ఆంధ్రప్రదేశ్ నామకరణం ఎవరిపుణ్యం?

-హైదరాబాద్ లేదా తెలుగువూపదేశ్ కావాలన్న తెలంగాణ
-పెద్ద మనుషుల ఒప్పందం నాటినుంచే వివాదం
-కర్నూలు చర్చల్లో రాజకీయం చేసిన ఆంధ్రులు
-హైదరాబాద్ తీర్మానం ప్రభుత్వానిది కాదు
-కేంద్రం కూడా దాన్ని ఆమోదించనూ లేదు
-తుది బిల్లులోనూ లేని ఆంధ్రవూపదేశ్ పేరు
-సెలెక్ట్ కమిటీలోనే మారిన సీను
రాష్ట్ర విభజన వేళ రాజకీయ నేతలు చరివూతను తవ్వుతున్నారు. చేతికందిన ఆధారాలతో ఎదుటి పక్షాన్ని దబాయిస్తున్నారు. తెలంగాణ ఆంధ్ర మధ్య జరిగిన అనేక అంశాలు ఇవాళ ముందుకు వస్తున్నాయి. ఆరవై ఏళ్ల అణచివేతపై తెలంగాణవాదులు ఆరోపణలు గుప్పిస్తుంటే.. అవన్నీ అసత్యాలేనని నిరూపించాలని ఆంధ్రవూపాంతీయులు విశ్వవూపయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఆంధ్రవూపదేశ్ పేరు వివాదంలోకి వచ్చింది. ఈ పేరును తమపై బలవంతంగా రుద్దారని తెలంగాణవాదులు ఆరోపిస్తున్నారు. కేంద్రం తొలుత ప్రతిపాదించిన రాష్ట్రం పేరు ఆంధ్ర- తెలంగాణ అని ఉండగా అందులో ఆంధ్రులు తమ ఆధిపత్య చిహ్నంగా ఉన్న ఆంధ్ర అన్న పదాన్ని అలాగే ఉంచి తెలంగాణను మాయం చేశారన్నది తెలంగాణ వాదుల వాదన. నామకరణం నాడే తమ అణచివేత ప్రారంభమైందనే దానికి సంకేతంగా వారు ఈ అంశాన్ని ముందుకు తెస్తున్నారు. అయితే ఆంధ్రవూపదేశ్ పేరును తెలంగాణవారు ఆమోదిస్తేనే పెట్టారని ఆంధ్రనాయకులు వాదనకు దిగుతున్నారు. తామెవరినీ అణచివేయలేదని అనడమే కాకుండా అసత్యాలు చెబుతున్నారని ఎదురుదాడికి దిగుతున్నారు.
సరే.. ఎవరికి వారు తమ వాదనకు ఏవో ఒక ఆధారాలు చూపుతున్నారు. ఇంతకీ వాస్తవమేమిటి? అరవైఏళ్లుగా తెలంగాణ వారు చేస్తున్న బలవంతపు నామకరణం ఆరోపణ కేవలం కల్పితమా? సీమాంవూధులు చెబుతున్నట్టు తెలంగాణ వారు ఐచ్ఛికంగా రాష్ట్రానికి కేంద్రం పెట్టిన ఆంధ్ర-తెలంగాణ పేరులో తెలంగాణ అన్న పదాన్ని వదిలేసుకున్నారా? నిజానిజాలేమిటి?
పెద్దమనుషుల ఒప్పందం నాడే కుదరని ఏకాభివూపాయం..
ఓం ప్రథమంగా ఆంధ్ర తెలంగాణ విలీనాన్ని హైదరాబాద్ రాష్ట్రంలో భాగంగా ఉన్న తెలంగాణ ప్రజలు నాయకులు వ్యతిరేకించిన విషయం జగద్విదితమే. వారి వ్యతిరేకతను ఫజల్ అలీ కమిషన్ కూడా తన నివేదికలో నమోదుచేసింది కూడా. ఆ తర్వాత రాష్ట్ర ఏర్పాటుకు దారి తీసినపరిస్థితులు నెహ్రూ ప్రకటనలు హామీలు ఏవైతేనేం… చివరికి తెలంగాణ నాయకులు ఇష్టంగానో అయిష్టంగానో ఆంధ్రతో కలవాల్సి వచ్చింది. విలీన ఒప్పందాల మీద సంతకం పెట్టి వచ్చిన తర్వాత హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ‘‘ఇవాళ నా మరణశాసనం మీద నేనే సంతకం చేసుకున్నాను’’ అన్న మాట వాడారు. ఇష్టపూర్వకంగా కలవలేదనడానికి ఇంతకంటే మరోమాట అవసరమే లేదు. ఆ సందర్భంగా ఢిల్లీలో అధిష్టానం ముందు ఇరు ప్రాంతాల నేతలు 1956 ఫిబ్రవరి 20న ‘పెద్ద మనుషుల ఒప్పందం’ కుదుర్చుకున్నారు. తెలంగాణ వారికి అనేక రక్షణలకు ఆంధ్ర నాయకులు హామీలు ఇచ్చారు. అవి తెలంగాణ నాయకులు విశ్వసించారు. అనేక అంశాల్లో అంగీకారాలు కుదిరినా రెండు అంశాల్లో మాత్రం ఒక ఒప్పందానికి రాలేక పోయారు. అవి 1. రాష్ట్రం పేరు. 2. హైకోర్టు తరలింపు. రాష్ట్రానికి ఏ పేరు ఉండాలనే విషయమై మూడుపేర్లు హైదరాబాద్, విశాలాంధ్ర, ఆంధ్ర చర్చకు వచ్చాయి. విశాలాంధ్ర అని పెట్టాలని ఆంధ్రులు హైదరాబాద్ పేరుకు తెలంగాణవాదులు పట్టుబట్టారు. దీనితో ఇరు ప్రాంత నాయకులు మరోసారి చర్చలు జరిపి అంగీకారానికి రావాలని నెహ్రూ సూచించడంతో ఆ అంశాన్ని వదిలిపెట్టి మిగిలిన అంశాలపై సంతకాలు చేశారు. అప్పటికా వివాదం అపరిష్కృతంగానే ఉండిపోయింది.
కర్నూలులో రాజకీయం..
ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన పనులు కేంద్రం వేగిరం చేసింది. అపుడే దేశవ్యాప్తంగా భాషారాష్ట్రాల ఏర్పాటులో భాగంగా 15 రాష్ట్రాలకు కలిపి ఒకే బిల్లు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లు-1956 రూపొందించింది. అందులో తెలుగువారి ఉమ్మడి రాష్ట్రాన్ని ఆంధ్ర-తెలంగాణ అనే పేరుతో పిలిచారు. ఆ బిల్లు ఇరు రాష్ట్రాలకు చేరింది. పేరు మార్పు చేసుకునే సమయం ఇదే కావడంతో రాష్ట్రం పేరు, హైకోర్టు అంశం చర్చించేందుకు ఆంధ్ర నాయకుల ఆహ్వానం మేరకు తెలంగాణ నాయకులు చర్చల కోసం ఏప్రిల్ 2న కర్నూలుకు వెళ్లారు. వీరిలో ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు, కేవీ రంగాడ్డి, మర్రి చెన్నాడ్డి, జేవీ నరసింగరావు ఉన్నారు. ఆంధ్ర తరపున ముఖ్యమంత్రి బెజవాడ గోపాలడ్డి, టంగుటూరి ప్రకాశం, నీలం సంజీవడ్డి, కాసు బ్రహ్మానందడ్డి, అయ్యదేవర కాళేశ్వరరావులు ఉన్నారు. రాష్ట్రం పేరు మీద చాలాసేపే చర్చ జరిగింది. బూర్గుల, కేవీ, చెన్నా, నరసింగరావులు మాత్రం తెలంగాణ లేదా తెలుగు ప్రదేశ్ అనే పేర్లు ఉండాలని గట్టిగా వాదించారు. ఆంధ్ర నాయకులు ‘విశాలాంధ్ర’ అనే పేరు నచ్చకపోతే ‘ఆంధ్ర’ లేదా ‘ఆంధ్ర ప్రదేశ్ ’ ఉండాలన్నారు. ఉపనిషత్తులు.. పురాణాలు తిరగేసి చర్చించారు. చర్చలు ముగిశాయి. తెలంగాణ నాయకులు ఏప్రిల్ 3న హైదరాబాద్ వెళ్లిపోయారు.
తెల్లారేసరికి పత్రికల్లో ఆంధ్రవూపదేశ్ అన్న పేరుకు తెలంగాణ నాయకులు అంగీకరించారని వార్తలు వచ్చాయి. దీనితో తెల్లబోవడం తెలంగాణనాయకుల వంతైంది. ఎందుకంటే తెలంగాణనాయకులు ఏ పేరుకూ కూడా అంగీకారం తెలుపలేదు. ‘తెలంగాణలో వ్యతిరేకత ఉన్నందున మేం తక్షణమే ఏమీ చెప్పలేం. హైదరాబాద్ వెళ్లి మావాళ్లతో చర్చించి చెబుతాం’ అన్నారు. ఆంధ్రవూపదేశ్ పేరు తమకు అంతగా నచ్చకపోయినా దానికే సమ్మతించాలని టంగుటూరి, అయ్యదేవర వంటి పెద్దలు కోరినందున వారికివ్వవలిసిన విలువ ఇచ్చి దాన్ని గురించి ఆలోచిస్తామని చెప్పి తామొక నిర్ణయానికి వచ్చే లోపల ఈ విషయమై ఏ చర్యా తీసుకోవద్దని ఆంధ్ర నాయకులను కోరి హైదరాబాద్‌కు వచ్చేశారు. కానీ పత్రికల్లో ఆంధ్రవూపదేశ్‌కు అంగీకరించారని వచ్చేసింది. సహచరులతో ఈ విషయమై చర్చించే లోపలే ఊపిరి పీల్చుకునే వ్యవధి ఇవ్వకుండా ఆంధ్ర ముఖ్యమంత్రి బెజవాడ గోపాల రెడ్డి కర్నూలు అసెంబ్లీలో ఆంధ్రవూపదేశ్ పేరు ప్రతిపాదిస్తూ ఏప్రిల్ 4న తీర్మానం ప్రవేశపెట్టారు. అంటే ఆంధ్రవూపదేశ్‌కు తెలంగాణ వారు అడ్డపడే అవకాశం ఇవ్వకుండా ముందరి కాళ్లకు బంధం వేశారన్న మాట. ఇంత చిన్న విషయం కూడా తేల్చుకోలేరా అని నెహ్రూతో చీవాట్లు తినే పరిస్థితి.
ఆంధ్రవూపదేశ్ పేరు చేర్చని హైదరాబాద్ ప్రభుత్వం..
ఆంధ్రనాయకుల ధోరణి అర్థం చేసుకున్న ముఖ్యమంత్రి బూర్గుల రాష్ట్రాల పునర్వవస్థీకరణ బిల్లులో పేరు మార్పు అంశం లేకుండానే ఏప్రిల్ 8న కొన్ని సవరణలు ప్రతిపాదించారు. హైకోర్టు హైదరాబాద్‌లోనే ఉంచాలని ఇక్కడి న్యాయమూర్తులను ‘ఆంవూధ-తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు’గా పరిగణించాలని సవరణ ప్రతిపాదించారు. హైదరాబాద్ కర్ణాటక ప్రాంతానికి చెందిన కొన్ని ప్రాంతాలు తెలంగాణలో కలిపే ఇతర సవరణలు ప్రతిపాదించారు. అంతే తప్ప ఆంధ్ర ముఖ్యమంత్రి లాగా రాష్ట్రం పేరును మార్చే సవరణను తాను ప్రవేశపెట్టలేదు. అంటే ప్రభుత్వం తరపున ఆంధ్రవూపదేశ్ పేరును అంగీకరించలేదన్న మాట. దీనితో విశాలాంధ్ర కోసం అంగలార్చుతున్న పీడీఎఫ్ ప్రతిపక్షనేత సీడీ దేశ్‌ముఖ్ తాను ఆంధ్రవూపదేశ్ పేరు ప్రతిపాదిస్తూ సవరణ ప్రతిపాదించారు. ఇక రాయలసీమతో సన్నిహిత బంధుత్వాలు ఉండి మొదటినుంచి విశాలాంధ్ర నినాదం వినిపిస్తున్న కాంగ్రెస్ సభ్యుడు పాగా పుల్లాడ్డి తాను కూడా ఆంధ్రవూపదేశ్ పేరు ఉంచుతూ సవరణ ప్రతిపాదించారు. ఏప్రిల్ 12న సభ దాన్ని మూజువాణి ఓటుతో ఆమోదించింది. అదేసమయంలో బూర్గుల ప్రవేశపెట్టిన ‘ఆంధ్ర తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు’గా పిలవాలన్న సవరణా నెగ్గింది. ఏతావాతా తేలేదేమంటే హైదరాబాద్ ప్రభుత్వం ఆంధ్రవూపదేశ్ పేరుకు అధికారికంగా ఆమోదముద్ర వేయలేదు.
పట్టించుకోని కేంద్రం..సెలెక్ట్ కమిటీలో మాయ..
ఇదిలా ఉంటే ఆంధ్ర అసెంబ్లీ హైదరాబాద్ అసెంబ్లీలో ఆంధ్రవూపదేశ్ పేరు ఉంచాలని తీర్మానాలు వచ్చినా కేంద్రం ఆ సవరణను తుది బిల్లులో చేర్చలేదు. ఆంధ్ర-తెలంగాణ అన్న పేరుతోనే ఉంచి మిగిలిన 15 రాష్ట్రాల ఏర్పాటుతో కూడిన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లు-1956ను పార్లమెంటులో ప్రవేశపెట్టింది. బిల్లుపై చర్చించినపుడు వివిధ పార్టీలు తమతమరాష్ట్రాలకు సంబంధించి అనేక విషయాల్లో అభ్యంతరాలు లేవనెత్తడంతో గందరగోళం ఏర్పడి చివరికి బిల్లును ఏప్రిల్ 23న ప్రత్యేక సెలెక్ట్ కమిటీ పరిశీలనకు పంపించారు. అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ ఆంధ్రుల వాదనలు రెండు ఒకటి ఆంధ్రవూపదేశ్ అన్న పేరు, హైదరాబాద్‌కు హైకోర్టు తరలింపు అమోదించి బిల్లులో చేర్చారు. దీనిపై తెలంగాణ నాయకులు అసమ్మతి వ్యక్తం చేశారు.
మరోసారి అసమ్మతి తెలిపిన టీ నేతలు..:
ఈలోగా రాష్ట్ర ఏర్పాటు జరగనుండడంతో గత ఫిబ్రవరిలో కుదుర్చుకున్న పెద్ద మనుషుల ఒప్పందానికి రాజ్యాంగబద్దత కల్పించేందుకు అధిష్టానం ఇరువూపాంతనేతలను ఢిల్లీకి పిలిపించింది. జూలై 19న వీరు కేంద్ర హోం మంత్రి గోవింద్ వల్లబ్ పంత్ సమక్షంలో చర్చలు ప్రారంభించారు. తెలంగాణ నాయకులు కేవీ రంగాడ్డి, చెన్నా జేవీ తొలుత బిల్లులో ఉన్నట్టు ఆంధ్ర-తెలంగాణ అన్న పేరునే ఉంచాలని, గుంటూరులో హైకోర్టు డివిజన్ బెంచి ఉంచాలని వాదించారు. ఆంధ్ర నాయకులు యధావిధిగా సెలెక్టు కమిటీ చెప్పినట్టు ఆంధ్రవూపదేశ్ అని ఉంచాలన్నారు. వాదోపవాదాల అనంతరం పంత్ సూచన మేరకు ఈ అంశాలు అధిష్టాన నిర్ణయానికి వదిలివేశారు. తెలంగాణ ప్రాంతీయ సంఘం రక్షణలపై చర్చించారు. ఈ ఒప్పందాల సారాంశాన్ని కేంద్రం ఆగస్టు 10 లోక్‌సభ ముందు పెట్టి ఆమోదం పొందింది. ఆగస్టు 31న రాష్ట్రాల పునర్వవస్థీకరణ బిల్లు -1956 ను పార్లమెంటు ఆమోదించింది. ఈ బిల్లులో ఉమ్మడి రాష్ట్రం పేరును కేంద్రం ఆంధ్రవూపదేశ్ గానే ఉంచింది.
తెలంగాణవాదుల వాదన ఇదే…
ఆంధ్రవూపదేశ్ అన్న పేరుపై కర్నూలులో జరిగిన రాజకీయాన్ని తెలంగాణవాదులు ద్రోహంగానే భావిస్తున్నారు. పత్రికలూ యధాశక్తి దీనికి దోహదపడ్డాయి. (కర్నూలు ఎపిసోడ్ మొత్తం ఉదంతాన్ని 1956 ఏప్రిల్ 14న ఆంధ్రవూపభ సంపాదకీయంలో రాసింది. అందులో ఆంధ్రనాయకుల ‘తొందరపాటు’ను దుయ్యబట్టింది. తెలంగాణ నాయకుల సంయమనాన్ని ప్రశంసించింది.) ఇక హైదరాబాద్ ప్రభుత్వం ఆంధ్రవూపదేశ్ పేరును ప్రతిపాదించక పోవడం, కేంద్రం కూడా పార్లమెంటుకు సమర్పించిన బిల్లులో ఆంధ్ర-తెలంగాణ అనే పేర్కొనడంతో హైదరాబాద్ అసెంబ్లీ ఆమోదాన్ని తెలంగాణ వాదులు పరిగణనలోకి తీసుకోవడం లేదు. సెలెక్టు కమిటీలో ఆంధ్ర వాదనలు రెండూ ఆమోదం పొందడం మేనేజ్ చేయడంగానే వారు పరిగణిస్తున్నారు. అలాగే చివరికి ఈ అంశాన్ని అధిష్టానానికి వదిలి వేశాక ఆంధ్రుల ఒత్తిడి తెచ్చి పేరు కొనసాగించుకున్నారని నమ్ముతున్నారు. అంటే కర్నూలు రాజకీయం, సెలెక్టు కమిటీలో మార్పు, అధిష్టానం కల్పించుకోకపోవడం అన్నీ తెలంగాణవారి వాదానికి పునాదులని చెప్పవచ్చు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు