దుబ్బాక ఉప ఎన్నికల ఫలితం తెలంగాణ రాజకీయ మార్పులకు సంకేతం ?

దుబ్బాక  ఉప ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలో  పెను మార్పులకు అంకురార్పణ కానున్నాయి
ఎదురు లేదని ఏకఛత్రాధిపత్యంతో విర్రవీగిన అధికార పార్టీకి దుబ్బాక ఫలితం ఓ గుణపాఠం


దుబ్బాక  ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టి అభ్యర్థి  రఘునందనరావు గెలుపు సాధారణ గెలుపు కాదు.  ఈ స్థానంలో  భారతీయ జనతా పార్టి ఏం గెలుస్తుందిలే అని మీడియాతో సహా అందరు వేసిన అంచనాలు తల క్రిందులు చేస్తూ  తామే గెలవబోతున్నామంటూ బిజెపి చెప్పిన మాటలు  నిజం చేసింది.  అధికార  టిఆర్ఎస్ పార్టీకి బిజెపి గెలుపు ఊహించని షాక్ అని చెప్ప వచ్చు. ఓటమి అనేది ఎరుగని టిఆర్ ఎస్ కు ఇది తొలి స్వయం  కృతాపరాధ పరాజయం. 

బిజెపికి దక్కిన  మెజార్టి  ఫిగర్ ఎంతో లెక్క వేయడం అసలు లెక్క కాదు. ఇది అధికార పార్టీకి ఘోర పరాజయం...బిజెపికి ఘన విజయం. ఈ ఫలితాలతో తెలంగాణ రాజకీయ సమీకరణలు మారబోతున్నాయి.

గెలుపు  ఓటములకు అనేక కారణాలు విశ్లేషించవచ్చు. బయటికి కనిపించే కారణాలకన్నా  కానరాని కారణాలు కూడ అనేకం ఉంటాయి. అధికార పార్టి అహానికి ఇదో గుణ పాఠం....సిఎం కెసిఆర్ ఫాం హౌజ్ పాలనకు చెరమ గీతం..హరీశ్ రావు కు షాక్ అంటూ సోషల్  మీడియాలో  తెలంగాణ వారి స్పందన చూస్తుంటే దుబ్బాకలో  బిజెపి గెలవాలని కెసిఆర్ పాలనతో విసిగి పోయిన వారంతా  కాంక్షించినట్లు అర్దం అవుతోంది. దుబ్బాకలో   బిజెపిది ఉత్త విజయం కాదు...ఘన విజయం అని చెప్పాలి.  ఇక్కడ అభ్యర్థి రుఘునందనరావు కాక ఇతర ఎవరు ఉన్నా బిజెపి కాకుండా వేరే పార్టి అయినా వాస్తవంగా అధికార పార్టి హంగామా తట్టుకునే వారు కాదు. కనుక ఈ విజయం బిజేపీకే సాద్యపడింది.  రఘునందనరావు ను అధికార టిఆర్ ఎస్ ముప్పు తిప్పలు పెట్టింది.  ట్రబుల్ షూటర్  తన ప్రత్యర్థి రఘునందనరావుకు అడుగడుగునా ట్రబుల్స్ ఇచ్చాడు. దుబ్బాకలో  ఎన్నికల షెడ్యూల్  ప్రకటన నుండి ఏం జరిగిందో  టిఆర్ఎస్ పార్టి ఓట్ల కోసం ఎంతగా తన అధికార దర్పం ప్రదర్శించిందో అంతగా మైనస్ అయింది. ఓటర్ల మనసు గెలుచుకోవాలని టిఆర్ఎస్ ఎంతగా తాపత్రయ పడి ఎన్ని మంత్ర, తంత్రాలు ప్రయోగించిందో అంతగా వ్యతిరేకత మూట గట్టుకుంది.


                   రిటర్నింగ్ అధికారి నుండి  గెలుపు పత్రం స్వీకరిస్తున్న రఘునందన రావు 

గతంలో రామలింగారెడ్డికి వచ్చిన భారి మెజార్టీకి  ఉప ఎన్నికల్లో పోలైన ఓట్లకు ఎంతో వ్యత్యాసం ఉంది.  2018 ఎన్నికల్లో రామలింగారెడ్డికి రికార్డు స్థాయిలో  62,500 కు పైగా ఓట్ల మెజార్టి వచ్చింది. ఈ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్కు 61 వేల పై చిలుకు ఓట్లు  వచ్చాయి.  2014 లో 37 వేల పై చిలుకు మెజార్టి వచ్చింది.  ఉప ఎన్నికల్లో  1.64 లక్షల ఓట్లు పోలవగా లక్ష వరకు ఓట్లు తమవే నని టిఆర్ఎస్ నేతలు చెప్పుకున్నారు. రామలింగారెడ్డి పై ఉన్నసానుభూతి కల్సి వస్తుందని  ఆయన భార్యను పోటీలో దించినప్పటికి సానుభూతి లభించలేదు. గత రెండు ఎన్నికల్లో  ఇదే స్థానం నుండి బిజెపి  అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన  సానుభూతి  ఉప ఎన్నికల్లో రఘునందన రావుకు కొంత పనిచేసిందని చెప్పవచ్చు.    రఘునందన రావును పోలీసులు నీడలా వెంటాడి అతనికి అడుగడుగునా అడ్డుపడడం రాష్ట్ర పార్టి అధ్యక్షులు బండి సంజయ్ ను కూడ పోలీసులు అడ్డు కోవడం వంటి  ఏకపక్ష కార్యాలు బిజెపిపై సానుభూతి కలిగించాయి.  దుబ్బాకలో  అధికార పార్టి  గెలుపు కోసం నెరిపిన  ఎన్నికల  తాంత్రిక  విద్యలన్నింటిని  బిజెపి  తనకు అనుకూలంగా మలుచుకుంది. ఆటంకాలనన్నింటిని వీడియోలు తీసి బిజెపి ఎప్పటి కప్పుడు సోషల్ మీడియాలో  సర్కులేషన్ లో పెట్టడం  ఆ పార్టీకి ఎంతో లాభించింది.  పోలీసులు డబ్బులు పట్టుకున్న విషయాన్ని బిజెపి తనకు అనుకూలంగా మార్చుకుంది. పోలీసులే  ఇంట్లో డబ్బుల సంచి తెచ్చి పెట్టారని బిజెపి పోలీసులను, అధకార పార్టీని  డిఫెన్సులోకి నెట్టింది. ఆ పిమ్మట  పోలీసులు  వీడియోలు విడుదల చేసినా  ఎవరు నమ్మలేదు. పోలీస్ కమీషనర్  బండి సంజయ్ ను అడ్డుకుని తిప్పిపంపిన వీడియో బండి సంజయ్ దీక్ష తదితర అంశాలు దుబ్బాక ఓటర్ల సానుభూతిని సంపాదించాయి.  బండి సంజయ్ ను ఉద్దేశించి హరీశ్ రావు  "అరే బిడ్డా బండి సంజయ్" అంటూ సవాల్  చేసిన  వీడియో  వాట్సప్ , ఫేస్ బుక్ లో బాగా వైరల్ అయింది. బి.సి  సామాజిక వర్గానికి చెందిన  ఓ నాయకుడిని అందులో ఓ రాష్ట్ర స్థాయి నాయకుడిని అరే బిడ్డా  అంటూ సంభోదిస్తాడా అంటూ బిసిలు అగ్రహం వ్యక్తం చేసారు.

వీటన్నింటి కంటే ప్రభుత్వ  పాలనా వైఫల్యాలు ముఖ్యంగా సిఎం కెసిఆర్  ప్రజల మనోభీష్టానికి విరుద్దంగా  నిర్వహించిన రాచకార్యాల ఫలితాలు  దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాల్లో కనిపించాయి.

పేద వారిపై భారం మోపేలా  తెచ్చిన ఎల్ఆర్ఎస్ స్కీం...కరోనా సమయంలో తెచ్చిన వ్యవసాయేతర ఆస్తుల నమోదు....హైదరాబాద్ నగరాన్ని  వరదలు ముంచెత్తిన సమయంలో కెసిఆర్ ముఖం చాటేయడం వంటి అనేక అంశాలు దుబ్బాకలో బిజెపికి కల్సి వచ్చాయి. 

దుబ్బాక ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి  అడ్డంగా రేగిన దుబ్బ బిజెపి అంది పుచ్చుకున్న విజయం రాష్ట్రంలో భారీ రాజకీయ తుఫానుకు  ఓ హెచ్చరిక గా మారింది.


వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు