.ఇక రాష్ట్రానికి వచ్చిన ప్రధానులు రాజీవ్‌గాంధీ, వీపీ సింగ్, పీవీ నర్సింహరావు, చంద్రశేఖర్, దేవేగౌడలు మొదలుకొని మన్మోహన్‌సింగ్ దాకా హైదరాబాద్‌లోని లేపాక్షి నిలయం నుంచి జ్ఞాపికలుగా నిర్మల్ బొమ్మనే ఇస్తున్నారంటే ఈ కళకు ఎంతటి గుర్తింపు ఉందో ఊహించవచ్చు. రాజీవ్ ప్రధానిగా ఉన్న సమయంలో నిర్మల్ బొమ్మలకు బాగా ఆకర్షితులయ్యారు. దానికి నిదర్శంగా ఆయన మరణానంతరం న్యూఢిల్లీలో ఏర్పాటైన రాజీవ్‌గాంధీ ఆర్ట్ మ్యూజియంలో నిర్మల్ బొమ్మలను ప్రదర్శించారు. ఈ మ్యూజియంను సందర్శించిన అప్పటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్, ఉపరాష్ట్రపతి బైరాన్‌సింగ్ షెఖావత్‌లు ఈ పేయింటింగ్స్, బొమ్మల గురించిఆరా తీశారు. వాటిని తీర్చిదిద్దిన కళాకారుడు రాచర్ల లింబయ్యను ఢిల్లీకి పిలిపించి ‘శిల్పగురు’అవార్డుతో సత్కరించారు. 1986 నిర్మల్ కళాకారుడు బూసాని నర్సింగంను ‘కళారత్న’ అవార్డుతో అప్పటి సీఎం ఎన్టీరామారావు అభినందించారు. నిర్మల్ బొమ్మలు హైదరాబాద్ లేపాక్షి నిలయంతో పాటు దేశ, విదేశాల్లో షోరూంలలో పెట్టి అమ్ముతున్నా.. నిర్మల్‌లో ఉన్న చెల్లించే ధరకు ఇతర ప్రాంతాల్లో పది రేట్ల తేడా ఉండడం గమనార్హం.

ప్రకృతిసాయం.. నిర్మల్ బొమ్మల పరిశ్రమ ఇక్కడ వేళ్లూడడానికి ప్రకృతిసాయం కూడా ఉంది. ఇక్కడికి సమీపంలోని అడవుల్లోనే రాష్ట్రంలో మరే అడవుల్లో లభించని పొనికి కర్ర దొరుకుతుంది నిర్మల్ బొమ్మల తయారీకి వాడేది ఆ కర్రనే. ఇది చాలా తేలికగా ఉంటుంది. వివిధ ఆకృతులలోకి తీర్చిదిద్దే క్రమంలో విరిగిపోవడం లాంటి సమస్యలు ఉండవు. అడవుల నుంచి తీసుకువచ్చే ఆ కర్రను కళాకృతులుగా మలుస్తారు. దానికి చింతగింజలతో తయారు చేసిన లప్పం, పొనికి కర్రను కళాకృతిగా మలిచే సందర్భంగా వచ్చే కర్రపొడితో పేస్ట్‌ను తయారు చేస్తారు. అక్కడక్కడ దొరికే సుద్దమట్టిని బట్టతో వడగట్టి… మట్టి ముద్దను తయారు చేసి ప్రైమర్‌కోట్‌గా వాడుతారు. కర్రను అవసరమైన కళాకృతిలోకి తెచ్చేందుకు చింతగింజల లప్పం, కర్రపొడి పేస్ట్,సుద్దమట్టి ముద్దలు వాడుతూ రూపుదిద్దుతారు. అనంతరం రేక్‌మాల్ పేపర్‌తో నున్నగా తీర్చిదిద్దుతారు. దానికి జీవకళ ఉట్టిపడే రంగులు అద్ది బొమ్మలు చేస్తారు. పేయింటింగ్స్‌లో విలువైన కార్డ్‌బోర్డ్‌ను వాడుతారు. నిర్మల్ నకాషీల చేతిలో రూపుదిద్దుకునే ఈ నగిషీ(సుందర బొమ్మలు)లు జీవకళతో ఉట్టి పడుతుంటాయి. ఈ వృత్తిలో ఉన్న వారిని నాలుగు దశాబ్దాల కిందట నగిషీలుగా పిలిచేవారు. ప్రస్తుతం నకాషీలుగా వ్యవహరిస్తున్నారు.

ప్రమాదపుటంచున నిర్మల్ బొమ్మ
స్వాతంత్ర్యానంతరం హైదరాబాద్ రాష్ట్రంలో సహకార ఉద్యమం ముమ్మరంగా సాగింది. ఈ రాష్ట్రంలో ఆనాడు చేనేత సహకార సంఘం దేశంలోనే అత్యుత్తమంగా పనిచేసింది. ఆ వరుసలోనే ఇక్కడి కళాకారుల రక్షణకు 1955లో నిర్మల్ కొయ్యబొమ్మల సహకార సంఘం ఏర్పడింది. కళాకారులకు భరోసా దొరికింది. సీమాంధ్ర ప్రభుత్వం వచ్చాక క్రమంగా సహకార రంగాన్ని విస్మరించారు. ఈ కళకు ఆసరా కరువైంది. సీమాంధ్రలోని కొండపల్లి బొమ్మలపైనే నాటి ప్రభుత్వాలు దృష్టిపెట్టి నిర్మల్ బొమ్మలను విస్మరించాయి. సీమాంధ్ర పాలకులు వివిధ రూపాల్లో కొండపల్లి బొమ్మలకే ప్రచారం కల్పించారు. ప్రభుత్వ సమాచార శాఖ ఓటు కొండపల్లికే పడగా మీడియా సినిమా రంగాలు వాటికే ప్రచారం ఇచ్చాయి. నిర్మల్ బొమ్మలకు ప్రాచుర్యం కల్పించలేదు. 1996లో సొసైటీ ముందు భాగంలో షోరూం నిర్మాణానికి అప్పటి జిల్లా కలెక్టర్ ఏఆర్ సుకుమార్ ఇచ్చిన రూ.10లక్షల సహాయం ఒక్కటే సీమాంధ్రపాలనలో ఇక్కడి పరిశ్రమకు లభించిన ప్రోత్సాహం! షోరూం వెనుకనే వర్క్‌షాపు ఉంది.
ఒకనాడు 200 మందికిపైగా కళాకారులతో కళకళలాడిన వర్క్‌షాపులో ఇవాళ 20 మంది మిగిలారు. అనారోగ్యంతో 10 మంది దాకా కార్మికులు రావడంలేదు. కొయ్యబొమ్మల పరిశ్రమలో గతంలో పనిచేసి తమకూ కళ నేర్పిన పెద్దల ఫోటోలను ఇక్కడ గోడలకు వేలాడదీశారు. సొసైటీలో తయారైన బొమ్మలు దేశదేశాల్లో ప్రముఖుల ఇళ్లల్లో అలంకారమవుతుంటే తమకు పూట గడువడం కూడా కష్టంగా మారిపోయాయని వారు ఆవేదన వెలిబుచ్చారు. రాష్ట్రపతినుంచి శిల్ప గురు అవార్డు పొందిన దివంగత రాచర్ల లింబయ్య ముగ్గురు కొడుకులు ఇక్కడే పని చేస్తున్నారు. కళారత్న అవార్డు పొందిన బూసాని నర్సింగం కొడుకులిద్దరు కూడా ఇదే పరిశ్రమలో ఉపాధి పొందుతున్నారు. వీరిలో ఏ ఒక్కరికీ నెలకు రూ.3 వేల నుంచి 4 వేలు మించి కూలిలీలు రావడం లేదు. సొసైటీ లెక్కలు చూస్తున్న మేనేజర్ బ్రహ్మరౌతు శంకర్ వర్మను పలుకరించగా కూలీలకు పీస్ రేట్ (బొమ్మను బట్టి ధర) చొప్పున చెల్లిస్తున్నామని తెలిపారు. పొనికి కర్ర దొరుకడం లేదని, అడవిలో ఈ కర్ర అంతరించిపోతుందని పేర్కొన్నారు. అటవీ శాఖ ద్వారా కర్రను కొనుగోలు చేస్తున్నామని, మిగతా ముడిసరుకు తయారు చేసుకుని బొమ్మలు చేస్తే కళాకారులకు రోజుకు రూ.200లకు మించి రావడం లేదని చెప్పారు. పైగా పొనికి కర్రను చెక్కేటప్పుడు వచ్చే ధూళితో శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయని చెప్పారు.1995లో అప్పటి కలెక్టర్ సుకుమార్ నకాషీ కుటుంబాలకు నిర్మల్ మండలం వెంకటాపూర్ వద్ద నివాసం స్థలాల కోసం నాలుగు ఎకరాలను కేటాయించారు. ఆర్థికంగా చితికిపోయిన ఈ కుటుంబాలు అప్పటికప్పుడే ఇల్లు నిర్మించుకోలేకపోయాయి. దీంతో ఇవి రియల్టర్ల పరమయ్యాయి.
కొండపల్లికి కొండంత … సీమాంధ్రలోని కొండపల్లి బొమ్మల పరిశ్రమను పాలకులు ప్రోత్సహించి ఆదరిస్తుండగా నిర్మల్ కొయ్యబొమ్మల పరిశ్రమను పట్టించుకున్న వారేలేరు. కొండపల్లి బొమ్మలను పాఠ్యంశాల్లో కూడా చేర్చారు. వాటికి మంచి మార్కెట్ లభించింది. ఆ బొమ్మల సంస్థను ప్రభుత్వ చేయూతతో ఓ సంస్థ దత్తత తీసుకొంది ప్రభుత్వం యేటా నిధులు కూడా మంజూరు చేస్తున్నది. కానీ నిర్మల్ కొయ్య బొమ్మల పరిశ్రమపై నిండా నిర్లక్ష్యం ఆవరించింది. ఈ పరిశ్రమను ప్రభుత్వం ఇండస్ట్రీగా గుర్తించి కార్మికులకు పీఎఫ్ , ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉంది. గుడ్డిలో మెల్లగా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాషన్ టెక్నాలజీ సంస్థ నిర్మల్ పరిశ్రమను గుర్తించింది. జియోక్షిగాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ కింద భారత ప్రభుత్వం ద్వారా నిర్మల్ కొయ్య బొమ్మల పరిశ్రమకు భౌగోళిక గుర్తింపు ఇచ్చి నిర్మల్ టాయ్స్ అండ్ క్రాప్ట్స్‌పై ఆ సంస్థకే పేటెంట్ హక్కులు కట్టబెట్టింది. ఇది ఈ పరిశ్రమలకు కాస్త ఊరటనిచ్చే అంశమే.
చిన్నప్పటినుంచీ ఈ వృత్తిలోనే..:రాచర్ల శ్రీనివాస్ కుటుంబం
మా తండ్రి రాచర్ల లింబయ్య శిల్పగురుగా ఉప రాష్ట్రపతి ద్వారా అవార్డు అందుకున్నారు. చిన్నతనంలోనే నాన్న మాకు ఈ కళ గురించి చెప్పేవారు. మా తాత కూడా ఇదే వృత్తిలో ఉండేవాడని చెబుతూనే మా ముగ్గురు అన్నదమ్ములను నిర్మల్ బొమ్మల తయారీ వృత్తిలోకి తీసుకువచ్చారు. తాత, తండ్రుల వారసత్వ వృత్తిని కొనసాగిస్తుండడం గర్వంగానే ఉన్నప్పటికి ఇపుడు భార్య, భర్తలిద్దరం కష్టపడ్డా నెలకు రూ. 6 వేలకు మించి 

జీతం రూ. 6వేలు దాటలే : భూసాని నర్సింగం
గడిచిన అరవైయేళ్ళుగా పని చేస్తున్న. ఈ పరిశ్రమనే నమ్ముకున్న. అన్ని ధరలు పెరిగాయి. కాని నాకు వచ్చే దినసరి వేతనం మాత్రం పెరగలేదు. ఇప్పటికీ రూ.6 వేలకు మించి రాదు. నా ఇద్దరు కొడుకులు ఇదే వృత్తిలో ఉన్నారు. ఎన్‌టి రామారావు నాకు రాష్ట్ర అవార్డు ఇచ్చినాడు. కాని నా కుటుంబాన్ని ఆదుకునే స్థాయిలో ప్రభుత్వం నుంచి ఒక్క అవకాశం రాలేదు.
సర్కారు భరోసానిస్తేనే మనుగడ : బిఆర్. శంకర్ , మేనేజర్
పదిహేనేళ్ళుగా కొయ్య బొమ్మల పరిశ్రమ మేనేజర్‌గా పని చేస్తున్న. నన్ను ఇటీవలనే హస్త కళల కార్పొరేషన్ డైరెక్టర్‌గా నియమించారు. ప్రభుత్వం మా వృత్తిలో ఉన్న యువతకు భరోసానివ్వాలి. ప్రభుత్వ స్కీములు అమలు చేసి వారిలో ఆసక్తి పెంచితే ఈ వృత్తిలోకి యువకులు వచ్చే అవకాశం ఉంది. పింఛన్ అమలు చేయాలి. పొనికి మొక్కల ప్లాంటేషన్ చేపట్టాలి. గతంలో మంజూరైన ఇండ్ల స్థలాలను తిరిగి మాకే దక్కేలా చూడాలి.
రోజుకు రెండు వందలే..:నర్సయ్య
ఈ సొసైటీలో 30 యేళ్ళ నుంచి పని చేస్తున్న. అందరం కళాకారులం కలిసే సొసైటీ నడుపుకుంటున్నాం. నేను బొమ్మలకు రంగులు వేసే పని చేస్తా. 200కి మించి దినసరి కూలి రావడం లేదు. ప్రభుత్వం ఆదుకుంటే మంచిది.
వృద్ధ కళాకారులకు పెన్షన్ ఇవ్వాలి : రాచర్ల కిషన్
నలబై యేళ్లుగా ఉన్న. వయస్సు మీద పడడంతో పని కష్టమవుతోంది. వృద్ధ కళాకారులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలి. ఇతర సంస్థల్లో పని చేసే కూలీలు , ఉద్యోగుల మాదిరిగానే మా సంస్థను గుర్తించి సౌకర్యాలు వర్తింపజేయాలి.
కష్టమైనా తప్పడం లేదు :నాంపల్లి శ్రీనివాస్
మా నాన్న నుంచి ఈ పని నేర్చుకున్న. ఈ కళ ఇతరులకు లాభసాటిగా ఉంటే మా వృత్తిలో ఉన్న వారికి ఏ మాత్రం అండగా ఉండడం లేదు. కళాకారులకు ఒక్కరికి కూడా ఐదారువేలకు మించి కూలీ పడడం లేదు. ఇన్ని ధరలు పెరిగిన రోజుల్లో జీతాలతో కుటుంబాలు గడపడం కష్టమే.
ప్రైవేటు కాలేజీలో చేరా : పర్షరౌతు రాజుమా తాత జివ్వయ్య కొయ్య బొమ్మ తయారు చేసేవారు. అయితే వారసత్వ వృత్తి కుటుంబాలను ఎంత మాత్రం ఆదుకోవడం లేదు. చాలీ చాలని వేతనాలు. వృత్తి క్రమంగా అంతరించిపోతున్నది. కుటుంబాన్ని నడిపేందుకు ప్రైవేటు కాలేజీలో క్లర్స్‌గా పని చేస్తున్న.

బీడీ కార్మికుల కన్న తక్కువ వేతనం:శ్రీదేవి, కార్మికురాలు
నా భర్త శ్రీనివాస్‌కు సహకారంగా నేను కూడా ఈ వృత్తిలో చేరాను. బీడీ కార్మికుల వేతనాల కన్నా తక్కువ వస్తోంది. రోజు నాలుగు గంటలు పనిచేస్తే నెలకు రూ. 2500 మించి రావడం లేదు.
January 5, 2014


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు