బెయిల్ వాదనే చెల్లదన్న ఎన్ ఐ ఎ న్యాయవాది! వివి కవిత వినిపించమన్న న్యాయమూర్తి !!

 వివి బెయిల్ - కోర్టు విచారణ సంగతులు:
బెయిల్ వాదనే చెల్లదన్న ఎన్ ఐ ఎ న్యాయవాది!
వివి కవిత వినిపించమన్న న్యాయమూర్తి !!


వివి బెయిల్ పై విచారణ డిసెంబర్ 3 నుంచి ఇవాళ్టికి (డిసెంబర్ 15 కు) వాయిదా పడిందని, ఇవాళ్టిదాకా వివిని నానావటి ఆస్పత్రిలోనే ఉంచమన్నారని మీకు తెలుసు.

ఇవాళ సాయంత్రం 3.50 కి న్యాయమూర్తులు షిండే, కార్నిక్ లు ఈ కేసు వినడం మొదలు పెట్టారు. దాదాపు గంటసేపు వాదనలు ఆసక్తికరంగా నడిచాయి. 

మన న్యాయవాది ఆనంద్ గ్రోవర్ వాదనలు మొదలు పెట్టబోతుండగానే ఎన్ ఐ ఎ న్యాయవాది అనిల్ సింగ్ అసలు ఈ విచారణే అసందర్భం అన్నాడు. ఇది ఆరోగ్య కారణాల మీద వేసిన బెయిల్ పిటిషన్ ను సెషన్స్ కోర్టు నిరాకరిస్తే ఆ నిరాకరణ మీద అప్పీలు అని, ఆ ఆరోగ్య కారణాలేవీ ఇప్పుడు వర్తించవని ("కొవిడ్ అన్నారు, వచ్చింది, పోయింది. మెరుగైన వైద్యం అన్నారు, అది అయిపోయింది"), అలాగే మామూలు బెయిల్ దరఖాస్తయితే సెషన్స్ కోర్టుకు పోవాలి గాని హైకోర్టుకు రాగూడదని, కనుక ఈ విచారణకు తన ప్రాథమిక అభ్యంతరం చెపుతున్నానని అన్నాడు. 

ఇది ఆరోగ్య కారణాల బెయిల్ ఒక్కటే కాదని, దానితోపాటు, జైలు పరిస్థితులు, ప్రాథమిక హక్కులు, అధికరణం 226 వంటి మూడు వేరువేరు అంశాలున్నాయని ఆనంద్ గ్రోవర్ అన్నారు. 


న్యాయమూర్తి షిండే కూడ ఆరోగ్యకారణాల బెయిల్ అప్పీలును వినే అవకాశం ఉందన్నారు. అంతకన్న ముఖ్యంగా, సెషన్స్ కోర్టుకు వెళ్లకుండా హైకోర్టుకు బెయిల్ కోసం రావడం మీద తమకూ అంతకు ముందు సందేహాలు ఉండేవని, కాని ఆర్ణబ్ గోస్వామి కేసులో సుప్రీం కోర్టు తీర్పు తర్వాత తమకు ఆ అధికారం ఉందని స్పష్టత వచ్చిందని అన్నారు. 


అంటే ప్రారంభంలోనే ఆ అభ్యంతరం చెప్పడానికి వీలు లేదని అంటూ ఆనంద్ గ్రోవర్ ను కొనసాగించమన్నారు. 


ఆనంద్ గ్రోవర్ మూడు స్థాయిల్లో తన వాదన ఉంటుందన్నారు. ఒకటి, సెషన్స్ కోర్టు తీర్పును కొట్టివేయవలసి ఉందన్నారు. రెండు, ఆరోగ్యం గురించి ఇప్పటికి మూడు ఆస్పత్రుల్లో ఐదారు నివేదికలు ఉన్నాయని, అన్నీ తమకు అందుబాటులో లేవని, ఉన్నవాటిలో కూడ ఒకదానికీ మరొకదానికీ పొంతనలేదని, ఇప్పుడు డిశ్చార్జి చేసి జైలుకు పంపితే జైలులో చికిత్స చేసే సౌకర్యాలు గాని నైపుణ్యం గాని లేవని అన్నారు. బెయిల్ పై విడుదల చేసి కుటుంబ రక్షణలో ఉంచడమే పరిష్కారం అన్నారు. 


బెయిల్ పై విడుదల చేసినా విచారణకు హాజరవుతారని చెపుతూ "ఆయన సుప్రసిద్ధ కవి. ఇప్పటికి ప్రభుత్వాలు ఆయనను రెండు డజన్ల కేసుల్లో పెట్టి ఏళ్ల తరబడి విచారణ జరిపినా కోర్టులు అన్ని కేసులూ కొట్టివేసి నిర్దోషిగా ప్రకటించాయి" అంటుండగా, జడ్జి షిండే "ఆయన కవిత ఒకటి చదివి వినిపిస్తారా" అని అడిగారు. "నాకు ఇష్టమైన కవిత ఒకటి ఉంది. కాని నాకు గుర్తుండదు. వెతకమంటారా" అని ఆనంద్ గ్రోవర్ లాప్ టాప్ తెరవబోయారు. "అహ వద్దు, ఊరికే వాతావరణం తేలిక పరచడానికి అన్నాను" అని జడ్జి అన్నారు. 


అసలు కేసు విచారణ ఏ స్థాయిలో ఉంది అని జడ్జి ఎన్ ఐ ఎ న్యాయవాదిని అడిగారు. చార్జెస్ ఫ్రేం చేసే స్థాయిలో ఉందని ఆయన జవాబిచ్చాడు. ఇప్పుడు నడుస్తున్న పద్ధతిలో ఇంకో పదేళ్లకు కూడ చార్జెస్ ఫ్రేం చేయడం కుదరదని ఆనంద్ గ్రోవర్ అన్నారు. 


ఎన్ ఐ ఎ చట్ట నిబంధనలను కూడ ప్రాసిక్యూషన్ పాటించడం లేదంటూ ఆనంద్ గ్రోవర్ కేసును వివరించడం కొనసాగించారు. 


అప్పటికే గంట అయింది. "మీకు ఇంకా ఎంత సమయం కావాలి" అని జడ్జి అడిగితే ఆనంద్ గంటన్నర అన్నారు. తర్వాత తనకు ఒక గంట కావాలని ఇందిరా జైసింగ్ అన్నారు. 


మీరేమంటారు అని మహారాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది ఠాక్రేను జడ్జి అడగగా, "ఎన్ ఐ ఎ తీసుకున్న తర్వాత మా పాత్ర పరిమితమే" అన్నాడాయన. "ఆస్పత్రి బిల్లు చెల్లించడం తప్ప" అని జడ్జి హాస్యమాడారు. 


ఆనంద్, ఇందిర వాదనలు, ప్రాసిక్యూషన్ ప్రతివాదనలు జరపడానికి ఇప్పుడు సమయం లేదు గనుక వర్చువల్ గా కొనసాగిద్దామా అని జడ్జి అడిగారు. భౌతిక కోర్టే కావాలని ఆనంద్ అన్నారు. 


సోమవారం డిసెంబర్ 21 కి వాయిదా వేశారు. వివిని నానావటి ఆస్పత్రిలోనే పాత షరతులతోనే కొనసాగించాలన్నారు.


N వేణుగోపాల్ FB నుండి

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు