నా Certificate కథ - అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు

 అట్టడుగు వర్గంలో పుట్టి అనంత కష్టాలతో పెరిగి కసితో జీవితాన్ని జయించిన  అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు...తన చిన్ననాటి కథ  సోషల్ మీడియాలో పంచుకున్నాడు.
ఇది చదివిన వారంతా తమ కథ కూడ ఇదేనని కన్నీటి పర్యంతం అయ్యారు...స్పూర్తి దాయకం అయిన ఐఏఎస్ అధికారి యదార్థ గాధ ఇది

నా Certificate కథ



1992 వ సంవత్సరం…..

కొలిమిగుండ్ల గ్రామం....

మండల రెవెన్యూ అధికారి కార్యాలయం (MRO Office) ....

మధ్యాహ్న సమయం…

ఓ పది మీటర్ల దూరంలో..MRO Office ఎదురుగా ఓ ఫారం చెట్టు ....prosopis juliflora ( కంప చెట్టు. దీన్ని ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా పిలుస్తారు)

దాని కింద వున్న చిన్న అరుగులాంటి బండమీద కూర్చుని ఉన్నాడు, ఓ పదకొండు సంవత్సరాల అబ్బాయి.

ఆ కంపచెట్టు తెరిపెలు తెరిపెలుగా వుంది. ఎక్కువ నీడను కూడా ఇవ్వలేకపోతుంది.

అది తప్ప ఇంక అక్కడ నీడ వున్న ప్రదేశం ఏదీ లేదు. దాని క్రిందనే తలదాచుకోవాలి, లేదంటే ఎండలో మాడాలి. వేరే మార్గం లేదు.

ఆ అబ్బాయి ఆ చెట్టు కింద వున్న గజం రాయి మీద కూర్చొని MRO Office వైపు చూస్తూ వున్నాడు.


ఏమైనా పిలుపు వస్తుందేమోనని.

---------------------------------

దాదాపు పదకొండున్నర – పన్నెండు ప్రాంతంలో వచ్చాడు అక్కడికి.

అక్కడ కార్యాలయంలో వున్న అధికారిని అడిగితే “వేచి వుండు, MRO (Mandal Revenue Officer) గారు వచ్చిన తర్వాత నీ పని చూస్తారు” అని చెప్పాడు.


ఆ MRO రాక కోసం...

ఆ కార్యాలయ అధికారి పిలుపు కోసం ...


చూస్తూ అక్కడే పడిగాపులు కాస్తూ కూర్చున్నాడు ఆ అబ్బాయి.

ఇంకో పెద్దాయన వచ్చి ఆ బండ మీద కూర్చుంటూ ఆ అబ్బాయిని అడిగాడు,

“ఏం నాయనా! ఇక్కడ కూర్చున్నావు? ఏం పని కోసం వచ్చావు?”

“Caste Certificate కోసం వచ్చాను పెద్దాయన”

“దాదాపుగా నెల రోజుల పైనే అయింది అప్లికేషన్ పెట్టి, ఈరోజు ఇస్తామన్నారు, అందుకే వచ్చాను.”

“ఎవరు చెప్పారు?”

“మా ఊరి తలారి (Village Revenue Assistant) చెప్పాడు.”

“ఒక్కడివే కనపడుతున్నావ్? పెద్దలెవరూ రాలేదా , నీతో పాటు?”

“లేదు, పెద్దాయన. మా అమ్మానాన్న పనికి వెళ్లారు. నన్ను వెళ్లి Certificate తెచ్చుకోమన్నారు”

“ఏం చదువుతున్నావ్?”

“ఐదవ తరగతి చదువుతున్నాను. అది అయిపోవచ్చింది. నవోదయ స్కూల్కు పరీక్ష వ్రాశాను. Select అయ్యాను. అన్ని Certificates తీసుకుని రమ్మని letter వచ్చింది.”

Caste Certificate MRO Office లో ఇస్తారు కదా! దాని కోసం చాలా రోజులయ్యింది apply చేసుకొని. ఇప్పుడు ఇస్తారు వెళ్లి తీసుకోమని మావూరి తలారి చెప్పాడు, అందుకే వచ్చాను.

------------------------

“నాన్న, నాకు Caste Certificate మరియు ఇతర Certificates అన్నీ originals తీసుకొని రమ్మన్నారు, నవోదయ స్కూలుకు.”

ఆరో తరగతి లో join అవ్వాలంటే అన్ని certificates తీసుకొని వెళ్లాలంట!”

“సరే మరి, నేనైతే రాలేను, నేను పనికి వెళ్ళాలి. ఇంతకు ముందు photo తీసుకోవడానికి వెళ్ళా వ్ కదా! వారు వెళ్లినప్పుడు వెళ్లు మరి.”

“వాళ్లు select కాలేదంట, వాళ్ళు ఇప్పుడు Certificate తీసుకోవడానికి రారు.”

“సరే మొన్ననే కదా! నువ్వు వాళ్లతో కలిసి కొలిమిగుండ్ల వెళ్లి వచ్చావు, బస్సుల రూటు తెలుసుకదా! ఒక్కడివి వెళ్లిరాలేవా”

“నువ్వు రాలేకపోతే నేను వెళ్లి వస్తాను. నాకు చార్జీకి డబ్బులివ్వు మరి.”

“ఎంత?”

“పేరుసోముల నుండి తిమ్మనాయుని పేటకు రూపాయిన్నర అక్కడి నుండి కొలిమిగుండ్ల కు రెండు రూపాయిలు... మొత్తం మూడున్నర.

మూడున్నర రాను, మూడున్నర పోను మొత్తం ఏడు రూపాయలు అవుతుంది.”

“సరే, ఇదిగో! ఈ పది రూపాయలు తీసుకో!”

మధ్యాహ్నం పూట అక్కడే కొలిమిగుండ్లలో ఏదో ఒకటి కొనుక్కుని తిను.”

అంటూ తీసి పది రూపాయలు చేతిలో పెట్టారు.

“డబ్బులు జాగ్రత్త. అజాగ్రత్తగా వుండి డబ్బులు పోగొట్టుకున్నావంటే అంతే సంగతులు”

పది రూపాయలు తీసుకొని జాగ్రత్తగ, పొద్దున్నే వేసుకోవాల్సిన నిక్కర్ జేబులో పెట్టుకొని పడుకున్నాను

మరుసటి రోజు పొద్దున్నే లేచి, తయారయ్యి భోంచేసి ఎనిమిది కల్లా బయలు దేరాను.

అంగీ (Shirt) నిక్కరు(half pant) వేసుకొని పది రూపాయల నోటును జాగ్రత్తగా పెట్టుకొని, పేరుసోముల దగ్గర వున్న బస్సు ఆగే స్ధలంలో వచ్చి నిలబడ్డాను.

పేరుసోముల నుండి తిమ్మనాయుని పేట, అక్కడి నుండి కొలిమిగుండ్ల వచ్చేసరికి జేబులో ఒక అయిదు రూపాయల నోటు, ఒకటిన్నరూపాయల చిల్లర మిగిలింది. కండక్టర్ ఇచ్చిన డబ్బులు అంగీ జేబులో పెట్టుకొని, బస్సు దిగి సరాసరి MRO Office కి వెళ్లి అక్కడ వున్న Junior Assistant ను కలిసి వచ్చిన పని చెప్పగానే

MRO గారు బయటికి వెళ్లారు. వచ్చిన తరువాత కలువు అని చెప్పడంతొ, నేను ఫారం (ముళ్లకంప) చెట్టు కింద కూర్చుని wait చేస్తూ వున్నాను.

అక్కడికి ఓ మాదిరిగా జనాలు వస్తూ పోతూ వున్నారు. MRO Office ఎదురుగా ఒకాయన తెల్ల బట్టలు వేసుకొని

కుర్చీ మీద కూర్చొని వచ్చిపోయే వారితో మాట్లాడుతూ వున్నాడు. కాలి మీద కాలు వేసుకుని దర్జాగా కూర్చున్నాడు కుర్చీలో. వచ్చిన వారు చేతులు కట్టుకుని నిలబడి మాట్లాడుతూ వున్నారు

“ఏం కావాలి నీకు?”

“Certificate కోసం వచ్చాను.”

“ఆ గదిలో clerk (Junior Assistant) వుంటాడు. ఆయన్నివెళ్లి అడుగు.”

ఆయన చూపించిన వైపున వున్న రూమ్ దగ్గరికి వెళ్లి అక్కడ వున్న వారిలో ఒకరితో అడిగాను – “సర్, నాకు Caste Certificate కావాలి apply చేసి చాల రోజులయింది. ఈ రోజు వస్తే ఇస్తామని చెప్పారు.

“ఏం పేరు?”

“గంధం చంద్రుడు”

“ఏ ఊరు”

“కోటపాడు”

“సరే, wait చెయ్యి MRO గారు సంతకం చేయ్యాల్సి వుంది. సార్ వచ్చి సంతకం చేసిన తరువాత ఇస్తాం

“అలాగే సర్.”

-----------------

MRO గారు ఎప్పుడు వస్తారో తెలియదు. ఎప్పుడు వెళతారో తెలియదు. ఒక వేళ నేను తినడానికి బయటికి వెళ్తే, ఆయన వచ్చి వెళ్లిపోతే?

లేదు లేదు, నేనెక్కడికి వెళ్లకూడదు. Certificate తీసుకొని కావాలంటే అప్పుడు తింటాను ఏమైనా...


పన్నెండు…

ఒకటి…

రెండు…

మూడు…

నాలుగు గంటలు గడిచిపోయాయి.

ఆ ముల్లకంప చెట్టు కింద, అటూ ఇటూ తిరుగుతూ వచ్చిపోయేవారిని గమనిస్తూ.... వున్నాను. చెట్టు కింద వున్న బండ కాలుతూ వుంది, ఎండకు కాళ్లు కాలుతూ వున్నాయి, చెప్పులు లేక.


అటూ ఇటూ తిరుగుతూ ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ వున్నాను.


దాదాపు మూడున్నర ప్రాంతంలో వచ్చారు MRO గారు. సరాసరి ఆయన room లోకి వెళ్లిపోయారు.

అప్పటు వరకు అక్కడ దర్జాగా తెల్ల బట్టలు వేసుకొని, కూర్చీలో కాలు మీద కాలు వేసుకొని కూర్చున్న వ్యక్తి*, MRO గారు రాగానే ఒక్క ఉదుటున లేచి, కుర్చీని పక్కకు జరిపి, వంగి ఆయన నమస్కారం పెట్టి, ఎక్కడలేని వినయం ప్రదర్శించాడు.

నాకు అది చూసి ఆశ్చర్యం అనిపించింది. మళ్లీ clerk వున్న రూమ్ లోకి వెళ్లి ఆయనకు గుర్తు చేశాను. MRO గారు వచ్చారు అని. సరే, నేను తీసుకొని వెళ్తాను files అన్ని, నువ్వు wait చెయ్యి అన్నట్లు చూపించాడు నాకు. మళ్లీ పదినిమిషాలు అటూ ఇటూ తిరిగి మళ్లీ దగ్గరికి ‌వెళ్లాను. ఈ సారి బిళ్ల బంట్రోతు అడిగాడు.



“నీ పని కూడా అయిపోయిందిలే! ఏమన్నా తెచ్చావా?” నన్ను చూస్తూ అన్నాడు బిళ్ల బంట్రోతు.

నాకు అర్ధం కాలేదు


“ఏమన్నా తెచ్చావా? అంటే చాలా చూస్తావేం?”

“డబ్బులున్నాయా?”

లేవని కానీ, వున్నాయనీ కానీ చెప్పకుండా అలా వుండిపోయాను నేను.

నేను ఏమీ చెప్పక పోయేసరికి, ఆయన నా file ను పక్కన పెట్టి మిగతా Certificate/Files మీద ఎక్కడయితే MRO గారు సంతకం చేశారో, దాని కింద అధికారిక stamp వేస్తూ, వచ్చిన వారికి వచ్చినట్టు certificates ఇస్తూవున్నాడు. వారు ఆయనకు ఏదో ఇస్తున్నారు. చేతిలో చెయ్యి కలుపుతూ

ఒక్కొక్కరి నుండి ఒక్కో పద్ధతి…

ఒకరికేమో గోడ చాటుకు వెళ్ళి ఏదో చేతిలో చెయ్యి పెట్టి తీసుకొని, వెంటనే certificate తెచ్చి ఇస్తున్నాడు. ఇంకొకరితో అలా పది అడుగుల దూరం నడిచి, మళ్లీ లోపలికి వెళ్లి వాళ్ల certificate/Documents వాళ్లకి ఇస్తున్నాడు.

మద్యమద్యలో నా వైపు చూస్తూ వున్నాడు.

ఇదంతా నాకు అర్ధం కావడం లేదు. అందరికీ Certificate/documents ఇస్తూవున్నాడు. నాకు మాత్రం ఇవ్వట్లేదు.

ఒకవైపు ఎండ...

ఒకవైపు ఆకలి...

బంట్రోతేమో certficate ఇవ్వడం లేదు.

వుండబట్టలేక మళ్లీ అడిగాను, “ నా certificate ఇవ్వండి.”

“సరే, ఇటు రా”

దగ్గరికి వెళ్లాను.

నా చొక్కా జేబులో చెయ్యి పెట్టాడు. అందులో అయిదు రూపాయిల నోటు చిల్లర ఆయన చేతికి చిక్కాయి.

నేను వెనక్కి జరగబోయాను, చేతిని అడ్డు పెట్టబోయాను.

కానీ రెండూ జరగలేదు. అంత వేగంగా జేబులో చెయ్యి పెట్టడం, డబ్బులు తీసుకోవడం క్షణాల్లో జరిగిపోయాయి.

లోపలికి వెళ్లి certificate బయటికి తెచ్చి, అక్కడ వున్న stool మీద దాన్ని వుంచి నా ఎదురుగానే దాని మీద MRO గారి designation stamp, office stamp (Round stamp) వేసి…

“ఇదిగో నీ certificate తీసుకో.”

నాకు certificate ఇచ్చినందుకు సంతోషం కంటే, జేబులో నుండి ఉన్న డబ్బు మొత్తం లాక్కునందుకు ఎక్కువ బాధ కలిగింది. కొద్ది సేపు ఆగాను, ఆయన ఏమన్నా కనికరించి నా డబ్బులు నాకు తిరిగి ఇస్తాడేమోనని. ఆయనకు అటువుంటి ధ్యాసే లేదు. ఆయన మిగతా certificates కు stamp వెయ్యడం, వాటికోసం వారితో పక్కకు వెళ్లడం, వారితో చెయ్యి కలపడంలో busy గా ఉన్నాడు.

అప్పటికి దాదాపు అయిదున్నర కావస్తుంది టైం.

ఏం చెయ్యాలో కొద్ది సేపు పాలుపోలేదు నాకు. కొద్ది సేపటికి మా అత్తగారి ఊరు - బెలుం - గుర్తుకువచ్చింది. అది కొలిమిగుండ్ల నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

------------------------x------------------------------x-----------------------------------------------

చిన్న సుబ్బమ్మ- మా మేనత్త, బెలుం లో ఉంటారు. ఆవిడంటే నాకు చాలా ఇష్టం. తను కూడా చిన్న అల్లుడినైన నన్ను చాలా మురిపెంగా చూసుకుంటుంది. బెలుం కు బస్సులో వెళ్లాలన్నా రూపాయిన్నర కావాలి. అది కూడా లేకుండా తీసుకున్నాడు ఆ బిళ్ల బంట్రోతు. ఇంక ఎక్కువసేపు ఆలోచించలేదు. వేగంగా నడుచుకుంటూ వెళ్తే ఒక గంట - గంటన్నర లో బెలుం చేరుకోవచ్చు.


అనుకున్నదే తడవుగా, కాళ్లకి పని చెప్పాను. కడుపు ఆకలితో నక నక లాడుతూవుంది. ఎండకు దుమ్ము, ధూళి కొట్టుకు పోయి ఉన్నాను. Certificate ను జాగ్రత్తగా ఒక పేపర్ లో చుట్టి రౌండుగా చేసి జేబులో పెట్టుకున్నాను.

కొలిమిగుండ్ల నుండి బెలుంకు సింగల్ రోడ్డు. ఎప్పుడూ పాడయిపోయి గతుకులు గతుకులుగా ఉంటుంది. ఆ దారిలో నాపరాళ్ల గనులు చాలా వున్నాయి. అందులో పని చేసేవారు మూడు నాలుగు లోపు పనులు ముగించి ఇళ్లకు వెళ్తారు. ఐదు వరకు ఎవ్వరూ ఉండరు. అంతా నిర్మానుష్యంగా ఉంటుంది.

రోడ్డు మీద ఒక్కడినే నడవడం మొదలు పెట్టాను, భయపడుకుంటూనే. చిన్న అడుగులు ఎంతగా వెయ్యాలనుకున్న ఎక్కువ దూరం పడవు. వేగంగా వెళ్లడం ఒక్కటే మార్గం. ఇక లాభం లేదనుకుని పరిగెత్తడం మొదలు పెట్టాను . ఆయాసం వచ్చేంత వరకు పరిగెత్తడం, ఆయాసం తగ్గేంత వరకు నడివడం తర్వాత మళ్లీ పరిగెత్తడం - మళ్లీ నడవడం

- పరుగు

- నడక -

ఇలా సాగింది నా ప్రయాణం. కొద్ది కొద్దిగా సూర్యకాంతి తగ్గుతూ ఉంది. ఆ పెద్ద కొండల వలన సూర్యుడు పూర్తిగా కనిపించకుండా అయిపోయాడు. దాదాపు చీకటిపడిపోయింది.

భయం భయంగా, వేగంగా వెళ్లాలన్న ఆతృతతో రొప్పూతూ certificate ను, గుండెను అరచేతిలో పెట్టుకుని వెళ్లాను. దాదాపు పూర్తిగా చీకటిపడుతున్న సమయానికి ఆరున్నర ప్రాంతంలో బెలుం లో ఉన్న మా అత్తగారింటికి చేరిపోయాను. బయట నవారు మంచం మీద మా మామ కూర్చుని వున్నాడు. ఆయన ఎవరితోనో మాట్లాడుతున్నాడు. నన్ను గమనించలేదు. నాకు ఆగి ఆయన్ని పలకరించే పరిస్ధితి లేదు. సరాసరి ఇంటిలోపలికి ‌వెళ్లాను.

ఇంటి లోపలికి అడుగు పెట్టేటప్పుడు గమనించింది మా అత్త.

“ఏం నాయనా! బాగున్నావా?”

“ఈ టైములో వచ్చారేమి?” పెద్ద వాళ్లతో కలిసి వచ్చాననుకుని ఇంకా బయటకి చూస్తూ వుంది.

మిగతా వారు ఎక్కడా అన్నట్టు. ఎవరూ వెనక లేకపోయెసరికి అప్పుడు అడిగింది -

“ఒక్కడివే వచ్చావా?”

“అవును, ఒక్కడినే వచ్చాను”

కాళ్లంతా దుమ్ము పట్టిపోయి వున్నాయి. మాటలు రావడం లేదు. నోరు ఎండిపోయి ఉంది. నీళ్లు ఇవ్వమన్నట్టు సైగ చేసాను. సూరి - మా అత్త కొడుకు - నాకంటే నెల రోజులు చిన్నవాడు - వెంటనే నీళ్లు తెచ్చి ఇచ్చాడు. గబగబా నీళ్లు తాగి మంచం మీద కూర్చున్నాను, కాళ్లు నొప్పి పెడుతుంటే.


“తిన్నావా?”


“లేదు”

“ఎలా వచ్చావు?”

“కొలిమిగుండ్ల నుంచి నడుచుకుంటూ...”


అప్పుడు అర్ధం అయ్యింది మా అత్తకు ఏదో పొరపాటు జరిగింది అని. వచ్చి పక్కన కూర్చింది. తల మీద చెయ్యి వేసి నిమురుతూ అడిగింది - ఏం జరిగిందని - మొత్తం జరిగిందంతా చెప్పాను. కళ్లలో నీళ్లు తిరుగుతుండగా.

గట్టిగా హత్తుకుని మంచం మీద నుంచి లేచి వంట గదిలోకి వెళ్లి పళ్లెం లో అన్నం, పప్పు పెట్టుకుని వచ్చి - తినమని ఇచ్చింది. నా పక్కనే పడుకుని రాత్రి కాళ్లు పిసుకుతూ పడుకుంది. వాళ్లను శాపనార్ధాలు పెడుతూ.

పొద్దునే లేచి అత్త తో డబ్బులిప్పించుకుని కోటపాడుకు బయలుదేరాను.

------

వచ్చిన తర్వాత ముందు రోజు రాత్రి మా ఇంట్లో జరిగిన విషయం తెలిసింది.

“చిన్నోడు వచ్చాడా?” పనిముగించుకుని తిరిగి వచ్చి, కాళ్లు కడుక్కుంటూ అడిగాడు నాన్న, అమ్మని. అప్పటికి దాదాపు ఏడు గంటలు అవుతుంది. ఇంకా రాలేదా? సరే నేను bus stop దగ్గరికి వెళ్లి తీసుకుని వస్తాను అని, అమ్మ - భోజనం తిని వెళ్లు అని అంటూ వున్నా వినకుండా గబగబా వెళ్లిపోయాడు.

పొద్దున్నుంచి సాయంత్రం వరకు పని చేసి బాగా అలసి పోయి ఉన్నాడు. కాళ్లు, చేతులు కడుక్కుని, భుజం మీద towel వేసుకుని bus stop కి వెళ్లాడు.

పేరుసోములలో తిమ్మనాయుని పేట నుండి కోవెలకుంట్ల వళ్లే బస్సులో రావాలి అబ్బాయి. చివరి బస్సు దాదాపు రాత్రి ఏడున్నర - ఎనిమిది మద్య వస్తుంది. దారిలో వేరేవాళ్లు ఎదురైతే వాళ్లను అడిగాడు - మా చిన్నబ్బాయిని ఏమన్నా చూసారా అని.

చివరి బస్సు ఎనిమిది గంటలకు వచ్చింది. అందులో కోటపాడు వాళ్లు ఒకరిద్దరు దిగారు - నేను కనపడలేదు. దిగిన వారిని ఆత్రంగా అడిగాడు - మా చిన్నబ్బాయిని ఎక్కడైనా చూసారా? అని. అందరి నుండి లేదు/చూడలేదు అన్న సమాధానమే వచ్చింది.

bus stop లో దాదాపు ఒక గంట సేపు - అంటే తొమ్మిది వరకు వేచిచూసి, ఏం చెయ్యాలో దిక్కుతోచలేదు ఆయనకు, నాన్నకు భయం పట్టుకుంది. ఏమన్నా అయ్యిందా అబ్బాయికి. లేదా పని జరగక అక్కడే ఆగిపోయాడా? ఎవరైనా ఏమైనా చేశారా? ఏం చెయ్యాలో పాలుపోక బాధపడుకుంటూ తిరిగి ఇంటికి వచ్చాడు.

ఆ కాలంలో ఫోన్ లు లేవు - atleast మా గ్రామంలో ఎవరికీ landline కూడా లేదు.

ఏమైపోయాడు, ఎలావున్నాడు తెలుసుకునే మార్గమే లేదు. పోనీ కొలిమిగుండ్ల కి వెళ్దామంటే బస్సులు లేవు ఆ టైములో... ఇతర వాహనాలు అద్దెకు తీసుకొని వెళ్లడానికి కూడా దొరకవు. దొరికినా వాటిని అద్దెకు తీసుకునేంత స్థోమత లేదు.

ఇంటికి వచ్చీ రాగానే అమ్మ భయంగానే అడిగింది - ఎక్కడ పిల్లోడు అని. రాలేదు అని చెప్పగానే ఒకటే ఏడుపు.

నాన్న లోలోపల ఏడుస్తున్నాడు. అమ్మ బయటకి ఏడుస్తూ ఉంది గట్టిగా. వండిన భోజనం అలానే ఉంది. నాన్న బస్టాండుకు వెళ్లాడు కదా - పిల్లోడిని తీసుకు వస్తాడు కదా - అప్పుడు అందరం కలిసి తిందాం అని అమ్మ కూడా తినలేదు. నాన్న ఒక్కడే తిరిగి వచ్చేసరికి ఇద్దరికీ తినాలనిపంచలేదు.

రాత్రంతా ఒకటే ఏడుపులు.... మధ్యమధ్యలో నాన్న ధైర్యం చెప్తున్నాడు అమ్మకు – “ఆ! ఏమి అయ్యింటాది. పని అయ్యిండదు. అక్కడే ఉంటాడు. పొద్దున్నేవచ్చేస్తాడులే.”

అన్ని దేవతలను వేడుకుంది అమ్మ మనసులో - వాళ్లతో వీళ్లతో మాట్లాడాడు నాన్న - ఏం చేద్దాం ఇప్పుడు అని. ఉదయం ఒకటి రెండు బస్సులు వచ్చేవరకు వేచి చూడడం తప్ప మార్గము లేదని చెప్పారు వాళ్ళు.

గుండెను అరచేతిలో పట్టుకుని రాత్రంతా ఏడుస్తూ, మేలుకుని ఉన్నారు. అమ్మ, నాన్న - ఇద్దరూ మరుసటి రోజు మధ్యాహ్నం నేను వచ్చిన తర్వాత కానీ భోజనం చెయ్యలేదు.

అలా ముగిసింది నా certificate కథ.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు