కరోనా తో మృతి చెందిన జర్నలిస్ట్ కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం

యూనియన్ నేతలతో జరిగిన భేటీలో అంగీకరించిన ఎ.పి సి. ఎం. జగన్ మోహన్ రెడ్డి
తక్షణమే అధికారులకు ఆదేశాలు


కరోనా సోకి మరణించిన జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకునేందుకు ఎపి సిఎం వై.ఎస్ జగన్ మెహన్ రెడ్డి సుముఖత వ్యక్తం చేసారు. మరణించిన వారి కుటుంబాలకు రూ 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు. తక్షణమే ఇది అమలు జరగాలని సిఎం అధికారులను ఆదేశించారు.



ఎపి సిఎం జగన్మోహన్ రెడ్డితో జరిగిన సమావేశం అనంతరం ఎపిడబ్ల్యుజే మంగళవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది.

జర్నలిస్ట్ లను కరోనా వారియర్స్ గా గుర్తించాలని కోరుతూ గత నాలుగు నెలలుగా ఏ.పి.యు.డబ్ల్యు.జే. సాగించిన పోరాటం ఫలించింది. కరోనా బారిన పడి మృతి చెందిన జర్నలిస్ట్ కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించేందుకు ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి అంగీకరించారు. ఐ.జే.యు.జాతీయ అధ్యక్షుడు కే.శ్రీనివాస రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ జాతీయ మీడియా, అంతర్రాష్ట్ర వ్యవహారాల సలహా దారుడు దేవులపల్లి అమర్ అక్టోబర్ 12 రాత్రి ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి తో భేటీ అయ్యారు.

ఆంధ్ర ప్రదేశ్ లో జర్నలిస్ట్ లు ఎదుర్కుంటున్న పలు సమస్యలను వారు ముఖ్య మంత్రి దృష్టికి తీసుకు వెళ్లారు. వారు వివరించిన సమస్యలపై ముఖ్య మంత్రి సానుకూలంగా స్పందించారు. కరోనా తో మృతి చెందిన ఒక్కొక్క జర్నలిస్ట్ కుటుంబానికి ఐదు లక్షల రూపాయల వంతున ఆర్థిక సహాయాన్ని ముఖ్య మంత్రి సహాయ నిధి నుండి అందిస్తామని జగన్ యూనియన్ నేతలకు తెలిపారు.
జర్నలిస్టు ల డిమాండ్ లకు ముఖ్య మంత్రి సానుకూలంగా స్పందించారు.

ముఖ్యమంత్రి తో జరిగిన భేటీ పర్యవసానాలను ఐ.జే.యు. జాతీయ అధ్యక్షులు కే.శ్రీనివాస రెడ్డి, ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవుల పల్లి అమర్, యూనియన్ జాతీయ ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు, రాష్ట్ర అధ్యక్షుడు ఐ.వి.సుబ్బా రావు, ప్రధాన కార్యదర్శి చందు జనార్ధన్ తదితరులు 13 వ తేదీ విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వెల్లడించారు.

అక్రెడిటేషన్ కమిటీల ఏర్పాటు, విధివిధానాల లో జరిగిన లోపాలను సవరించాలని యూనియన్ నేతలు చేసిన విజ్ఞప్తికి కూడా ముఖ్య మంత్రి సానుకూలంగా స్పందించారు. వాటిని సరి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఈ రెండు అంశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని తన కార్యాలయ అధికారులకు ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. దాంతో యూనియన్ గత నాలుగు నెలలుగా సాగిస్తున్న పోరాటం ఫలించిందని చెప్పాలి. గత నాలుగు నెలలుగా దేశం లో ఎక్కడా లేనంత పెద్ద సంఖ్యలో ఆంధ్ర ప్రదేశ్ లో సుమారు 40 మంది పాత్రికేయులు కరోనా బారిన పడి మృతి చెందారు. ఈ విషాదకర పరిణామం ఆయా కుటుంబాలకే కాక జర్నలిస్ట్ లందరికీ తీవ్ర ఆవేదన, ఆందోళన కలిగించింది. తొలి మరణం నమోదు అయిన వెంటనే ఏ.పి.యు.డబ్ల్యు.జే. సమస్య తీవ్రతను గ్రహించింది. జర్నలిస్ట్ లను కరోనా వారియర్స్ గా గుర్తించాలని, మృతి చెందిన జర్నలిస్ట్ కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేసింది. ప్రభుత్వానికి విన్న వించింది. మంత్రులకు, అధికారులకు,ప్రభుత్వ సలహా దారులకు సమస్యని వివరించింది. యూనియన్ జిల్లా శాఖలు కూడా స్థానిక స్థాయిలో స్పందించి సమస్యపై ఆందోళనలు నిర్వహించాయి. తగిన పరిష్కారం లభించక పోవడం తో చివరికి జర్నలిస్ట్ లు రోడ్లెక్కాల్సి వచ్చింది. డిమాండ్ల సాధన కోసం ఏ.పి.యు. డబ్ల్యు.జే. పట్టు విడుపులు లేని పోరాటాన్ని సాగించిందని నాయకులు తెలిపారు.



రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజుల పాటు మంత్రులకు, సుమారు 70 మంది ఎమ్మెల్యేలకు జర్నలిస్ట్ లు వినతి పత్రాలు ఇచ్చారు.

జూలై 18 న రాష్ట్ర వ్యాప్తంగా కోర్కెల దినం పాటించాలని యూనియన్ పిలుపు ఇచ్చింది. అన్ని జిల్లాల్లో 127 కేంద్రాల్లో ధర్నాలు, ప్రదర్శనలు చేసి అధికారులకు వినతి పత్రాలు అంద చేశారు. తిరిగి ఆగస్ట్ 17 న ఏ.పి.యు.డబ్ల్యు.జే. వ్యవస్థాపక దినోత్సవం రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఆన్ లైన్ క్యాంపెయిన్ ప్రారంభమయ్యింది. పది రోజుల పాటు సాగిన క్యాంపెయిన్ లో 10,932 మంది గూగుల్ ఫార్మ్స్ సబ్మిట్ చేశారు. జర్నలిస్టులకు మద్దతుగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల నాయకులు కూడా ఆన్ లైన్ క్యాంపెయిన్ లో పాల్గొన్నారు. జర్నలిస్ట్ ల డిమాండ్ కు ఆన్ లైన్ లో లభించిన మద్దతు కు సంబంధించిన డేటా ను, వినతిపత్రాన్ని, ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామ కృష్ణా రెడ్డి కి యూనియన్ అంద చేసింది.

జాతీయ స్థాయిలో ఐ.జే.యు.కూడా రంగం లోకి దిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసింది. సెప్టెంబరు 21,22, తేదీల్లో సమావేశమైన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జర్నలిస్ట్ లను కరోనా వారియర్స్ గా గుర్తించాలని కోరుతూ ఒక తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని ఐ.జే.యు. పూర్వాధ్యక్షుడు దేవులపల్లి అమర్ ప్రతి పాదించారు. ఆమోదం పొందేందుకు ఐ.జే.యు. ప్రతినిధులు బల్విందర్ సింగ్ జమ్మూ, ఎం. ఎ. మాజిద్ కృషి చేశారు. ఆమేరకు పి.సి.ఐ. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తన సూచనలను లేఖ రూపంలో పంపించింది. ఐ.జే.యు.పిలుపు మేరకు అక్టోబర్ 2 న గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్త నిరసన దినం పాటించారు. వేలాది మంది జర్నలిస్ట్ లు నిరసనలో పాల్గొన్నారు.

ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని జిల్లాల్లో దాదాపు 50 కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు జరిగాయి. పోరాటాల పర్యవసానంగానే అక్టోబర్ 12 వ తేదీ సాయంత్రం ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి తో ఐ.జే.యు.జాతీయ అధ్యక్షుడు కే.శ్రీనివాస్ రెడ్డి, ఐ.జే.యు. పూర్వాధ్యక్షుడు,రాష్ట్ర ప్రభుత్వ సలహా దారు దేవుల పల్లి అమర్ భేటీ జరిగింది.


కరోనా తో మృతి చెందిన జర్నలిస్ట్ కుటుంబాలను ఆదుకునేందుకు నిర్ణయం తీసుకున్న ముఖ్య మంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారి కి ముందుగా కృతజ్ఞతలు చెప్పాలి. ఒక సమస్యను గుర్తించి, దాన్ని ఒక డిమాండ్ గా రూపకల్పన చేసి, దశల వారీగా వివిధ రూపాల్లో పోరాటం చేసి, ప్రభుత్వం పై ఒత్తిడి చేసి,ఆమోదింప చేయడం 63 ఏళ్ల పోరాట చరిత్ర కలిగిన ఏ.పి.యు.డబ్ల్యు.జే.వల్ల మాత్రమే సాధ్యమని మరో సారి రుజువు అయ్యిందని ఐజెయు జాతీయ కార్యవర్గ సభ్యుడు
డి.సోమ సుందర్ తెలిపారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు