తెలంగాణలో పీవీ పేరుతో కొత్త జిల్లా

 ఈటెలను ఇరకాటంలో పెట్టే ఎత్తులో సిఎం కెసిఆర్ వ్యూహం
హుజూరాబాద్ కేంద్రంగా 12 లేదా 14 మండలాలతో కొత్త జిల్లా


తెలంగాణ లో మరో కొత్త జిల్లా ఏర్పాటు కాబోతోందా... హుజూరాబాద్ కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు అవుతుందని పార్టి వర్గాల్లో చర్చ సాగుతోంది. భారత మాజి ప్రధాన మంత్రి పి.వి.నర్సింహారావు పేరిట కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఇప్పటికే  సూచనలు చేసినట్లు తెలుస్తోంది. సిఎం కెసిఆర్ కు అత్యంత సన్నిహితులు అయిన మాజి మంత్రి, ఎంపి కెప్టెన్ లక్ష్మికాంత రావు పి.వి నర్సింహారావు పేరిట కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని సిఎం కెసిఆర్ ఎదుట ప్రస్తావించారని సమాచారం. కెప్టెన్ లక్ష్మి కాంత రావు మాట కాదనని సిఎం అందుకు అంగీకరించి జూన్ 28 న జరిగే పి.వి శతజయంతి రోజు కొత్త జిల్లా ఏర్పాటు కాని లేదా ప్రకటన కాని చేస్తారని టిఆర్ఎస్ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. హుస్నాబాద్‌,హుజూరాబాద్‌లో ఉన్న మండలాలతో కొత్తగా జిల్లా ఏర్పాటు చేయాలని గతంలో ఈ నియోజవర్గాలకు చెందిన నేతలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు.

కొత్త జిల్లా ఏర్పాటు వెనకాల మరో రాజకీయ వ్యూహం కూడ ఉంది. మాజిమంత్రి ఈటల రాజేందర్ ను హుజూరాబాద్ లో జీరో చేసే వ్యూహంతో పావులు కదుపుతున్న సిఎం కెసిఆర్ పి.వి పేరిట ఏర్పాటు చేయబోయే కొత్త జిల్లా అందుకు బాగా ఉపకరిస్తుందని ఆలోచిస్తున్నారు.

పి.వినర్సింహారావు శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తు ఆయన పట్ల ఎన లేని గౌరవం ప్రకటించిన ముఖ్యమంత్రి ఆయన కుటుంబానికి కూడ అత్యంత ప్రాధాన్యత నిచ్చారు. ఆయన కూతురు సురభి వాణి దేవికి ఎమ్మెల్సి టికెట్ ఇచ్చి అనూహ్యంగా గెలిపించారు. భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో పి.వి నర్సింహారావు ఇంటిని పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దుతున్నారు.

హూజురాబాద్ ను జిల్లా చేయడం వల్ల  కూతవేటు దూరంలో ఉండే పి.వి స్వగ్రామం వంగర కు ప్రాముఖ్యత పెరుగుతుంది. హుజురాబాద్ నియోజవర్గంలో ఉన్న  భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్‌ మండలాలు వరంగల్ అర్బన్ జిల్లాలో ఉన్నాయి. ఈ మండలాలను వరంగల్ అర్బన్ నుండి విడదీసి కొత్తగా ఏర్పాటు చేేసే పి.వి నర్సింహారావు జిల్లాలో చేర్చనున్నారు. వీటితో పాటుగా హుజురాబాద్, శంకరపట్నం, వీణవంక, జమ్మికుంట, ఇల్లంతకుంట, సైదాపూర్, చిగురుమామిడి మండలాలను ఇందులో చేర్చనున్నారు.  

ఈటల ఎమ్మెల్సే పదవికి రాజీనామా చేసిన నేపద్యంలో ఉప ఎన్నికల్లో కొత్త జిల్లా ఏర్పాటు ప్రధాన అంశంగా మారనుంది. కొత్త జిల్లాలో మొత్తం 12 లేదా 14 మండలాలు ఉండేలా కసరత్తు చేస్తున్నారని సమాచారం.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు