గేల్ ఓంవేట్ కు జోహార్లు


జ్యోతిరావు ఫూలేపై తొలి డాక్టరేట్ చేసిన అమెరికన్ భారతీయురాలు *గేల్ ఓంవేట్ కు జోహార్లు* !



2 ఆగస్టు 1941లో అమెరికా నందు పుట్టి డిగ్రీ చేసి, ఇండియాలోని స్త్రీలు, ఓబీసీ, ఎస్సి, ఎస్టి లపై పరిశోధనాత్మా గ్రంథాలు రాసిన మహా మేధావి, సామాజిక శాస్త్రవేత్త గేల్ ఓంవేట్ (81) ఆగస్టు 25 న ఉదయం అనారోగ్యంతో మరణించారు. ఆమె 1970 లో ఉన్నత విద్యను పొందడానికి ఇండియాకు వచ్చారు. ఆనాడు దళితబహుజన ఉద్యమానికి అకర్షితులైయ్యారు. భారత దేశ చరిత్రలోనే తొలిసారిగా జాతిపిత జ్యోతిరావు ఫూలే, సావిత్రిమాయి ఫూలే వారిపై సత్యశోధక ఉద్యమంపై పి.ఏచ్.డి డాక్టరేట్ చేసి, వారిని విశ్వవ్యాప్తం చేసిన ఘనత ఆమెకే దక్కింది. ఆమె గొప్ప రచయిత, గ్రంథాకర్తనే గాకుండా దేశవ్యాప్తంగా అనేక యూనివర్సిటీలో, సభల్లో దేశీయ సమతవాదులైన బుద్ధుడు, ఫూలే, అంబేడ్కర్, సూఫీ సంత్ ల గురించి సైద్ధాంతిక ప్రచారం చేసిన మహిళల్లో ప్రథములు. ఇండియా చరిత్రలోనే కుల వ్యవస్థపై లోతైన మేధో మంథనం చేసిన కుల నిర్ములనవాది, మార్కిస్టు, గొప్ప స్త్రీ విముక్తివాది, మానవ హక్కుల పరిరక్షణ యోధురాలు. 1980 లో మహారాష్ట్ర లోని ప్రఖ్యాత మార్కిస్టు, శ్రమిక్ ముక్తి దళ్ నేత భరత్ పాఠంకర్ (మరాఠా - కాపు) తో సాంగ్లీ జిల్లా కాసేగావ్ లో ఆదర్శ వివాహం అయింది. ఆమె ప్రత్యేక్షంగా పలు రైతుల పోరు, బహుజన పోరాటాల్లో క్రియాశీలకంగా పాల్గొన్నారు. జైలు పాలయ్యారు. గేల్ ఓంవేట్ పలు జాతీయ ఇంగ్లీష్ దినపత్రికలో విశ్లేషణాత్మక వ్యాసాలు రాశారు. మహారాష్ట్రలోని గొప్ప సూఫీ సంత్ ల మరాఠీ గాథలను / పద్యాల్ని ఇంగ్లీష్ లోకి అనువాదం చేసి మరాఠీత్తెర లోకానికి పరిచయం చేసింది. ఇంతేగాకుండా 25 కు పైగా అమూల్యమైన బహుజన శ్రామిక సైద్ధాంతిక గ్రంథాల్ని లిఖించారు. ఉద్యమ సమయాల్లోనే భార్య భర్తలిద్దరు బౌద్ధ ధర్మాన్ని స్వీకరించారు. "బుద్ధిజం ఇన్ ఇండియా" అనే గొప్ప రీసర్చ్ గ్రంథం రాసి, దాని ద్వారా ఆమె విశ్వాఖ్యాతిని పొందిన విషయం అవగతమే. గేల్ సాదాసీదా కామ్రేడ్ తరహాలో తన జీవనం సాగించారు. ప్రజల ద్వారా పురస్కారాలు, అవార్డులతో, ప్రశంశలతో కామ్రేడ్ గేల్ జీవితం సాఫల్యం మైంది. దేశం నేడు ఓ ఆణిముత్యం కోల్పోయింది. నేడు ఆమెకు సమస్త శ్రామిక బహుజన లోకం చేతులెత్తి సెల్యూట్ చేస్తున్నారు.


మూల్ నివాసి మాల : 9869010890

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు