కెసిఆర్ కు దేవె గౌడ మద్దతు

 


దేశంలో మత త్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నందుకు సీఎం కేసీఆర్ ను దేవెగౌడ అభినందించారు. ఈ క్ర‌మంలో సీఎం కేసీఆర్‌కు దేవేగౌడ ఫోన్ చేశారు. దేవేగౌడ మాట్లాడుతూ రావు సాబ్…మీరు అద్భుతంగా పోరాడుతున్నారు. మత తత్వ శక్తుల మీద ఎవరమైనా పోరాటాన్ని కొనసాగించాల్సిందే. దేశ లౌకికవాద సంస్కృతిని, దేశాన్ని కాపాడుకునేందుకు మేమంద‌రం మీకు అండగా వుంటాం… మీ యుద్దాన్ని కొనసాగించండి.. మా సంపూర్ణమద్దతు మీకు ఉంటుంది అంటూ దేవేగౌడ తన మద్దతును ప్రకటించారు. తాను త్వరలోనే బెంగళూరుకు వచ్చి సమావేశమ‌వుతాన‌ని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ దేవేగౌడ‌కు తెలిపారు.

ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్ బీజేపీపై స్వరం పెంచారు. తెలంగాణ శాసనసభ ఎన్నికలకు మరో 22 నెలల గడువు ఉంది. ఈ స్థితిలో అన్ని వైపుల నుంచి ప్రశంసలు అందుకునేందుకు.. మోదీ గుజరాత్ మోడల్ ను కూడా కేసీఆర్ ప్రశ్నించారు. 2014 లోకసభ ఎన్నికలకు ముందు మోడీ గుజరాత్ మోడల్ తెర మీదికి వచ్చిన విషయం తెలిసిందే. మోడీ వ్యక్తిగత ప్రతిష్ట రాజకీయాల్లో పెరగడానికి అది ప్రధానమైన కారణం. 


కేసీఆర్ మోదీని వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకుని విమర్శిస్తూ వస్తున్నారు. ఊపర్ షెర్వానీ, అందర్ పరేషానీ అని ఆయన వ్యాఖ్యానించారు. మోడీ డ్రెస్ కోడ్ మీద వరుసగా వ్యాఖ్యలను సంధిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలు జరుగుతున్న సమయంలో రవీంద్రనాథ్ ఠాగూర్ మాదిరిగా కనిపించడానికి గడ్డం పెంచుకున్నారని ఆయన మోదీని విమర్శించారు. అరే బాప్ రే... తమిళనాడు వెళ్తే లుంగీ ధరించాల్సిందే, ఏమిటిది అని అన్నారు. ఈ విధమైన గిమ్మిక్కుల వల్ల దేశానికి ఒరిగేదేమిటని ఆయన ప్ఱశ్నించారు. 

మోదీది అట్టర్ ఫ్లాప్ ప్రభుత్వమని ఆయన వ్యాఖ్యానించారు. సర్జికల్ స్ట్రైక్ ను ఆయన ఈ సందర్భంలో తెర మీదికి తెచ్చారు. సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయని చెప్పడానికి ఆధారాలు కావాలని రాహుల్ గాంధీ అడిగితే తప్పేమిటని, ఎఐసిసి అధ్యక్షుడిగా ఆయన అడిగారని, ఇప్పుడు తాను అడుగుతున్నానని, ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. సుదీర్ఘంగా సాగిన మీడియా సమావేశంలో ఆయన అనేక విషయాలను ముందుకు తెచ్చారు. బీజేపీని అధికారం నుంచి తరిమి కొడుతామని, ప్రజలు కోరితే జాతీయ స్థాయిలో రాజకీయ పార్టీ పెడుతానని ఆయన చెప్పారు. 

జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించాలనే కేసీఆర్ ఉద్దేశం కొత్తదేమీ కాదు. 2018 నుంచి ఆయన అందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే శాసనసభకు ముందస్తు ఎన్నికలు జరిగేలా చూసుకున్నారు. 2019 మార్చి -ఏప్రిల్ లో జరగాల్సిన ఎన్నికలను 2018 డిసెంబర్ లో జరిగేలా చూసుకున్నారు. అయితే, ఆ సమయంలో కేసీఆర్ ప్రధానంగా కాంగ్రెసుకు సవాళ్లు విసురుతూ వెళ్లారు. రాహుల్ గాంధీని అతి పెద్ద బఫూన్ గా అభివర్ణించారు. ప్రధాని మోదీకి దగ్గరవుతూ వచ్చారు. కేసీఆర్ కు బిజెపి బీ టీంగా పేరు వచ్చింది. బీజేపీకి వ్యతిరేకంగా ఆయన ఒక రకంగా అకస్మాత్తుగా, తీవ్ర వైఖరిని ప్రదర్శిస్తూ వస్తున్నారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు