పాముల రాజకీయాల్లో పావులు!

 


పదవిలోకి రావడం..!

ఆ పదవిని కాపాడుకోవడం!

ఆ పదవికి పోటీగా ఎవరూ ఎదగకుండా చూసుకోవడం!

రాజకీయాలు  ఇప్పుడు ప్రధానంగా ఈ మూడు సూత్రాల మీదనే నడుస్తున్నాయి..

ఇలాంటి రాజకీయాలు నడపడంలో ఇందిరమ్మ ఘనాపాటీగా పేరొందినా..

పీవీ నరసింహారావు వంటి

మనిషి అపర చాణక్యుడని

కీర్తి గాంచినా..

తాత నెహ్రూ..

మనవడు రాజీవ్ సైతం వీటిని రసవత్తరంగా సాగించినా..

వాజపేయీ సైతం మినహాయింపు కాకపోనీ..

రాజకీయం రాజకీయమే!


ఇప్పుడు మోడీ సాబ్ విషయానికి వద్దాం..

నరేంద్రుని పాలన..

ఆయన తీసుకున్న 

అర్ధిక చర్యలు..

గుజరాత్..గుజరాతీల

అనుకూల నిర్ణయాలు

విదేశీ విధానాలు..

కోవిడ్ పాలసీలు..

ఇవన్నీ పక్కన పెడదాం..

రాజకీయమే మాటాడుకుందాం..

అది కూడా పక్కాగా..!


ఇద్దరు..ఆహ నలుగురు తెలుగు ప్రముఖులకు

వ్యతిరేకంగా మోడీజీ పనుపున సాగుతున్న 

పాలిటిక్స్..ఎలిమినేషన్

పాలిట్రిక్స్..!


స్వయంకృతంతో పాటు నరేంద్ర మో'ఢీ' వల్ల జాతీయ రాజకీయాల్లోనే గాక స్వరాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో కూడా పలచబడిపోయిన

తెలుగుదేశం అధినాయకుడు

చంద్రబాబు నాయుడు ప్రతిష్ట గురించి ముందు ప్రస్తావించుకుందాం..

నిజమే...ఆయన తప్పు మీద తప్పు చేసి తన పలుకుబడి తగ్గిపోవడానికి తానే కారణం అయ్యారు.అయితే అందుకు ముందు బీజాలు వేసింది 

మన్మోహన్ సర్కార్..

సోనియా నిర్ణయం..

42 పార్లమెంట్ స్థానాలతో

అత్యంత బలంగా ఉండే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండుగా చెయ్యడంతో 

25 స్థానాలకు పరిమితమైపోయింది.

అంతే..ముఖ్యమంత్రులు...

ఆంధ్రలో పాలక పక్షాలు అప్పటి నుంచి నీరసం...

అప్పుడే మొదలైంది బిజెపి నవరసం..సరిగ్గా ఆంధ్రప్రదేశ్ విడిపోయి బుల్లి ప్రదేశ్ కు ఎన్నికలు జరిగి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం..నరేంద్ర మోడీ దేశ ప్రధాని స్థానాన్ని అధిష్టించడం ఒకేసారి జరిగాయి.అప్పటికే 2004..2009 ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో దెబ్బ తిని కుదేలై పోయి ఉన్న తెలుగుదేశం ఆ ఎన్నికల్లో జాతీయ..రాష్ట్ర స్థాయిల్లో బిజెపితో జత కట్టింది.

ఆంధ్రప్రదేశ్ లో బిజెపి పొత్తు కారణంగా టిడిపి లాభపడిందా లేదా అనేది జవాబు దొరకని ప్రశ్న కాదు.

   ఇక అసలు విషయానికి వస్తే 

అప్పటికే నీరస పడి ఉన్న చంద్రబాబు మోడీతో 

చెయ్యి కలవడం..పక్కాగా చెప్పాలంటే మోడీ చేతి కింద తన చెయ్యి ఉంచడం..

వాస్తవానికి జాతీయ స్థాయిలో మోడీ కంటే చంద్రబాబు నాయుడే ముందుగా పాప్యులర్..

అంత కంటే ముందే చంద్రబాబు నాయుడు

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన మనిషి.అలాంటి వ్యక్తి

ఎప్పటికైనా దేశ ప్రధాని పదవికి జరిగే రేసులో ఉండే అవకాశం ఉంటుంది. బిజెపిలో కొన్ని శక్తులు 

ఆ దశలోనే చంద్రబాబు జోరుకు కళ్లెం వేసేదెలా 

అనే ఆలోచనలో ఉన్నాయి.అందుకు తగిన అవకాశం కోసం కమలం పార్టీ వ్యూహకర్తలు పొంచి ఉన్నారు.రోగి కోరింది అదే.. వైద్యుడు చెప్పిందీ అదే అన్న చందాన అవకాశం కాంగ్రెస్ రూపంలో బిజెపికి కలిసి వచ్చింది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండుగా చీల్చడం ద్వారా కాంగ్రెస్ తెలుగు రాష్ట్రాల్లో తనకు తానుగా చితి పేర్చుకోడమే గాక పరోక్షంగా చంద్రబాబు 

చెయ్యి కూడా నరికినంత పని చేసింది..

అదే సమయంలో చంద్రబాబు బిజెపితో కొన్నాళ్ళ పాటు దోస్తీ చేసి పోనీ అలాగే ఉండిపోకుండా

తగుదునమ్మా అనుకుంటూ బయటికి వచ్చేశారు.

ఈ నిర్ణయాల వెనక చంద్రబాబు సొంత ఆలోచనలే కీలకం అయినా గాని బిజెపి సైతం 

అలాంటి పరిస్థితులు కల్పించింది.సరే...

ఈ పరిణామాలు 

మొన్న 2019 ఎన్నికల్లో జగన్ పార్టీ చేతిలో తెలుగుదేశం చావు దెబ్బ తినడానికి దారి తీశాయి.

అదిగో..అక్కడే..అప్పుడే బిజెపి లక్ష్యం నెరవేరిపోయింది.జాతీయ స్థాయిలో రాజకీయాలను శాసించిన చంద్రబాబు..చిన్న రాష్ట్రానికి పరిమితం అయిపోవడమే గాక నేషనల్ ఫ్రంట్ అనే అత్యంత ప్రతిష్టాత్మకమైన కూటమికి ఆధిపత్యం వహించిన ఎన్టీఆర్ పార్టీ స్వరాష్ట్రంలోనే ఉనికిని కాపాడుకునే క్రమంలో నానా అగచాట్లు పడే దుస్థితికి చేరింది.

అదే..అదే..ఆపరేషన్ చంద్రబాబు..


ఓ పెద్ద వికెట్ ఔట్..!


ఇక రెండో తెలుగు వికెట్ ముప్పవరపు వెంకయ్యనాయుడు.

కథ పాతబడిపోయినా  ఆసక్తికరమే..!


ఇప్పుడు ప్రధానిగా.. 

హోం మంత్రిగా వెలిగిపోతూ బిజెపి రాజకీయాలను 

మాత్రమే గాక జాతీయ రాజకీయాలను శాసిస్తున్న నరేంద్ర మోడీ..అమిత్ షా ద్వయం ఎక్కడో మూల ఉన్న రోజుల్లోనే కమలం పార్టీకి మూలస్తంభం వెంకయ్యనాయుడు.

ఒకరకంగా చెప్పాలంటే వాజపేయి..అద్వానీ తర్వాత పార్టీ ఎదుగుదలకు ఆయన ప్రధాన కారకుడు.ఏనాడో పార్టీ అధ్యక్ష పదవిని అలంకరించి 

ఆ పదవికి..పార్టీకి 

వన్నె తెచ్చిన వ్యక్తి.

గొప్ప సిద్ధాంత కర్త..

మంచి వ్యూహనిపుణుడు.

ప్రత్యక్షంగా..పరోక్షంగా 

మోడీకి ఎంతో సాయపడిన మిత్రుడు.ఆయన ప్రధాని కావడానికి సైతం చెయ్యి అందించిన వ్యక్తి.

    

అలాంటి వ్యక్తి..ఉత్తరోత్రా తనకు పోటీ అవుతాడేమో అనే ఆలోచనతో క్రియాశీల రాజకీయాల నుంచి పక్కన బెట్టి..పక్కకు నెట్టి..

ఉప రాష్ట్రపతిని చేసేశారు నరేంద్రజీ..!


ఈ విషయంలో మోడీ పక్కన అనునిత్యం ఉంటూ ఆయన వ్యూహాల్లో ప్రధాన భాగస్వామి అయిన

అమిత్ షాను కూడా తక్కువ అంచనా వేయనక్కర లేదు.

మోడీతోనే ఉంటూ ఏమో..

ఏ పరిస్థితుల్లో అయినా ఆయన దిగిపోవలసి వస్తే..ఉన్నత పీఠంపై కూర్చోవాలని ఆశపడే షా ముందు చూపుతోనే వెంకయ్యకు మోడీ చేతనే చెక్ చెప్పించారు.


వెంకయ్యను క్రియాశీల రాజకీయాల నుంచి పక్కకు తప్పించారు సరే..

ఉపరాష్ట్రపతి పదవి వరకు తీసుకువెళ్లి ఆపేయడం మరీ దారుణమైన రాజకీయమే కదా.అన్ని అర్హతలూ ఉన్నా కూడా ఆయన్ను రాష్ట్రపతి చెయ్యకుండా రెండోసారి అడ్డుకట్ట వెయ్యడం  రాజకీయ వ్యూహం మాత్రమే గాక వ్యక్తిగత వ్యవహారంగా కూడా అనిపించక మానదు.

కోవింద్ ను రాష్ట్రపతిని చెయ్యడానికి ముందే వెంకయ్యను అత్యున్నత పీఠంపై కూర్చొబెడతారని దేశం మొత్తం భావించింది.

ఇప్పుడు ద్రౌపది ముర్ము వంతు.అపార అనుభవం..

అనంతమైన మేధస్సు..

సీనియారిటీ...

దేశ ప్రజలందరికీ పరిచయం..

వీటన్నిటితో పాటు ఉపరాష్ట్రపతి పదవి కూడా నిర్వహించిన అర్హత..

ఇవన్నీ చాలవా నాయుడును రాష్ట్రపతిని చెయ్యడానికి.కానీ మోడీ.. షా ద్వయం ఆ పని చెయ్యలేదు.ఓటు బ్యాంకు ఆలోచనలతో ముర్మును తెరపైకి తెచ్చారు.

వెంకయ్యను మరోసారి వంచించారు.


వెంకయ్య..చంద్రబాబు మంచి దోస్తులు..ఇద్దరికీ ఒకేసారి..ఒకే వ్యక్తి కారణంగా

భంగపాట్లు ఎదురుకావడం

యాదృచ్చికం అయితే ఎంతమాత్రం కాదు కదా..

మరదే రాజకీయం అంటే.

ఇక మరో రెండు ప్రాణులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్..

ఈ ఇద్దరి రాజకీయ భవితవ్యం ఎప్పుడూ తమ చెప్పుచేతల్లోనే ఉండేలా బిజెపి అగ్రనాయక ద్వయం వ్యవహరిస్తుంది.తన పరిస్థితిని అనుసరించి జగన్ రెడ్డికి అది తప్పని ఇరకాటం.అయితే పవన్ ఇప్పుడిప్పుడే కోరల నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది.ఎన్నికలు దగ్గర పడే సమయానికి పవన్ విషయంలో క్లారిటీ వస్తుంది.


ఏదిఏమైనా అధికారం..

మెజారిటీ బలం ఉన్న మోడీజీ చెప్పిందే వేదం..చేసిందే శాసనంగా చలామణి అయిపోతున్న రోజులు.ఈ క్రీడలో వికెట్లు అలా పడుతూనే ఉంటాయి.

తప్పదు.

అయినా.. 

పెద్ద తలకాయ..

మూల విరాట్టు

అద్వానీనే ప్రమిద లేని 

దీపం అయిపోయిన రాజకీయాల క్రీడలో

మిగిలిన వాళ్ళెంత..

ఉత్త సమిధలు!


✒️✒️✒️✒️✒️✒️✒️


ఎలిశెట్టి సురేష్ కుమార్

     జర్నలిస్ట్

   9948546286

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు