బి.పి మండల్ ఆదర్శంగా చట్టసభల్లో బి.సి వాటా సాధించాలి

 


బి.పి మండల్ ఆదర్శంగా చట్టసభల్లో బి.సి వాటా సాధించాలి


ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్


    బి.సి ల సర్వతోముఖాభివృద్ధికి సరిపోయే నివేదికను అందించిన బి. పి మండల్ ఆదర్శంగా చట్టసభల్లో బి.సి లకు వాటా సాధించాలని ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్ అన్నారు. శనివారం హన్మకొండ జిల్లా కేంద్రం అంబేద్కర్ సెంటర్ లో జరిగిన బి.పి మండల్ 42 వర్ధంతికి ఆయన హాజరై మాట్లాడారు. రాజ్యాంగ రచన సమయంలోనే బి.సి లకు మేలు చేయాలనుకునే అంబేద్కర్ ను అడ్డుకున్న బ్రాహ్మణీయ ఆధిపత్య కులాలు నేటికీ బి.సి ల అభివృద్ధికి అడ్డుపడుతున్నారని, మహాత్మా జ్యోతిరావు పూలే మొదలుకొని బి.పి. మండల్ వరకు ఎందరో మహనీయులు చేసిన త్యాగపూరిత పోరాటాల వల్ల బి.సి లకు కొన్ని హక్కులు సాధించారని, బి.సి ల అభివృద్ధికి నియమించిన కమీషన్ కు చైర్మన్ గా బ్రిందేశ్వర్ ప్రసాద్ మండల్ దేశమంతా పర్యటించిన బి.పి. మండల్ 40 విలువైన సూచనలతో 1980లో నివేదిక సమర్పించగా 1990 వరకు ఆ నివేదికను తొక్కిపట్టిన పాలకులపై కాన్షీరాం లాంటి మహనీయులు ఎన్నో పోరాటాలు చేశారని అన్నారు. మహనీయుల పోరాటాల వల్ల మండల్ సూచనలో ఒకటైన విద్యా, ఉద్యోగాల్లో 27 శాతం రిజర్వేషన్లు కల్పించి మిగతా 39 ప్రతిపాదనలను నేటికీ తొక్కిపెట్టారని అన్నారు. బి.పి మండల్ స్పూర్తితో ఆయన సూచించిన మిగతా 39 ప్రతిపాదనలను అమలు చేసే ఉద్యమానికి బి.సి లు సిద్ధం కావాలని అన్నారు. మహనీయులు సాధించిపెట్టిన హక్కులతో పాటు సకల సామాజిక రంగాల్లో బి.సి జనాభా దామాషా ప్రకారం వాటా రావాలంటే చట్టసభల్లో బి.సి లకు వాటా సాధించాలని పిలుపునిచ్చారు. వంద కులాలుగా, వంద వర్గాలుగా, వంద సంఘాలుగా విడిపోయి చెల్లాచెదురై వంద ప్రాంతాల్లో నివసిస్తున్న బి.సి లను అల్ ఇండియా ఒబిసి జాక్ ఐక్యం చేసి ఉద్యమం చేస్తుందని, దేశంలోనున్న బి.సి సంఘాలు ఎఐఒబిసి జాక్ లో చేరి చట్టసభల్లో బి.సి వాటా సాధించాలని పిలుపునిచ్చారు. 

    ఈ కార్యక్రమంలో పాల్గొన్న విముక్త చిరుతల కక్షి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జిలుకర శ్రీనివాస్ మాట్లాడుతూ దేశంలో అత్యధిక జనాభా కలిగి, ఉత్పత్తిలో కీలకపాత్ర పోషిస్తున్నప్పటికి బి.సి లు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఎదగడం లేదని, జనాభా దామాషా ప్రకారం బి.సి లకు చట్టసభల్లో వాటా ఇచ్చిన నాడే నిజమైన ప్రజాస్వామ్యమవుతుందని అన్నారు. బి.సి లకు బద్ధ శత్రువైన బిజెపిని బి.సి లు నమ్మి మోసపోతున్నారని అన్నారు. బిజెపికి, నరేంద్ర మోడీకి చిత్తశుద్ధి ఉంటే బి.సి జనగణన జరిపి చట్టసభల్లో వాటా కల్పించాలని డిమాండు చేశారు. బి.పి మండల్ సిఫార్సుల అమలకు ఆనాడు కాన్షీరాం మద్దతుగా నిలిచాడని, నేటి చట్టసభల్లో వాటా ఉద్యమానికి విసికె పార్టీ పూర్తి మద్దతుగా నిలుస్తుందని అన్నారు.

   ఈ కార్యక్రమంలో విసికె రాష్ట్ర కార్యనిర్వాహక అద్యక్షులు మచ్చ దేవేందర్, రజక రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు చాపర్తి కుమార్ గాడ్గే, వివిధ సంఘాల నాయకులు సింగారపు అరుణ, ఎడ్ల అర్జున్, పుట్ట రవి, తాడూరి మోహన్, బిరుదురాజు శ్రీధర్ రాజు, వల్లాల జగన్, చెన్న శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు