రఘురామ కృష్ణరాజును అరెస్ట్ చేసిన ఏపీ సిఐడి పోలీసులు

 


నర్సాపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజుకు ఎపి సిఎం వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి షాక్ ఇచ్చారు. ఏపీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ -సీఐడీ పోలీసులు శుక్రవారం రఘురామ కృష్ణ రాజును అరెస్ట్ చేశారు. 

రఘురామకృష్ణ రాజును పోలీసులు విజయవాడకు తరలించినట్లు సమాచారం.

హైదరాబాద్‌లోని రఘురామ ఇంటికి వెళ్లిన సీఐడీ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. రఘురామరాజుపై ఐపీసీ- 124 ఏ సెక్షన్ కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఆయనను అరెస్ట్ చేశారు. అయితే, బలవంతంగా తన తండ్రిని పోలీసులు అరెస్టు చేశారని ఎంపీ రఘురామ కుమారుడు భరత్ తెలిపారు. 35 మంది వ్యక్తులు మఫ్టీతో వచ్చి, కనీసం వారెంట్ కూడా ఇవ్వకుండా తీసుకెళ్లారని ఆయన తెలిపారు. గుండె సంబంధిత వ్యాధితో తన తండ్రి రఘురామ బాధపడుతున్నారని, పుట్టిన రోజు నాడే అరెస్టు చేశారని తెలిపారు.

తన తండ్రికి ఆరోగ్యం కూడా బాగాలేదని భరత్ వాపోయారు. ఆయనకు గుండె శస్త్రచికిత్స జరిగింది మూడు నెలల కిందటేనని వెల్లడించారు. తమ ఇంటికి వచ్చింది మఫ్టీలో ఉన్న పోలీసులా, రౌడీలా అనేది అర్థంకాలేదని అన్నారు. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారమే వచ్చి, అకస్మాత్తుగా అరెస్ట్ చేసి తీసుకెళ్లారని ఆరోపించారు. కనీసం న్యాయవాదితో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదని తెలిపారు. ఈ అరెస్ట్ అన్యాయం అని, కోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేస్తామని వెల్లడించారు.

రఘురామకృష్ణరాజుపై 124/ఏ, 153/బీ, 505 ఐపీసీ, 120(బి) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు సమాచారం. సెక్షన్ 50 కింద రఘురామ భార్య రమాదేవికి సీఐడీ నోటీసులు ఇచ్చింది.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు