సరిహద్దుల్లో అంబులెన్సులు అడ్డుకోవడంపై హై కోర్టు ఆగ్రహం

 


రాష్ట్ర సరిహద్దుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చే అంబులెన్సులను ఆపకూడదంటూ గతంలో హై కోర్టు చేసిన సూచనను తెలంగాణ సర్కార్ పెడ చెవిన పెట్టడంతో హై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ సర్కార్ నిర్ణయాలపై హై కోర్టు   సీరియస్ అయింది. కర్నూలు జిల్లా సరిహద్దులోని పుల్లూరు చెక్‌పోస్టు వద్ద అర్ధరాత్రి తర్వాత నుంచి పెద్ద ఎత్తున అంబులెన్స్‌లు నిలిచిపోయాయి. ఇద్దరు కరోనా పేషంట్లు అంబులెన్సులోనే చనిపోయారు. సూర్యాపేట జిల్లా రామాపురం క్రాస్‌ రోడ్డు వద్ద కూడా ఏపీ అంబులెన్స్‌లను  నిలిపి వేశారు. 

అంబులెన్సులను నిలిపి వేయడంపై విశ్రాత ఐఏఎస్ అధికారి ఒకరు హై కోర్టులో శుక్రవారం లంచ్ అవర్ మోషన్ మూవ్ చేసారు.  దీంట్లో ఎపి హై కోర్టు కూడ ఇంప్లీడ్ అయింది. 

అంబులెన్స్‌లను ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించింది. అంబులెన్స్‌లు ఆపే అధికారం తెలంగాణ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది. దేశంలో ఇలాంటి సర్క్యులర్‌ ఎక్కడా ఇవ్వలేదని, ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చలేదని పేర్కొంది. ఇతర రాష్ట్రాల ప్రజలకే కాదు.. హైదరాబాద్ వాసులకు కూడా బెడ్‌ కన్ఫర్మ్‌ అవ్వట్లేదని, నేషనల్ హైవే యాక్ట్‌ను ఉల్లంఘించడానికి ప్రభుత్వానికి అనుమతి లేదని తెలిపింది. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది.

‘పేషంట్లను తీసుకొస్తున్న అంబులెన్స్‌లు ఆపడం ఎక్కడైనా చూశామా? రైట్ టు లైఫ్‌ను ఆపడానికి మీకు ఏం అధికారం ఉంది? ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి నిబంధన మేం చూడలేదు. రోగులు సరిహద్దుల్లోనే చనిపోతున్నారు. పేషెంట్లు చనిపోతుంటే మీరు సర్క్యులర్లు జారీ చేస్తారా?సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లోనూ జనరల్‌ బెడ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల ప్రజలకే కాదు.. హైదరాబాద్‌లో ప్రజలకు సైతం అడ్మిషన్ ఉండట్లేదు. హైదరాబాద్‌లో పేషెంట్లకు ఆక్సిజన్ అవసరమైతే.. చిన్న ఆస్పత్రుల నుంచి పెద్ద ఆస్పత్రులకు వెళ్లడం లేదా? గద్వాల్, ఖమ్మం, నిజామాబాద్ నుండి కూడా.. 300 కి.మీ ప్రయాణం చేసి పేషంట్లు వస్తున్నారు, వారిని ఆపుతున్నారా? రాజ్యాంగాన్ని మీరు మార్చలేరు’ అంటూ హై కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి ఒక్కరికి ప్రాణాలు కాపాడుకునే హక్కు ఉందని, విజయవాడ, హైదరాబాద్ మార్గం నేషనల్‌ హైవే.. దానికి కేంద్ర ప్రభుత్వంపై అధికారం ఉంటుందని తెలిపింది. తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి అధికారం ఉండదని పేర్కొంది. అంబులెన్స్‌లను ఆపడానికి తెలంగాణ సర్కార్‌కు హక్కు లేదని, ఇప్పటి వరకు దేశంలో ఎక్కడ కూడా.. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన సర్క్యులర్ లాంటిది ఇవ్వలేదని తెలిపింది. కోర్ట్ చెప్పినా కూడా ఆదేశాలు పాటించలేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు