పెద్దపల్లిలో న్యాయవాది దంపతులను పట్ట పగలు హత్య చేసిన దుండగులు

 కల కలం రేపిన న్యాయవాద దంపతుల హత్య


పెద్దపల్లి జిల్లాలో న్యాయ వాద దంపతుల హత్య రాష్ట్ర వ్యాప్తంగా  కలకలం రేపింది.న్యాయవాదిని హత్య చేసింది  టిఆర్ఎస్ మండల అధ్యక్షులని ఆరోపణలు ఉన్నాయి. చనిపోయే ముందు న్యాయవాది వామనరావు ఆయన పేరు వెల్లడించాడని చెబుతున్నారు. వామన రావుదంపతులు పోలీస్ లాకప్ డెత్ కేసు వాదిస్తున్నారని సమాచారం.  దాంతో పాటు ఎమ్మెల్యే పుట్ మధు కు వ్యతిరేకంగా పలు కేసులు వాదిస్తున్నారని  తెలుస్తోంది. లాక్ అప్ డెత్  కేసు విషయంలో పోలీస్ కమీషనర్ సత్యనారాయణ రావు తో వాగ్వాదం జరిగిందని అంటున్నారు. అయితే హత్యలకు సంభందించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు నిందితులను పట్టు కునేందుకు 6 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. 

న్యాయ వాద దంపతుల హత్యలపై న్యాయ వాదులు మండి పడ్డారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. హత్యలపై ఉన్నత స్థాయి న్యాయ విచారణ జరపాలని న్యాయ వాదులు కోరారు.

 న్యాయ వాది వామనరావు ఆయన సతీమని నాగమణి ఇద్దరిని తమ స్వగ్రామం అయిన గుంజపడుగు గ్రామానికి వెళ్ళి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు  కారులో వెంబడించి అడ్డగించి దారుణంగా నరికి చంపారు. కారులోనే విచక్షణారహితంగా కత్తులతో దుండగులు నరికిచంపారు. రామగిరి మండలం కలవచర్ల వద్ద బుధవారం  ఈ సంఘటన జరిగింది. న్యాయవాది దంపతుల స్వగ్రామం మంథని మండలం గుంజపడుగు. స్వగ్రామం నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా దంపతులు హత్యకు గురైనారు. కుంట శ్రీను తనపై దాడి చేశాడంటూ చనిపోయే ముందు వామనరావు చెప్పారు. కుంట శ్రీను మంథని టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు

న్యాయవాది వామనరావు దంపతుల హత్యపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని బీజేపీ నేత బండి సంజయ్ డిమాండ్ చేశారు. వామనరావు దంపతుల హత్య రాష్ట్ర ప్రభుత్వ హత్యేనని ఆయన స్పష్టం చేశారు. పలువురు పోలీస్ అధికారులతో ప్రభుత్వమే హత్య చేయించిందని ఆరోపించారు. ప్రభుత్వ పెద్దలకు చెందిన అవినీతి చిట్టా వామనరావు దగ్గర ఉందని, ప్రభుత్వ అక్రమాలపై పోరాటం చేయటమే అడ్వకేట్ దంపతుల హత్యకు కారణమని చెప్పారు. టీఆర్ఎస్ పాలనలో అన్యాయానికి గురైన పేదల పక్షాన వామనరావు పోరాడుతున్నారని తెలిపారు. వామనరావుకు రక్షణ కల్పించాలన్న హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. ప్రశ్నించే గొంతుకు రాష్ట్రంలో స్థానం‌ లేదని, వామనరావు దంపతుల హత్య ద్వారా రుజువు అయిందని సంజయ్ అన్నారు.

న్యాయవాద దంపతులు వామన్‌రావు, నాగమణిలది మమ్మూటికి పోలీసులు చేయించిన హత్యేనని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు మండిపడ్డారు. న్యాయవాద దంపతుల హత్య తరువాత పోలీసులపై శ్రీధర్‌బాబు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టపగలు మహిళా న్యాయవాదిని చంపిన తర్వాత పోలీస్ యూనిఫాం ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ జన్మదినం సందర్భంగా పోలీసులు ఇచ్చిన బహుమతి ఇది అని శ్రీధర్‌బాబు విమర్శించారు.

శాంతి భద్రతలు కాపాడమంటే చంపిన వాళ్లకు రక్షణ ఇస్తారా అని పోలీసులపై శ్రీధర్‌బాబు ప్రశ్నించారు. తమకు ప్రాణహాని ఉందని న్యాయవాద దంపతులు ఎన్నో రోజులుగా చెబుతున్నా పోలీసులు పట్టించుకోలేదని శ్రీధర్‌బాబు ధ్వజమెత్తారు. జిల్లాలో గుండాయిజం, రౌడీయిజం నడుస్తున్నా పట్టించుకోరా అని పోలీసులను శ్రీధర్‌బాబు ప్రశ్నించారు. 



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు